
సాక్షి, చెన్నై: భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వెంకయ్య నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా, రజినీకాంత్ శనివారం సెపియన్స్‌హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదన్నారు. గొప్ప నాయకుడైన వెంకయ్యను రాజకీయాల నుంచి దూరం చేశారని తెలిపారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు. మరికొన్ని రోజులపాటు ఆయన కేంద్రమంత్రిగా కొనసాగి ఉంటే బాగుండేది అని తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో, సూపర్ స్టార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రజినీకాంత్ మంచి నటుడు. ఆయన రాజకీయాల్లోకి రావద్దని నేను చెప్పాను. ఆరోగ్యంగా ఉండాలంటే రాజకీయాల్లోకి రాకూడదని సలహా ఇచ్చాను. ప్రజలను సేవ చేయడానికి రాజకీయాలు ఒక్కటే కాదు.. అనేక మార్గాలున్నాయని అన్నారు. అయితే, ఇదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చేవారిని తాను నిరుత్సాహపరచడం లేదన్నారు. ఎక్కువ మంది యువకులు రాజకీయాల్లోకి రావాలని, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, భావజాలానికి నిబద్ధత ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment