సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ సంఘాల పక్షాన తమకు మద్దతివ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, మాజీ ఎంపీ వి.హనుమంతరావు శనివారం సాయంత్రం విద్యానగర్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వెళ్లి ఆర్. కృష్ణయ్యను కలిశారు.
బీసీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, బీసీల కులగణన చేపట్టాలన్న డిమాండ్‌కు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారని వారు గుర్తు చేసి.. తమకు సంఘీభావం తెలపాలని కృష్ణయ్యను కోరారు.
ఇందుకు స్పందించిన ఆయన బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ నేతల ముందుంచి వాటిని పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీసీల మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగానే కృష్ణయ్య ఆఫీసుకి, ఇంటికి ఠాక్రే, వీహెచ్ వెళ్లారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
రాజకీయాలకు సంబంధం లేదు: కృష్ణయ్య
ఠాక్రే, వీహెచ్‌లతో సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని, బీసీ డిమాండ్లపైనే చర్చ జరిగిందని చెప్పారు. బీసీ సంఘం అధ్యక్షుడిగా మాత్రమే వారు తనను కలిశారని స్పష్టం చేశారు. బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని కోరానని, అందుకు కాంగ్రెస్ నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ పక్షాన బీసీ బిల్లు పెట్టి 14 పార్టీల మద్దతు కూడగట్టామని వెల్లడించారు.
బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి స్పష్టం: ఠాక్రే
ఆర్.కృష్ణయ్యతో చర్చల తర్వాత ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అందుకే కృష్ణయ్యతో మాట్లాడేందుకు తాము వచ్చామన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. కాగా, బీసీ సంఘం కార్యాలయంపైనే ఉన్న కృష్ణయ్య నివాసంలోకి ఠాక్రే, వీహెచ్‌లు వెళ్లి కొద్దిసేపు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment