భీమా కోరేగావ్ కసు నిందితుడు స్టాన్ స్వామి (ఫైల్ ఫోటో)
ముంబై: ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన విజ్ఞప్తిపై బొంబాయి హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే 84 ఏళ్ల స్వామి ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం నుంచి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కోవిడ్‌కు చికిత్స పొందుతూ స్టాన్ స్వామి సోమవారం గుండెపోటుతో మృతి చెందారని ఆయన బెయిల్ కేసును విచారిస్తున్న ధర్మాసనానికి స్వామి తరఫు న్యాయవాది మిహిర్ దేశాయి తెలిపారు.
దీనిపై జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టిస్ ఎన్‌జే జమాదార్‌ల ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వార్తపై స్పందించేందుకు తమకు మాటలు రావడం లేదని, స్టాన్ స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని వ్యాఖ్యానించింది. రోమన్ కేథలిక్ ప్రీస్ట్‌గా ఉన్న స్టాన్ స్వామి మృతిపై జెస్యూట్ ప్రొవిన్షియల్ ఆఫ్ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ‘ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల కోసం ఆయన జీవితాంతం పోరాడారు. పేదలకు గౌరవప్రదమైన జీవితం లభించాలని పోరాటం చేశారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
స్టాన్ స్వామి మృతి విషయంలో చికిత్స అందించిన ఆసుపత్రిపై కానీ, బెయిల్ కేసు విచారణ జరుపుతున్న కోర్టుపై కానీ తమకెలాంటి ఫిర్యాదులు లేవని చెప్పగలమని.. అయితే, ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏపై, జైలు అధికారులపై మాత్రం అలా చెప్పలేమని న్యాయవాది మిహిర్ దేశాయి ధర్మాసనంతో వ్యాఖ్యానించారు. స్వామికి సరైన సమయంలో వైద్య సదుపాయం కల్పించే విషయంలో ఎన్‌ఐఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. విచారణ ఖైదీ అయిన తన క్లయింట్ స్వామి మృతికి దారితీసిన కారణాలపై హైకోర్టు న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 10 రోజుల ముందు స్వామిని జేజే ఆసుపత్రికి తీసుకువెళ్లారని, కానీ, ఆయనకు అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్ష జరపలేదని కోర్టుకు వివరించారు.
ఆ తరువాత హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో పరీక్షించగా, కోవిడ్ నిర్ధారణ అయిందన్నారు. స్టాన్ స్వామికి బెయిల్ మంజూరు చేయడాన్ని ప్రతీసారి ఎన్‌ఐఏ వ్యతిరేకించిందని, కానీ, ఒక్కరోజు కూడా ఆయనను విచారించడానికి కస్టడీకి తీసుకోలేదని ఆరోపించారు. విచారణ ఖైదీగా ఉన్న సమయంలోనే స్టాన్ స్వామి మరణించినందువల్ల, ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం అధికారులు ఆయనకు పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా, న్యాయ విచారణకు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం స్టాన్ స్వామి అంత్యక్రియలు ముంబైలో జరుగుతాయని కోర్టు తెలిపింది. ఎల్గార్ పరిషత్– మావోయిస్ట్ సంబంధాలకు సంబంధించిన కేసులో, కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2020 అక్టోబర్ నుంచి స్వామిని విచారణ ఖైదీగా మొదట తలోజా జైళ్లో నిర్బంధించారు.
మొదట అక్కడి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. అనంతరం, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మే నెలలో హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, జేజే ఆసుపత్రిలో తనను చేర్చడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఫాదర్ స్టాన్ స్వామి మృతికి నా హృదయపూర్వక నివాళులు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీ హత్యను మోదీ, షా విజయవంతంగా ముగించారు. ఆయనకు బెయిల్ నిరాకరించిన జడ్జీలు ఇక రాత్రులు నిద్ర పోలేరనుకుంటా. వారికీ ఈ హత్యలో భాగం ఉంది’ అని సీపీఐఎంల్ పొలిట్‌బ్యూరో మెంబర్ కవిత కృష్ణన్ ట్వీట్ చేశారు. స్టాన్ స్వామి విషయంలో ఎన్‌ఐఏ వ్యవహరించిన తీరుపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడ్తున్న తనకు జైలులో ఆహారం తీసుకోవడానికి వీలుగా ఒక సిప్పర్‌ను, స్ట్రాను ఇవ్వాలని ఎన్‌ఐఏను ఆదేశించాలని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు స్వామి మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. స్వామి చేసిన ఆ చిన్న అభ్యర్థనపై స్పందించడానికి ఎన్‌ఐఏ 4 వారాల గడువు కోరింది. అయితే, ఆ తరువాత స్వామికి సిప్పర్, స్ట్రాతో పాటు, వీల్ చెయిర్‌ను, చేతికర్రను, వాకర్‌ను, ఇద్దరు సహాయకులను సమకూర్చామని ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది.
ఆదివాసీల కోసం 30 ఏళ్ల పోరాటం
ఫాదర్ స్టాన్ స్వామి పూర్తి పేరు స్టానిస్లాస్ లూర్దుసామి. జార్ఖండ్‌లో ఆదివాసీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవిత పర్యంతం ఆయన కృషి చేశారు. నక్సలైట్లను ముద్రవేసి అక్రమంగా జైళ్లో మగ్గుతున్న ఆదివాసీల దుస్థితిపై ఆయన ఒక పరిశోధన గ్రంథం రాశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని తమపై తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని దాదాపు 97 శాతం విచారణ ఖైదీలు తనతో చెప్పినట్లు స్వామి అందులో పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన 3దశాబ్దాల పాటు కృషి చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1937లో ఆయన జన్మించారు. ‘జంషెడ్‌పూర్ ప్రావిన్స్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ జీసస్’లో చేరి, ప్రీస్ట్‌గా మారారు. 1970లలోనే యూనివర్సిటీ ఆఫ్ మనీలాలో సోషియాలజీలో పీజీ చేశారు.
బ్రసెల్స్‌లో చదువుకుంటున్న సమయంలో బ్రెజిల్‌లోని పేదల కోసం కృషి చేస్తున్న ఆర్చ్ బిషప్ హోల్డర్ కామరా సేవలు ఆయనను అమితంగా ఆకర్షించాయి. 1975 నుంచి 1986 వరకు బెంగళూరులోని ఇండియన్ సోషల్ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. 30 ఏళ్లుగా జార్ఖండ్ గిరిజనుల కోసం పనిచేస్తున్నారు. వారి భూములను అభివృద్ధి పేరుతో డ్యాములు, గనులు, టౌన్‌షిప్‌ల కోసం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న తప్పుడు ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్న గిరిజన యువత విడుదలకి కృషి చేశారు. కేన్సర్‌తో, పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడ్తున్న స్టాన్ స్వామిని, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత అక్టోబర్ 8న రాంచిలో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment