సాక్షి, అమరావతి: సమాజంలో అన్ని విధాలుగా వెనుకబడిన తరగతుల వారికి ఈ ప్రభుత్వంలోనే సరైన న్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. డబ్బు, నోరు, శక్తి, గుర్తింపు లేనివాళ్లకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అగ్రపీఠం వేసిన ఏకైక వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. జగన్ పాలనలో బడుగుల బతుకులు మారాయని, ఆయన గెలుపుతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఉద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్‌లో 139 బీసీ కులాల ప్రతినిధులతో గురువారం బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తన 45 ఏళ్ల బీసీ ఉద్యమ ప్రస్థానంలో ఎంతో మంది నాయకులను చూశాననీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల మేలు కోరే జగన్ వంటి నాయకుడిని చూడలేదనీ పేర్కొన్నారు.
ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సంఘ సంస్కర్తగా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, సామాజిక న్యాయం అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. నాలుగున్నరేళ్ల ఆయన పాలనలోనే వాస్తవ రాజ్యాధికార బదిలీ జరిగిందని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనూ జరగనంత సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని చెప్పారు. సామాజిక న్యాయం కోసం, సమ సమాజం నెలకొల్పే దిశగా జగన్ పాలన కొనసాగుతున్నందున బీసీలంతా ఆయనకు మద్దతుగా నిలవాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.
బీసీలు బాగుంటే చంద్రబాబుకు కడుపుమంట
సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని పేదవర్గాల కడుపునిండుతుంటే చంద్రబాబు వంటి పెత్తందార్ల కడుపు మండుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ’ఖబడ్దార్ ప్రతిపక్షాలు.. మీ మోసాలు మాకు తెలిశాయి’ అంటూ కృష్ణయ్య హెచ్చరించారు. అమ్మఒడి, విద్యాదీవెన వంటి అనేక పథకాలు పెట్టి బీసీల బిడ్డలను సీఎం జగన్ చదివిస్తున్నారనీ, విదేశీ విద్య వంటి ప్రోత్సాహంతో బీసీల పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారనీ, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి బీసీలు ఇప్పుడు కార్లు, విమానాల్లో తిరుగుతున్నారని చెప్పారు.
పొరుగున ఉన్న ఒడిశా, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లి బీసీ బతుకులు ఎలా ఉన్నాయో చూస్తే ఏపీలో బీసీల అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో తెలుస్తుందని చెప్పారు. ఇటీవల కర్ణాటకలోని బళ్లారి, తమిళనాడులోని తెలుగు వారుండే ప్రాంతంలో ఓ సమావేశానికి తాను వెళ్లినపుడు అమ్మ ఒడి, పింఛన్, విద్యా కానుక, ఆరోగ్యశ్రీ వంటి పథకాల కోసం తమను కూడా ఏపీలో కలిపితే బాగున్ను అని అక్కడివారు తనతో అన్నట్టు ఉదహరించారు. రాష్ట్రాన్ని 14 ఏళ్ళు పాలించిన చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల మోసపు మాటలు ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment