కాపులను బీసీల్లో చేర్చడం అసాధ్యం
♦ బీసీలకు అన్యాయం జరగకుండా ఎలా చేరుస్తారు?
♦ నియంతృత్వ వైఖరి ప్రదర్శిస్తే పాలకుల పీఠాలు కదుల్చుతాం
♦ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
♦ విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, విజయవాడ: వెనుకబడిన తరగతుల్లో(బీసీ) కాపులను చేర్చితే బీసీలు నష్టపోతారని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం భవిష్యత్తు కార్యాచరణపై చర్చిం చేందుకు మంగళవారం విజయవాడలో బీసీ సం క్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... రిజర్వేషన్లు ప్రకటించే విషయంలో మండల్ కమిషన్, బీసీ కమిషన్, సుప్రీంకోర్టు కొన్ని పారామీటర్లను పెట్టాయని గుర్తుచేశారు. వాటిని పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం కాపులను బీసీల్లో కలిపితే చట్టప్రకారం చెల్లవని స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చడం ఆచరణలో సాధ్యం కాదన్నారు.
ఏపీలోనూ జనాభా సర్వే జరగాలి
‘‘విద్యారంగంలో ఎ, బి, సి,డి గ్రూపులు ఉండడం వల్ల బీసీలకు ఇబ్బంది ఉండదు. స్థానిక సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూపులు లేకపోవడం వల్ల అక్కడ కాపులే బీసీ ట్యాగ్ మీద రిజర్వేషన్లు పొందుతారు. బీసీల గొంతు నొక్కి అయినా సరే కాపులను బీసీల్లో కలపాలని ప్రభుత్వం చూస్తోంది. దీన్ని మేము కచ్చితంగా అడ్డుకుంటాం. ఏకపక్షంగా, నియంతృత్వ వైఖరి ప్రదర్శిస్తే పాలకుల పీఠాలను కదల్చడానికీ వెనుకాడబోం. తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జనాభా సర్వే జరగాలి. అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారు. వారి అభ్యున్నతి కోసం ప్యాకేజీలు ఇవ్వాలే తప్ప బీసీ రిజర్వేషన్లను తీసుకోవడం సరైంది కాదు. బీసీల్లో కాపులు చేరకుండా అడ్డుకునేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం’’ అని కృష్ణయ్య తేల్చిచెప్పారు.
న్యాయం కోసం పోరాడుతాం
కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ ఇప్పటికే పోరాటం చేస్తున్నామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, దాన్ని పరిశీలించిన తర్వాత బీసీల జేఏసీ ఏర్పాటు చేసి, బీసీలకు న్యాయం చేసేందుకు పోరాడతామని తెలిపారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ... బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు ఏవిధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. త్వరలోనే బీసీల్లోని అన్ని కులాలతో బీసీ సింహగర్జన నిర్వహించాలని విస్తృత స్థాయి సమావేశంలో కొందరు సూచించారు.
ఆత్మత్యాగానికైనా సిద్ధం
బీసీ సమావేశంలో ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తుండగా గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన మురళీగౌడ్(35) లేచి ‘బీసీల ఐక్యత వర్థిలాలి’ అంటూ నినాదాలు చేస్తూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తలపై పోసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పక్కనే ఉన్న మిగిలిన నేతలు అతడిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. కాపులను బీసీల్లో చేర్చుకుండా ఉండేందుకు తాను ఆత్మత్యాగం చేయడానికైనా వెనుకాడబోనని మురళీగౌడ్ హెచ్చరించాడు.
మద్దతు ఇవ్వండి: కాగా, కాపులను బీసీల్లో చేర్చడానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కృష్ణా జిల్లా కాపునాడు అధ్యక్షుడు బేటు రామ్మోహన్, ఇతర కాపు నేతలు.. ఆర్.కృష్ణయ్యకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కాపు నాయకులతో బీసీ నేతలు ఘర్షణకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను శాంతపరిచి అక్కడ నుంచి పంపించివేశారు.