BC Welfare Association
-
బీసీల రాజ్యాధికారమే ప్రధాన ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: ‘‘జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అటు చట్టసభల్లో... ఇటు మంత్రి పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేదు. 5 నుంచి 10 శాతం ఉన్న అగ్రకులాలకు చెందిన వారు 50 శాతం పైబడి పదవులు దక్కించుకుంటున్నారు. రా జ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన కేటాయిం పులు జరగాలి. కానీ ప్రతి పార్టీ బీసీలకు అత్తెసరు స్థానాలిచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఓట్లు రాబట్టేందుకు సంక్షేమ ఫలాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ బీసీలు బాగు పడాలంటే సంక్షేమ పథకాలతో సాధ్యం కాదు. కేవలం రాజకీ య పదవులు, పాలనలో కీలక బాధ్యతలు దక్కితే నే చట్టాలు చేసే అధికారం వస్తుంది. ఆ ఆలోచన తోనే ఈసారి ఎన్నికల్లో బీసీలకు అత్యధిక టికెట్లు రాబట్టేందుకు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీల సింహగర్జన సభను నిర్వహిస్తున్నాం’’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో లక్షలాది మందితో నిర్వహిస్తున్న బీసీల సింహగర్జన బహిరంగ సభ నేపథ్యంలో ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచు కున్నారు. అవి ఆయన మాటల్లోనే... ప్రతి పార్టీ 60 సీట్లు ఇవ్వాలి.. కానీ రాష్ట్ర జనాభాలో 60 శాతానికిపైగా ఉన్న బీసీలకు ప్రతి రాజకీయ పార్టీ కనీసం 60 సీట్లు కేటాయించాలి. అన్ని ప్రధాన కులాలను కలుపుకుంటూ టికెట్లు ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థి తులతో పోలిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ లకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. 2018 ఎన్ని కల్లో బీఆర్ఎస్ బీసీలకు 26 సీట్లు కేటాయించ గా... తాజాగా ప్రకటించిన జాబితాలో కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చింది. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు ఈ దఫా సీటు కేటాయించకపోవ డం గమనార్హం. ఇక కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు ఏమేరకు సీట్లు కేటాయిస్తాయో వేచిచూడాలి. మా నినాదం మాత్రం ఒక్కటే. ‘కులానికో సీటు, అలాంటి పార్టీలకే బీసీల ఓటు’. సంక్షేమ పథకాల అమలంటూ బీసీలకు భిక్ష వేసినట్లు చేస్తూ ఓట్లు రాబట్టుకుంటున్నాయి. నిధుల కేటాయింపు అనేది బీసీల హక్కు. ప్రతి పార్టీ బీసీ రాజకీయ పాలసీ ప్రకటించాలి త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నా యి. వెనువెంటనే పార్లమెంటు ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీ రాజకీయ పాలసీని ప్రకటించాలి. ఈమేరకు బీసీల సింహగర్జన సభలో తీర్మానాలు చేస్తాం. ప్రతి ఇంటి నుంచి ఓ మనిషి... ప్రతి ఊరి నుంచి ఓ బండి... నినాదంతో సింహగర్జన నిర్వ హిస్తున్నాం. రాజకీయ పార్టీలకతీతంగా ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నా. దళిత, గిరిజన సంఘాల ప్రతినిధులు సైతం ఈ సభకు రాను న్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పలు సంఘాల ప్రతినిధులు రానున్నారు. ఈ బహిరంగ సభకు దివంగత గద్దర్ పేరు పెడుతున్నాం. -
ప్రధానితో ఆర్.కృష్ణయ్య, బీసీ నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లో సమాన వాటా ఇవ్వకుండా అన్యాయం జరు గుతోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. బీసీలకు న్యాయం చేసేందుకు ప్రధానమంత్రి హోదాలో జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ , లాల్ కృష్ణ, డా.మారేష్, డా.పద్మలత, రమేశ్ ప్రధానమంత్రితో కలిసి చర్చలు జరిపారు. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో బీసీలకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రధానికి వివరించి ఒక వినతిపత్రాన్ని అందించారు. జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులవృత్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. బీసీలకు ఏ రంగంలో కూడా ఇంతవరకు జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని, విద్యా,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదని ప్రధానికి వివరించారు. అందుకోసం బీసీలకు రావాల్సిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరగాలని ఆర్.కృష్ణయ్య కోరారు. అదేవిధంగా జనాభా గణనలో కులాల వారీగా బీసీ జనాభా గణన చేయాలని బీసీ నేతల బృందం ప్రధానిని కోరింది. బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని ప్రధానమంత్రి చెప్పారని సమావేశం అనంతరం ఆర్.కృష్ణయ్య తెలిపారు. -
బీసీల పక్షాన కాంగ్రెస్‌కు మద్దతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ సంఘాల పక్షాన తమకు మద్దతివ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, మాజీ ఎంపీ వి.హనుమంతరావు శనివారం సాయంత్రం విద్యానగర్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వెళ్లి ఆర్. కృష్ణయ్యను కలిశారు. బీసీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, బీసీల కులగణన చేపట్టాలన్న డిమాండ్‌కు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారని వారు గుర్తు చేసి.. తమకు సంఘీభావం తెలపాలని కృష్ణయ్యను కోరారు. ఇందుకు స్పందించిన ఆయన బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ నేతల ముందుంచి వాటిని పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీసీల మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగానే కృష్ణయ్య ఆఫీసుకి, ఇంటికి ఠాక్రే, వీహెచ్ వెళ్లారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయాలకు సంబంధం లేదు: కృష్ణయ్య ఠాక్రే, వీహెచ్‌లతో సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని, బీసీ డిమాండ్లపైనే చర్చ జరిగిందని చెప్పారు. బీసీ సంఘం అధ్యక్షుడిగా మాత్రమే వారు తనను కలిశారని స్పష్టం చేశారు. బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని కోరానని, అందుకు కాంగ్రెస్ నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే పార్లమెంటులో వైఎస్సార్సీపీ పక్షాన బీసీ బిల్లు పెట్టి 14 పార్టీల మద్దతు కూడగట్టామని వెల్లడించారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి స్పష్టం: ఠాక్రే ఆర్.కృష్ణయ్యతో చర్చల తర్వాత ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అందుకే కృష్ణయ్యతో మాట్లాడేందుకు తాము వచ్చామన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. కాగా, బీసీ సంఘం కార్యాలయంపైనే ఉన్న కృష్ణయ్య నివాసంలోకి ఠాక్రే, వీహెచ్‌లు వెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. -
బీసీ కుల గణనకు వైఎస్ జగన్ సర్కార్ జై
సాక్షి, అమరావతి : కుల గణన చేపట్టాలన్న బీసీ సంఘాల న్యాయమైన డిమాండ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైకొట్టింది. వెనుకబడిన వర్గాల ఆశల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. వీరి న్యాయమైన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సీఎం వారికి నైతిక మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ తాజా నిర్ణయంపట్ల బీసీ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్త జనాభా లెక్కల సేకరణలో బీసీ కులం కాలమ్ చేర్చి కుల గణన చేపట్టాలంటూ కేంద్రాన్ని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది. పైగా ఇప్పుడు రాష్ట్ర పరిధిలో కుల గణనకు సన్నద్ధమైంది. దీనిపై అధ్యయనానికి రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం వెల్లడించారు. త్వరలో మంత్రి వేణు నేతృత్వంలో కమిటీని కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే బీసీ కుల గణనకు ముందుకొచ్చిన బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం రాష్ట్రంలో బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుంది. తద్వారా జనాభా లెక్కల సేకరణలో కులం కాలమ్ చేర్పి కుల గణన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కుల జనగణనతో ఎంతో మేలు.. నిజానికి.. దేశ జనాభాలో 52శాతం కంటే అధికంగా ఉన్న ఓబీసీల లెక్కలు తేలాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. ప్రస్తుతం కొన్ని బీజేపీ మిత్రపక్షాలతో సహా అనేక రాజకీయ పార్టీలు ఓబీసీ జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీని సైతం ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానం ప్రకారం కులాల వారీగా జనాభా గణనను చేపట్టలేమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పలుమార్లు ప్రకటించింది. కులాల వారీ లెక్కలు తేలితే జనాభా ప్రాతిపదికన (దామాషా ప్రకారం) వారికి నిధులు, విద్య, ఉద్యోగం, పదవులు రిజర్వేషన్ ప్రకారం దక్కుతాయని, తద్వారా ఆయా కులాలకు ఎంతో మేలు జరుగుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. నామి¯óట్ పదవులు, బడ్జెట్ కేటాయింపులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సైతం జనాభా వారీగా అందించి సామాజిక న్యాయం చేయవచ్చన్నది వాటి వాదన. 20 ఏళ్లుగా ఉద్యమాలు.. సీఎంకు కృతజ్ఞతలు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కలు–2022లో కులం కాలమ్ ఏర్పాటుచేసి బీసీ జనాభా లెక్కలు తేల్చాలని ఇటీవల జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాం. కోవిడ్‌తో ఇప్పటికే ఆలస్యమైన జనాభా లెక్కల సేకరణ ఈ ఏడాది చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ అంటూ అనేక సంఘాలతో కలిసి ఢిల్లీలో ధర్నాలు చేశాం. 20 ఏళ్లుగా చేస్తున్న ఈ డిమాండ్‌ను ఏ జాతీయ పార్టీ పట్టించుకోలేదు. కానీ, ఏపీలో చేపట్టేందుకు నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. – ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇది చరిత్రాత్మకం అవుతుంది కులాల వారీ జనాభా గణన చరిత్రాత్మకం అవుతుంది. అది ఓబీసీల్లోని పేదలకు వరంగా మారుతుంది. ఓబీసీ జనాభాను లెక్కించడంవల్ల ప్రభుత్వ పథకాలను ఇంకా సమర్థంగా అమలుచేయవచ్చు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీసీ బాధలను అర్థం చేసుకుని రాష్ట్రంలో కుల గణనకు సీఎం వైఎస్ జగన్ ముందుకురావడం అభినందనీయం. దీని ద్వారా తాను బీసీల పక్షపాతినని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. – కేశన శంకరరావు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం -
దద్దరిల్లిన జంతర్‌మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్‌తో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ దద్దరిల్లింది. కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారని నిరసిస్తూ బీసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘ కనీ్వనర్ లాల్ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ నరేశ్, రాజ్‌కుమార్, ఢిల్లీ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ నాయకత్వం వహించిన మహాధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మహాధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ.. రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి బీసీలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 129 బీసీ కులాలకుగాను 120 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్లను చేశారని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత 35 సంవత్సరాల్లో 70సార్లు పార్లమెంటు వద్ద ధర్నాలు– ప్రదర్శనలు నిర్వహించామని... శాంతియుతంగా ఉద్యమిస్తే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి: కేకే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్ చేశారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే పథకాలు వేగంగా అమలు జరుగుతాయని అన్నారు. ఈ విషయమై పార్లమెంటులో ప్రస్తావించి పోరాటం కొనసాగిస్తామని కేకే తెలిపారు. బీసీ జనాభా లెక్కించాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాలని లింగయ్య యాదవ్ అన్నారు. -
బీసీలకు పెద్దపీట వేసింది వైఎస్ జగనే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, అమరావతి: లోకేశ్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు బీసీ రిజర్వేషన్లపై కనీస అవగాహన లేదనే విషయం అర్థమవుతోందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టంచేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు 34 శాతానికి పెంచారని, సీఎం వైఎస్ జగన్ తగ్గించారంటూ లోకేశ్ పచ్చి అబద్ధాలు చెప్పడాన్ని జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ విషయమై ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వాస్తవంగా బీసీలకు చంద్రబాబు అన్యాయం చేస్తే సీఎం వైఎస్ జగన్ న్యాయం చేశారని వివరించారు. ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థలకు ఎన్నికలే జరపని చంద్రబాబు.. బీసీలకు 34% రిజర్వేషన్లు ఎలా అమలు చేశారని లోకేశ్‌ను ప్రశ్నించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లకు మించి పార్టీ పరంగా అవకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. 25 మంది ఉండే మంత్రివర్గంలో సైతం ఏకంగా 11 మంది బీసీలకు అవకాశం కల్పించారన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టులు, పనుల్లోనూ 50 శాతంపైగా బీసీలకు కట్టబెట్టారని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని, దమ్మున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని న్పష్టం చేశారు. -
మహిళా సాధికారతపై గుణాత్మక చర్చ జరగాలి
అంబర్‌పేట (హైదరాబాద్): మహిళా సాధికారతపై దేశవ్యాప్తంగా గుణాత్మక చర్చ జరగాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. గురువారం అంబర్‌పేట జైస్వాల్ గార్డెన్లో బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్ల కిందట పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవే పెట్టి అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా ఉంటేనే వారి జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని తెలిపారు. సమావేశంలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శారదగౌడ్ మాట్లాడుతూ అవకాశం వస్తే రాబోయే ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
27న విజయవాడలో బీసీ ఆత్మగౌరవ సభ
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): ఈ నెల 27న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హైదరాబాద్‌లో నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీ ఆత్మగౌరవ సభ పోస్టర్‌ను కృష్ణయ్య విడుదల చేశారు. ఈ సమావేశ వివరాలను ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్.మారేష్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సన్మానించి బీసీల సత్తా చాటేలా ఆత్మగౌరవ సభను నిర్వహించాలని కృష్ణయ్య సూచించారని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలంతా ఏకమై పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏపీ బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి పాల్గొన్నారు. అనంతరం బీసీ సంఘ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా మల్లి అప్పారావు, ఉత్తరాంధ్ర కన్వీనర్‌గా సనపాల లక్ష్మీనరసింహ, ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా అనిల్‌కుమార్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా వెంకటాచార్యులు, రాష్ట్ర కన్వీనర్‌గా తన్నీరు సుబ్బారావు, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాధవికి కృష్ణయ్య నియామకపత్రాలు అందించారు. -
9న చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి: కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, జనగణనలో కుల గణన చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో బీసీ సేన జాతీయ సమావేశం సేన జాతీ య అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్సార్ సీపీ పార్లమెంట్లో బిల్లు పెడితే అధికార బీజేపీ ఆమోదించకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు సాధన కోసం బీసీ ఎంపీలందరూ పార్లమెంట్లో డిమాండ్ చేయాలని కృష్ణయ్య కోరారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులపై క్రిమిలేయర్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బర్క కృష్ణయాదవ్ మాట్లాడుతూ బీసీల డిమాండ్లను ఆమోదించేంత వరకు ఢిల్లీలో పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు మాదప్ప, నాగరాజు, రాములుయాదవ్, అశోక్, అంజి తదితరులు పాల్గొన్నారు. -
భూ బకాసురులను వదిలి గుడిసెల మీదా దాడి చేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, చెరువులు, గుడులు, బడులను దర్జాగా కబ్జా చేసి తిరుగుతున్న భూ బకాసురులను వదిలి ఆకలి కోసం అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్న గిరిజనులపై దాడులు చేయడం ఏమిటని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేటలోని స్థానిక ఆదివాసీలు తాత్కాలికంగా తలదాచుకోవడానికి వేసుకున్న గుడిసెలను వందలాది మంది ఫారెస్టు పోలీసులతో ఏకదాటిగా దాడి చేసి కూల్చివేయడం అన్యాయమని శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తూ అత్యంత పాశవికంగా వ్యహరించడం ప్రభుత్వానికి తగదని, వెంటనే ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ఆదివాసులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గిరిజనులపై ఆకృత్యాలకు పాల్పడిన ఫారెస్టు, పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సూచించారు. ఆదివాసి గిరిజనులకు దేశంలో బతికే హక్కులేదా అని నిలదీశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళల వస్త్రాలను చిందరవందర చేస్తూ ఘోరంగా లాక్కెడం రజకార్ల పాలనను తలపించిందని ఆరోపించారు. గిరిజనుల పోరాటానికి బీసీ సమాజం పూర్తి మద్దతు ఇస్తుందని జాజుల ప్రకటించారు. -
‘బడుగుల సంక్షేమాన్ని మరిచిన కేంద్ర బడ్జెట్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు 74 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. మంగళవారం లోక్‌సభలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ అధ్యక్షతన బీసీ భవన్లో జరిగిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని పలు మార్లు ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులకు విన్నవించినా కేంద్రానికి చీమకుట్టినట్లుకూడా లేదని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తన బీసీ వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోకపోతే బీసీలమంతా ఏకమై పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ ప్రధాని అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని తాము అనుకున్నప్పటికీ మోదీ పాలనలో నేటికీ అన్యాయం, వివక్ష కొనసాగుతున్నాయని ఆరోపించారు. సురేశ్ మాట్లాడుతూ దేశంలోని 6 వేల బీసీ కులాలను ఆదుకునేలా బడ్జెట్‌ను పునఃసమీక్షించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, అనంతయ్య, అంజి, జయం తిగౌడ్, హరీశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలు పోరాడి సాధించుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. బీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్‌తో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కేశ న శంకర్రావు నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, రెడ్డప్ప, టీడీపీ ఎంపీలు కేశినేని శ్రీనివాస్, రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, రవీంద్రకుమార్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ బీసీల కులగణనతో మాత్రమే బీసీలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ బీసీ జనగణన చేపట్టాలని పార్లమెంట్ వేదికగా పోరాడతామని చెప్పారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రాధాన్యం ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, చిన్నచిన్న కులాలకు సైతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బీసీల అభ్యున్నతికి ఏపీ ముఖ్యమంత్రి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. బీసీల అభ్యున్నతికి, వారికి దశదిశ చూపించే బీసీ జనగణన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీలు బలమైన సామాజికవర్గమని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ అగ్రకులాల వారిని పల్లకిలో మోసిమోసి బీసీల భుజాలు అరిగిపోయాయని చెప్పారు. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి, జనగణన చేపట్టేవరకు ఏమాత్రం విశ్రమించకుండా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. -
బీసీబంధు పథకంపై కేసీఆర్ స్పందించాలి
కవాడిగూడ (హైదరాబాద్): బీసీ కులాలకు బీసీబంధు ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్ష చేపట్టారు. దీక్షను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ యాంత్రీకరణ, కార్పొరేటీకరణ, ఆధునీకరణ ద్వారా వృత్తులు కోల్పోయి అనేక కులాలు రోడ్డునపడ్డాయని, వీటిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంతో ఉపాధిలేక 46 మంది మనోవేదనకు గురై చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దీక్షలకు మధుయాష్కీ, కోదండరాం, దాసోజు శ్రావణ్, వి.హనుమంతరావు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా సంఘీభావం తెలిపారు. బీసీబంధు ప్రకటించకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు లాల్‌కృష్ణ, అరుణ్‌కుమార్, జనార్దన్, నీల వెంకటేశ్, సత్యనారాయణ, అంజి పాల్గొన్నారు. -
బార్ల నుంచి రాని కరోనా బడిలో వస్తుందా?
సాక్షి, పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్రంలో బార్లు ఆఫ్‌లైన్ నడుస్తుండగా విద్యా సంస్థలు మాత్రం ఆన్లైన్లో నడుస్తున్నాయని, బార్లో రాని కరోనా బడిలో ఎలా వస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఆన్లైన్ విద్య వల్ల సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు లేక గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం మంది విద్యార్థులు విద్యకు దూరమౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘రాష్ట్రంలో ఆన్లైన్ విద్య–బడుగు విద్యార్థుల అవస్థలు భవిష్యత్ కార్యాచరణ’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, కేంద్రకమిటీ సంఘం అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాజుల మాట్లాడారు. రాష్ట్రంలో 26 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్నారని వారికి ఏడాది కాలంగా మిడ్డే మీల్స్ ఇవ్వడంలేదని, ఆ డబ్బుతో విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు ఇప్పించవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. విద్యా సంస్థలు తెరవని పక్షంలో 24 గంటల దీక్ష, చలో హైదరాబాద్ అవసరమైతే సెక్రటేరియట్ ముట్టడి చేస్తామని జాజుల హెచ్చరించారు. -
తుది అంకానికి ఓబీసీ వర్గీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ ఆయా కులాల మధ్య రిజర్వేషన్లను దామాషా ప్రకారం పంచేందుకు వాటిని నాలుగు కేటగిరీలుగా ప్రతిపాదిస్తూ ముసాయిదా నివేదిక రూపొందించింది. ఆయా ప్రతిపాదనలను రాష్ట్రాలు, సంబంధిత భాగస్వాములతో చర్చించేందుకు సిద్ధమైంది. ఈ దిశగా మార్చి నెల నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 2,633 కులాలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తూ.. వరుసగా 2, 6, 9, 10 శాతం రిజర్వే షన్లను పంపిణీ చేస్తూ కమిషన్ ప్రతిపాదించి నట్టు సమాచారం. రిజర్వేషన్ ఫలాలు పొందని, అత్యంత వెనబడిన కులాలను మొదటి కేటగిరీలో పొందు పరిచినట్టు తెలుస్తోంది. నాలుగో కేటగిరీలో 97 కులాలు మాత్రమే ఉన్నప్పటికీ... జనాభా పరంగా చూస్తే సింహభాగం వారే ఉన్నారు. కాబట్టి 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లలో జనాభా ప్రాతిప దికన అత్యధికంగా 10% వారికే దక్కనుందని సమా చారం. 4వ కేటగిరీలో సామాజికంగా బలమైన, అత్యంత ప్రభావవంతమైన కులాలున్నాయి. గతం లోనూ ఈ కులాలే రిజర్వేషన్ల ఫలాలు అధికంగా పొందినప్పటికీ... జనాభా నిష్పత్తికి మించి వీరికి ప్రయోజనం కలిగిందనేది ఇతరుల అభ్యంతరం. మొదటి కేటగిరీలో 1,674 కులాలు, రెండో కేటగిరీలో 534 కులాలు, మూడో కేటగిరీలో 328, నాలుగో కేటగిరీలో 97 కులాలు పొందుపరిచినట్టు సమాచారం. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాలకు ప్రస్తుతం విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లలో మెజారిటీ భాగం కొన్ని కులాలకు మాత్రమే అందుతున్నాయని, ఓబీసీల్లో అత్యంత వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదంటూ బీసీ సంక్షేమ సంఘాల డిమాండ్లు, జాతీయ బీసీ కమిషన్ సిఫారసులు, స్థాయీ సంఘాల సిఫారసుల నేపథ్యంలో 2017 అక్టోబరు 2వ తేదీన ఈ కమిషన్ ఏర్పాటైంది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ అదే ఏడాది అక్టోబరు 10 నుంచి తన పని ప్రారంభించింది. ఈ కమిషన్ 12 వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు కేంద్ర మంత్రిమండలి ఈ కమిషన్ గడువు పొడిగించింది. ప్రస్తుతం 2021 జూలై 31కి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ కమిషన్ నాలుగు విధి విధానాల ఆధారంగా నివేదిక సమ ర్పించాల్సి ఉంటుంది. కేంద్ర జాబితాలో చేర్చిన ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాల పంపిణీలో అసమానతలు పరిశీలించడం, ఓబీసీ కులాల ఉప వర్గీకరణ కోసం శాస్త్రీయ విధానంలో నిబంధనలు రూపొందించడం, కేంద్ర జాబితాలో ఓబీసీలను ఉపకులాల వారీగా వర్గీకరించడం, కేంద్ర జాబితాలోని వివిధ ఎంట్రీలను అధ్యయనం చేసి అక్షర దోషాలు, పునరావృతులు, అస్పష్టతలు, లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడం.. తదితరæ నాలుగు విధివిధానాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ప్రవేశాల్లో... రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందని ఓబీసీ కులాలకు.. ఈ కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఓబీసీ జాబితాలో ఉన్న అటువంటి అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా కమిషన్ సిఫారసులు చేస్తుంది. సున్నితమైన అంశం... రాజకీయంగా ప్రాధాన్యత ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్లలో కొన్ని కులాలకే లబ్ధి చేకూరినట్టు కమిషన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఓబీసీలకు కేటాయించిన వాటిలో 97% మేర విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగాలు కేవలం 25% ఓబీసీ కులాలకే దక్కాయని, ఇందులో 24.95% ఉద్యోగాలు కేవలం 10 ఓబీసీ కులాలకే దక్కాయని, దాదాపు 983 కులాలకు (అంటే 37%) విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేకుండాపోయిందని కమిషన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది. 994 ఓబీసీ కులాలకు 2.68% మేర కోర్సుల్లో సీట్లు, ఉద్యోగాలు దక్కినట్టు సమాచారం. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ తనకు అప్పగించిన విధివిధానాల మేరకు ఆయా అసమానతలను తొలగించాల్సి ఉన్నందున.. ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలను అధికంగా పొందిన కులాలను చివరి కేటగిరీలో చేర్చాల్సి వస్తుందని అంచనా. దేశంలో రాజకీయా లపై కులాల ప్రభావం ఎక్కువ ఉంటున్నందున.. రిజర్వేషన్లు తగ్గితే అధిక ప్రాబల్యం ఉన్న కులాల నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయోనన్న చర్చ నడుస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన రిజ ర్వేషన్లు ఉండనున్నందున అలాంటి సమస్య తలె త్తదని, ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని వారికి లబ్ధి చేకూరుతుందని, తాము లేవనెత్తిన అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ‘సాక్షి’కి తెలిపారు. సమాచారాన్ని విశ్లేషించిన కమిషన్ 11 రాష్ట్రాల్లో ఇప్పటికే బీసీ వర్గీకరణ అమలవుతోంది. అయితే ఆ వర్గీకరణ రాష్ట్ర జాబితాలోని కులాలకు రాష్ట్రస్థాయిలో వర్తిస్తుంది. ఇప్పుడు ఈ జాతీయస్థాయి కమిషన్ కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ల పంపిణీకి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీసీ కులాల ఉప వర్గీకరణ చేపట్టిన అన్ని రాష్ట్రాలతో, రాష్ట్ర స్థాయి వెనుకబడిన తరగతుల కమిషన్లతో ఈ కమిషన్ చర్చించింది. ఉన్నత విద్య కోర్సుల్లో ఓబీసీ విద్యార్థుల ప్రవేశానికి సంబంధించిన సమాచా రాన్ని, ప్రభుత్వంలో భాగమైన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఓబీసీలకు ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కమిషన్ సేకరించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ఇప్పటివరకు రిజర్వేషన్ పంపిణీలో చోటు చేసుకున్న అసమానతలను విశ్లేషించింది. సంబంధిత సమాచారం భారీ పరిమాణంలో ఉన్నందున దానిని శాస్త్రీయంగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించేందుకు సమయం అవసరమైంది. అలాగే లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాల నుంచి సమాచారం రావడం ఆలస్యమైంది. వీటన్నింటినీ విశ్లేషించి, ముసాయిదాను రూపొందించిన కమిషన్ తన ప్రతిపాదనలపై వచ్చే నెల నుంచి రాష్ట్రాలు, ఓబీసీ కులాలు, సంబంధిత అంశంలో భాగస్వాములందరితో చర్చించనుంది. -
ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఆదివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి వినతిపత్రం సమరి్పంచారు. కోవిడ్–19 నేపథ్యంలో పలు ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, కోవిడ్‌తో పాటు ఇతర చికిత్సలకూ అనవసర పరీక్షలు నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. -
సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు
నెహ్రూనగర్(గుంటూరు)/చిలకలూరిపేట: రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలను గుర్తించి వాటికి అనుగుణంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, బీసీ కులాలన్నీ ఆయనకు రుణపడి ఉంటాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీల సమస్యలపై తాను వివిధ రాష్ట్రాల్లో పోరాడుతున్నానని, అయితే ఏపీలో బీసీల సమస్యలపై పోరాడేందుకు ఎలాంటి అవకాశం కలగట్లేదని, సంస్కరణవాది అయిన వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటమే అందుకు కారణమని అన్నారు. ఈ మేరకు శనివారం గుంటూరు, చిలకలూరిపేటల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీలపై చిత్తశుద్ధితో వ్యవహరించారని, ఈనాడు ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకేసి బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారని ప్రశంసించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ..ఇచి్చన మాటకు కట్టుబడి సీఎం జగన్ బీసీలకు 56 కార్పొరేషన్లు ఇవ్వడం గర్వకారణమన్నారు. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్పొరేషన్ చైర్మన్లకు జరిగిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజని అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, జోగి రమే‹Ù, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మద్దాళి గిరిధర్, మద్యపాన విమోచన సమితి అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, పలువురు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. -
అచ్చెన్నాయుడు లేఖతో సంబంధం లేదు
తెనాలి: ఈఎస్ఐ పరికరాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి ఆరోపణల కేసులో జైలులో ఉన్న మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు రాసిన లేఖతో బీసీలకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. హత్యానేరంలో జైలుకెళ్లిన మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విషయంలోనూ బీసీలకు సంబంధం లేదని తెలిపారు. బీసీ నేతలు ఏవైనా కేసుల్లో ఇరుక్కుంటే అవి స్వయంకృతాపరాధాలు మినహా బీసీ హక్కులు, ప్రయోజనాల రక్షణ కోసం చేసే త్యాగాలుగా బీసీలు భావించవద్దని పేర్కొన్నారు. -
జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
కర్నూలు (సెంట్రల్): బీసీలకు నిర్మాణాత్మక, రాజ్యాంగబద్ధమైన పదవులను కల్పించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం ఆయన కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా జనాభా ప్రకారం చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గతేడాది పార్లమెంట్లో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. దేశంలో 14 బీసీ పార్టీలు ఉన్నాయని, వాటికి రాని ఆలోచన వైఎస్సార్సీపీకి రావడం గొప్ప విషయమని అన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. -
అప్పులు బీసీలకు.. సంపద అగ్రవర్ణాలకా?
నాంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు కోత విధించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సంక్షేమ రంగంలో 48 శాతం కోత విధించడం బాధాకరమని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో బీసీలకు రూ.5,960 కోట్లు కేటాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2,672 కోట్లు మాత్రమే కేటాయించారని ధ్వజమెత్తారు. బడ్జెట్లో బీసీ సబ్‌ప్లాన్ ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరేళ్లలో రెండు లక్షల 20 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకువచ్చారని ఆరోపించారు. అప్పులు బీసీలకు, ఆర్థిక సంపద అగ్రవర్ణాలకా? అని నిలదీశారు. జోగు రామన్న ఏ పాపం చేశారని మంత్రివర్గంలోకి తీసుకోలేదు? సకల జనుల సమ్మెను నడిపిన స్వామిగౌడ్ ఎక్కడికి పోయారు? ఆత్మబలిదానం చేసుకున్న దాసోజు కుటుంబం ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. మంగళవారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో జాజుల మాట్లాడారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలను గవర్నర్లుగా నియమించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన బీసీ సంఘాల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటిస్తోందని అన్నారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉదయం 10 గంటలకు హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లకు ఆత్మీయ సత్కార అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ఎంబీసీ అధ్యక్షుడు బంగారు నర్సింహ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంచార జాతుల సంఘం అధ్యక్షులు పోల శ్రీనివాస్, వెంకటనారాయణ, విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షుడు బండి సాయన్న, వీర భద్రయ్య సంఘం అధ్యక్షులు వీరస్వామి, ప్రొఫెసర్ ఆలెదాసు జానయ్య, విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి రంగాచారి, దూదేకుల సంఘం అధ్యక్షుడు షేక్ సత్తార్ సాహెబ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీహరి యాదవ్, కురుమ సంఘం నాయకులు సదానందం, కనకల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఐకమత్యం పెరిగింది’ వెనుకబడిన తరగతుల్లో ఐకమత్యం వచ్చిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఐకమ త్యం పెరగడంతోనే మంత్రివర్గంలోని మం త్రులకు ఉద్వాసన పలకడానికి ప్రభుత్వం వెనుకడుగు వేసిందన్నారు. బీసీలపై చర్య తీసుకుంటే పీఠాలకే ఎసరు పెట్టినట్లు అవుతుందనే భయం పాలకవర్గంలో ఉందన్నారు. తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్రానికి రావడం కొత్త రాజకీయ నాందికి ఆరంభమని అన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గవర్నర్‌గా తెలంగాణకు రావడం అదృష్టంగా భావించాలని అన్నారు. -
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లకై ఉద్యమించాలి
హైదరాబాద్: బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని పార్టీలకతీతంగా బీసీలందరూ పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో ఆంధ్రపదేశ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీల సమావేశం ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకానమ్మ అధ్యక్షతన జరిగింది. ఆర్.కృష్ణ య్య మాట్లాడుతూ.. 71 ఏళ్ల స్వతంత్ర భార తంలో పాలకులు బీసీలను అభివృద్ధి చేయకుండా గొర్రెలు, బర్రెలు ఇచ్చి, అడుక్కుతినే బిక్షగాళ్లను చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రంలోగానీ ఇప్పటివరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీలేడని ఆవేదన వ్యక్తం చేశా రు. 545 మంది లోక్‌సభ సభ్యుల్లో 96 మంది మాత్రమే బీసీలు ఉన్నారని, తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు కేవలం 22 మందే ఉన్నారన్నారు. తెలంగాణలో 112 బీసీ కులాలు ఉండగా ఇంతవరకు 104 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, జి.శ్రీనివాసులు, రమ్యశ్రీ (సినీ నటీ) తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా, బద్వేల్‌కు చెందిన జి.శ్రీనివాసులుకు నియమాక పత్రాన్ని ఆర్.కృష్ణయ్య అందజేశారు. తెలంగాణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా అల్లి లక్ష్మి, సభ్యులుగా సుమన్‌బాబు, దేవి మంజిరాలను ఎన్నుకుంది. -
వసతి గృహాల్లో సమస్యలకు చెక్!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నుంచి హాస్టళ్లు పునఃప్రారంభం కానుండటం తో ఆలోపే అక్కడి సమస్యలను పరిష్కరిం చే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశా లు జారీ చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ వసతి గృహాలకు సెలవులు ఉన్నందున.. వీలైనన్ని ఎక్కువ హాస్టళ్లను సందర్శించాలని బీసీ సంక్షే మ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విజిట్‌లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమా లు, పరిశీలన తీరును వివరించారు. సందర్శన అనంతరం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌కు నివేదికలు ఇవ్వాలని, ప్రాధా న్యతలను బట్టి నిధులు విడుదల చేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యక్తిగత పరిశీలనకే ప్రాధాన్యత బీసీ హాస్టళ్ల పరిశీలన వ్యక్తిగతంగా చేపట్టాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితరాలను పరిశీలించాలి. ప్రస్తుతం హాస్టల్ కొనసాగుతున్న భవనం, నిర్మాణం తీరు, కరెంటు సరఫరా, బల్బులు, కరెంటు వైరింగ్, కిటికీలు, తలుపుల పరిస్థితి, హాస్టల్ పరిసరాల్లో చెత్త తొలగింపు, యూనిఫాం పంపిణీ, స్టాకు, పుస్తకాలు, కాపీల పంపిణీ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇటీవల బీసీ వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. వాటి వినియోగం, పనితీరు ఎలా ఉందనే దాన్ని పరిశీలించాలి. రాష్ట్రవ్యాప్తంగా 700 బీసీ హాస్టళ్లలో 634 వసతిగృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 362 హాస్టళ్లు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతుండగా.. మిగతా 272 హాస్ట ళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. హాస్టల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించేందుకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పించారు. నిర్ణీత ప్రొఫార్మాలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించి ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతుంది. -
ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఏపీ అభివృద్ధి: కృష్ణయ్య
సాక్షి, మైలవరం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఏప్రిల్ 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్‌కు ఓటేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మైలవరంలో కృష్ణయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో బిల్లు పెట్టకుండా చంద్రబాబు బీసీలను మోసం చేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టి ఐదుగురు ఎంపీలతో పోరాడిన వ్యక్తి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు ఏవైతే రిజర్వేషన్ బిల్లులు ఉన్నాయో, బీసీలకు కూడా ఆ ప్రకారమే ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన శాసనసభ్యులతో బీసీలకు ప్రైవేటు బిల్లు పెట్టేవిధంగా తీర్మానం చేశాడని ప్రశంసించారు. మా పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ కూడా బీసీల బిల్లు కోసం పోరాడిన దాఖలాలు లేవని విమర్శించారు. -
బీసీలను మోసం చేసిన కేసీఆర్
హైదరాబాద్: ఎంపీ టికెట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీసీలను మరోసారి మోసం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ఉద్యమంలో ముందు నుంచి ఉన్న బీసీలకు మొండి చేయి చూపి అగ్రకులాల వారికే పెద్ద పీట వేశారన్నారు. చిక్కడపల్లిలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఐదు శాతం ఉన్న రెడ్లకు ఐదు టికెట్లు కేటాయించి 56% ఉన్న బీసీలకు మూడు టికెట్లే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ అధిపతులు, పారిశ్రామికవేత్తలు, విద్యను వ్యాపారం చేసే వారికి, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్లకు టికెట్లు కేటాయించి, సామాజికవేత్తలను విస్మరించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ను తెలంగాణ రెడ్ల సమితిగా మార్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణ మలిఉద్యమకారులను విస్మరించటం సరికాదన్నారు. కేసీఆర్ సైతం పోటీ చేస్తే ఓడిపోయే హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించి అవమానించారన్నారు. రాజకీయంగా బీసీలను అణగదొక్కేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, దీనికి బీసీలంతా ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్.దుర్గయ్య, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీలకు 50% టికెట్లు ఇవ్వాలి’
హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలోని బీసీలకు 50% టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని బీసీభవన్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీసీ నాయకుల కోర్ కమిటీ సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తామని అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. గతంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కృష్ణ, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో బీసీలకు బిచ్చమేసినట్లు టీడీపీ అతితక్కువ ప్రాతినిథ్యం కల్పించిందని విమర్శించారు. పార్టీలు బీసీల ను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాయన్నారు.