UAPA
-
NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్ చెల్లదని, ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ న్యూస్ పోర్టల్‌కు విదేశీ నిధులు అందుతున్నాయంటూ.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కిందటి ఏడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అరెస్టుకు సరైన కారణాలు చెబుతూ రిమాండ్ కాపీని సమర్పించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. దీంతో.. రిమాండ్ కాపీ తమకు అందకపోవడంతో ఈ అరెస్ట్ చెల్లదని, వెంటనే ఆయన్ని రిలీజ్ చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పంకజ్ బన్సాల్ కేసును కోర్టు ప్రస్తావించింది. అరెస్టుకు గల కారణాలేంటో నిందితులకు కూడా రాతపూర్వకంగా పోలీసులు తెలియజేయాల్సి ఉంటుందని పంకజ్ బన్సాల్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ కేసులోనూ అదే వర్తిస్తుంది అని బెంచ్ స్పష్టం చేసింది. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్టోబర్ 3వ తేదీన న్యూస్‌క్లిక్‌పోర్టల్‌లో పని చేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అదే రోజు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. ‘న్యూస్‌క్లిక్’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్‌సింగం నుంచి గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.ఈ క్రమంలోనే న్యూస్‌క్లిక్ ఆఫీస్‌తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు జరిపి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇంకోవైపు.. ‘న్యూస్‌క్లిక్’పై దాడులను విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారి గళాన్ని అణచివేసేందుకే కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు. బిహార్‌లో కులగణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రం న్యూస్‌క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని విపక్షాలు ఆ సమయంలో మండిపడ్డాయి. -
ధనికులపై సూపర్ ట్యాక్స్.. సీపీఎం మేనిఫెస్టో ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: రానున్న లోక్‌సభ ఎన్నికలకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPM) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. UAPA వంటి క్రూరమైన చట్టాలను రద్దు చేస్తామని, ధనికులపై "సూపర్ ట్యాక్స్"ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అవకాశం కల్పించాలని వామపక్ష పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ దశాబ్ద పాలన ద్వారా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని సీపీఎం పేర్కొంది. సీపీఎం మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ద్వేషపూరిత ప్రసంగం, నేరాలకు వ్యతిరేకంగా చట్టం కోసం పోరాడతామని సీపీఎం హామీ ఇచ్చింది. CAA లేదా పౌరసత్వ (సవరణ) చట్టం- 2019ని రద్దు చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. "చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA), మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) వంటి అన్ని క్రూరమైన చట్టాలను రద్దు చేస్తామని సీపీఎంపేర్కొంది. స్వతంత్ర సంస్థల స్వయంప్రతిపత్తిని పరిరక్షించడానికి, బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను పునఃపరిశీలించి, రివర్స్ చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది. సాధారణ సంపద పన్నుతో పాటు అత్యంత సంపన్నులపై పన్ను, వారసత్వపు పన్ను తప్పనిసరిగా చట్టబద్ధం చేస్తామని పేర్కొంది. ప్రస్తుత లేబర్ కోడ్స్ స్థానంలో కార్మిక అనుకూల చట్టాలను రూపొందిస్తామని కూడా పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మాదిరిగానే, సీపీఎం కూడా పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన నిబంధనను హామీ ఇచ్చింది. 'పని చేసే హక్కు'ని రాజ్యాంగ హక్కుగా చేర్చేలా చూస్తామని కూడా హామీ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పోస్టులలో ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తామని, ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడంతోపాటు ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్ కేటాయింపులను రెట్టింపు చేస్తామని మేనిఫెస్టో పేర్కొంది. పట్టణ ఉపాధికి హామీ ఇచ్చే కొత్త చట్టం, నిరుద్యోగ భృతిపై సీపీఎం హామీ ఇచ్చింది. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో జీడీపీలో కనీసం ఆరు శాతానికి పెంచనున్నట్లు సీపీఎం పేర్కొంది. ఇది మొత్తం కేంద్ర పన్నుల వసూళ్లలో 50 శాతం రాష్ట్రాలకు అప్పగించడాన్ని సూచిస్తుంది. తాము అధికారంలోకి వస్తే, ఒక ప్యానెల్ ద్వారా రాష్ట్ర గవర్నర్‌ను ఎన్నుకునే పద్ధతిని అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలు సీపీఎం హామీ ఇచ్చింది. ఆదివాసీల రాజ్యాంగ, చట్టపరమైన హక్కుల పరిరక్షణపై వాగ్దానం చేసింది. కుల ప్రాతిపదికన జనాభా గణన, రాజకీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలపై నిషేధం, జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ తదితర అంశాలు సీపీఎం మేనిఫెస్టోలో ఉన్నాయి. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పదేళ్ల సుదీర్ఘ కారాగారవాసం నుంచి గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. ఇదే అభియోగాలతో ఆయనతోపాటు అరెస్టయిన మరో అయిదుగురికి కూడా విముక్తి లభించింది. ఒకరు విచారణ సమ యంలో మరణించారు. అభియోగాలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెబు తూనే, అసలు తగిన అనుమతులు లేకుండా సాగించిన ఈ కేసు చెల్లుబాటు కాదని బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం వ్యాఖ్యానించటం మన నేర న్యాయవ్యవస్థ పనితీరును పట్టిచూపుతోంది. యూఏపీఏ కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలంటే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిందితులపై పకడ్బందీ సాక్ష్యాధారాలున్నాయని వారు విశ్వసించాకే ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలి. కానీ ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్టు చేయగా ఏడాది తర్వాతగానీ అనుమతులు రాలేదు. ఇతర నిందితులు వాస్తవానికి 2013లోనే అరెస్టయ్యారు. ఈ సంగతి పట్టని మహారాష్ట్రలోని గఢ్చిరోలి సెషన్స్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుని ఈలోగా ఒక సాక్షిని కూడా విచారించింది! చివరకు 2017లో వీరిని దోషులుగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించింది. అటు ప్రభుత్వ యంత్రాంగం సరే... ఇటు న్యాయవ్యవస్థ సైతం ఇంత యాంత్రికంగా పనిచేయటం సరైందేనా? బొంబాయి హైకోర్టు 2022లో ఈ అవక తవకలను గుర్తించి కేసు కొట్టేసింది. కానీ ఆ వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర అప్పీల్‌ను స్వీకరించి బొంబాయి హైకోర్టు తీర్పును నిలుపుదల చేయటం, తిరిగి దీన్ని విచారించాలంటూ ఆదేశాలు జారీచేయటంవల్ల సాయిబాబా తదితరులకు స్వేచ్ఛ లభించటానికి మరికొన్ని నెలలు పట్టింది. ఇలా కనీస సాక్ష్యాధారాలు కొరవడిన, ముందస్తు అనుమతులు తీసుకోని కేసులో నింది తులను పదేళ్లపాటు జైలు గోడలమధ్య బంధించి వుంచారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వ్యవస్థల సమష్టి వైఫల్యం కాదా? ఇందుకు జవాబుదారీతనం వహించాల్సిందెవరు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఈయూ కమిషన్, అమెరికన్ కాంగ్రెస్, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభా గంలో ఈ కేసు ప్రస్తావనకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని వివిధ సంస్థల వరకూ అందరికందరూ ఇది అన్యాయంగా బనాయించిన కేసు అనీ, వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు 2015లో జీరో అవర్‌లో దీన్ని రాజ్య సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కనీసం కేసు తేలేవరకూ నిందితులను బెయిల్‌పై విడుదల చేసివుంటే కొంతలో కొంతైనా న్యాయం చేసినట్టయ్యేది. బెయిల్ అనేది హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలన్నది మౌలిక న్యాయసూత్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈమధ్యకాలంలో కూడా పదే పదే ఈ సంగతిని గుర్తుచేస్తున్నారు. అయినా ఆచరణకొచ్చేసరికి జరిగేది వేరుగా వుంటోంది. నిందితులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపట్ల విరోధభావాన్ని వ్యాప్తిచేసేందుకు కుట్రపన్నారని తెలిపింది. ఆ విషయంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర పత్రాలువంటి సాక్ష్యాధారాలు అత్యంత బలహీనమైన వని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వెబ్సైట్ నుంచి వీడియోలు, ఇతర సమాచారం డౌన్లోడ్ చేసుకోవటం దానికదే నేరమెలా అవుతుందన్నది ధర్మాసనం సందేహం. ఫలానా ఉగ్ర వాద చర్యకూ, దానికీ సంబంధం వున్నదని నిరూపిస్తే తప్ప ఆ సాక్ష్యానికి ఎలాంటి విలువా వుండ దని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా అభిప్రాయాలు ఎవరికీ తెలియ నివి కాదు. ఆయన వృత్తిరీత్యా ఇంగ్లిష్ అధ్యాపకుడు. కవి, రచయిత కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారు. అరెస్టయిన సమయానికి విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్డీఎఫ్) బాధ్యుడు. ఆయన హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే, విధ్వంసానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ 90 శాతం అంగవైకల్యం వున్న సాయిబాబా మరొకరి సాయం లేనిదే తన పని తాను చేసుకోవటం కూడా అసాధ్యం. బయటకు వెళ్లాలంటే చక్రాల కుర్చీ తప్పనిసరి. అటు వంటి వ్యక్తిని ఉగ్రవాదిగా జమకట్టడం సబబేనా? కేవలం అసమ్మతిని వ్యక్తం చేయటమే ఒక మనిషిని పదేళ్లపాటు జైల్లోకి నెట్టడానికి కారణం కావటం మనం నమ్మే ప్రజాస్వామిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉగ్రవాద చర్యలు సమాజ క్షేమానికి ముప్పుగా పరిణమిస్తాయనటంలో సందేహం లేదు. అటువంటివారిని అదుపు చేయాలంటే యూఏపీఏ వంటి కఠిన చట్టాల అవసరం వుందని ప్రభుత్వాలు భావిస్తే తప్పుబట్టనవసరం లేదు. కానీ మన రాజ్యాంగమే అనుమతించిన సహేతుకమైన అసమ్మతిపై లేనిపోని ముద్రలేసి దాన్ని తుంచివేయాలనుకోవటం, భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవటం ఏరకంగా చూసినా సబబు కాదు. ఇప్పుడు సాయిబాబా కోల్పోయిన విలువైన పదేళ్ల కాలాన్ని ప్రభుత్వం వెనక్కివ్వలేదు. కనీసం ఉద్యోగమైనా చేసుకోనివ్వాలి. ఇతర క్రిమినల్ కేసుల మాట అటుంచి యూఏపీఏ వంటి దారుణ చట్టాలకింద అరెస్టయి నిర్దోషులుగా తేలినవారికైనా తగిన పరిహారం చెల్లిస్తే కాస్తయినా ఉపశమనం ఇచ్చినట్టవుతుంది. పాలకులు ఆలోచించాలి. -
ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు బెయిల్ రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన విజ్ఞప్తిని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటిస్తూ ఆదేశాలిచ్చింది. గత ఏడాది జర్నలిస్ట్ బండారి మద్దిలేటి, న్యాయవాదులు నలమాస కృష్ణ, మెంచు సందీప్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ యూఏపీఏ కింద అరెస్టు చేసింది. కాగా, ప్రత్యేక కోర్టు ఈ నిందితులకు గత సంవత్సరం ఆగస్టు 21, సెప్టెంబర్ 15, 28 తేదీల్లో వేర్వేరు తీర్పుల ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ ఎన్ఐఏ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ఈ కేసును మళ్లీ విచారించాలని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు సూచించింది. ఇటీవల ప్రత్యేక కోర్టు, కేసును తిరిగి విచారించింది. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది వి.పట్టాభి, న్యాయవాదులు నందిగం కృష్ణారావు, వి.రఘునాథ్ వాదించారు. కాగా బెయిల్ రద్దు చేసేందుకు ఎలాంటి కారణాలు లేనందున గతంలో బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
భీమా కోరేగావ్ కేసు: స్టాన్ స్వామి కన్నుమూత
ముంబై: ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన విజ్ఞప్తిపై బొంబాయి హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే 84 ఏళ్ల స్వామి ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం నుంచి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కోవిడ్‌కు చికిత్స పొందుతూ స్టాన్ స్వామి సోమవారం గుండెపోటుతో మృతి చెందారని ఆయన బెయిల్ కేసును విచారిస్తున్న ధర్మాసనానికి స్వామి తరఫు న్యాయవాది మిహిర్ దేశాయి తెలిపారు. దీనిపై జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమాదార్ల ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వార్తపై స్పందించేందుకు తమకు మాటలు రావడం లేదని, స్టాన్ స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని వ్యాఖ్యానించింది. రోమన్ కేథలిక్ ప్రీస్ట్‌గా ఉన్న స్టాన్ స్వామి మృతిపై జెస్యూట్ ప్రొవిన్షియల్ ఆఫ్ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ‘ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల కోసం ఆయన జీవితాంతం పోరాడారు. పేదలకు గౌరవప్రదమైన జీవితం లభించాలని పోరాటం చేశారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాన్ స్వామి మృతి విషయంలో చికిత్స అందించిన ఆసుపత్రిపై కానీ, బెయిల్ కేసు విచారణ జరుపుతున్న కోర్టుపై కానీ తమకెలాంటి ఫిర్యాదులు లేవని చెప్పగలమని.. అయితే, ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న ఎన్ఐఏపై, జైలు అధికారులపై మాత్రం అలా చెప్పలేమని న్యాయవాది మిహిర్ దేశాయి ధర్మాసనంతో వ్యాఖ్యానించారు. స్వామికి సరైన సమయంలో వైద్య సదుపాయం కల్పించే విషయంలో ఎన్ఐఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. విచారణ ఖైదీ అయిన తన క్లయింట్ స్వామి మృతికి దారితీసిన కారణాలపై హైకోర్టు న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 10 రోజుల ముందు స్వామిని జేజే ఆసుపత్రికి తీసుకువెళ్లారని, కానీ, ఆయనకు అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్ష జరపలేదని కోర్టుకు వివరించారు. ఆ తరువాత హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో పరీక్షించగా, కోవిడ్ నిర్ధారణ అయిందన్నారు. స్టాన్ స్వామికి బెయిల్ మంజూరు చేయడాన్ని ప్రతీసారి ఎన్ఐఏ వ్యతిరేకించిందని, కానీ, ఒక్కరోజు కూడా ఆయనను విచారించడానికి కస్టడీకి తీసుకోలేదని ఆరోపించారు. విచారణ ఖైదీగా ఉన్న సమయంలోనే స్టాన్ స్వామి మరణించినందువల్ల, ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం అధికారులు ఆయనకు పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా, న్యాయ విచారణకు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం స్టాన్ స్వామి అంత్యక్రియలు ముంబైలో జరుగుతాయని కోర్టు తెలిపింది. ఎల్గార్ పరిషత్– మావోయిస్ట్ సంబంధాలకు సంబంధించిన కేసులో, కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2020 అక్టోబర్ నుంచి స్వామిని విచారణ ఖైదీగా మొదట తలోజా జైళ్లో నిర్బంధించారు. మొదట అక్కడి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. అనంతరం, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మే నెలలో హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, జేజే ఆసుపత్రిలో తనను చేర్చడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఫాదర్ స్టాన్ స్వామి మృతికి నా హృదయపూర్వక నివాళులు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీ హత్యను మోదీ, షా విజయవంతంగా ముగించారు. ఆయనకు బెయిల్ నిరాకరించిన జడ్జీలు ఇక రాత్రులు నిద్ర పోలేరనుకుంటా. వారికీ ఈ హత్యలో భాగం ఉంది’ అని సీపీఐఎంల్ పొలిట్‌బ్యూరో మెంబర్ కవిత కృష్ణన్ ట్వీట్ చేశారు. స్టాన్ స్వామి విషయంలో ఎన్ఐఏ వ్యవహరించిన తీరుపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్తున్న తనకు జైలులో ఆహారం తీసుకోవడానికి వీలుగా ఒక సిప్పర్‌ను, స్ట్రాను ఇవ్వాలని ఎన్ఐఏను ఆదేశించాలని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు స్వామి మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. స్వామి చేసిన ఆ చిన్న అభ్యర్థనపై స్పందించడానికి ఎన్ఐఏ 4 వారాల గడువు కోరింది. అయితే, ఆ తరువాత స్వామికి సిప్పర్, స్ట్రాతో పాటు, వీల్ చెయిర్‌ను, చేతికర్రను, వాకర్‌ను, ఇద్దరు సహాయకులను సమకూర్చామని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఆదివాసీల కోసం 30 ఏళ్ల పోరాటం ఫాదర్ స్టాన్ స్వామి పూర్తి పేరు స్టానిస్లాస్ లూర్దుసామి. జార్ఖండ్‌లో ఆదివాసీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవిత పర్యంతం ఆయన కృషి చేశారు. నక్సలైట్లను ముద్రవేసి అక్రమంగా జైళ్లో మగ్గుతున్న ఆదివాసీల దుస్థితిపై ఆయన ఒక పరిశోధన గ్రంథం రాశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని తమపై తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని దాదాపు 97 శాతం విచారణ ఖైదీలు తనతో చెప్పినట్లు స్వామి అందులో పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన 3దశాబ్దాల పాటు కృషి చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1937లో ఆయన జన్మించారు. ‘జంషెడ్పూర్ ప్రావిన్స్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ జీసస్’లో చేరి, ప్రీస్ట్‌గా మారారు. 1970లలోనే యూనివర్సిటీ ఆఫ్ మనీలాలో సోషియాలజీలో పీజీ చేశారు. బ్రసెల్స్‌లో చదువుకుంటున్న సమయంలో బ్రెజిల్‌లోని పేదల కోసం కృషి చేస్తున్న ఆర్చ్ బిషప్ హోల్డర్ కామరా సేవలు ఆయనను అమితంగా ఆకర్షించాయి. 1975 నుంచి 1986 వరకు బెంగళూరులోని ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్‌గా పనిచేశారు. 30 ఏళ్లుగా జార్ఖండ్ గిరిజనుల కోసం పనిచేస్తున్నారు. వారి భూములను అభివృద్ధి పేరుతో డ్యాములు, గనులు, టౌన్‌షిప్‌ల కోసం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న తప్పుడు ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్న గిరిజన యువత విడుదలకి కృషి చేశారు. కేన్సర్‌తో, పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్తున్న స్టాన్ స్వామిని, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత అక్టోబర్ 8న రాంచిలో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. -
బెయిల్ పిటిషన్లో యూఏపీఏ ప్రస్తావన ఎందుకు?
న్యూఢిల్లీ: బెయిల్ కేసు విచారణలో ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ)’పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేయడాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును ఇతర కోర్టులు తమ తీర్పులకు ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అయితే, ఆ విద్యార్థులకు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘బెయిల్ కేసులో ఇచ్చిన తీర్పులో దాదాపు 100 పేజీలు మొత్తం యూఏపీఏపైనే చర్చ ఉండడం ఆశ్చర్యకరం. యూఏపీఏ చట్టబద్ధత అంశం ఆ కేసులో కోర్టు ముందుకు రాలేదు. ఆ కేసు కేవలం బెయిల్ మంజూరుకు సంబంధించినది’అని జస్టిస్ హేమం త్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై సుప్రీంకోర్టు వాఖ్యానించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. బెయిల్ పొందిన జేఎన్‌యూ విద్యార్థినులు నటాషా నార్వల్, దేవాంగన కలీతా, జామియా మిలియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తన్హాకు 4 వారాల్లోపు స్పందించాలని ఆదేశించింది. వారి బెయిల్ విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆ విద్యార్థులకు బెయిలిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మొత్తం యూఏపీఏ తలకిందులైందని పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. -
వరవరరావు పరిస్థితి విషమం
ముంబై: ‘ఎల్గార్ పరిషత్’ కేసుకు సంబంధించి జైళ్లో ఉన్న ప్రముఖ తెలుగు విప్లవ కవి వరవర రావును తక్షణమే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణశయ్యపై ఉన్న వ్యక్తి చికిత్స కోసం అభ్యర్థిస్తుంటే కుదరదని ఎలా చెప్పగలుగుతున్నారని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మాధవ్ జమ్‌దార్‌ల ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. దాంతో వరవర రావును ప్రత్యేక కేసుగా పరిగణించి, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్చి, 15 రోజుల పాటు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆసుపత్రిలో వరవరరావును చూసేందుకు ఆసుపత్రి నిబంధనల మేరకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కోర్టు స్పష్టం చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వరవరరావు నవీముంబైలోని తలోజా జైళ్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వరవర రావును తలోజా జైలు ఆసుపత్రి నుంచి తక్షణమే నానావతి ఆసుపత్రికి మార్చి, మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన భార్య హేమలత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. వరవరరావు ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ‘తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు మరణశయ్యపై ఉన్న ఒక 80 ఏళ్ల వ్యక్తికి తలోజా జైళ్లోనే చికిత్స అందిస్తామని ఎలా చెప్తారు?’ అని ఈ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రి అయిన నానావతి హాస్పిటల్లో వరవర రావు చికిత్సకు అయిన ఖర్చును ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. చికిత్సకు అయ్యే ఖర్చును వరవర రావే భరించాలన్న ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే వాదనను.. వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర జైసింగ్ తోసిపుచ్చారు. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించలేకపోవడానికి డబ్బులు లేవన్న కారణాన్ని ప్రభుత్వాలు చూపకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఉటంకించారు. ఆమె వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ‘ప్రస్తుతం ఆయన మీ కస్టడీలో ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మీ కస్టడీలో ఉన్నట్లుగానే భావించాలి. అందువల్ల చికిత్స ఖర్చును మీరే భరించాలి’ అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాంతో, ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే రాష్ట్ర హోం మంత్రిని ఫోన్లో సంప్రదించారు. అనంతరం, వరవరరావుకు 15 రోజుల పాటు నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కోర్టుకు తెలిపారు. దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించాలని, భవిష్యత్తులో ఈ తరహా కేసులకు దీన్ని ఉదాహరణగా చూపకూడదని అభ్యర్థించారు. ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను.. కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. దానికి, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అభియోగాలను నమోదు చేయాల్సి ఉందని ఎన్ఐఏ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ సమాధానమిచ్చారు. అభియోగాల నమోదుకు ఇంకా కనీసం ఒక సంవత్సరం పడుతుందని, ఎందుకంటే ఆ అభియోగాలన్నీ ప్రాథమికంగా కంప్యూటర్ సాక్ష్యాలపై ఆధారపడి ఉన్నాయని వరవరరావు తరఫున జైసింగ్‌తో పాటు వాదనలు వినిపించిన ఆనంద్ గ్రోవర్ కోర్టుకు వివరించారు. చనిపోతే ఎవరిది బాధ్యత? విచారణ ఇలాగే కొనసాగితే వరవరరావు జైళ్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఇందిర జైసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు పారిపోకూడదనే ఉద్దేశంతోనే విచారణ ఖైదీలను జైళ్లో పెడతారని, కానీ, మానసికంగా దుర్బలమై, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వీవీ పారిపోయే అవకాశమే లేదని ఆమె వివరించారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆయన చనిపోతే ఎవరిది బాధ్యత? ఆసుపత్రిలో ఆయనకేమైనా అయితే, అది కస్టోడియల్ మరణమే అవుతుంది’ అని స్పష్టం చేశారు. జైళ్లో సహచరులు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా వరవరరావును చూసుకుంటున్నారని, కానీ, వారు వైద్యంలో శిక్షణ పొందినవారు కాదని కోర్టుకు వివరించారు. ఆసుపత్రిలో ఉండగా, వరవరరావుకు చేసిన వైద్య పరీక్షలపై కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అవి తప్పై ఉండొచ్చని, వాటిపై ఆయన వయసు 54 ఏళ్లు అని ఉందని పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్న లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. నానావతి హాస్పిటల్లో జరిపిన వైద్య పరీక్షల నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. కోర్టుకు తెలియజేయకుండా ఆయనను ఆసుపత్రి నుంచి పంపించేయవద్దని ఆదేశించింది. వీవీ భార్య హేమలత వేసిన రిట్ పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఆయనను నానావతి ఆసుపత్రికి మార్చే అంశానికే బుధవారం నాటి వాదనలను పరిమితం చేద్దామని కోర్టు సూచించడంతో, బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగలేదు. విచారణను డిసెంబర్ 3కి కోర్టు వాయిదా వేసింది. -
కాసీంపై రాజద్రోహ నేరాన్ని వెంటనే ఎత్తేయ్యాలి
తెలంగాణ ఏర్పడ్డాక కూడా బడుగులపైనే రాజ్యద్రోహం కేసులు పెడతారా అని బీసీసంక్షేమసంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జకృష్ణ ప్రశ్నించారు.. ప్రజాస్వామ్య పరిధిలో యూనివర్శిటీలో ఆచార్యుడిగా ఒకవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూ, సామాజిక అసమానతలపై రచనలు చేస్తూ 'నడుస్తున్న తెలంగాణ' పత్రికను నడుపుతున్న కాసీంపై ప్రభుత్వం పెట్టిన రాజ్యద్రోహం కేసును వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులకు గురైన బడుగులు, బలహీనవర్గాల వారిని ఆదుకోవాల్సింది పోయి.. నక్సలైట్లతో సంబంధాలున్నాయని రాజద్రోహం కేసును పెట్టడం ప్రభుత్వానికి ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే నక్సల్స్ అజెండాను అమలుచేస్తామన్న సీఎం కేసీఆర్, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న వారిపై రాజద్రోహం కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. కాసీం అడవుల్లో అజ్ఞాతంగా ఉండడం లేదని, తుపాకి పట్టలేదని అటువంటి వారిపై రాజద్రోహం కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ అక్రమకేసును వెంటనే ఎత్తేయక పోతే తమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు.