తెలంగాణ ఏర్పడ్డాక కూడా బడుగులపైనే రాజ్యద్రోహం కేసులు పెడతారా అని బీసీసంక్షేమసంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జకృష్ణ ప్రశ్నించారు.. ప్రజాస్వామ్య పరిధిలో యూనివర్శిటీలో ఆచార్యుడిగా ఒకవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూ, సామాజిక అసమానతలపై రచనలు చేస్తూ 'నడుస్తున్న తెలంగాణ' పత్రికను నడుపుతున్న కాసీంపై ప్రభుత్వం పెట్టిన రాజ్యద్రోహం కేసును వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులకు గురైన బడుగులు, బలహీనవర్గాల వారిని ఆదుకోవాల్సింది పోయి.. నక్సలైట్లతో సంబంధాలున్నాయని రాజద్రోహం కేసును పెట్టడం ప్రభుత్వానికి ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే నక్సల్స్ అజెండాను అమలుచేస్తామన్న సీఎం కేసీఆర్, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న వారిపై రాజద్రోహం కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు.
కాసీం అడవుల్లో అజ్ఞాతంగా ఉండడం లేదని, తుపాకి పట్టలేదని అటువంటి వారిపై రాజద్రోహం కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ అక్రమకేసును వెంటనే ఎత్తేయక పోతే తమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు.