
న్యూఢిల్లీ: బెయిల్ కేసు విచారణలో ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ)’పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేయడాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును ఇతర కోర్టులు తమ తీర్పులకు ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అయితే, ఆ విద్యార్థులకు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘బెయిల్ కేసులో ఇచ్చిన తీర్పులో దాదాపు 100 పేజీలు మొత్తం యూఏపీఏపైనే చర్చ ఉండడం ఆశ్చర్యకరం. యూఏపీఏ చట్టబద్ధత అంశం ఆ కేసులో కోర్టు ముందుకు రాలేదు.
ఆ కేసు కేవలం బెయిల్ మంజూరుకు సంబంధించినది’అని జస్టిస్ హేమం త్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై సుప్రీంకోర్టు వాఖ్యానించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. బెయిల్ పొందిన జేఎన్‌యూ విద్యార్థినులు నటాషా నార్వల్, దేవాంగన కలీతా, జామియా మిలియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తన్హాకు 4 వారాల్లోపు స్పందించాలని ఆదేశించింది. వారి బెయిల్ విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆ విద్యార్థులకు బెయిలిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మొత్తం యూఏపీఏ తలకిందులైందని పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment