
చావుబతుకుల మధ్య భర్త.. బిడ్డకు జన్మనిచ్చిన భార్య
కొడుకు పుట్టిన సంతోషానికి దూరంగా సిద్ధయ్య కుటుంబం
వెంటిలేటర్‌పై ఎస్సై 3 బుల్లెట్లు తొలగింపు..
మెదడు సమీపంలో మరో బుల్లెట్
సాక్షి, హైదరాబాద్: ఓవైపు మృత్యువుతో పోరాడుతున్న భర్త.. మరోవైపు ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ..! అదీ ఒకే అసుపత్రిలో! భర్త పరిస్థితి తలుచుకొని కుమిలిపోవాలో.. తమ కలల పంట కళ్లు తెరిచిందని ఆనందపడాలో తెలియని దయనీయ పరిస్థితి ఆమెది!! జానకీపురం ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఎస్సై సిద్ధయ్య భార్య ధరణి శనివారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాల్పుల ఘటన జరిగి ఉండకపోతే వారింట్లో ఆనందం వెల్లివిరిసేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. చావు బతుకుల మధ్య ఉన్న భర్తను తలచుకొని ధరణి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. వాస్తవానికి ఆమె మరో 10 రోజులకు ప్రసవించాల్సి ఉంది. కానీ భర్త పరిస్థితితో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. పురిటినొప్పులు రావడంతో సిద్ధయ్య చికిత్స పొందుతున్న ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలోనే డాక్టర్లు రాత్రి తొమ్మిదిన్నరకు ఆమెకు ఆపరేషన్ చేశారు.
24 గంటలు గడిస్తేగానీ..
సిద్ధయ్య (29) శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకుపోయాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పది మందితో కూడిన వైద్య బృందం 8 గంటల పాటు శ్రమించి మూడు బుల్లెట్లను తొలగించగలిగింది. మెదడు సమీపంలోకి దూసుకపోయిన మరో బుల్లెట్‌ను తొలగించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే కానీ..ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పారు. బుల్లెట్ గాయాల వల్ల ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. ఇప్పటికే ఆరు యూనిట్ల రక్తం ఎక్కించారు.
కడప జిల్లాకు చెందిన సిద్ధయ్య కుటుంబం 20 ఏళ్ల క్రితమే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో స్థిరపడింది. 2011బ్యాచ్‌కు చెందిన ఆయనకు ఏడాది క్రితమే ధరణితో వివాహమైంది. కాగా, కానిస్టేబుల్ నాగరాజు కట్టంగూర్ మండలం రసూల్‌గూడెంకు చెందిన వ్యక్తి. ఆయనకు ఎనిమిది నెలల క్రితం సంజనతో వివాహమైంది. రెండేళ్ల పాటు ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసిన తర్వాత ఐదేళ్ల క్రితం సివిల్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.