
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. స్థానిక బాలాజీచెరువు సెంటర్ సమీపంలోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘ భవనంలో ఆదివారం ఉదయం జిల్లా బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. సంఘ గౌరవాధ్యక్షుడు రాయుడు చంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీల సంక్షేమానికి డిమాండ్లను సాధించుకునే దిశగా ముందుకు సాగాలని నిర్ణయించారు.
సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ చట్టాన్ని తీసుకురావాలని, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, రూ.20 వేల కోట్లతో ప్రత్యేక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, నిబంధనలను తొలగించి ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ప్రతి నియోజకవర్గంలో బీసీలకు ఒక రెసిడెన్సియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సంసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు రాజకీయ పాలన, ఆర్థిక, సామాజిక రంగాలలో అన్యాయం జరుగుతోందన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు పంపన రామకృష్ణ, మట్టపర్తి సూర్యారావు, చప్పిడి వెంకటేశ్వురరావు, సీతారత్నం, పితాని శ్రీనివాసరావు, పెంకె గోవిందరావు, మట్టపర్తి జితేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కన్వీనర్‌గా పంపన
జిల్లా చేనేత కులాల సమాఖ్య, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పంపన రామకృష్ణ జిల్లా బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నుంచి వచ్చిన నియామక ఉత్తర్వులను సంఘ రాష్ట్ర, జిల్లా నాయకులు ఆదివారం కాకినాడలో జరిగిన సమావేశంలో రామకృష్ణకు అందజేశారు. పంపన మాట్లాడుతూ జిల్లాలో బీసీ కులాలన్నింటిని ఏకతాటిపైకి తేవడానికి కార్యాచరణ రూపొందిస్తానన్నారు. అనంతరం రామకృష్ణను సంఘనాయకులు ఘనంగా సన్మానించారు.