National Investigation Agency (NIA)
-
రామేశ్వరం బ్లాస్ట్ కేసు: నిందితుడు షాజిబ్ అరెస్ట్!
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి నిందితుడు, ఉగ్రవాది షాజిబ్ హుస్సన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. వివరాల ప్రకారం.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో నిందితుడు షాజిబ్‌ను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాంబు పేలుడు అనంతరం పరారీలో ఉన్న షాజిబ్‌ను ఎట్టకేలకు ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఇక, పేలుళ్ల తర్వాత అతను అస్సాం, పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పాయి. #RameshwaramCafe accused arrested from #WestBengal pic.twitter.com/hmtccWxVXT — JOKER (@TheJokerBhai) April 12, 2024 ఇదిలా ఉండగా.. మార్చి ఒకటో తేదీన బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు ఎస్ఐఏ రంగంలోకి దిగింది. -
బెంగళూర్ కేఫ్ పేలుడుతో జగిత్యాలకు లింక్?
సాక్షి, బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో.. తెలంగాణ జిల్లా జగిత్యాలకు సంబంధం ఉందా?.. తాజా అరెస్టుతో ఆ దిశగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ NIA మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అయితే అతని స్వస్థలం జగిత్యాల కావడం.. పైగా అతనొక మోస్ట్ వాంటెడ్ కావడంతోకీ అంశం తెర మీదకు వచ్చింది.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో.. నిషేధిత పీఎఫ్ఐ కీలక సభ్యుడు సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న అతన్ని ఎన్ఐఏ వైఎస్సార్ జిల్లా(ఏపీ) మైదుకూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసింది. బెంగళూరు పేలుడు కేసులో.. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. సలీం స్వస్థలం జగిత్యాల కేంద్రంలోని ఇస్లాంపురా. చాలాకాలంగా పరారీలో ఉన్న అతన్ని.. NIA సెర్చ్ టీం మైదుకూరులో అదుపులోకి తీసుకుంది. రామేశ్వరం కెఫ్ బాంబు పేలుడులో.. ఇతని హస్తమున్నట్టు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే సలీంతో పాటు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎండీ అబ్దుల్ అహ్మద్, నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ ఇలాయస్ అహ్మద్ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్లిద్దరి కోసం ఇప్పుడు ఎన్ఐఏ టీంలు గాలింపు చేపట్టాయి. ఇదిలా ఉంటే.. గతంలో ఉగ్రమూలాలకు కేరాఫ్‌గా జగిత్యాల పేరు పలుమార్లు వినిపించింది. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసు లింకుతో మరోసారి జగిత్యాల్లో ఉగ్రమూలాలపై చర్చ నడుస్తోంది. గతంలో జగిత్యాలతో పాటు కరీంనగర, నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు, పలువురి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బెంగళూరు పేలుడు కేసు.. NIA కీలక ప్రకటన
ఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) శనివారం కీలక ప్రకటన చేసింది. అనుమానితుడి కొత్త ఫొటోలను విడుదల చేసి.. ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరింది. ఇందుకుగానూ రూ.10 లక్షల రివార్డు కూడా ఉంటుందని ఫోన్ నెంబర్లు, మెయిల్ అడ్రస్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మార్చి 1వ తేదీ మధ్యాహ్నాం రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగింది. బస్సులో వచ్చిన ఓ వ్యక్తి తన బ్యాగ్‌ను కేఫ్‌లో వదిలివెళ్లడం.. కాసేపటికే అది పేలడం సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అయితే.. ఫుటేజీల ఆధారంగా అనుమానితుడి కదలికలను దర్యాప్తు బృందం పరిశీలించింది. అయితే.. ఆ రోజు రాత్రి సమయంలో బళ్లారి బస్టాండ్‌లో అనుమానితుడు సంచరించినట్లుగా పేర్కొంటూ ఓ ఫుటేజీని నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. ఘటన తర్వాత.. తుమకూరు, బళ్లారి, బీదర్, భట్కల్.. ఇలా బస్సులు ప్రాంతాలు మారుతూ.. మధ్యలో దుస్తులు మార్చుకుంటూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. చివరకు అతను పుణే వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. వీలైనంత త్వరలో అతన్ని పట్టుకుని తీరతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సరే తమకు తెలియజేయాలని ఎన్ఐఏ ప్రజల్ని కోరుతోంది. పేలుడు జరిగిన రెండ్రోజులకు.. అంటే మార్చి 3వ తేదీన రామేశ్వరం బ్లాస్ట్ కేసులోకి యాంటీ-టెర్రర్ ఏజెన్సీ NIA దిగింది. ఈ కేసును బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌తో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. రెండేళ్ల కిందటి బళ్లారి బాంబు పేలుడుతో పోలికలు ఉండేసరికి.. ఆ పేలుడుకు కారణమైన నిందితుడ్ని జైల్లోనే అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ఇక మరోవైపు బెంగళూరులో స్కూళ్లకు బాంబు బెదిరింపులకు సంబంధించిన కేసుల్ని సైతం పరిశీలిస్తోంది. అంతేకాదు.. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్న ఓ గ్రూప్‌ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇక.. ఇప్పుడు రామేశ్వరం కేఫ్‌లో అనుమానితుడి చిత్రాలు విడుదల చేసి.. ఆచూకీ తెలిపిన వాళ్ల వివరాల్ని గోప్యంగా ఉంచడంతో పాటు పది లక్షల రివార్డు సైతం ప్రకటించింది ఎన్ఐఏ. NIA seeks citizen cooperation in identifying the suspect linked to the #RameswaramCafeBlastCase. 📞 Call 08029510900, 8904241100 or email to info.blr.nia@gov.in with any information. Your identity will remain confidential. #BengaluruCafeBlast pic.twitter.com/ISTXBZrwDK — NIA India (@NIA_India) March 9, 2024 -
తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు..
చెన్నై: తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడువ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, తమిళనాడులో కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు శనివారం తెల్లవారుజాము నుంచే కొనసాగుతున్నాయి. చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కాగా, కోయంబత్తూరులో 2021 నాటి కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. #JustIn | NIA Raids Across Tamil Nadu's Tiruchirappalli — NDTV (@ndtv) February 10, 2024 ఇక, ముఖ్యంగా కోయంబత్తూరులోనే నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు, తనిఖీలు చేపట్టారు. 2021లో కోయంబత్తూరులోని ఉక్కడం కొట్టమేడు ప్రాంతంలో కారు బాంబు పేలుడుతో సంబంధాలపై దర్యాప్తు వేగవంతం చేశారు. అరబిక్ కాలేజీలో చదివిన విద్యార్థులకు నిషేధిత ఉద్యమాలతో సంబంధం ఉందా? అనే కోణంలో ఈ విచారణ జరుగుతున్నట్టు సమాచారం. -
ఉగ్ర దాడులకు ప్లాన్.. బెంగళూరులో ఎన్ఐఏ సోదాలు
బెంగళూరు: కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక, దేశవ్యాప్తంగా రెండు రోజులుగా పలుచోట్ల ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దేశంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కుట్రలను భగ్నం చేసే చర్యల్లో భాగంగా ఎన్ఐఏ పలుచోట్ల సోదాలు చేపట్టింది. రెండు రోజులు క్రితం.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని 44 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐసిస్ మాడ్యూల్ నాయకుడితో సహా మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పడఘా - బోరివలీ, ఠాణె, పుణె.. అటు కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ బృందాలు ఈ దాడులు నిర్వహించినట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. దాడుల్లో భారీ మొత్తంలో లెక్కలోకి రాని నగదుతోపాటు తుపాకులు, ఇతర ఆయుధాలు, కొన్ని పత్రాలు, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే, దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. The National Investigation Agency is conducting searches over half a dozen locations in Bengaluru in a terror conspiracy case. pic.twitter.com/az1k80U07m — ANI (@ANI) December 13, 2023 -
ఐసిస్ మాడ్యూల్ నేత సహా 15 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కొరడా ఝళిపించింది. సంస్థకు చెందినట్లుగా అనుమానిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో శనివారం దాడులు జరిపి 15 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఐసిస్ మాడ్యూల్ సూత్రధారి సాకిబ్ నచాన్ కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఇతడు కొత్తవారిని తమ గ్రూప్‌లోకి చేర్చుకుంటూ వారితో విధేయతతో ఉంటామని ప్రమాణం చేయిస్తుంటాడని వెల్లడించారు. మహారాష్ట్రలోని పగ్ధా–బోరివలి, థానె, మిరా రోడ్డు, పుణెలతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఉదయం దాడులు జరిపినట్లు వివరించారు. ఐసిస్ తరఫున ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, ఉగ్ర సంబంధ చర్యల్లో వీరు పాల్గొంటున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, తుపాకులు, ఇతర ఆయుధాలు, నిషేధిత సాహిత్యం, సెల్ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు వెల్లడి
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో పదకొండు మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ ఎన్ఐఏ(National Investigation Agency) న్యాయస్థానం. ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్ ఉర్ రెహమాన్‌తో పాటు 10 మందికి జైలు శిక్ష ఖరారు చేసింది ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. పాక్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చి పేలుళ్లకు ఒబెద్ కుట్ర పన్నాడు. అయితే.. తెలంగాణ పోలీసులు ఆ కుట్రను ముందుగానే భగ్నం చేశారు. ఒబెద్ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టు విచారణలో తేలింది. ఇక ‘ముజాహిద్దీన్ కుట్ర’గా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో సయ్యద్ ముక్బుల్‌ను సెప్టెంబర్ 22వ తేదీన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్నాడు ముక్బుల్. నాందేడ్‌కు చెందిన ముక్బుల్‌ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన అరెస్ట్ చేశారు. పాక్ ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్‌లోని కీలక సభ్యులతో ముక్బుల్ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది కూడా. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. లక్షల్లో నగదు, పలు డాక్యుమెంట్లు సీజ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టిన సోదాలు ముగిశాయి. తెలుగు రాస్ట్రాల్లో ఏకకాలంలో 62 ప్రాంతాల్లో ఎన్ఐఏ ఈరోజు(సోమవారం) సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో రూ. 13 లక్షల నగదు, పిస్టల్‌తో సహా 14 రౌండ్ల బుల్లెట్ల స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. దాంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసింది. ముంచుంగిపట్టు కేసులో భాగంగా సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యుడు చంద్ర నర్సింహులు అరెస్ట్‌తో ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు జరిపింది ఎన్ఐఏ. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి పౌర హక్కుల నేతలు, న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతోంది. మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో తనిఖీలు చేపట్టింది. పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలే టార్గెట్‌గా ఈ సోదాలు నిర్వహించారు,. గుంటూరు జిల్లా పొన్నూరు ప్రజావైద్యకళాశాలలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. డాక్టర్ టీ రాజారావు పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. నెల్లూరులో ఏపీ సీఎల్సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అరుణ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలోని న్యాయవాది క్రాంతి చైతన్య, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇళ్లతో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. విజయవాడలో విప్లవ రచయితల సంఘం నేత అరసవల్లి కృష్ణ ఇంట్లో సోదాలు చేపట్టింది. రాజమండ్రి బొమ్మెరులో పౌరహక్కుల నేత, అడ్వకేట్ నాజర్, శ్రీకాకుళం కేఎన్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇంట్లో తనిఖీలు చేపట్టింది. నెల్లూరు జిల్లాలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉంటున్న ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు జరుపుతోంది. ఎల్లంకి వెంకటేశ్వర్లు పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు. అనంతపురం బిందెల కాలనీలో కుల వివక్ష పోరాట సమితి నేత శ్రీరాములు ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. సలకంచెరువు పాఠశాలలో శ్రీరాములు హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. తీవ్రవాదులతో సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు.. కుల నిర్మూలన పోరాట సమిత నేత దుడ్డు వెంకట్రావు, సంతమాగలూరు సంతమాగులూరులో శ్రీనివాసరావు, విశాఖ ఎంవీపీ కాలనీలో ఎన్ఆర్ఎఫ్ ప్రతిప్రతినిధి, మంగళగిరి మండలం నవులూరులోని మక్కేవారిపేట, గన్నవరంలో అమ్మిసెట్టి రాధా, తాడేపల్లి బత్తుల రమణయ్య ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు సోదాలు జరుపుతోంది. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో కుల నిర్మూలనా పోరాట సమితి నేతగా వ్యవహరిస్తున్న కోనాల లాజర్ ఇంట్లో సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లోనూ సోదాలు హైదరాబాద్‌లోనూ సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. విద్యానగర్‌లోని పౌర హక్కుల సంఘం నేత సురేష్, బంధుమిత్రుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు జరిపింది. -
అరబిక్ క్లాసుల ముసుగులో ఉగ్ర పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–తమిళనాడుల్లో ఉన్న కొన్ని కేంద్రాలు అరబిక్ క్లాసుల ముసుగులో ఉగ్రవాద పాఠాలు బోధిస్తూ, యువతను ఐసిస్ వైపు ఆకర్షిస్తున్నాయా? ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు. ఇలా ప్రేరేపించిన నేపథ్యంలోనే 2022 అక్టోబర్ 23 కోయంబత్తూరులోని సంగమేశ్వర దేవాలయం వద్ద కారు బాంబు పేలుడు జరిగిందని స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చెన్నై ఎన్ఐఏ యూనిట్ శనివారం హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేసింది. హైదరాబాద్–తమిళనాడుల్లో మొత్తం 31 చోట్ల తనిఖీలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సోదాల్లో ఉగ్రవాద సంబంధిత పుస్తకాలు, పత్రాలతో పాటు ఫోన్లు, ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్‌లు వంటి డిజిటల్ పరికరాలు, రూ.60 లక్షల నగదు, 18,200 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ పుస్తకాలు, పత్రాలు అరబిక్‌తో పాటు తెలుగు, తమిళం భాషల్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. యువతను ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షించడానికి కొందరు ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా అధ్యయన కేంద్రాలు, అరబిక్ బోధన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఏర్పాటు చేసిన గ్రూపుల ద్వారా తమ భావజాలాన్ని ఐసిస్ విస్తరిస్తోందని ఎన్ఐఏ గుర్తించింది. చెన్నైకి చెందిన ఉగ్రవాది ఈ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. కొన్ని రోజులపాటు హైదరాబాద్‌లోనూ నివసించిన ఇతగాడు అల్ ఫుర్ఖాన్ పేరుతో ఓ పబ్లికేషన్స్ నిర్వహించాడు. ఇందులో తెలుగు, తమిళం, అరబిక్ భాషల్లో ఉగ్రవాద సాహిత్యం, భావజాలాన్ని వ్యాప్తి చేసే మెటీరియల్ ముద్రించాడు. ఐసిస్ మీడియా వింగ్ పేరు కూడా అల్ ఫుర్ఖానే కావడం గమనార్హం. ఇతగాడు ఇటీవలే విదేశాలకు పారిపోయాడని నిఘా వర్గాలు గుర్తించాయి. ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడులు.. ఈ చెన్నై వాసి నగరంలో నివసించిన కాలంలో సైదాబాద్ పరిధిలోని సపోటాబాద్కు చెందిన హసన్, రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌కు చెందిన అమీర్, యూసుఫ్‌గూడ, బోరబండ ప్రాంతాలకు చెందిన నూరుల్లా, జాహెద్‌లతో పాటు గోల్కొండ పరిధిలోని షేక్‌పేటకు చెందిన జబ్బార్‌తో సన్నిహితంగా మెలిగాడు. వీరితో పాటు మరికొందరు ఉగ్రవాద సానుభూతిపరులతో సోషల్ మీడియా గ్రూపులు నిర్వహించాడు. తాను ముద్రించిన పుస్తకాలను అందించడంతో పాటు వివిధ అంశాలకు సంబంధించిన సాఫ్ట్‌కాపీలను షేర్ చేశాడు. కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేరళ వాసి మహ్మద్ అజారుద్దీన్‌ను ఈనెల 1న ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇతడి నుంచీ ఎన్ఐఏ అధికారులు అల్ ఫుర్ఖాన్ ద్వారా ముద్రితమైన సాహిత్యం, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పుస్తకాలపై హైదరాబాద్‌లో ముద్రితమైనట్లు చిరునామా ఉంది. దీంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నగరానికి చెందిన ఐదుగురి వ్యవహారం ఎన్ఐఏ దృష్టికి వెళ్ళింది. దీంతో శనివారం నగరానికి చేరుకున్న ఎన్ఐఏ చెన్నై యూనిట్‌కు చెందిన ప్రత్యేక బృందం ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడి చేసి సోదాలు నిర్వహించింది. అల్ ఫుర్ఖాన్ పబ్లిషర్స్ ద్వారా ముద్రితమైన పుస్తకాలు, ఇతర పత్రాలతో పాటు సెల్ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. హసన్, అమీర్, నూరుల్లా, జాహెద్, జబ్బార్‌లకు సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. -
భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన NIA
సాక్షి, హైదరాబాద్/చెన్నై: జాతీయ దర్యాప్తు సంస్థ NAI ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది. దక్షిణాదిలోని 31 చోట్ల సోదాలు నిర్వహించి.. పలువురిని అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో భారీ ఉగ్రనెట్వర్క్ బయటపడింది. కోయంబత్తూరులో 22 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో, మిగతా చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అరబిక్ భాషలో ఉన్న కొన్ని పేపర్లు, వీటితో పాటు రూ. 60 లక్షలు, 18,200 US డాలర్స్ స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఆకర్షిస్తున్నారు ఉగ్రవాదులు. రీజనల్ స్టడీ సెంటర్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను రిక్రూట్ చేసుకుంటున్నారు ఉగ్రవాదులు. కిందటి ఏడాది అక్టోబర్ 23 న కోయంబత్తూర్ లో కారు పేలుడు చర్యకు పాల్పడింది ఈ తరహా శిక్షణ పొందిన ఉగ్రవాదులేనని ఎన్ఐఏ గుర్తించింది. -
పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు.. ఇద్దరు అరెస్ట్?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్ఐఏ సోదాలు చేపట్టారు అధికారులు. ఐఎస్ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అటు తమిళనాడులో కూడా ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, నగరంలో వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్ఐఎస్ఐ మాడ్యుల్లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఐసిస్ సానుభూతి పరుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు సహా హైదరాబాద్‌లోని పాతబస్తీ, మలక్‌పేట, టోలీచౌకీ సహా మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఇక, హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగిస్తోంది. 2022లో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్‌కు సంబంధించి ఎన్ఐఏ దాడులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సోదాల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. #WATCH | NIA conducts raids at 30 locations in both Tamil Nadu and Telangana in ISIS Radicalization and Recruitment case. The raids are underway in 21 locations in Coimbatore, 3 locations in Chennai, 5 locations in Hyderabad/Cyberabad, and 1 location in Tenkasi. (Visuals from… pic.twitter.com/KcCiO7SZ6u — ANI (@ANI) September 16, 2023 ఇది కూడా చదవండి: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో నటుడు నవదీప్ పేరు -
షరియత్ స్థాపనే హెచ్‌యూటీ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని పడగొట్టి షరియత్ స్థాపనే లక్ష్యంగా హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) సంస్థ పనిచేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారించింది. ఈ సంస్థకు చెందిన 16 మంది ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు గత నెల్లో హైదరాబాద్, భోపాల్‌లో అరెస్టు చేసిన విషయం విదితమే. ఎన్ఐఏ ఈ కేసును గత నెల 24న రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టింది. ఇస్లామిక్ రాజ్యస్థాపనకు వ్యతిరేకంగా, అడ్డంకిగా ఉన్న ఓ వర్గానికి చెందిన నాయకులను టార్గెట్‌గా చేసుకోవడంతోపాటు ప్రార్థన స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద దేశంలో దీనిపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాంతాల వారీగా తన్జీమ్లు ఏర్పాటు దేశంలో ఉన్న ప్రభుత్వం ఓ వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, వారి హక్కుల కోసం పోరాడే సంస్థలపై నిషేధం విధిస్తూ, కార్యకర్తలను జైళ్లకు పంపుతోందని తమ కేడర్‌కు నూరిపోస్తోంది. దీనికి సంబంధించి ఆడియోలు, వీడియోలను రూపొందించి రాకెట్ చాట్, త్రీమా యాప్స్ ద్వారా ప్రచారం చేసింది. ఈ ఉగ్ర సంస్థ మధ్యప్రదేశ్, హైదరాబాద్‌ల్లో విస్తరించి ఉన్నట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా తన్జీమ్గా పిలిచే మాడ్యుల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. మధ్యప్రదేశ్ తన్జీమ్‌కు యాసిర్ ఖాన్, తెలంగాణ తన్జీమ్‌కు మహ్మద్ సలీం నేతృత్వం వహించారు. వీళ్లు మరింత మందిని తన సంస్థలో చేర్చుకుని వివిధ ప్రాంతాలకు విస్తరించడానికి కుట్ర పన్నారు. ఈ ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిలో ఆడియో, వీడియోలతోపాటు ఐఎస్ఐఎస్ రూపొందించే ఆన్లైన్ పత్రిక వాయిస్ ఆఫ్ హింద్ ప్రతులు, ఖలాఫతుల్లా అల్ మహదీపై ఉన్న పత్రాలు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, ఏకే 47, 303 రైఫిల్‌తోపాటు వివిధ పేలుడు పదార్థాల ఫొటోలు, వాటి డాక్యుమెంట్లను రిట్రీవ్ చేశారు. హైదరాబాద్‌లోనే కీలక నిర్ణయాలు మధ్యప్రదేశ్, తెలంగాణ తన్జీమ్లకు చెందిన 17 మంది ఉగ్రవాదులు గతేడాది హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. గోల్కొండ ప్రాంతంలోని సలీం ఇంట్లో జరిగిన ఈ మీటింగ్‌లోనే భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించి, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని అధికారులు తేల్చారు. సలీం సహా హైదరాబాద్ తన్జీమ్‌కు చెందిన ఆరుగురూ ఆపరేషన్స్ చేయడానికి సిద్ధమవుతూ శిక్షణ కూడా తీసుకున్నారు. హైదరాబాద్ తన్జీమ్‌కు సంబంధించి జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపింది. -
ఆరోగ్యం ముసుగులో ఉగ్రవాదం.. పీఎఫ్ఐ చార్జిషీటులో విస్మయకర అంశాలు
సాక్షి, కరీంనగర్: రాడ్డు.. కర్ర..కత్తి ఏ ఆయుధాన్ని ఎలా వాడాలి..? ఎలా దాడి చేయాలి? మనిషి శరీరంలో ఎక్కడెక్కడ సున్నిత ప్రాంతాలు ఉంటాయి..? ఎక్కడ కొడితే ప్రాణాలు పోతాయి..? ఇవీ.. ఆరోగ్య పరిరక్షణ ముసుగులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) రహస్యంగా నిర్వహించిన కార్యకలాపాలు. శారీరక, మానసిక ఆరోగ్యం ముసుగులో పీఎఫ్ఐ చేసిన సంఘ వ్యతిరేక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. యోగా.. కరాటే పేరుతో ఆయుధాల వినియోగం, మనుషులను సులువుగా చంపడం ఎలా..? తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారని తేలింది. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయి. ఇవే విషయాలను ఎన్ఐఏ ఇటీవల దాఖలు చేసిన చార్జిషీటులోనూ పేర్కొంది. శారీరక ఆరోగ్యానికి, ఆత్మరక్షణ పేరిట నడిపిన కరాటే శిబిరాలు, యోగా పేరిట నడిపిన ధ్యానకేంద్రాలన్నీ ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారాయని చార్జిషీటులో పేర్కొంది. ఎలా బయటపడిందంటే..? పీఎఫ్ఐ కీలక సభ్యుడు, నిజామాబాద్‌కు చెందిన (స్వస్థలం జగిత్యాల) అబ్దుల్‌ఖాదర్‌ను పోలీసులు నిజామాబాద్‌లో అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇతను నిజామాబాద్‌లో దాదాపు 200 మంది ముస్లిం యువకులకు శిక్షణ ఇచ్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. గతేడాది జూలై 4న పోలీసులు అబ్దుల్ ఖాదర్, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో సాదుల్లా, ఇమ్రాన్, మొబిన్‌ను మరుసటి రోజు అరెస్టు చేశారు. వీరి నెట్‌వర్క్‌ను ఏపీలోని కడప, కర్నూలు నుంచి పీఎఫ్ఐ సభ్యులు ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిజామాబాద్ 4వ టౌన్లో పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిందితుడు అబ్దుల్‌ఖాదర్ విదేశాలకు వెళ్లి రావడం, పలు దేశాల నుంచి పీఎఫ్ఐకి నిధులు తెచ్చినట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి సెక్షన్ 120 (బి), 153(ఎ), ఐపీసీ సెక్షన్లు 17, 18, 18(ఎ), 18(బి) యూఏ(పి) యాక్ట్ కింద ఆగస్టు 26న తిరిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో అబ్దుల్ ఖాదర్ (ఆటోనగర్, నిజామాబాద్), అబ్దుల్ అహ్మద్ (ముజాహెద్నగర్, నిజామాబాద్), షేక్ ఇలియాస్ అహ్మద్ (ఖాజానగర్, నెల్లూరు), అబ్దుల్ సలీమ్ (ఇస్లాంపూర్, జగిత్యాల), షేక్ షాదుల్లా (గుండారం, నిజామాబాద్), ఫిరోజ్ ఖాన్ (శాంతినగర్, ఆదిలాబాద్), మహమ్మద్ ఉస్మాన్ (తారకరామనగర్, జగిత్యాల), సయ్యద్ యాహియా సమీర్ (ఆటోనగర్, నిజామాబాద్), షేక్ ఇమ్రాన్ (ముజాహెద్నగర్, నిజామాబాద్), మొహమ్మద్ అబ్దుల్ ముబీన్ (హబీబ్‌నగర్, నిజామాబాద్), మొహమ్మద్ ఇర్ఫాన్ (హుస్సేన్‌పురా, కరీంనగర్)పై చార్జీషీటు దాఖలు చేసింది. హింసలో సుశిక్షితులు నిజామాబాద్‌లో శిక్షణ పొందిన 200 మంది యువతను పథకం ప్రకారం ముందుగా ఆరోగ్యం, ధ్యానం పేరిట యోగా, కరాటే అంటూ పోగుచేశారు. ఆపై వారిలో దేశ వ్యతిరేక భావజాలం నింపుతూ వారి మనసులను కలుషితం చేసేందుకు యత్నించారు. యోగా క్యాంపుల ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టడం, కరాటే పేరిట దాడి చేయడంలో తర్ఫీదు ఇచ్చారని ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొంది. గొంతు, తల, ఉదరం తదితర సున్నిత ప్రాంతాలపై దాడి చేయడం, ఎక్కడ కొడితే మనిషి త్వరగా మరణిస్తాడన్న విషయాలపైనా తరగతులు ఇచ్చినట్లు కూడా ఎన్ఐఏ ఛార్జిషీటులో స్పష్టం చేసింది. కొనసాగుతున్న నిఘా.. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాపై ఎన్ఐఏ నిఘా కొనసాగుతోంది. గతంలో క్రియాశీలకంగా ఉన్న సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) నిషేధానికి గురవడంతో పీఎఫ్ఐ ముసుగులో తిరిగి కార్యకలాపాలు మొదలుపెట్టినట్టు గుర్తించింది. అందుకే దేశవ్యాప్తంగా దీని కార్యకలాపాలకు కళ్లెం వేసేందుకు గతేడాది సెప్టెంబర్ 18న పీఎఫ్ఐ స్థావరాలపై దాడులు చేసింది. అందులోభాగంగా జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించింది. పలువురి నుంచి కీలక డాక్యుమెంట్లు, పీఎఫ్ఐ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. సంస్థకు సంబంధించి ఇంకా ఎవరైనా సానుభూతిపరులు, స్లీపర్‌సెల్స్ ఉన్నారా? అన్న కోణంలో నిరంతర నిఘా కొనసాగుతూనే ఉంది. -
పాపులర్ ఫ్రంట్‌పై ఎన్ఐఏ గురి
న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తోపాటు దాని అనుబంధ సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దృష్టి పెట్టారు. చట్టవ్యతిరేక, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సదరు సంస్థలపై ఇప్పటికే కేసు నమోదయ్యింది. కేసు దర్యాప్తులో భాగంగా కేరళలో 12 జిల్లాల్లో పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలకు సంబంధించిన 56 ప్రాంతాల్లో గురువారం అధికారులు సోదాలు నిర్వహించారు. పీఎఫ్ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జోనల్ హెడ్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్–ట్రైనర్స్తోపాటు మారణాయుధాలు ఉపయోగించడంలో శిక్షణ పొందిన మరికొందరి నివాసాల్లో సోదాలు చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి చెప్పారు. మరో 20 మంది అనుమానితుల ఇళ్లను తనిఖీ చేసినట్ల తెలిపారు. ఆయుధాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలపై గతంలోనే కేసు నమోదు చేసింది. -
ఉత్తరాది గ్యాంగ్స్టర్లు దక్షిణాది జైళ్లకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్ల ఆగడాలను చెక్‌పెట్టేందుకు, వారి విస్తృత నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఎన్ఐఏ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్లను దక్షిణాది రాష్ట్రాల జైళ్లకు తరలించాలని భావిస్తోంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా, సుపారీ హత్యలు, హవాలా దందా, బెదిరింపు వసూళ్లు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో కొందరు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైళ్లలో పడేశారు. వాళ్లు అక్కడి నుంచే నిక్షేపంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తొలి దశలో వారిలో 25 మందిని దక్షిణాది జైళ్లకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. మూసావాలా హత్యతో అలర్ట్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే జైళ్లలో ఒకటైన ఢిల్లీలోని తీహార్ జైలు నుంచే మూసేవాలా హత్య ప్రణాళికను గ్యాంగ్స్టర్లు అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిహార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్వర్క్ ద్వారా ఈ హత్య చేయించారనే కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. తిహార్‌లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ నీరాజ్ బవానా సైతం జైలు నుంచే తన వ్యాపారాన్ని ఇష్టారీతిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లదీ ఇదే పంథా. జైళ్లలో కొత్తగా చిన్న ముఠాలుగా ఏర్పడి తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఏప్రిల్‌లో గ్యాంగ్‌స్టర్ జితేంద్ర గోగిను చంపేశాడనే కోపంతో మరో గ్యాంగ్‌స్టర్ శేఖర్ రాణాను గోగి సన్నిహితుడు రోహిత్ మోయి జైలు నుంచే కుట్ర పన్ని హత్య చేయించాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పెరిగాయి. కొన్ని కేసుల్లో గ్యాంగ్స్టర్లకు జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం మధ్య ఆధిపత్య పోరు పెరిగి గొడవలకు దారితీస్తోంది. వీరికి విదేశాల నుంచి ఆర్ధిక సహకారం అందుతోందనే దారుణ వాస్తవాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఉత్తరాది జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం కూడా ఎన్ఐఏ ప్రతిపాదనకు మరో కారణం. ఢిల్లీలో 14 సెంట్రల్ జైళ్ల సామర్ధ్యం 9,346 కాగా 17,733 మంది ఖైదీలున్నారు. పంజాబ్‌లో జైళ్లలో 103 శాతం, హరియాణాలో 127 శాతం, రాజస్థాన్‌లో 107 శాతం ఖైదీలున్నారు. -
మంగళూరు పేలుడు: షరీఖ్ కళ్లు తెరవాలని పోలీసులు..
బెంగళూరు: శనివారం సాయంత్రం మంగళూరు మైసూర్ శివారులో ఓ ఆటోలో ఉన్నట్లుండి పేలుడు సంభవించిన ఘటన.. ప్రమాదం కాదని, ఉగ్రకోణం ఉందని తేలడంతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పైగా అంతర్జాతీయ ఉగ్రసంస్థ ప్రమేయం బయటపడడంతో.. విస్తృత దర్యాప్తు ద్వారా తీగ లాగే యత్నంలో ఉంది కర్ణాటక పోలీస్ శాఖ. ఈ క్రమంలో.. పేలుడులో గాయపడ్డ మొహమ్మద్ షరీఖ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. కర్ణాటక పోలీసుల కథనం ప్రకారం.. శివమొగ్గ జిల్లా తీర్థాహల్లికి చెందిన షరీఖ్.. ఆటోలో డిటోనేటర్ ఫిక్స్ చేసిన ప్రెషర్‌కుక్కర్ బాంబుతో ప్రయాణించారు. మంగళూరు శివారులోకి రాగానే అది పేలిపోయింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు షరీఖ్ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో అతనికి చికిత్స అందుతోంది. ఇక ఇది ముమ్మాటికీ ఉగ్ర చర్యగానే ప్రకటించిన కర్ణాటక పోలీసు శాఖ.. కేంద్ర సంస్థలతో కలిసి దర్యాప్తు చేపడుతోంది. నగరంలో విధ్వంసం సృష్టించే ఉద్దేశంతోనే షరీఖ్ యత్నించినట్లు భావిస్తున్నామని అదనపు డీజీపీ అలోక్ తెలిపారు. 24 ఏళ్ల వయసున్న షరీఖ్‌పై ఓ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ప్రభావం ఉందని శాంతి భద్రతల అదనపు డీజీపీ అలోక్ కుమార్ సోమవారం వెల్లడించారు. అంతేకాదు.. కర్ణాటక బయట అతనికి ఉన్న లింకులను కనిపెట్టేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. బెంగళూరు సుద్ధాగుంటెపాళ్యాకు చెందిన అబ్దుల్ మాటీన్ తాహా.. షరీఖ్‌కు గతంలో శిక్షకుడిగా వ్యవహరించాడు. అంతేకాదు అతనిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐదు లక్షల రివార్డు ప్రకటించింది అని అడిషినల్ డీజీపీ వెల్లడించారు. అతను(షరీఖ్) ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని, తద్వారా అతన్ని విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అంటున్నారు. సుమారు 45 శాతం కాలిన గాయాలతో.. మాట్లాడలేని స్థితిలో చికిత్స పొందుతున్నాడు ఆ యువకుడు. ఇక.. మైసూర్లో షరీఖ్ అద్దెకు ఉంటున్న ఇంట్లో అగ్గిపెట్టెలు, పాస్పరస్, సల్ఫర్, గీతలు, నట్లు-బోలట్లు లభించాయి. ఆ ఇంటి ఓనర్ మోహన్ కుమార్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక ప్రేమ్ రాజ్ అనే పేరుతో ఫేక్ ఆధార్‌కార్డు తీసి.. ఆ గుర్తింపుతో దాడులకు యత్నించి ఉంటాడని, ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్ బాంబ్ తయారుచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మంగళూరు, శివమొగ్గ, మైసూర్, తీర్థహల్లితో పాటు మరో మూడు చోట్ల ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. #Mangaluru மங்களூர் ஆட்டோவில் குண்டு வெடிப்பு பயங்கரவாத செயல் என்று டிஜிபி அறிவிப்பு pic.twitter.com/rPDLRHgLMY — E Chidambaram. (@JaiRam92739628) November 20, 2022 మరికొందరికి బ్రెయిన్‌వాష్..? ఇదిలా ఉంటే 24 ఏళ్ల షరీఖ్.. ఓ బట్టల దుకాణంలో పని చేసేవాడు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు గానూ UAPA కింద అతనిపై కేసు కూడా నమోదు అయ్యింది. మంగళూరులో గతంలో మత సంబంధిత అభ్యంతరకర రాతలు, బొమ్మలు గీసి.. జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. శివమొగ్గలో పంద్రాగష్టున జరిగిన మత ఘర్షణల్లోనూ ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సమయంలో ఒకతన్ని కత్తితో పొడిచిన కేసులో సహ నిందితుడిగా ఉండడమే కాదు.. ఆ కేసులో పరారీ నిందితుడిగా ఉన్నాడు షరీఖ్. ఈ కేసులో అరెస్ట్ అయిన యాసిన్, ఆమాజ్‌లు.. షరీఖ్ తమకు బ్రెయిన్‌వాష్ చేశాడని వెల్లడించారు. అంతేకాదు.. అతనికి సంబంధాలు ఉన్న ఉగ్ర సంస్థ కోసం ఇక్కడా షరీఖ్ పని చేశాడని వాంగ్మూలం ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ల నుంచి భారత్‌కు సిద్ధించింది నిజమైన స్వాతంత్రం కాదని..ఇస్లాం రాజ్య స్థాపనతోనే అది పూర్తవుతుందని ఇతరులకు షరీఖ్ బోధించేవాడని పోలీసులు వెల్లడించారు. Karnataka | Mangaluru Police displays the material recovered from the residence of Mangaluru autorickshaw blast accused, Sharik. pic.twitter.com/y3Atxfi96p — ANI (@ANI) November 21, 2022 సిరియాకు చెందిన ఆ మిలిటెంట్ సంస్థ నుంచి ఓ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశం అందుకున్న షరీఖ్.. అందులోని పీడీఎఫ్ ఫార్మట్ డాక్యుమెంట్ ద్వారా బాంబు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడని కర్ణాటక పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అంతేకాదు తుంగ నది తీరాన బాంబు పేలుడు తీవ్రతను తెలుసుకునేందుకు.. ట్రయల్‌ను సైతం నిర్వహించారని పోలీసులు తెలిపారు. -
‘ఫెడరల్’ పరిరక్షణ ముఖ్యం
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను మరింత పటిష్ఠం చేయబోతున్నామనీ, వచ్చే రెండేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాని విభాగాలుంటాయనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), నేరశిక్షా స్మృతి(సీఆర్పీసీ)లకు సవరణలు కూడా చేస్తామన్నారు. హరియాణాలోని సూరజ్‌కుంద్‌లో ముఖ్యమంత్రులు, హోంమంత్రులు పాల్గొన్న మేధోమథన సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. ఎన్ఐఏ విస్తరణ, నేరాల స్వభావం మారు తున్న తీరు గురించి అమిత్ షా వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదం సైబర్ ప్రపంచంలో కూడా స్వైరవిహారం చేస్తూ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తుండటం రహస్యమేమీ కాదు. కనుక అమిత్ షా అన్నట్టు నేర సామ్రాజ్యాన్ని కూల్చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి బాధ్యతే. అయితే తీసుకురాదల్చిన ఏ మార్పుల విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకోవటం, వాటి మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు, చేర్పులకు సిద్ధపడటం అవసరమని కేంద్రం గుర్తించాలి. ముంబై మహానగరంపై ఉగ్ర దాడి నేపథ్యంలో 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎన్ఐఏ చట్టాన్ని తెచ్చింది. ఒక రాష్ట్రానికి చెందిన ఉగ్రవాదులు మరో రాష్ట్రంలోకి ప్రవేశించి అలజడులు సృష్టించటం, వేరే దేశాల ఉగ్రవాదులు చొరబడి విధ్వంసక చర్యలకు పాల్పడటం వంటి తీవ్ర నేరాల అణచివేతకు సాధారణ పోలీసు విభాగాలు సరిపోవనీ, సీబీఐపై ఇప్పటికే ఉన్న ఒత్తిళ్ల వల్ల అది కూడా ఈ తరహా నేరాలపై దృష్టి కేంద్రీకరించలేదనీ అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఎన్ఐఏకు విశేషాధికారాలు ఇవ్వటం కోసం తాను ‘రాజ్యాంగ పరిమితులను అతిక్రమించే ప్రమాదకరమైన విన్యాసం చేయ వలసి వస్తున్నద’ని అప్పటి అమెరికా ఎఫ్‌బీఐ చీఫ్ రాబర్ట్ మ్యూలర్తో 2009లో నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం వాపోయినట్టు 2011లో బయటపడిన వికీలీక్స్ టేపుల్లో వెల్లడైంది. ఎన్ఐఏ ఏర్పాటు వ్యవహారం ఎంత సున్నితమైనదో ఈ అభిప్రాయమే చెబుతోంది. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తున్నదని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీయే పలుమార్లు ధ్వజమెత్తారు. ఆయన నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది మరింత పెరిగిందే తప్ప తగ్గలేదని పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, కేరళ తదితర విపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపించటం రివాజైంది. రాష్ట్రాల ఆదాయవనరులు కుదించటం మొదలుకొని పలు రంగాల్లో కేంద్రం జోక్యం పెరుగుతున్నదనీ, రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజారుస్తున్నారనీ ఆ ఆరోపణల సారాంశం. వీటన్నిటికీ పరాకాష్ఠ ఎన్ఐఏపై రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ దాఖలు చేసిన పిటిషన్. తమ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ చట్టం తెచ్చిందన్న సంగతి కూడా మరిచి శాంతిభద్రతల పరిరక్షణ వ్యవహారంలో చట్టం తెచ్చే అధికారం పార్లమెంటుకు ఎక్కడిదని ఛత్తీస్‌గఢ్ ప్రశ్నించింది. నిజానికి ఎన్ఐఏ చట్టం తెచ్చినప్పుడే ఆ చర్య రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోవటం అవుతుందన్న సంగతి చిదంబరానికి తెలుసు. మ్యూలర్ దగ్గర చిదంబరం వాపోవటం దీన్ని దృష్టిలో ఉంచుకునే. నేరాల దర్యాప్తులో రాష్ట్రానికుండే అధికారాలను ఎన్ఐఏ చట్టం హరిస్తున్నదని ఛత్తీస్‌గఢ్ ప్రధాన ఆరోపణ. ఎన్ఐఏకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి, దాన్ని మరింత కఠినతరం చేస్తూ 2019లో ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏకు కూడా సవరణలు చేసింది. ఛత్తీస్‌గఢ్ సవాలు చేసింది ఈ సవరణలను కాదు. మొత్తం ఎన్ఐఏ చట్టమే ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తుందని వాదించింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందన్న సంగతలా ఉంచి, ఎన్ఐఏ తీరుతెన్నుల విషయంలో రాజకీయ పక్షాల నుంచి, ప్రజాసంఘాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. సాధారణ పౌరులకు ఫెడరలిజం వంటి అంశాలపై పెద్ద పట్టింపు లేకపోవచ్చు. కానీ రాష్ట్రాలు శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా వ్యవహరించలేవనీ, ఉగ్రవాదంవంటి అంశాల్లో దర్యాప్తు కోసం వాటి అనుమతి తీసుకోవటంలో అపరిమితమైన జాప్యం చోటుచేసు కుంటున్నదనీ నిర్ధారించేందుకు అవసరమైన డేటా కేంద్రం దగ్గర ఉన్నదా? ఇటీవలే జరిగిన కొయం బత్తూరు పేలుడుకు సంబంధించి తమిళనాడు పోలీసులు చురుగ్గా స్పందించి, ఎన్ఐఏ ఆ కేసును తీసుకొనే లోపే ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని ఏ రాష్ట్రమూ ఉపేక్షించదని ఈ ఉదంతం చెబుతోంది. స్వేచ్ఛాయుత సమాజాలను భయకంపితం చేయటం, రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నపరచటం ఉగ్రవాదుల ఆంతర్యం. అందుకు దీటుగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దటం, పకడ్బందీ దర్యాప్తు జరిపి నేరగాళ్లకు శిక్షపడేలా చూడటం అవసరం. అలాగే న్యాయవ్యవస్థను పటిష్టం చేయటం ముఖ్యం. ఇలాంటి చర్యలు ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేయ గలవు తప్ప చట్టాలను మరింత కఠినం చేసు కుంటూ పోవటం పరిష్కారం కాదు. ఎన్ఐఏను పటిష్టపరచటం, బ్రిటిష్ వలసపాలకుల కాలంలో పుట్టుకొచ్చిన ఐపీసీ, సీఆర్పీసీ లను ప్రక్షాళన చేయటం వంటి అంశాల్లో పార్లమెంటులోనే కాదు, వెలుపల కూడా సమగ్ర చర్చ జరిగేలా చూడాలి. రాష్ట్రాల అభీష్టాన్నీ, పౌర సమాజం అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసు కోవాలి. తీసుకొచ్చే ఏ మార్పులైనా ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలగని రీతిలో ఉండాలి. -
హన్మకొండ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు కలకలం..
సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనిత, ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్, హన్మకొండలో సోదాలు చేపట్టింది. న్యూ ప్రకాష్‌రెడ్డి పేటలోని ప్రభుత్వ టీచర్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనిత ఇంట్లో ఎన్సోఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసులు అనిత ఇంటివద్ద మోహరించి అటు వైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. సామాజిక కార్యకర్తగా మహిళా చైతన్య కార్యక్రమాలు అనిత నిర్వహిస్తారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనిత ఇంట్లో మూడుగంటల పాటు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు మహిళల మ్యానిఫెస్టో, పాటల పుస్తకాలు తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. గతంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఉండేదని ప్రస్తుతం కమిటీలు లేవని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తమ ఆక్టివిటీస్ కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరు నెలలకు ఓసారి సమావేశం నిర్వహిస్తామని మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో రాసుకున్న బుక్ ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్ళారని చెప్పారు. గతంలో కార్యాలయానికి పిలిచి మాట్లాడారని తెలిపారు. మహిళలకు సమాజంలో జరుగుతున్న అన్యాయంపై మాట్లాడొద్దని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో వారం రోజులుగా పోలీస్ ప్రత్యేక బలగాలు సరిహద్దులో మోహరించి కూంబింగ్ చేపట్టాయి. ఓ వైపు సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ మరోవైపు మావోయిస్టుల సానుభూతిపరుల గురించి ఎన్ఐఏ ఆరా తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అనిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే 25లక్షల రివార్డ్
-
దావూద్ ఇబ్రహీంపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?
ఢిల్లీ: గ్లోబల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై భారీ రివార్డు ప్రకటించింది భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఎన్ఐఏ. దావూద్ గురించి సమాచారం అందించిన వాళ్లకు పాతిక లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. దావూద్‌తో పాటు అతని అనుచరుడు చోటా షకీల్ మీద కూడా రూ.20 లక్షలు ప్రకటించింది జాతీయ విచారణ సంస్థ. భారత ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో టాప్ అయిన ఎన్ఐఏ.. తాజాగా దావూద్‌కు సంబంధించి ఫొటోను సైతం విడుదల చేసింది. దావూద్, చోటా షకీల్‌తో పాటు ఉగ్రవాదులైన అనీస్ ఇబ్రహీం, జావెద్ చిక్నా, టైగర్ మెమోన్‌ల మీద రూ.15 లక్షల బౌంటీ ప్రకటించింది ఎన్ఐఏ. దావూద్‌తో పాటు ఇతరులంతా కలిసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, అల్ కాయిదాలతో కలిసి పని చేస్తున్నారని, బడా వ్యాపారవేత్తలను, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. వీళ్ల గురించి సమాచారం అందించిన వాళ్లకు రివార్డు అందిస్తామని పేర్కొంది. ► 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం.. పన్నెండు చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకుల మరణానికి, 700 మంది గాయపడడానికి కారణం అయ్యాడు. ► గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ఐరాస భద్రతా మండలి దావూద్‌ను గుర్తించగా.. అరెస్ట్‌ను తప్పించుకోవడానికి దావూద్ పాక్‌లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. తాజాగా భద్రతా మండలి రిలీజ్ చేసిన ఉగ్రవాద జాబితాలో దావూద్ ఉండగా.. కరాచీ పేరిట అతని చిరునామా సైతం ఉండడం గమనార్హం. ► అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి డీ-కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసిందని దర్యాప్తులో తేలింది. ► మే నెలలో ఎన్ఐఏ 29 ప్రాంతాల్లో దాడులు చేసింది. అందులో హాజీ అలీ దర్గా, మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సమీర్ హింగోరా(1993 ముంబై పేలుళ్లలో దోషి), సలీం ఖురేషీ(ఛోటా షకీల్ బావమరిది), ఇతరులకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ► 2003లో, దావూద్ ఇబ్రహీంను భారతదేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించాయి. అంతేకాదు 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిపై 25 మిలియన్ల డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి. ► ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధిత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్‌పై కేసులు నమోదు అయ్యాయి. ► 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో, దావూద్ తాజ్ మహల్ హోటల్‌తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. ► 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్‌ను దావూద్ నడిపించాడని కొన్ని జాతీయ మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరించాయి. ► డీ కంపెనీ.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని, నైజీరియాకు చెందిన బోకో హరామ్ ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందని సమాచారం. ఇదీ చదవండి: శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా -
హైదరాబాద్ వెళ్లాలంటే ఎన్ఏఐ కోర్టును అడగండి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: షరతులతో కూడిన మెడికల్ బెయిల్‌పై విడుదలైన విప్లవ రచయిత వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లాలంటే అనుమతి కోసం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించాలని సుప్రీంకోర్టు సూచించింది. కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు విచారించింది. వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. సొంత నివాస స్థలమైన హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటే ఆ వాతావరణంలో వరవరరావు త్వరగా కోలుకుంటారని తెలిపారు. దీంతో అనుమతి కోసం ఎన్ఐఏ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని వరవరరావుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇదీ చదవండి: Varavara Rao: వరవరరావుకు ఊరట.. శాశ్వత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు -
ఎన్ఐఏ విస్తృత తనిఖీలు
సాక్షి, అమరావతి/టంగుటూరు/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పర్యవేక్షణలో ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ సిబ్బంది విజయవాడ, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో పలువురు మావోయిస్టు సానుభూతిపరుల నివాసాల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే సోదాలు నిర్వహించడం ప్రారంభించారు. మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్లకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 10 గంటలకు పైగా సోదాలు నిర్వహించి, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విజయవాడ సింగ్‌నగర్‌లోని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర (కేఎన్పీఎస్) అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, కొత్త రాజరాజేశ్వరిపేటలో పట్టపు జ్యోతి (డప్పు రమేష్ భార్య) నివాసాల్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు చేశాయి. ఇక ప్రకాశంజిల్లాలోని ఆలకూరపాడులోని మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష అలియాస్ రమాదేవి వాసంలోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె నివాసంలో లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. శిరీష ఇంటి పరిసరాల్లో 200 మీటర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రజలను, మీడియాను రాకుండా నిలువరించారు. తహసీల్దారు, వీఆర్ఏ సమక్షంలో ఎన్ఐఏ అధికారులు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థినిని దళాలకు వైద్యం చేసేలా నియమించుకుని, దళం వైపు అకర్షించేలా చేశారని వైద్య విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు క్రమంలోనే ఈ తనిఖీలు చేసినట్లు తెలిసింది. కాగా, విజయవాడలో దుడ్డు ప్రభాకర్ నివాసంలో ఎన్ఐఏ అధికారుల తనిఖీలు చేయడానికి వ్యతిరేకంగా విరసం, కేఎన్పీఎస్, ఇఫ్టూ తదితర ప్రజా సంఘాలు నిర్వహించిన ధర్నాలో శిరీష పాల్గొన్నారు. తన భర్త, కుమారుడు చనిపోయాక టైలరింగ్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న తమ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. -
దివంగత నక్సలైట్ ఆర్కే భార్య శిరీష ఇంట్లో సోదాలు
-
టైలర్ కన్హయ్య హత్య కేసు.. సర్కార్ సంచలన నిర్ణయం
రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంలో దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య తర్వాత ఉదయపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. ఇదిలా ఉండగా.. టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య నేపథ్యంలో ఉదయపూర్ ఇన్స్పెక్టర్ జనరల్, పోలీస్ సూపరింటెండెంట్‌తో సహా ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి చెందిన 32 మంది అధికారులను బదిలీ చేశారు. కాగా, సున్నితమైన ఈ కేసు దర్యాప్తును దేశంలోని అత్యున్నత ఉగ్రవాద నిరోధక సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి కేంద్ర హోంశాఖ అప్పగించింది. ఈ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. కన్హయ్య లాల్ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హత్య కేసుపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇది తీవ్రమైన నేరమని అన్నారు. హంతకులిద్దరికీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ హత్య కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి నేరస్థులను పట్టుకోగలిగామని అన్నారు. ఇదే సమయంలో హంతకులకు ఉగ్రవాద సంస్థలతో ఉన్న లింకులను సైతం కనుగొన్నట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఉదయ్‌పూర్ కంటే వారం ముందే మరో ఘటన!.. అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం -
ఉదయ్‌పూర్ ఘటనలో ఉగ్రకోణం?.. హోం శాఖ కీలక ఆదేశాలు
Udaipur Tailor Murder: రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసుపై దేశవ్యాప్తంగా స్పందన పెరిగిపోతుండగా.. మరోవైపు చర్చ కూడా విపరీతంగా నడుస్తోంది. ఈ తరుణంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. బుధవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ఉగ్రకోణం అనుమానాలు వ్యక్తం అవుతున్నందున.. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విచారణకు ఆదేశించింది. టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కస్టమర్లలాగా నటిస్తూ కొలతలు ఇస్తుండగానే.. కన్హయ్య గొంతు కోసి హత్య చేస్తూ వీడియో వైరల్ చేయడం, ఆపై ప్రధానికి సైతం హెచ్చరికలు జారీ చేసిన వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. ప్రవక్తపై నూపర్ కామెంట్ల వివాదం తర్వాత.. నూపుర్‌కు మద్ధతుగా కన్హయ్య పోస్టులు పెట్టినందుకే ఈ హత్య జరిగనట్లు నిందితుల వీడియో ద్వారా స్పష్టమైంది. మరోవైపు .. సదరు వీడియోలను తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకోవైపు ఉగ్ర కోణం నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ట్విటర్లో ప్రకటించింది కూడా. ఏదైనా సంస్థ ప్రమేయం, అంతర్జాతీయ లింకులు క్షుణ్ణంగా పరిశోధించబడతాయి అని ట్వీట్లో పేర్కొంది. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ ఐజీ స్థాయి అధికారితో పాటు ఎన్ఐఏ బృందం ఒకటి మంగళవారమే ఉదయ్‌పూర్‌కు చేరుకుని పరిశీలించింది. తాజా సమాచారం ప్రకారం.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉదయ్‌పూర్ ఘటనపై ఎన్ఐఏ బృందం కేసు నమోదు చేయొచ్చని తెలుస్తోంది. MHA has directed the National Investigation Agency (NIA) to take over the investigation of the brutal murder of Shri Kanhaiya Lal Teli committed at Udaipur, Rajasthan yesterday. The involvement of any organisation and international links will be thoroughly investigated. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 29, 2022 చదవండి: అచ్చం ఐసిస్ తరహాలో క్రూరంగా కన్హయ్య గొంతు కోశారు