సామాజిక న్యాయంలో మేటి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
అభిప్రాయం
తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రకటించిన లోక్‌సభ స్థానాల్లో 11 బీసీలకు కేటాయించారు; అలాగే 59 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 100 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇంతటి ప్రాతినిధ్యం వారికి లభించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధికారంలో, బడ్జెటులో, సంపదలో, గౌరవంలో, విద్యా, ఉద్యోగాలలో జనాభా కంటే ఎక్కువ వాటా యిచ్చి సామాజిక న్యాయం కల్పించిన చరిత్ర పురుషుడు జగన్. అంతేగాకుండా, వివిధ విద్యా పథకాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేస్తూ, వారు శాశ్వతంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారు. ఇది జగన్‌కు జనం పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని చాటుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత 71 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లాగా ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోలేదు. ఆ కులాల అభివృద్ధిలో జగన్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాశారు. వైసీపీ రెండేళ్ల క్రితమే రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వే షన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టి, దీనికి 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడింది. విశేషం ఏమిటంటే, గత 75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో ఈ బిల్లు పెట్టలేదు. చివరకు బీసీ పార్టీలుగా చలామణి అవుతున్న డీఎంకే, అన్నా డీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, అప్నా దళ్, జనతాదళ్ కూడా ఈ బిల్లు పెట్ట లేదు.
చారిత్రక ఘట్టం
ఇటీవల 18 ఎమ్మెల్సీ పదవులు ఇస్తే, అందులో 11 సీట్లు బీసీలకు కేటాయిస్తే దేశంలోని బీసీలందరూ ఆశ్చర్య పోయారు. గత ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం)... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని జగన్ ఆవిష్కరించారు. అందులో బీసీ, మెనారిటీలకు 11 పదవులు ఇచ్చారు.
ఐదుగురికి డిప్యుటీ సీఎం పద వులు ఇస్తే... నాలుగు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చారు. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం ఇదే ప్రథమం. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలను వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పను లలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు.
56 బీసీ కులాల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్‌లలో మొత్తం 100 శాతం పోస్టులు బీసీలకు కేటాయించారు. 193 కార్పొరేషన్లలో బీసీలకు 109 కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగింది. నామినే టెడ్ పదవులలో 50 శాతానికి చట్టం చేయడమే కాదు; అమలులో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి ఈ వర్గాలలో అచంచల విశ్వాసం చూరగొన్నారు. దీని మూలంగా ఈ కులాలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగాయి.
తరతరాలుగా పేరుకుపోయిన భావదాస్యం పోయి, నాయకత్వ లక్షణాలు పెరిగాయి. వేష భాషలు, నడవడి, సంస్కృతి మూలంగా సమగ్రంగా మారి ఆధునీకరణ చెందుతారు.
రాజ్యసభలో మొత్తం 9 మంది వైసీపీ సభ్యులుంటే... అందులో నలుగురు బీసీలు, ఒకరు ఎస్సీ. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు.
మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజుకూ, మండలి డిప్యుటీ చైర్‌పర్సన్‌గా మైనారిటీ మహిళ జకియా ఖానంకు అవకాశం కల్పించారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి సుప్రీంకోర్టు తగ్గిస్తే, పార్టీ పరంగా అదనంగా 20 శాతం కలిపి, మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు జగన్. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలవగా, అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు.
మండల పరిషత్ ఎన్నికల్లో, వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే, అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు కేటాయించారు(67 శాతం). 13 మున్సిపల్ కార్పొరేషన్లలో, 92 శాతం మేయర్ పదవులు ఈ వర్గాల వారికే ఇచ్చారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 60 శాతం వీరికే కేటాయించారు. గ్రామ – వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపు 1.30 లక్షలు. వీటిలో 83 శాతం ఈ వర్గాలవారే. ఈ 57 నెలల్లోనే మరో 2.70 లక్షల వలంటీర్ ఉద్యోగాలు, మిగిలిన ఉద్యోగాలు కలుపుకొని 6.03 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. ఇందులోనూ 75 శాతం వాటా ఈ వర్గాలదే.
దీర్ఘ దృష్టి
విద్య ద్వారానే బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయనీ, వారికి గౌరవం పెరుగుతుందనీ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తు న్నారు జగన్. అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. అమ్మఒడి పథకం కింద ఒకటి నుంచి పదవ తరగతి వరకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. దీని వలన ప్రతి ఒక్కరు చదువుకుంటు న్నారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం 20 వేల రూపాయల స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ తదితర ఉన్నత చదువులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను ఇచ్చేటట్లు జీవోలు జారీ చేశారు.
పాలకులు ఓట్లు వస్తాయనే ఆశతో జనాకర్షక పథకాలు పెడతారు. దీర్ఘకాలంలో సమాజ శ్రేయస్సు ఎలా సాధ్యమవుతుందని ఆలోచించరు. కానీ జగన్ వివిద విద్యా పథకాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేస్తూ, వారు శాశ్వతంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ముందు చూపుతో, విజన్‌తో ఈ పథకాలను ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం.
ఇది జగన్‌కు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని చాటుతుంది. ఉన్నత విద్య వలన జ్ఞాన సమాజం ఏర్పడుతుంది. సమాజంలో ప్రతి పౌరుడు సభ్యతతో, సంస్కారంతో, ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తాడు. దీని మూలంగా వైద్యం, ఆరోగ్యంపై పెట్టే బడ్జెట్ తగ్గుతుంది. శాంతిభద్రతలు కూడా చక్కగా ఉండటంతో పోలీసు శాఖపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి.
ఒక తరపు పెట్టుబడి
ఇంజినీరింగ్, ఇతర పీజీ కోర్సులు, మెడిసిన్ చదివేవారు విదేశా లకు వెళ్లి, ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఆఫ్రికా, యూరోపియన్, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం లేదా ఉపాధి పొందుతున్నారు. దీని మూలంగా దేశానికి, రాష్ట్రానికి విదేశ మారక ద్రవ్యం లభిస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిస్తుంది. చదువు ద్వారా పొందిన జ్ఞానంతో ఆధునిక వ్యవసాయం చేస్తే అధిక ఉత్పత్తి సాధించడానికి వీలు కలుగుతుంది. దీనిమూలంగా ఆ యా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. సమాజ కోణంలో చూస్తే, ఒకసారి ఒక కుటుంబం ఉన్నత చదువులు చదివితే, సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి.
ఆ కుటుంబం ప్రభుత్వ రాయి తీల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఆదాయం పెరగడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సబ్సిడీ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. పదేళ్లలో 40 శాతం, మరో పదేళ్లలో మరో 50 శాతం, మొత్తంగా 20 ఏళ్లలో 90 శాతం మంది సబ్సిడీ పథకాలు వద్దనే స్థాయికి చేరిపోతారు. వీటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బడ్జెట్‌లో 90 శాతం తగ్గిపోతుంది. ఒక తరంపై ఖర్చుపెడితే రెండవ తరానికి ఈ విద్యా పథకం స్కీముల అవసరం ఉండదు. పేదరికం ఉండదు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది.
ఆర్. కృష్ణయ్య
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ); జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ‘ 90000 09164
Comments
Please login to add a commentAdd a comment