ఆస్పత్రిలో నారాచంద్రబాబునాయుడు, లోకేశ్
నకిరేకల్ / చిట్యాల : సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ (61) రోడ్డు ప్రమాదానికి గురాయ్యరు. చావుబతుకుల మధ్య ఉన్న ఆయనను నార్కట్‌పల్లిలోని కామినేని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ మృతి వార్త టీవీలు, సోషల్‌మీడియా ద్వారా తెలియడంతో ఆయన అభిమానులతో నార్కట్‌పల్లి కామినేని వైద్యశాల జనసంద్రంగా మారింది. హరికృష్ణ మృతదేహాన్ని చూసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతోపాటు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్, సినీ, రాజకీయ ప్రముఖులు కామినేని వైద్యశాలకు వచ్చారు.
దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులతో నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి ముందు కిక్కిరిసి పోయింది. జాతీయ రహదారికి ఇరువైపులా అభిమానులు మోహరించారు. వచ్చిన జనాన్ని, అభిమానులను అదుపుచేయడంలో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. కాన్వాయ్‌లో ఎవ్వరు వచ్చిన ఒక్కసారిగా కేరింతలతో హైవే మీదకు దూసుకురావడంతో విజయవాడ, హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. సినీ ప్రముఖులు రావడంతో వారిని చూసేందుకు అభిమానులు కాన్వాయ్ మీదకు ఎగబడి చూశారు. అమరావతి నుంచి హెలికాప్టర్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికి ఆయన వాహనంలోనే నార్కట్‌పల్లిలోని కామినేని వైద్యశాలకు ఉదయం 11:09 నిమిషాలకు చేరుకున్నారు. గంటపాటు కామినేని వైద్యశాలలోనే ఉన్నారు. హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం.. హరికృష్ణ వాహనంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. తదనంతరం హరికృష్ణ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో చంద్రబాబునాయుడు తన వెంట హైదరాబాద్‌కు తీసుకెళ్లే క్రమంలో ఆసుపత్రి ముందున్న అభిమానులు పెద్దఎత్తున వాహనాలను వెంబడించారు.
భారీ కేరింతలతో సుమారు కిలోమీటర్ మేర వారి కాన్వాయ్ వెంట అభిమానులు పరుగులు తీశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హరికృష్ణ మృతదేహం తీసుకెళ్లే వరకు ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితులను సమీక్షించారు. సినీ ప్రముఖులు జగపతిబాబు, హరికృష్ణ కుటుంబీకులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, హరికృష్ణ సోదరి పురందేశ్వరి, కొడాలి నాని, ఇతర సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఆసుపత్రిలో హరికృష్ణ మృతదేహం వద్ద నివాళులర్పించారు.
భారీ బందోబస్తు..
ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలతో పోలీసులు భద్రతను పర్యవేక్షించారు. ఆసుపత్రి గేటు లోపలికి ముఖ్యమైన వ్యక్తులను మాత్రమే అనుమతించారు. కొందరు ప్రముఖుల కార్లును సైతం ఆసుపత్రిలోకి అనుమతించలేదు. ప్రముఖ హీరో జగపతిబాబు కారును కూడా పోలీసులు అనుమతించకపోవటంతో ఆయన ఆసుపత్రి గేటు బయటనే కారు దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్లాడు.
మీడియా ప్రతినిధులతో వాగ్వాదం..
ఆసుపత్రి వద్ద కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి వద్ద పలు టీవీ న్యూస్ చానల్స్ వీడియోగ్రాఫర్స్ కవరేజీ చేస్తుండగా దూరంగా వెళ్లి కవరేజీ చేయాలని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మీడియా ప్రతినిధులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆసుపత్రి ఎదుట ట్రాఫిక్‌జాం..
కామినేని ఆసుపత్రి ఎదురుగానే జాతీయ రహదారి ఉండడంతో ఆసుపత్రి వద్దకు వచ్చిన ప్రజలు, వారి వాహనాలతో హైవేపై ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు కల్పించుకుని తగిన చర్యలు తీసుకోవడంతో రహదారిపై వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. ప్రముఖులు ఆసుపత్రి వద్దకు వచ్చిన సందర్భంలో, హరికృష్ణ మృతదేహాన్ని తరలించిన సందర్భంలో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment