సాక్షి, న్యూఢిల్లీ : దేశ విచ్ఛిన్నానికి యత్నించిన వ్యక్తులకు మేధావులు మద్ధతు ఇవ్వటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశాన్ని నాశనం చేసే శక్తులకు అండగా నిలుస్తూ.. సొంత సైన్యంపైనే సదరు మేధావులు పోరాటాలు చేయటం దారుణమని ఆయన పేర్కొన్నారు.
బుధవారం ఢిల్లీలో జాతీయ విచారణ సంస్థ(ఎన్‌ఐఏ) మాజీ డైరెక్టర్ జనరల్(తొలి) రాధా వినోద్ రాజు సంస్మరణ సభలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘‘అసమ్మతికి ఈ దేశంలో చోటు ఉంటుంది. కానీ, దేశ విచ్ఛిన్నాన్ని అనుమతించే ప్రసక్తే లేదు. అఫ్జల్ గురు, యాకుబ్ మెమోన్ లాంటి వాళ్ల పుట్టిన రోజులు జరపాల్సిన అవసరం మనకు ఏంటి? ఈ విషయంలో కొందరు మేధావుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది అని వెంకయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు.
కశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న అల‍్లర్లకు రెచ్చగొడుతున్న కొందరు వేర్పాటువాదుల నిజ స్వరూపాన్ని ఎన్‌ఐఏ బయటపెట్టిందని వెంకయ్య ప్రశంసలు కురిపించారు. అయితే పక్కా ఆధారాలతో వేర్పాటువాదులు పట్టుబడుతున్నప్పటికీ వారికి మద్ధతుగా మేధావులు పోరాటాలు చేస్తున్నారని.. కానీ, సామాన్యుల ప్రాణాలు పోతున్నప్పుడు మాత్రం వాళ్లు కనీసం నోరు కూడా మెదపరని ఆయన తెలిపారు. పైగా దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల మీద, సైన్యం మీద ఆరోపణలు చేస్తూ కాలం గుడుపుతున్నారని.. అయినప్పటికీ ప్రజల నైతిక మద్ధతు మాత్రం సైన్యానికే ఉంటుందన్న విషయాన్ని వాళ్లు(మేధావులు) గుర్తుంచుకుంటే మంచిదని వెంకయ్య సూచించారు.
ఇక ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఎన్‌ఐఏ కీలక అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment