సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లో సమాన వాటా ఇవ్వకుండా అన్యాయం జరు గుతోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. బీసీలకు న్యాయం చేసేందుకు ప్రధానమంత్రి హోదాలో జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ , లాల్ కృష్ణ, డా.మారేష్, డా.పద్మలత, రమేశ్ ప్రధానమంత్రితో కలిసి చర్చలు జరిపారు.
సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో బీసీలకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రధానికి వివరించి ఒక వినతిపత్రాన్ని అందించారు. జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులవృత్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. బీసీలకు ఏ రంగంలో కూడా ఇంతవరకు జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని, విద్యా,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదని ప్రధానికి వివరించారు.
అందుకోసం బీసీలకు రావాల్సిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరగాలని ఆర్.కృష్ణయ్య కోరారు. అదేవిధంగా జనాభా గణనలో కులాల వారీగా బీసీ జనాభా గణన చేయాలని బీసీ నేతల బృందం ప్రధానిని కోరింది. బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని ప్రధానమంత్రి చెప్పారని సమావేశం అనంతరం ఆర్.కృష్ణయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment