వైఎస్ జగన్ మంత్రివర్గంలో వారికి 17 మంత్రి పదవులు
బాబు కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 12 మంత్రి పదవులే
సొంత సామాజిక వర్గానికే బాబు ప్రాధాన్యం.. రెడ్డి వర్గానికి నిరాశే..
కమ్మకు 5, కాపులకు 4,రెడ్డి వర్గానికి కేవలం మూడే
సాక్షి, అమరావతి: జనాభాపరంగా అత్యధికంగా ఉన్న బీసీలకు 24 మందితో కొలువుదీరిన సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో కనీసం సగం కూడా స్థానం దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీసీలకు కేవలం 8 మంత్రి పదవులు ఇవ్వగా అతి తక్కువ జనాభా ఉన్న సీఎం చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి మాత్రం ఐదు పదవులు (బాబుతో కలిపి) దక్కడం గమనార్హం. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన రెడ్డి సామాజిక వర్గానికి సైతం చంద్రబాబు నిరాశే మిగిల్చారు.
వైఎస్సార్ సీపీ పాలనలో ఒక్క బీసీలకే పది మంత్రి పదవులు ఇవ్వగా, ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు ఒకటి, మైనారిటీలకు ఒక మంత్రి పదవి చొప్పున దక్కాయి. మొత్తం మంత్రివర్గంలో వైఎస్ జగన్ ఆయా వర్గాలకు ఇచ్చిన పదవుల శాతం 68 కాగా ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో వారికిచ్చిన పదవులు 45 శాతం మాత్రమే కావడం గమనార్హం.
» సీఎం చంద్రబాబు మంత్రి పదవుల్లో బీసీలకు 8, కాపులకు 4, రెడ్డి వర్గానికి కేవలం మూడు మాత్రమే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారు. ఆయా వర్గాలకు ఆయన ఏకంగా 17 మంత్రి పదవులు ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 12 పదవులు మాత్రమే ఇచ్చారు.
» వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు ఒక్కో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో కాపు వర్గానికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ జగన్ హయాంలో ఆయనతో కలిపి ఐదు పదవులు దక్కగా చంద్రబాబు ప్రభుత్వంలో ముగ్గురికే అవకాశం లభించింది.
» వైఎస్ జగన్ ప్రతి అడుగులో సామాజిక న్యాయాన్ని పాటించారు. మంత్రివర్గం నుంచి స్థానిక సంస్థలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు లాంటి అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతానికిపైగా ఇచ్చి రాజకీయ సాధికారతకు బాటలు వేశారు. చంద్రబాబు తొలి అడుగులోనే సొంత సామాజికవర్గంపై మక్కువ ప్రదర్శించి దళిత, మైనారిటీ, బీసీ వర్గాలను చిన్నచూపు చూశారు.
Comments
Please login to add a commentAdd a comment