సాక్షి, అమరావతి : కుల గణన చేపట్టాలన్న బీసీ సంఘాల న్యాయమైన డిమాండ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైకొట్టింది. వెనుకబడిన వర్గాల ఆశల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. వీరి న్యాయమైన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సీఎం వారికి నైతిక మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఈ తాజా నిర్ణయంపట్ల బీసీ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్త జనాభా లెక్కల సేకరణలో బీసీ కులం కాలమ్ చేర్చి కుల గణన చేపట్టాలంటూ కేంద్రాన్ని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది.
పైగా ఇప్పుడు రాష్ట్ర పరిధిలో కుల గణనకు సన్నద్ధమైంది. దీనిపై అధ్యయనానికి రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం వెల్లడించారు. త్వరలో మంత్రి వేణు నేతృత్వంలో కమిటీని కూడా ప్రభుత్వం ప్రకటించనుంది.
ఇప్పటికే బీసీ కుల గణనకు ముందుకొచ్చిన బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం రాష్ట్రంలో బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుంది. తద్వారా జనాభా లెక్కల సేకరణలో కులం కాలమ్ చేర్పి కుల గణన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
కుల జనగణనతో ఎంతో మేలు..
నిజానికి.. దేశ జనాభాలో 52శాతం కంటే అధికంగా ఉన్న ఓబీసీల లెక్కలు తేలాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. ప్రస్తుతం కొన్ని బీజేపీ మిత్రపక్షాలతో సహా అనేక రాజకీయ పార్టీలు ఓబీసీ జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీని సైతం ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానం ప్రకారం కులాల వారీగా జనాభా గణనను చేపట్టలేమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పలుమార్లు ప్రకటించింది.
కులాల వారీ లెక్కలు తేలితే జనాభా ప్రాతిపదికన (దామాషా ప్రకారం) వారికి నిధులు, విద్య, ఉద్యోగం, పదవులు రిజర్వేషన్ ప్రకారం దక్కుతాయని, తద్వారా ఆయా కులాలకు ఎంతో మేలు జరుగుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. నామి¯óట్ పదవులు, బడ్జెట్ కేటాయింపులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సైతం జనాభా వారీగా అందించి సామాజిక న్యాయం చేయవచ్చన్నది వాటి వాదన.
20 ఏళ్లుగా ఉద్యమాలు.. సీఎంకు కృతజ్ఞతలు
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కలు–2022లో కులం కాలమ్ ఏర్పాటుచేసి బీసీ జనాభా లెక్కలు తేల్చాలని ఇటీవల జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాం. కోవిడ్‌తో ఇప్పటికే ఆలస్యమైన జనాభా లెక్కల సేకరణ ఈ ఏడాది చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ అంటూ అనేక సంఘాలతో కలిసి ఢిల్లీలో ధర్నాలు చేశాం. 20 ఏళ్లుగా చేస్తున్న ఈ డిమాండ్‌ను ఏ జాతీయ పార్టీ పట్టించుకోలేదు. కానీ, ఏపీలో చేపట్టేందుకు నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు.
– ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
ఇది చరిత్రాత్మకం అవుతుంది
కులాల వారీ జనాభా గణన చరిత్రాత్మకం అవుతుంది. అది ఓబీసీల్లోని పేదలకు వరంగా మారుతుంది. ఓబీసీ జనాభాను లెక్కించడంవల్ల ప్రభుత్వ పథకాలను ఇంకా సమర్థంగా అమలుచేయవచ్చు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీసీ బాధలను అర్థం చేసుకుని రాష్ట్రంలో కుల గణనకు సీఎం వైఎస్ జగన్ ముందుకురావడం అభినందనీయం. దీని ద్వారా తాను బీసీల పక్షపాతినని ఆయన మరోసారి నిరూపించుకున్నారు.
– కేశన శంకరరావు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం
Comments
Please login to add a commentAdd a comment