వీసీ స‌జ్జ‌నార్ అవ‌య‌వ‌దాన ప్ర‌తిజ్ఞ‌.. క్యూఆర్ కోడ్ విడుద‌ల‌ | VC Sajjanar organ donation pledge at Kamineni Hospital Hyderabad | Sakshi
Sakshi News home page

వీసీ స‌జ్జ‌నార్ అవ‌య‌వ‌దాన ప్ర‌తిజ్ఞ‌.. క్యూఆర్ కోడ్ విడుద‌ల‌

Published Mon, Aug 12 2024 6:12 PM | Last Updated on Mon, Aug 12 2024 6:16 PM

VC Sajjanar organ donation pledge at Kamineni Hospital Hyderabad

ప్ర‌జ‌లంద‌రూ ముందుకు రావాలని పిలుపు

అవ‌య‌వ‌దాన ప్ర‌తిజ్ఞ‌ల కోసం క్యూఆర్ కోడ్ విడుద‌ల‌

కామినేని ఆస్ప‌త్రిలో అవ‌య‌వ‌దాన అవ‌గాహ‌న ప్ర‌చారం ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో ఈ ప‌విత్ర కార్యంపై అవ‌గాహ‌న పెంచాల‌ని ల‌క్ష్యం

సాక్షి, హైద‌రాబాద్: మ‌న దేశంలో ఎవ‌రైనా మ‌ర‌ణించిన త‌ర్వాత వారి దేహాల‌ను ఖ‌న‌నం లేదా ద‌హ‌నం చేస్తుంటార‌ని, అలా చేసేముందు వారి శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాలు దానం చేస్తే మ‌రో 8 ప్రాణాలు బ‌తుకుతాయ‌ని అద‌న‌పు డీజీపీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డుర‌వాణా సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ అన్నారు. మ‌ర‌ణానంత‌రం తాను త‌న అవ‌య‌వాలు దానం చేస్తున్న‌ట్లు ఈ రోజు ప్ర‌తిజ్ఞ చేస్తున్నాన‌ని, ప్ర‌జ‌లంద‌రూ కూడా ఈ విష‌యంలో ముందుకు రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన కామినేని ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో అవ‌వ‌య‌దాన అవ‌గాహ‌న ప్ర‌చారం ప్రారంభ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ మేర‌కు ప్ర‌తిజ్ఞ చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తియేటా ఆగ‌స్టు 13వ తేదీని ప్ర‌పంచ అవ‌య‌వ‌దాన దినోత్స‌వంగా చేసుకుంటారు. దీనిపై ఉన్న అపోహ‌ల‌ను తొల‌గించి, మ‌రింత‌మందిని ఈ దిశ‌గా ప్రోత్సహించేందుకు, అవ‌య‌వ‌దానంపై అవ‌గాహ‌న క‌ల్పిచేందుకు ఈ కార్య‌క్ర‌మం చేప‌డ‌తారు.

ఈ సంద‌ర్భంగా కామినేని ఆస్పత్రుల సీఓఓ గాయ‌త్రీ కామినేని మాట్లాడుతూ.. “గౌర‌వ‌నీయులైన వీసీ సజ్జ‌నార్ ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి అంద‌రికీ స్ఫూర్తినిస్తున్నందుకు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. ఇక్క‌డ అనేక‌మంది రోగులు త‌మ‌కు జీవితంలో ల‌భించే సెకండ్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 14 వేల మందికి పైగా వ్య‌క్తులు అవ‌య‌వ‌మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే మ‌న‌మంతా స్పందించాలి. అవ‌య‌వ‌దాన ప్ర‌తిజ్ఞ కార్య‌క్ర‌మాన్ని ఇక్క‌డ మేం ప్రారంభిస్తున్నాం. ప్ర‌తి ఒక్క‌రూ పేర్లు న‌మోదుచేసుకుని, ఇక్క‌డ ఉన్న‌వారికి ఒక ఆశ క‌ల్పించాల‌ని కోరుతున్నాను. 

రాబోయే సంవ‌త్స‌రాల్లో జాతీయ స‌గ‌టును మించి మ‌న తెలుగు రాష్ట్రాల్లో అవ‌య‌వ దానాలు జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నాను. ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం ప‌రిస్థితి అలా లేదు. దాత‌ల కోసం ఎదురుచూపులు త‌ప్ప‌ట్లేదు. అవ‌య‌వదానం అంటే ప్రాణాన్ని నిస్వార్థంగా మ‌రొక‌రికి దానం చేయ‌డ‌మే. అలా చేయ‌డం ద్వారా మ‌రో ఎనిమిది మందిలో మ‌నం చిరంజీవులుగా ఎప్ప‌టికీ ఉండిపోతాం. నేనూ ఇప్ప‌టికే అవ‌య‌వ‌దాన ప్ర‌తిజ్ఞ చేశాను. మీరంతా నాతో క‌లిసొస్తార‌ని ఆశిస్తున్నా. మ‌న‌మంతా క‌లిసి ఒక ప్ర‌భంజ‌నంలా ఈ అవ‌య‌వ‌దాన స‌త్కార్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న ద‌శ నుంచి కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ల క‌థ‌లు వింటే మీ హృద‌యాలు క‌రుగుతాయి” అని తెలిపారు.

ప్ర‌జ‌లంద‌రూ ముంద‌డుగు వేసి, అవ‌య‌వ‌దాత‌లుగా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అద‌న‌పు డీజీపీ వీసీ స‌జ్జ‌నార్ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ... “కామినేని ఆస్ప‌త్రిని నా త‌ర‌ఫు నుంచి, ప్ర‌భుత్వం త‌ర‌ఫు నుంచి అభినందిస్తున్నాను. ఇటీవ‌ల ఇలాంటి కార్య‌క్ర‌మం నేను చూడ‌లేదు. అవ‌య‌వ‌దానం గురించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నాకు విశ్వాసం ఉంది. కామినేని కుటుంబంతో నాకు రెండు ద‌శాబ్దాల సాహిత్యం ఉంది. పోలీసుల‌కు కూడా వాళ్లు చాలా చేశారు. పోలీసు శాఖ త‌ర‌ఫున కూడా ఆ కుటుంబానికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. కొవిడ్ వ‌చ్చిన‌ప్పుడు కామినేని ఆస్ప‌త్రి చేసిన సేవ‌లు అపూర్వం. నేను చాలామంది వైద్యుల‌కు ఫోన్లు చేసేవాడిని. శ‌శిధ‌ర్ లాంటివాళ్లు అర్ధ‌రాత్రి చేసినా స్పందించేవారు. వైద్యులు, న‌ర్సులు, అంద‌రూ కొవిడ్ స‌మ‌యంలో చాలా సేవ‌లు చేశారు. తీవ్ర‌గాయాలు అయిన‌ప్పుడు మొట్ట‌మొద‌ట‌గా కామినేని ఆస్ప‌త్రికే మా సిబ్బందిని పంపేవాడిని. 

ముఖ్యంగా అవ‌య‌వ‌దానం విష‌యంలో చాలా అవ‌గాహ‌న రావాలి. కొన్ని ల‌క్ష‌ల మంది అవ‌య‌వాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్ర‌భుత్వ స‌మాచారం ప్ర‌కారం గ‌త సంవ‌త్స‌రం దేశంలో 18,378 డొనేష‌న్లు అయితే, వాటిలో లైవ్ డొనేష‌న్లు 15,436 కెడావ‌ర్ డొనేష‌న్లు 2,942చొప్పున ఉన్నాయి. లైవ్ డొనేష‌న్ల‌లో కూడా అత్య‌ధికం అంటే దాదాపు ప‌దివేల‌కు పైగా మ‌హిళ‌లే చేశారు. మూడోవంతు మాత్ర‌మే పురుషులు ఉన్నారు. దేశంలో ఒక ట్రాన్స్‌జెండ‌ర్ కూడా అవ‌య‌వ‌దానం చేయ‌డం విశేషం. మాతృప్రేమ ఇందులో స్ప‌ష్టంగా తెలుస్తోంది. ప‌ది సంవ‌త్స‌రాల క్రితం 4,490 మంది మాత్ర‌మే మొత్తం అవ‌య‌వ‌దానాలు చేశారు. ఇప్పుడు ఇంత పెర‌గ‌డానికి వివిధ ఆస్పత్రులు, ప్ర‌భుత్వాలు చేస్తున్న అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలే కార‌ణం. డాక్ట‌ర్ స్వ‌ర్ణ‌ల‌త లాంటివాళ్లు జీవ‌న్‌దాన్ ద్వారా ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్క‌డ కూడా చాలామంది వైద్యులు అవ‌య‌వ మార్పిడి ఆప‌రేష‌న్ల‌లో ఎంతో ముందున్నారు. వీరంద‌రికీ నా మ‌నఃపూర్వ‌క అభినంద‌న‌లు” అని చెప్పారు.

క్యూఆర్ కోడ్ విడుద‌ల‌
ఈ సంద‌ర్భంగా ఎవ‌రైనా అవ‌య‌వదానం చేయాల‌నుకుంటే అందుకు వీలుగా కామినేని ఆస్ప‌త్రి త‌ర‌ఫున ఒక క్యూఆర్ కోడ్ విడుద‌ల చేశారు. 18 ఏళ్లు నిండిన ఎవ‌రైనా త‌మ స్మార్ట్ ఫోన్‌లోని క్యూఆర్ కోడ్ స్కాన‌ర్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఒక ద‌ర‌ఖాస్తు ఫారం వ‌స్తుంది. దాన్ని నింపి, స‌బ్మిట్ చేయ‌డం ద్వారా ప్ర‌తి ఒక్క‌రూ అవ‌య‌వ‌దాత‌లుగా మారొచ్చు.

అవ‌య‌వ‌దానంపై అవగాహన కల్పించేందుకు కామినేని ఆస్పత్రి డైరెక్ట్ మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్ర‌చారాల‌తో కూడిన సమగ్ర అవ‌గాహ‌న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛంద దాతలను ప్రోత్సహించేందుకు ఆసుపత్రి ఆవరణలో డిజిటల్ కియోస్క్ ఏర్పాటుచేశారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు సమర్పించిన వెంటనే వారి వాట్సప్ నంబర్లకు 'గర్వించదగిన అవయవ దాత' కార్డును పంపిస్తారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల‌ని కామినేని ఆస్ప‌త్రి అంద‌రినీ ఆహ్వానిస్తోంది. అవ‌య‌వ‌దాత‌గా పేరు న‌మోదుచేసుకోవ‌డం ద్వారా, కుటుంబానికి జీవ‌నాధార‌మైన వ్య‌క్తుల‌కు ప్రాణ‌దానం చేయ‌గ‌ల అవ‌కాశం మీకు ద‌క్క‌వ‌చ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement