kamineni hospital
-
వీసీ సజ్జనార్ అవయవదాన ప్రతిజ్ఞ.. క్యూఆర్ కోడ్ విడుదల
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో ఎవరైనా మరణించిన తర్వాత వారి దేహాలను ఖననం లేదా దహనం చేస్తుంటారని, అలా చేసేముందు వారి శరీరంలో ముఖ్యమైన అవయవాలు దానం చేస్తే మరో 8 ప్రాణాలు బతుకుతాయని అదనపు డీజీపీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మరణానంతరం తాను తన అవయవాలు దానం చేస్తున్నట్లు ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నానని, ప్రజలందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో అవవయదాన అవగాహన ప్రచారం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా చేసుకుంటారు. దీనిపై ఉన్న అపోహలను తొలగించి, మరింతమందిని ఈ దిశగా ప్రోత్సహించేందుకు, అవయవదానంపై అవగాహన కల్పిచేందుకు ఈ కార్యక్రమం చేపడతారు.ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రుల సీఓఓ గాయత్రీ కామినేని మాట్లాడుతూ.. “గౌరవనీయులైన వీసీ సజ్జనార్ ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ స్ఫూర్తినిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇక్కడ అనేకమంది రోగులు తమకు జీవితంలో లభించే సెకండ్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 14 వేల మందికి పైగా వ్యక్తులు అవయవమార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే మనమంతా స్పందించాలి. అవయవదాన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ మేం ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పేర్లు నమోదుచేసుకుని, ఇక్కడ ఉన్నవారికి ఒక ఆశ కల్పించాలని కోరుతున్నాను. రాబోయే సంవత్సరాల్లో జాతీయ సగటును మించి మన తెలుగు రాష్ట్రాల్లో అవయవ దానాలు జరగాలని ఆశిస్తున్నాను. ప్రస్తుత సమాజంలో మాత్రం పరిస్థితి అలా లేదు. దాతల కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. అవయవదానం అంటే ప్రాణాన్ని నిస్వార్థంగా మరొకరికి దానం చేయడమే. అలా చేయడం ద్వారా మరో ఎనిమిది మందిలో మనం చిరంజీవులుగా ఎప్పటికీ ఉండిపోతాం. నేనూ ఇప్పటికే అవయవదాన ప్రతిజ్ఞ చేశాను. మీరంతా నాతో కలిసొస్తారని ఆశిస్తున్నా. మనమంతా కలిసి ఒక ప్రభంజనంలా ఈ అవయవదాన సత్కార్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. వ్యాధులతో బాధపడుతున్న దశ నుంచి కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ల కథలు వింటే మీ హృదయాలు కరుగుతాయి” అని తెలిపారు.ప్రజలందరూ ముందడుగు వేసి, అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉందని అదనపు డీజీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... “కామినేని ఆస్పత్రిని నా తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తున్నాను. ఇటీవల ఇలాంటి కార్యక్రమం నేను చూడలేదు. అవయవదానం గురించి అవగాహన కల్పించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని నాకు విశ్వాసం ఉంది. కామినేని కుటుంబంతో నాకు రెండు దశాబ్దాల సాహిత్యం ఉంది. పోలీసులకు కూడా వాళ్లు చాలా చేశారు. పోలీసు శాఖ తరఫున కూడా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొవిడ్ వచ్చినప్పుడు కామినేని ఆస్పత్రి చేసిన సేవలు అపూర్వం. నేను చాలామంది వైద్యులకు ఫోన్లు చేసేవాడిని. శశిధర్ లాంటివాళ్లు అర్ధరాత్రి చేసినా స్పందించేవారు. వైద్యులు, నర్సులు, అందరూ కొవిడ్ సమయంలో చాలా సేవలు చేశారు. తీవ్రగాయాలు అయినప్పుడు మొట్టమొదటగా కామినేని ఆస్పత్రికే మా సిబ్బందిని పంపేవాడిని. ముఖ్యంగా అవయవదానం విషయంలో చాలా అవగాహన రావాలి. కొన్ని లక్షల మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం గత సంవత్సరం దేశంలో 18,378 డొనేషన్లు అయితే, వాటిలో లైవ్ డొనేషన్లు 15,436 కెడావర్ డొనేషన్లు 2,942చొప్పున ఉన్నాయి. లైవ్ డొనేషన్లలో కూడా అత్యధికం అంటే దాదాపు పదివేలకు పైగా మహిళలే చేశారు. మూడోవంతు మాత్రమే పురుషులు ఉన్నారు. దేశంలో ఒక ట్రాన్స్‌జెండర్ కూడా అవయవదానం చేయడం విశేషం. మాతృప్రేమ ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. పది సంవత్సరాల క్రితం 4,490 మంది మాత్రమే మొత్తం అవయవదానాలు చేశారు. ఇప్పుడు ఇంత పెరగడానికి వివిధ ఆస్పత్రులు, ప్రభుత్వాలు చేస్తున్న అవగాహన కార్యక్రమాలే కారణం. డాక్టర్ స్వర్ణలత లాంటివాళ్లు జీవన్‌దాన్ ద్వారా ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది వైద్యులు అవయవ మార్పిడి ఆపరేషన్లలో ఎంతో ముందున్నారు. వీరందరికీ నా మనఃపూర్వక అభినందనలు” అని చెప్పారు.క్యూఆర్ కోడ్ విడుదలఈ సందర్భంగా ఎవరైనా అవయవదానం చేయాలనుకుంటే అందుకు వీలుగా కామినేని ఆస్పత్రి తరఫున ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్లోని క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే ఒక దరఖాస్తు ఫారం వస్తుంది. దాన్ని నింపి, సబ్మిట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అవయవదాతలుగా మారొచ్చు.అవయవదానంపై అవగాహన కల్పించేందుకు కామినేని ఆస్పత్రి డైరెక్ట్ మెసేజ్‌లు, సోషల్ మీడియా ప్రచారాలతో కూడిన సమగ్ర అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛంద దాతలను ప్రోత్సహించేందుకు ఆసుపత్రి ఆవరణలో డిజిటల్ కియోస్క్ ఏర్పాటుచేశారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు సమర్పించిన వెంటనే వారి వాట్సప్ నంబర్లకు 'గర్వించదగిన అవయవ దాత' కార్డును పంపిస్తారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కామినేని ఆస్పత్రి అందరినీ ఆహ్వానిస్తోంది. అవయవదాతగా పేరు నమోదుచేసుకోవడం ద్వారా, కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తులకు ప్రాణదానం చేయగల అవకాశం మీకు దక్కవచ్చు. -
నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, సాక్షి: నాగోల్‌లోని ఓ ప్రముఖ హోటల్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నెర గ్రాండ్ హోటల్లో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు హోటల్లో జరిగిన ఎంగేజ్మెంట్ పంక్షన్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. -
కామినేని ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మృతిచెందిన వ్యకికి చికిత్సను అందించి ఠాగూర్ సినిమాలోని సీన్‌ను తలపించేలా ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్ వ్యవహరించిందని మృతుని కుటుంబసభ్యులు గురువారం రాత్రి హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మునుగెల శివకృష్ణ(35) సూర్యాపేటలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో లోన్ రికవరీగా ఉద్యోగం చేస్తూ భార్య ఉమా పిల్లలు అక్షత, కన్నయ్యలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. శివకృష్ణకు గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు సూర్యాపేట నుంచి నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషయమంగా ఉందని ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్‌కు తరలించాలని సూచించారు. వెంటనే అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో శివకృష్ణను ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన ఎల్బీనగర్ కామినేని వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. గుండె నాళాలు మూసుకుపోయాయని మూడు స్టట్స్ వేయాలని వైద్యులు చేప్పడంతో వేయమని చెప్పామన్నారు. శివకృష్ణకు ఇన్సూరెన్స్ కార్డు ఉన్నా ఇంకా అప్రూవల్ రాలేదని డబ్బులు చెల్లించాలని పేర్కొనడంతో డబ్బులు చెల్లించారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని కిడ్నీలు చెడిపోయాయని, డయాలసిస్ చేస్తున్నామని వైద్యులు తెలిపారన్నారు. డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి చేయడంతో రూ. 7లక్షలు చెల్లించామని ఇంకా డబ్బులు చెల్లించలేమని, రోగిని నిమ్స్‌కు తీసుకెళ్లామని బంధువుల పేర్కొనగా... రెండు రోజులుగా రోగిని బంధువులకు చూపించకుండా, రోగి పరిస్థితి కుటుంబసభ్యులకు తెలుపకుండా గుట్టుగా ఉంచారని ఆరోపించారు. గురువారం ఉదయం నుంచి రోగి బంధువులు, కుటుంబ సభ్యులు షిఫ్ట్ చేస్తామని మరింత ఒత్తిడి చేశారు. రాత్రి సమయంలో రోగి బంధువులు, కుటుంబ సభ్యులకు తెలుపకుండా దొంగచాటుగా రోగిని అంబులెన్స్‌లో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బంధువులు, కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకుని ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. అంతేకాకుండా ఆస్పత్రి ఎదుట ఆస్పత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మృతి చెందిన వ్యక్తికి వెంటిలేటర్ ఏర్పాటు చేసి చికిత్సను అందించారని కేవలం ఇన్సూరెన్స్‌ను క్లయిమ్ చేసుకునేందుకు మృతిచెందిన వ్యక్తికి చికిత్సను అందించారని ఆరోపణలు చేస్తూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. కామినేని హాస్పిటల్స్ సూపరింటెండెంట్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో రాలేదు. -
హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె..
Deepika Padukone Admit In Kamineni Hospital In Hyderabad: ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాష్ పదుకొణె కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది బ్యూటిఫుల్ దీపికా పదుకొణె. తనదైన అందం, నటనతో అనేక అభిమానులను సంపాదించుకుంది. డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది దీపికా పదుకొణె. ఇదిలా ఉంటే తాజాగా దీపికా పదుకొణె ఆస్పత్రిలో చేరింది. హార్ట్‌బీట్ పెరగడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రుస్తుతం ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నట్లు సమాచారం. కాగా దీపికా పదుకొణె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతేకాకుండా షారుక్ ఖాన్‌తో 'పఠాన్' మూవీ చేస్తున్న దీపికా హాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకి ముప్పుపై దీపికా సమాధానం.. రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్.. డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్.. -
కామినేని ఆసుపత్రి నుంచి కిమ్స్ ఆసుపత్రికి 15 నిమిషాల్లో గుండెను తరలించిన అధికారులు
-
చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి
సాక్షి, హైదరాబాద్ : నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన చిన్నారి ప్రణతి చివరకు శాశ్వత నిద్రలోకి చేరుకుంది. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందింది. కాగా గురువారం యాదగిరిగుట్ట పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద రాచకొండ పోలీసుల వాహనం ఢీకొని ప్రణతి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మెదడుకి కూడా బలమైన గాయం కావడంతో పాటు కొన్న అవయవాలు పని చేయకపోవడంతో ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు.వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ప్రణతి కోలుకోవాలని, మెరుగైన వైద్యం అందించడానికి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చివరి వరకూ ప్రయత్నించారు. మరోవైపు నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: (చిన్నారిపై నుంచి దూసుకెళ్లిన పోలీసు వాహనం) -
కన్నతండ్రే కాలయముడయ్యాడు..
చౌటుప్పల్: ఆ చిన్నారి పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు.. భార్యపై ఉన్న కోపాన్ని పసిబిడ్డపై చూపించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన సిలివేరు శివకు హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు చెందిన అక్షరతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి అయిన నాటినుంచే శివ, భార్యపై అయిష్టంగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో అక్షర గర్భం దాల్చింది. ఈ విషయం నచ్చని శివ అబార్షన్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోక మొదటి కాన్పు కావడంతో ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. 3 నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు నిహారిక అని పేరు పెట్టారు. ఇటీవల అక్షర బిడ్డతో కలసి భర్త వద్దకు వచ్చింది. ఆదివారం భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. కొద్ది సేపటి తర్వాత అక్షర పడక గది నుంచి బయటకు వెళ్లింది. అంతలోనే శివ, పసిపాప నిహారిక గొంతు నులుముతుండటం చూసి వెంటనే బిడ్డను లాక్కుంది. అప్పటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పాపను హుటాహుటిన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున పాప మృతిచెందింది. -
మోకాలి చికిత్స కోసం వస్తే ప్రాణం తీశారు!
మన్సూరాబాద్: మోకాలి చికిత్స కోసం వస్తే ప్రాణం పోయిన సంఘటన ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్, అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన పూడూరి రాములమ్మ(48) మోకాలి నొప్పితో బాధపడుతూ గత నెల 21 ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు వెన్నుపూసకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నందుకు ఆస్పత్రిలో చేరాలని, ఇందుకు రూ. 1.32 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆగస్టు 23న రాములమ్మను ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా, అదే నెల 25న వెన్నుపూసకు శస్త్ర చికిత్స చేశారు. చికిత్స అనంతరం శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ఈ నెల 3న కడుపులో మరో శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఊపరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టిందని చెబుతూ ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో గుండె పని చేయడం లేదని, కరెంటు షాక్‌తో తిరిగి పల్స్‌రేట్‌ను పెంచామని వైద్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం బంధువులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్లి చూడగా రాములమ్మ అప్పటికే మృతిచెందింది. దీనిపై వైద్యులను నిలదీయగా ఇప్పుడే మృతి చెందిందని చెబుతున్నారని బాధితులు ఆరోపించారు. మొదట చికిత్సకు రూ. 1.32 లక్షలు ఖర్చవుతుందని చెప్పారని, అయితే సీఎం సహాయనిధి నుంచి రూ. 2.50 లక్షలు, గొర్లను అమ్మి మరో రూ. 2.70 లక్షలు చెల్లించిప్పటికీ మరో రూ. 1.08 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాములమ్మ మృతి చెందిందని, ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు:ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములమ్మకు సరైన చికిత్సను అందించామని, వైద్యుల నిర్లక్ష్యం లేదని కామినేని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు పేర్కొన్నారు. న్యూరో సర్జన్ డాక్టర్ అనంత్ చికిత్సను అందించారని, శస్త్ర చికిత్స తరువాత అరుదుగా వచ్చే సమస్యల కారణంగా రాములమ్మ మృతి చెందిందని ఆయన పేర్కొన్నారు. -
హరికృష్ణతో సెల్ఫీ.. స్పందించిన ఆసుపత్రి
సాక్షి, నల్గొండ : నటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం అనంతరం ఆయన్ని నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిలో కొందరు హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందారు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోశారు. కాగా, ఈ విషయంపై కామినేని ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగిన వారిపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సిబ్బందిలో కొంతమంది చేసిన తప్పిదం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని పేర్కొంది. సిబ్బందిలో కొందరి అనాగరిక, అమానుష ప్రవర్తన వల్లే ఈ తప్పిందం జరిగిందనీ, హరికృష్ణ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఆసుపత్రి తరపున క్షమాపణలు తెలిపింది. -
జనసంద్రంగా ‘కామినేని’
నకిరేకల్ / చిట్యాల : సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ (61) రోడ్డు ప్రమాదానికి గురాయ్యరు. చావుబతుకుల మధ్య ఉన్న ఆయనను నార్కట్‌పల్లిలోని కామినేని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ మృతి వార్త టీవీలు, సోషల్‌మీడియా ద్వారా తెలియడంతో ఆయన అభిమానులతో నార్కట్‌పల్లి కామినేని వైద్యశాల జనసంద్రంగా మారింది. హరికృష్ణ మృతదేహాన్ని చూసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతోపాటు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్, సినీ, రాజకీయ ప్రముఖులు కామినేని వైద్యశాలకు వచ్చారు. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులతో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి ముందు కిక్కిరిసి పోయింది. జాతీయ రహదారికి ఇరువైపులా అభిమానులు మోహరించారు. వచ్చిన జనాన్ని, అభిమానులను అదుపుచేయడంలో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. కాన్వాయ్‌లో ఎవ్వరు వచ్చిన ఒక్కసారిగా కేరింతలతో హైవే మీదకు దూసుకురావడంతో విజయవాడ, హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. సినీ ప్రముఖులు రావడంతో వారిని చూసేందుకు అభిమానులు కాన్వాయ్ మీదకు ఎగబడి చూశారు. అమరావతి నుంచి హెలికాప్టర్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికి ఆయన వాహనంలోనే నార్కట్‌పల్లిలోని కామినేని వైద్యశాలకు ఉదయం 11:09 నిమిషాలకు చేరుకున్నారు. గంటపాటు కామినేని వైద్యశాలలోనే ఉన్నారు. హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం.. హరికృష్ణ వాహనంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. తదనంతరం హరికృష్ణ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో చంద్రబాబునాయుడు తన వెంట హైదరాబాద్‌కు తీసుకెళ్లే క్రమంలో ఆసుపత్రి ముందున్న అభిమానులు పెద్దఎత్తున వాహనాలను వెంబడించారు. భారీ కేరింతలతో సుమారు కిలోమీటర్ మేర వారి కాన్వాయ్ వెంట అభిమానులు పరుగులు తీశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హరికృష్ణ మృతదేహం తీసుకెళ్లే వరకు ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితులను సమీక్షించారు. సినీ ప్రముఖులు జగపతిబాబు, హరికృష్ణ కుటుంబీకులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, హరికృష్ణ సోదరి పురందేశ్వరి, కొడాలి నాని, ఇతర సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఆసుపత్రిలో హరికృష్ణ మృతదేహం వద్ద నివాళులర్పించారు. భారీ బందోబస్తు.. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో పోలీసులు భద్రతను పర్యవేక్షించారు. ఆసుపత్రి గేటు లోపలికి ముఖ్యమైన వ్యక్తులను మాత్రమే అనుమతించారు. కొందరు ప్రముఖుల కార్లును సైతం ఆసుపత్రిలోకి అనుమతించలేదు. ప్రముఖ హీరో జగపతిబాబు కారును కూడా పోలీసులు అనుమతించకపోవటంతో ఆయన ఆసుపత్రి గేటు బయటనే కారు దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్లాడు. మీడియా ప్రతినిధులతో వాగ్వాదం.. ఆసుపత్రి వద్ద కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి వద్ద పలు టీవీ న్యూస్ చానల్స్ వీడియోగ్రాఫర్స్ కవరేజీ చేస్తుండగా దూరంగా వెళ్లి కవరేజీ చేయాలని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మీడియా ప్రతినిధులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి ఎదుట ట్రాఫిక్‌జాం.. కామినేని ఆసుపత్రి ఎదురుగానే జాతీయ రహదారి ఉండడంతో ఆసుపత్రి వద్దకు వచ్చిన ప్రజలు, వారి వాహనాలతో హైవేపై ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు కల్పించుకుని తగిన చర్యలు తీసుకోవడంతో రహదారిపై వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. ప్రముఖులు ఆసుపత్రి వద్దకు వచ్చిన సందర్భంలో, హరికృష్ణ మృతదేహాన్ని తరలించిన సందర్భంలో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. -
కామినేని హాస్పిటల్ ఎదుట ఆందోళన
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ.. రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో బుధువారం వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లెముర్ గ్రామానికి చెందిన బీరప్ప(35) అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రిలో చేరాడు. కాగా.. ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మృతిచెందాడంటూ.. అతని కుటుంబసభ్యులు, బంధవులు ఆందోళన చేస్తున్నారు. -
కార్పోరేట్ ఆసుపత్రి అమానుషం
హైదరాబాద్: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ పట్ల ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రి దారుణంగా ప్రవర్తించింది. పాప పుట్టి 12 రోజులైనా ఇప్పటివరకూ తల్లికి చూపించకుండా దాచిపెట్టింది. బిడ్డను తమకు చూపాలని మహిళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఆసుపత్రి వర్గాలు దిగొచ్చాయి. చిన్నారిని కన్నతల్లికి చూపించాయి. కాన్పు సమయంలో చిన్నారి తలకు గాయమైందని.. శిశువుకు ప్రత్యేక శస్త్ర చికిత్స అందిస్తున్న కారణంగానే ఇన్ని రోజులూ కన్నతల్లికి చూపించలేదని పేర్కొన్నాయి. దీంతో ఆగ్రహించిన మహిళ కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి తలకు గాయమైందని, తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇన్ని రోజులు ఆసుపత్రి కాలయాపన చేసిందని ఆరోపించారు. ఆపరేషన్ సమయంలో శిశువు తలకు కత్తెర తగలడం వల్ల గాయమైనట్లు తెలుస్తోంది. -
మెరుగుపడుతున్న సంజనా ఆరోగ్యం
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారి సంజనా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని కామినేని వైద్యులు గురువారం వెల్లడించారు. ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిందితులకు బెయిల్ రద్దు చేయాలని సంజనా తల్లిదండ్రులు గురువారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 2వ తేదీన పెద్ద అంబర్‌పేట వద్ద రోడ్డు దాటుతున్న సంజనతోపాటు ఆమె తల్లిని తాగి వాహనం నడుపుతున్న యువకులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సంజనాతోపాటు ఆమె తల్లీ తీవ్రంగా గాయపడింది. దీంతో వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు యువకులు బెయిల్ పై విడుదలయ్యారు. దాంతో వారి బెయిల్ రద్దు చేయాలని హయత్ నగర్ పోలీసులను సంజనా తల్లిదండ్రులు కోరారు. -
క్రమంగా కోలుకుంటున్న సంజనా
హైదరాబాద్ : పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సంజనా ఆరోగ్య పరిస్థితి క్రమంగా కోలుకుంటుందని కామినేని వైద్యులు బుధవారం వెల్లడించారు. ఆమె ఇంకా వెంటిలేటర్‌పైనే కొనసాగుతుందని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన పెద్ద అంబర్‌పేట వద్ద సంజనాతోపాటు ఆమె తల్లిని తాగి వాహనం నడిపి... యువకులు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సంజనాతోపాటు ఆమె తల్లీ కూడా తీవ్రంగా గాయపడింది. వీరు ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సంజనాను కారు ఢీకొట్టడంతో ఆమె తాతయ్యకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
విషమంగానే సంజన ఆరోగ్యం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆమెకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగిస్తున్నట్లు కామినేని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమె తల్లి శ్రీదేవి పరిస్థితి మెరుగవుతున్నట్లు వెల్లడించారు. -
కమ్యూనిస్టు యోధుడు ఉజ్జిని ఇకలేరు
హైదరాబాద్: తొలితరం కమ్యూనిస్టు యోధుడు, నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు(90) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని సైదాబాద్‌లోని తన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు నివాసానికి తరలించారు. మాజీ మంత్రి జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు ఉజ్జిని భౌతికకాయాన్ని సందిర్శించి నివాళులు అర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం గ్రామానికి తరలించారు. అక్కడ నల్లగొండ జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణరావు మూడుసార్లు మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన నాయకుడిగా పేరు గడించారు. నారాయణరావు మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. కమ్యూనిస్టు సీనియర్ నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా పేదల పక్షాన అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. సీపీఐ సంతాపం: ఉజ్జిని నారాయణరావు మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. సైదాబాద్‌లోని ఆయన నివాసంలో నారాయణరావు భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి చాడ, ఇతర నేతలు పల్లా వెంకటరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్ తదితరులు నివాళులర్పించారు. నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి ఇతర నేతలతో కలసి ఎంతో కృషి చేశారని తమ కుటుంబ సభ్యులను పార్టీ సభ్యులుగా, నాయకులుగా ఆయన తీర్చిదిద్దారని సురవరం సంతాప సందేశంలో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పొల్కంపల్లి వెంకటరామారావుతో కలసి ఆంధ్ర మహాసభలో చేరి ప్రజాసమస్యలపై స్పందించి కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగారని, భూ పోరాట ఉద్యమాల్లో పాల్గొన్నారని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రజా ఉద్యమానికి అంకితం కమ్యూనిస్టు ఉద్యమం తీవ్ర నిర్బంధానికి గురైన కాలంలో కూడా నారాయణరావు ప్రజా ఉద్యమానికి అంకితమై పనిచేశారని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన మృతికి నివాళులర్పించారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా పేద రైతాంగం పట్ల నిబద్ధతతో కృషి చేశారని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు. -
మునుగోడు మాజీ ఎమ్మెల్యేకు అస్వస్థత
మునుగోడు(నల్గొండ జిల్లా): మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిణి నారాయణరావు(90) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈయన వరసగా మూడుసార్లు సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన నాయకుడిగా పేరొందారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు: యువతి మృతి
చిట్యాల(నల్లగొండ): విజయవాడ- హైదరాబాద్ జాతీయరహదారిపై సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న సుమో చిట్యాల వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, రోడ్డుపై బోల్తా పడింది. ఆ వెనుకే వేగంగా వచ్చిన కారు కూడా డివైడర్‌ను, సుమోను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనలో సుమోలోని ముగ్గురు తీవ్రంగా గాయపడగా, కారులో ఉన్న బెంగళూరుకు చెందిన నాన్సీ(22) అక్కడికక్కడే చనిపోగా ఆమె తల్లి అనిత తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కారుపై మృతదేహం.. 15 కి.మీ. ప్రయాణం..!
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద శనివారం రోడ్డు దాటుతున్న వృద్ధుడు కొమిరెల్లి వెంకట్‌రెడ్డి(65)ని హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్‌రెడ్డి అమాంతం గాల్లోకి ఎగిరి అదే కారుపై పడి మృతి చెందాడు. కానీ, కారు డ్రైవర్ రహీంఖాన్ మాత్రం ఆ వాహనాన్ని ఆపకుండా 15 కిలోమీటర్ల దూరం అలాగే కారుపై మృతదేహంతోనే వెళ్లాడు. వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపుడే అయిటిపాముల వద్ద కారు రిపేర్‌తో ఆగిపోగా పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. - నార్కట్‌పల్లి -
ఆర్టీసీ బస్సులు ఢీ.. పదిమందికి గాయాలు
-
ఆర్టీసీ బస్సులు ఢీ.. పదిమందికి గాయాలు
నార్కెట్‌పల్లి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డు జంక్షన్ దాటుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సును ఢీకొన్న ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు మణుగూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. నార్కెట్ పల్లి శివారులోని కామెనేని ఆస్పత్రి ఎదురుగా ఉన్న వై జంక్షన్ వద్ద నార్కెట్‌పల్లి పట్టణంలోనికి ప్రవేశిస్తుండగా.. హైదరాబాద్ నుంచి నర్సరావుపేట వెళ్తున్న ఇంద్ర బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు క్షతగాత్రులను వెంటనే స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు. -
కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి అనే యువ కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు పెద్ద సంఖ్యలో బుధవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుడి బంధువులతో ఆస్పత్రి యాజమాన్యం చర్చలు జరుపుతోంది. సంఘటనపై వివరాలు తెలియాల్పి ఉంది. -
చికిత్స పొందుతూ ‘సాక్షి’ విలేకరి కృష్ణ మృతి
హైదరాబాద్: నాలుగు రోజుల కింద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విలేకరి చేరాల కృష్ణ సోమవారం తుదిశ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన కృష్ణ (29) హయత్‌నగర్ మం డలం పెద్దఅంబర్‌పేట విలేకరిగా విధులు నిర్వహిస్తూ అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసముంటున్నారు. కృష్ణకు 2013లో ఎల్బీనగర్ చింతల్‌కుంటకు చెందిన గౌతమితో వివాహం జరిగిం ది. 10వ తేదీన రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వనస్థలిపురం ఆటోనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం సాయంత్రం 4.30 సమ యంలో తుది శ్వాస విడిచారు. కృష్ణ మృతిపట్ల ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ మురళి సంతా పం ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి, సిటీబ్యూరో చీఫ్ ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డిలు కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. కృష్ణ కుటుంబ సభ్యులను ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శించారు. కృష్ణ స్వగ్రామం నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఫలించని సదుద్దేశం..: బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణ అవయవాలను దానం చేయడానికి ఆయన కుటుంబీకులు సోమవారం ఉదయం జీవన్‌దాన్ సంస్థను సంప్రదించారు. వారు ఆసుపత్రికి వచ్చి పరీక్షలు జరిపి అవయవాల సేకరణకు సన్నద్ధమవుతున్న తరుణంలోనే కృష్ణ గుండె ఆగిపోయింది. -
కామినేని ఆస్పత్రిపై కేసు నమోదు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్‌కు ఆరోగ్య భద్రత కార్డు ఉన్నా వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిన కామినేని ఆసుపత్రిపై కేసు నమోదైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ యాదగిరి ఈ నెల 3న రాత్రి విధులు ముగించుకుని ఘట్కేసర్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం 108లో కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి విధులలో ఉన్న డాక్టర్ ఎలాంటి ప్రథమ చికిత్స చేయకుండా నిర్లక్ష్యం వహించాడు. ఆరోగ్య భద్రత స్కీమ్ అగ్రిమెంట్ కలిగి ఉన్నా చికిత్స అందించకుండా డాక్టర్లు తిరస్కరించారు. దీంతో వెంటనే యాదగిరిని మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్.భద్రారెడ్డి వైద్యం అందించని కామినేని ఆసుపత్రి, విధులలో ఉన్న డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కామినేని ఆసుపత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దకాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
చిట్యాల(నల్గొండ): చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయరహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనకాలే వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. -
మృతి చెందిన వ్యక్తికి చికిత్స..!
కామినేని ఆస్పత్రిలో బంధువుల ఆందోళన మన్సూరాబాద్ : చనిపోయిన వ్యక్తికి కామినేని ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసినట్లు రోగి బంధువులు ఆరోపించారు. బంధువుల వివరాలు.. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన నాగులంచి శ్రీనివాస్‌రెడ్డి(48) లారీలోని ఐరన్ షీట్లు అన్ లోడ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. అడ్వాన్స్‌గా రూ.75 వేలు చెల్లించారు. రోగికి చికిత్స చేయాలంటే మరో రూ.1.50 లక్షలు చెల్లించాల్సిందిగా ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. అంత మొత్తం తమ వద్ద లేదని, డిశ్చార్జ్ చేస్తే గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తామని అతడి బంధువులు కోరారు. ప్రస్తుతం రోగి వెంటిలేటర్‌పై ఉన్నాడని, డిశ్చార్జ్ చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనుమానం వచ్చి కొంత మంది ఐసీయూలోకి వెళ్లి పరీక్షించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు గమనించారు. ఆస్పత్రి వైద్యులు చనిపోయిన వ్యక్తికి చికిత్స చేస్తున్నట్లు నటిస్తూ తమ నుంచి భారీగా డబ్బులు గుంజేందుకు యత్నించారని ఆరోపిస్తూ వుృతుని భార్య పద్మ, కుమార్తె దివ్య, కుమారుడు సంపత్‌రెడ్డి సహా పలువురు బంధువులు ఆస్పత్రి వుుందు ఆందోళనకు దిగారు. ఈ విషయమై కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణను వివరణ కోరేందుకు ‘సాక్షి’ యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
పోలీసుల పాత్ర అభినందనీయం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య గాయపడ్డ పోలీసులకు పలువురి పరామర్శ హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సహకారంతో ముందుకు కొనసాగాలని, పోలీసుల ధైర్యసాహసాలు అభినందనీయమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో గాయపడ్డ రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, ఎస్ఐ సిద్ధయ్యలను ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ సూర్యాపేట సంఘటన దిగ్భ్రాంతిని కలుగజేసిందని, తెలంగాణ పోలీసుల పాత్రను ప్రశంసించారు. దురదృష్టవశాత్తు నాగరాజు మృతి విచారకరమని, కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేపీ ఎల్పీ నేత లక్ష్మణ్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మైనార్టీ విభాగం నేత ముస్తఫా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిలు కూడా బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించారు. అప్రమత్తంగా లేకపోవడం విచారకరం ‘‘మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సిమి కార్యకలాపాలపై వెబ్సైట్లో పెట్టినప్పటికి అప్రమత్తంగా లేకపోవడం విచారకరం. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను అందించాలి. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎస్ఐ, ఇతర పోలీసులు అభినందనీయులు.’’ -జి.కిషన్‌రెడ్డి సిద్ధయ్య త్వరగా కోలుకోవాలి ‘‘ఉగ్రవాదులు, దారిదోపిడీగాళ్లను పోలీసులు విజ్ఞతతో ఎదుర్కోవడం అభినందనీయం. దాడుల్లో పోలీసులు మరణించినందుకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా. మృత్యువుతో పోరాడుతున్న సిద్ధయ్య త్వరగా కోలుకోవాలి. బాధిత పోలీసుల కుటుంబానికి రావాల్సిన అన్ని రకాల సహాయంతో పాటు ఉద్యోగం ఇవ్వాలి.’’ - కె.జానారెడ్డి సాయం అందిస్తున్నాం ‘‘సూర్యాపేట ఎన్కౌంటర్లో గాయపడ్డ పోలీసులకు అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాం. ఎస్ఐ సిద్ధయ్యకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నాం. మూడు శస్త్రచికిత్సలు నిర్వహించి రెండు బుల్లెట్లను తొలగించగా, ఇప్పటికి పరిస్థితి విషమంగానే ఉంది.’’ -మంత్రి లక్ష్మారెడ్డి హృదయ విదారకం ‘‘సూర్యాపేటలో జరిగిన సంఘటన హృదయ విదారకం. సంఘటన జరిగినప్పుడే ప్రభుత్వం స్పందించి చేతులు దులుపుకుంటోంది. పోలీసు అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అధునాతన ఆయుధాలు అందించి.. వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. - కొండా రాఘవరెడ్డి -
అపస్మారక స్థితిలోనే ఎస్సై సిద్ధయ్య
హైదరాబాద్: దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలోని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం)ఎస్ఐ జూలూరి సిద్ధయ్య (29)ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆదివారం ఉదయం వైద్యులు విడుదల చేసిన మెడికల్ బులెటన్లో స్పష్టం చేశారు. బ్లడ్‌ప్లజర్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చి, అధిక రక్తస్త్రావాన్ని నివారించినప్పటికీ..ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇప్పటి వరకు ఆయన కళ్లు తెరచి కూడా చూడలే దు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న మెదడు, పొత్తికడుపులో ఉండిపోయిన బుల్లెట్లను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలా? లేదా అనే అంశంపై వైద్యులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకిపురం-చిన్నకోడూరు మధ్య శనివారం ఉదయం పోలీసులకు, దుండగులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ సిద్ధయ్య, రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డిలను చికిత్స కోసం ఎల్బీన గర్ కామినేని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. వీరిలో సీఐ బాలగంగిరెడ్డి ఆరో గ్య పరిస్థితి నిలకడగా ఉండగా, ఎస్ఐ సిద్ధయ్య మాత్రం ఇంకా మృత్యువుతోనే పోరాడుతున్నాడు. పది మందితో కూడిన వైద్య బృందం ఇప్పటి వరకు ఆయనకు మూడు శస్త్రచికిత్సలు చేసింది. సుమారు ఎనిమిది గంటల పాటు శ్రమించి ఎడమ చెవి వెనుక భాగం నుంచి మెదడు వరకు దూసుకపోయిన ఒక బుల్లెట్ ను, ఛాతీకి ఎడమవైపు నుంచి భుజం వైపు దూసుకుపోయిన మరో బుల్లెట్‌ను తొలగించారు. అలాగే, పొత్తి కడుపును పూర్తిగా ఓపెన్ చేసి ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను శుభ్రం చేసినప్పటికీ...కడుపులోని బుల్లెట్ వ ల్ల ప్రా ణానికి ప్రమాదం లేక పోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. శరీరం శస్త్రచికిత్సకు సహకరించక పోవడంతో చిన్న మెదడులోకి దూసుకపోయిన మరో బుల్లెట్‌ను కూడా వదిలేశారు. బాధితుని ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడిన తర్వాత మరోసారి శస్త్రచికిత్స చేసి వాటి ని తొలగించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే రెండు రోజులైనాల కళ్లు తెరిచి చూడక పోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. -
12 గంటలు గడిస్తేగానీ చెప్పలేం: కామినేని ఆస్పత్రి వైద్యులు
హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య పరిస్థితి 12 గంటలు గడిస్తేగానీ చెప్పలేం అని కామినేని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం శివారులో శనివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్ధయ్య తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.ఎస్ఐ శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయని ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సిద్ధయ్య మెదడు, తల, ఛాతీ, పొట్టలో బుల్లెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రోజుకి ఇప్పటికీ సిద్ధయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిద్ధయ్య తలలో ఉన్న బుల్లెట్ వల్ల ప్రమాదంలేదని వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా, సిద్ధయ్య భార్య ధరణి శనివారం రాత్రి ఇదే ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. -
చావుబతుకుల మధ్య భర్త.. బిడ్డకు జన్మనిచ్చిన భార్య
కొడుకు పుట్టిన సంతోషానికి దూరంగా సిద్ధయ్య కుటుంబం వెంటిలేటర్‌పై ఎస్సై 3 బుల్లెట్లు తొలగింపు.. మెదడు సమీపంలో మరో బుల్లెట్ సాక్షి, హైదరాబాద్: ఓవైపు మృత్యువుతో పోరాడుతున్న భర్త.. మరోవైపు ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ..! అదీ ఒకే అసుపత్రిలో! భర్త పరిస్థితి తలుచుకొని కుమిలిపోవాలో.. తమ కలల పంట కళ్లు తెరిచిందని ఆనందపడాలో తెలియని దయనీయ పరిస్థితి ఆమెది!! జానకీపురం ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై సిద్ధయ్య భార్య ధరణి శనివారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాల్పుల ఘటన జరిగి ఉండకపోతే వారింట్లో ఆనందం వెల్లివిరిసేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. చావు బతుకుల మధ్య ఉన్న భర్తను తలచుకొని ధరణి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. వాస్తవానికి ఆమె మరో 10 రోజులకు ప్రసవించాల్సి ఉంది. కానీ భర్త పరిస్థితితో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. పురిటినొప్పులు రావడంతో సిద్ధయ్య చికిత్స పొందుతున్న ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలోనే డాక్టర్లు రాత్రి తొమ్మిదిన్నరకు ఆమెకు ఆపరేషన్ చేశారు. 24 గంటలు గడిస్తేగానీ.. సిద్ధయ్య (29) శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పది మందితో కూడిన వైద్య బృందం 8 గంటల పాటు శ్రమించి మూడు బుల్లెట్లను తొలగించగలిగింది. మెదడు సమీపంలోకి దూసుకపోయిన మరో బుల్లెట్‌ను తొలగించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే కానీ..ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పారు. బుల్లెట్ గాయాల వల్ల ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. ఇప్పటికే ఆరు యూనిట్ల రక్తం ఎక్కించారు. కడప జిల్లాకు చెందిన సిద్ధయ్య కుటుంబం 20 ఏళ్ల క్రితమే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో స్థిరపడింది. 2011బ్యాచ్‌కు చెందిన ఆయనకు ఏడాది క్రితమే ధరణితో వివాహమైంది. కాగా, కానిస్టేబుల్ నాగరాజు కట్టంగూర్ మండలం రసూల్గూడెంకు చెందిన వ్యక్తి. ఆయనకు ఎనిమిది నెలల క్రితం సంజనతో వివాహమైంది. రెండేళ్ల పాటు ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసిన తర్వాత ఐదేళ్ల క్రితం సివిల్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
కౌలు రైతు బలవన్మరణం
నార్కట్‌పల్లి (నల్లగొండ): అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పట్ల జంగిలయ్య(30), ఆరు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. దిగుబడి సరిగా రాకపోవటం, గిట్టు భాటు ధర లభించకపోవటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. రూ.6 లక్షల వరకు అప్పు మిగిలిపోవటంతో మనస్తాపానికి గురైన జంగిలయ్య ఈనెల 4వ తేదీన క్రిమి సంహారక మందు తాగాడు. కామినేని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం చనిపోయాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఏపీలో వైద్య రంగం అభివృద్ధికి కేంద్రం సాయం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడలో కామినేనిఆసుపత్రి ప్రారంభం విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడ సమీపంలో రూ. 150 కోట్లతో నిర్మించిన కామినేని ఆసుపత్రిని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న ఆధునిక వైద్యం ఇక మీదట ఏపీ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సాయమందించటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇందులో భాగంగా రూ.1200 కోట్లతో మంగళగిరి వద్ద ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రస్తుత తరుణంలో ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. అందరికీ వైద్యం అందించడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రవేశ పెట్టిందని, దీనిని మూడు నెలల్లో అమలులోకి తీసుకువస్తామన్నారు. విజయవాడలో కామినేని ఆసుపత్రి ఏర్పాటుతో అత్యాధునిక వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులు వ్యాపారం కోసమే కాకుండా సేవా భావంతో కూడా సవలందించాలని కోరారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎయిమ్స్ ఏర్పాటుకు రూ.1200 కోట్లు, విజయవాడ, అనంతపురంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు రూ.150 కోట్ల చొప్పున, అలాగే.. విజయవాడ-గుంటూరు మధ్యలో కేన్సర్ ఆసుపత్రికి రూ.120 కోట్లు, నెల్లూరు, కర్నూలులో కేన్సర్ ఆస్పత్రులకు రూ.45 కోట్ల చొప్పున నిధులు మంజూరుకు కేంద్ర అంగీకరించిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మంత్రులు పరిటాల సునీత, పి. నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునీకరణకు ఆసుపత్రులు సై..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆధునిక టెక్నాలజీకి పెద్ద పీటవేస్తూ నాణ్యమైన వైద్య సేవలందించే ఆసుపత్రులే భవిష్యత్తులో నిలదొక్కుకుంటాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నిపుణులైన వైద్యులతోపాటు ఆధునిక ఉపకరణాలను సమకూర్చుకున్న ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవడానికి రోగులు మొగ్గు చూపుతున్నారట. దీనికితోడు ఆసుపత్రుల మధ్య తీవ్ర పోటీ నెలకొంటోంది. ఇంకేముంది మార్కెట్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీని తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వైద్య చికిత్సలో ఉపయోగించే, అలాగే రోగ నిర్ధారణ పరీక్షలకు వాడే ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే, హిమోడైనమిక్ రికార్డింగ్, సర్జికల్ ఇమేజింగ్, వార్మర్ వంటి ఉపకరణాల మార్కెట్ పరిమాణం ప్రస్తుతం భారత్‌లో సుమారు రూ. 4,340 కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 7 నుంచి 10 శాతం ఉంది. ప్రైవేటు ఆసుపత్రులే ముందు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో దేశంలో ప్రైవేటు ఆసుపత్రులే ముందుంటున్నాయి. మొత్తం మార్కెట్లో 70 శాతం వాటా ఈ ఆసుపత్రులదే. మెట్రో, అగ్రశ్రేణి నగరాల్లోని పెద్ద ఆసుపత్రులు కొత్త టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నాయని జీఈ హెల్త్‌కేర్ లైఫ్‌కేర్ సొల్యూషన్స్ విభాగం దక్షిణాసియా డెరైక్టర్ అశుతోష్ బెనర్జీ తెలిపారు. లల్లబాయ్ వార్మర్ ప్రైమ్ ఉపకరణాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ప్రజల్లో కూడా ఉపకరణాలపట్ల అవగాహన పెరుగుతోంది. కావాల్సిన సౌకర్యాలున్న ఆసుపత్రికే వెళ్తున్నారని చెప్పారు. నవజాత శిశువుల సంరక్షణకు ఉపయోగించే వార్మర్లు దేశవ్యాప్తంగా ఏటా 15,000 అమ్ముడవుతున్నాయని వివరించారు. మొత్తం ఉపకరణాల మార్కెట్లో 40 శాతం వాటాతో జీఈ తొలి స్థానంలో ఉన్నట్టు చెప్పారు. దేశంలో ఫిలిప్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సీమెన్స్, ఎరిక్సన్ వంటి కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ. నైపుణ్యానికి టెక్నాలజీ తోడు..: ప్రపంచంలో వస్తున్న అధునాతన టెక్నాలజీని పరిశీలించి, సూచనలిచ్చేందుకు అంతర్జాతీయ పరిశోధనా విభాగాన్ని అపోలో హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకుంది. ఉపకరణాల కొనుగోలుకు ఏటా రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఈడీ సంగీతా రెడ్డి తెలిపారు. రోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అందుబాటు ధరలో వైద్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. నిపుణులైన వైద్యులకు టెక్నాలజీ తోడైతే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయని రెయిన్బో హాస్పిటల్స్ ఎండీ రమేష్ కంచర్ల తెలిపారు. కొత్త టెక్నాటజీ వినియోగంలో తమ ఆసుపత్రి ఎప్పుడూ ముందుంటుందని, ఏటా సుమారు రూ.10 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. ధర నియంత్రించాలి.. ఉపకరణాల ధరలు ఖరీదుగా ఉండడం వల్లే చికిత్సల ఖర్చు కూడా ఎక్కువగా ఉంటోందని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. వీటి ధరలు దిగివస్తే సామాన్యులకూ నాణ్యమైన సేవలు చేరతాయని కామినేని హాస్పిటల్స్ ఎండీ కామినేని శశిధర్ తెలిపారు. ‘తక్కువ ధరకే వైద్యం అందించాలని ప్రభుత్వం అంటోంది. అదే ఉపకరణాల ధర విషయంలో మాత్రం దేశంలో నియంత్రణ లేకుండా పోయింది. ఉదాహరణకు గత ఏడాది రూ.1 కోటి ఉన్న ఉపకరణం ధర కాస్తా ఏడాదిలో సగానికి పడిపోతుంది. ఈలోపు మరో కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వస్తుంది. మొత్తంగా తయారీ కంపెనీలు ఆసుపత్రులతో ఆటలాడుకుంటున్నాయి’ అని అన్నారు. కాగా, టెక్నాలజీ కోసం కామినేని ఆసుపత్రులు ఏటా రూ.30 కోట్లదాకా వ్యయం చేస్తున్నాయి. -
టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా దుర్మరణం
సాక్షి, నార్కట్‌పల్లి/నల్లగొండ/హైదరాబాద్: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా (57) గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అత్యంత వేగంగా వెళ్తూ అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాషా గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయలుదేరారు. 8.30 గంటల సమయంలో ఆయన వాహనం నార్కట్‌పల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. మూడు పల్టీలు కొట్టి, అవతలివైపు పడింది. ఈ ప్రమాదంలో బాషా అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ ముజాఫర్ ఇక్బాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తలకు బలమైన గాయాలు కావడం వల్లే బాషా మృతి చెందారని పోస్టుమార్టం నిర్వహించిన నల్లగొండ ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాషా భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నం.12 మిథిలానగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. సాయంత్రం గంటసేపు బాషా భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి, అనంతరం ఆయన స్వస్థలం గుంటూరుకు తీసుకెళ్లారు. శుక్రవారం అంత్యక్రియలకు చంద్రబాబు, పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు హాజరవుతారు. బాషా దుర్మరణం గురించి తెలిసిన వెంటనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బయల్దేరి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అక్కడ బాషా మృతదేహాన్ని చూసి కంటతడిపెట్టారు. బాషా కుమారుడు గయాజుద్దీన్‌ను ఓదార్చారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, ‘‘బాషాతో నాది విడదీయలేని సంబంధం. నా కుటుంబసభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉంది. పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన మృతి తీరని లోటు’’ అని అన్నారు. బాషా మృతిపట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, లోక్‌సత్తా అధినేత జేపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావంతో లాల్జాన్బాషాతో కలిసి పనిచేశానని, ఆయన తనకు మంచి మిత్రుడని మంత్రి జానారెడ్డి చెప్పారు. వామపక్ష శ్రేయోభిలాషిని కోల్పోయామని సీపీఐ నేత నారాయణ అన్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సంతాపం తెలిపారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ ఒక సంయుక్త ప్రకటనలో సంతాపం తెలిపారు. బాషా మరణం వెనుకబడిన వర్గాలకు తీరని లోటని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి, పరిటాల సునీత, వేనేపల్లి చందర్రావు, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, మంత్రి అహ్మదుల్లా, అక్బరుద్దీన్ ఒవైసీ, దేవేందర్‌గౌడ్, పయ్యావుల కేశవ్, షబ్బీర్ అలీ, జైపాల్ యాదవ్, వైఎస్సార్సీపీ నేత రెహమాన్, గద్దర్ తదితరులు బాషా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, సినీనటుడు బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయమ్మ దిగ్భ్రాంతి లాల్‌జాన్ బాషా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిరాడంబరుడు, సౌమ్యుడైన బాషా హఠాన్మరణం తమ మనస్సును కలచి వేసిందని విజయమ్మ పేర్కొన్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో బాషా ప్రజలకు, మైనారిటీలకు అంకితభావంతో సేవలు అందించారని అన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం! బాషా ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదం సమయంలో గంటకు 120 నుంచి 150 కి.మీ. వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంత వేగంతో వాహనం ఢీకొనడంతో డివైడర్‌కు ఉన్న ఇనుప కంచెలోని ఒక రాడ్ బాషా కూర్చున్న ముందుసీటు వైపు దూసుకొచ్చి, ఆయన కుడికాలులో గుచ్చుకుంది. వాహనం పల్టీలు కొడుతున్న సమయంలో ముందు డోర్ ఊడిపోయింది. సీటుబెల్టు పెట్టుకోకపోవడంతో బాషా అందులోంచి ఎగిరి కిందపడిపోయారు. రాడ్ గుచ్చుకున్న కాలు అంతవరకు తెగి, వాహనంలోనే ఉండిపోయింది. అయితే.. హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందే త్వరగా వెళ్లాలని లాల్‌జాన్‌బాషా తనకు సూచించారని డ్రైవర్ ముజాఫర్ ఇక్బాల్ తెలిపారు. వర్షం కురుస్తుండడంతో రోడ్డంతా తడిసి ఉందని, కామినేని జంక్షన్ వద్దకు రాగానే వాహనం వేగాన్ని తగ్గించేందుకు బ్రేక్ వేశానని.. వెంటనే అదుపుతప్పి ఘోరం జరిగిపోయిందని చెప్పాడు. బాషా రాజకీయ ప్రస్థానం లాల్‌జాన్‌బాషా 1956లో గుంటూరులో జన్మించారు. ఆయనకు 1975లో వివాహమైంది. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబం అంటే ఆయనకు బాగా ఇష్టం. అందుకే తరచూ తల్లి, ఆరుగురు తమ్ముళ్లు, నలుగురు సోదరీమణులతో గడుపుతుంటారు. ఇనుము వ్యాపారంలో స్థిరపడిన లాల్‌జాన్‌బాషా 1991లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగి.. ఆచార్య ఎన్జీ రంగాపై గెలుపొందారు. ఇక్కడ్నుంచి గెలుపొందిన మొట్టమొదటి టీడీపీ ఎంపీగా బాషాకు గుర్తింపు ఉంది. అయితే తదుపరి 1996, 1998లలో రాయపాటి సాంబశివరావుపై ఓటమి పాలయ్యారు. 1999లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి నేదురుమల్లి జనార్దనరెడ్డిపై పోటీపడ్డారు. కానీ విజయం సాధించలేకపోయారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో లాల్‌జాన్‌బాషా దుర్మరణం
నార్కెట్‌పల్లి సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లాల్‌జాన్‌బాషా మృతి చెందారు. నల్గొండ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు కామినేని ఆసుపత్రి వద్ద డీవైడర్‌ను ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాషా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాషా మృతి చెందిన వార్త తెలియగానే నకరేకల్ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య, టీడీపీ నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే లాల్‌జాన్‌బాషా మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు బాషా మృతికి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. బాషా మృతితో గుంటూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీ ఓ మంచి నేతను కొల్పోయిందని నరసరావు పేట ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి తన సంతపం ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 1984లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు ఎన్జీరంగాను ఓడించారు. అనంతరం ఆయన రాజ్యసభ సభ్యునిగా కూడా ఓ పర్యాయం పనిచేశారు.