పోలీసుల పాత్ర అభినందనీయం
- కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య
- గాయపడ్డ పోలీసులకు పలువురి పరామర్శ
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సహకారంతో ముందుకు కొనసాగాలని, పోలీసుల ధైర్యసాహసాలు అభినందనీయమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ సిద్ధయ్యలను ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ సూర్యాపేట సంఘటన దిగ్భ్రాంతిని కలుగజేసిందని, తెలంగాణ పోలీసుల పాత్రను ప్రశంసించారు.
దురదృష్టవశాత్తు నాగరాజు మృతి విచారకరమని, కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీఎల్‌పీ నేత జానారెడ్డి, బీజేపీ ఎల్‌పీ నేత లక్ష్మణ్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, మైనార్టీ విభాగం నేత ముస్తఫా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిలు కూడా బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించారు.
అప్రమత్తంగా లేకపోవడం విచారకరం
‘‘మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సిమి కార్యకలాపాలపై వెబ్‌సైట్‌లో పెట్టినప్పటికి అప్రమత్తంగా లేకపోవడం విచారకరం. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను అందించాలి. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎస్‌ఐ, ఇతర పోలీసులు అభినందనీయులు.’’
-జి.కిషన్‌రెడ్డి
సిద్ధయ్య త్వరగా కోలుకోవాలి
‘‘ఉగ్రవాదులు, దారిదోపిడీగాళ్లను పోలీసులు విజ్ఞతతో ఎదుర్కోవడం అభినందనీయం. దాడుల్లో పోలీసులు మరణించినందుకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా. మృత్యువుతో పోరాడుతున్న సిద్ధయ్య త్వరగా కోలుకోవాలి. బాధిత పోలీసుల కుటుంబానికి రావాల్సిన అన్ని రకాల సహాయంతో పాటు ఉద్యోగం ఇవ్వాలి.’’
- కె.జానారెడ్డి
సాయం అందిస్తున్నాం
‘‘సూర్యాపేట ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ పోలీసులకు అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాం. ఎస్‌ఐ సిద్ధయ్యకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నాం. మూడు శస్త్రచికిత్సలు నిర్వహించి రెండు బుల్లెట్లను తొలగించగా, ఇప్పటికి పరిస్థితి విషమంగానే ఉంది.’’
-మంత్రి లక్ష్మారెడ్డి
హృదయ విదారకం
‘‘సూర్యాపేటలో జరిగిన సంఘటన హృదయ విదారకం. సంఘటన జరిగినప్పుడే ప్రభుత్వం స్పందించి చేతులు దులుపుకుంటోంది. పోలీసు అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అధునాతన ఆయుధాలు అందించి.. వ్యవస్థను ప్రక్షాళన చేయాలి.
- కొండా రాఘవరెడ్డి