సామాజిక న్యాయమే పాలన అజెండా | R krishnaiah Article YSRCP Govt Social Justice CM YS Jagan | Sakshi
Sakshi News home page

సామాజిక న్యాయమే పాలన అజెండా

Published Sat, Jul 9 2022 9:51 AM | Last Updated on Sat, Jul 9 2022 9:51 AM

R krishnaiah Article YSRCP Govt Social Justice CM YS Jagan  - Sakshi

అభివృద్ధి, రాజ్యాధికారం అట్టడుగు వర్గాలకు బదిలీ కావడం రాజ్యాంగ నిర్మాతల లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్ల పాలనలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 75 ఏళ్ల స్వతంత్ర భారత్‌ కనీ వినీ ఎరుగని ఘట్టాలకు నాంది పలికింది. విప్లవాత్మకమైన విధానాల ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడమే అజెండాగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సాధికారతే లక్ష్యమని స్పష్టంగా కనిపిస్తోంది. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం వెనుకా ఉద్దేశం ఇదే. వైసీపీ ప్లీనరీ జరుగుతున్న నేపథ్యంలో, ఈ దిశగా వైసీపీ ప్రభుత్వ కృషిని తలుచుకోవడం ఎంతైనా సముచితం.

బలహీన వర్గాలు పాలితులుగా కాదు, పాల కులుగా ఉండాలన్నదే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంతి వైఎస్‌ జగన్‌ లక్ష్యం. ఆ దిశలోనే ఈ మూడేళ్లలో ప్రభుత్వ పాలన కొనసాగింది. సీఎం విశాల దృక్పథం వల్ల రాష్ట్రంలో వాస్తవ రాజ్యాధికార బదిలీ జరిగింది. సంక్షేమ రంగంతో పాటు, సామాజిక న్యాయం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యాలూ, చేసిన పనులూ ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత సామాజిక న్యాయం జగన్‌  వల్ల, జగన్‌ చేత పేద వర్గాలకు జరిగింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలలో కుడా పేద కులాలకు ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం జరగలేదు. అధికారంలో, సంపదలో, సామాజిక గౌరవంలో, విద్యలో... జనాభా ప్రకారం ఎవరి వాటా వారికి ఇచ్చిన దేశంలోనే మొదటి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి.  ఆర్థికంగా, రాజకీయ సాధికారత పరంగా, సామాజిక హోదా పరంగా, విద్యా పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది.

సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్‌ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్‌రాం, మౌలానా ఆజాద్, కొమురం భీమ్‌ కోరు కున్న సమాజం దిశగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. కేబినెట్‌ కూర్పు నుంచి కార్పొరేషన్, నామినేటెడ్‌ పదవులు, రాజ్యసభ సభ్యత్వాల వరకూ... పదవులు ఏవైనా అన్నింటా ఒకటే సూత్రం: అదే సోషల్‌ జస్టిస్‌. తన కేబినెట్‌లో దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌. శాసన సభ స్పీకర్‌ పదవిని బీసీ వర్గానికీ, శాసన మండలి ఛైర్మన్‌ ఎస్సీ వర్గానికీ ఇచ్చిన నాయకుడు కూడా ఆయనే.

పార్లమెంటులో రెండేళ్ల క్రితం బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాసింది వైసీపీ. దీనికి మద్దతుగా 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ పార్టీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. విశేషం ఏమిటంటే, గత 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్ల మెంటులో బిల్లు పెట్టలేదు. చివరకు బీసీ పార్టీలుగా చలామణీ అవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, అప్నా దళ్, జనతాదళ్‌ లాంటి పార్టీలు కూడా బీసీ బిల్లు పెట్ట లేదు. జగన్‌కు బీసీల చరిత్రలో శాశ్వత స్థానం ఉంటుంది.

నామినేటెడ్‌ పోస్టులలో 50 శాతం స్థానాలు వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్య మంత్రులకు వైసీపీ ప్రభుత్వం సవాల్‌ విసిరింది. ఏపీలో ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్‌ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్‌ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులలో, డైరెక్టర్‌ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అందులోని చైర్మన్, డైరెక్టర్‌ పదవులన్నింటినీ (684) ఆయా కులాల వారితోనే భర్తీ చేశారు.

193 కార్పొరేషన్లలో 109 కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు బీసీలకే దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగింది. మొత్తం 58 శాతం చైర్మన్‌ పదవులు బీసీలకే దక్కాయన్నమాట. దీని మూలంగా ఆయా కులాల నాయకత్వం పెరిగింది. ఈ కులాలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతోంది. ఆ కులాలలో తరతరాలుగా పేరుకుపోయిన భావ దాస్యం, బానిస ఆలోచనా విధానం పోయి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నామినేటెడ్‌ పదవులలో 50 శాతం బలహీన వర్గాలకు ఇవ్వాలని చట్టం చేయడమే కాదు, అమలులో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి ఈ వర్గాలలో అచంచల విశ్వాసం చూరగొన్నారు. శాశ్వత ప్రాతి పదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ మరో చరిత్రాత్మకమైంది. 25 మంది సభ్యుల మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇవ్వడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని జగన్‌ ఆవిష్క రించారు. అందులో బీసీ, మైనారిటీలకు 11 పదవులు ఇచ్చారు. ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే... నాలుగింటిని (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చారు. దేశ చరిత్రలో రాష్ట్ర హోం మంత్రిగా ఎస్సీ మహిళను రెండోసారీ నియమించడం ఇదే ప్రథమం. రాజ్యసభలో మొత్తం 9 మంది వైసీపీ సభ్యులు ఉంటే... అందులో మెజారిటీ సభ్యులు(ఐదుగురు) బీసీలే. ఇటీవల నాలుగు ఖాళీలు ఏర్పడితే... అందులో రెండు బీసీలకే!

శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌ రాజు, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనారిటీ మహిళ జకియా ఖానమ్‌కు అవకాశం కల్పించారు. మండ లిలో వైసీపీకి 32 మంది సభ్యులు ఉంటే, 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలవారే. అలాగే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతంకు తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే... దానిని పార్టీ పరంగా అదనంగా 20 శాతం పెంచి మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు అవకాశం ఇచ్చింది వైసీపీ. ఇది జగన్‌కు బీసీల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలువగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలకే కేటాయించారు. మండల పరిషత్‌ ఎన్నికల్లో... 648 మండలా లకుగానూ వైసీపీ 635 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను గెలిచింది. అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు. 

13 మున్సిపల్‌ కార్పొరేషన్లలో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఏడు మేయర్‌ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తం మేయర్‌ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సి పాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైసీïపీ రికార్డు స్థాయిలో గెలవగా... చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 73 శాతం ఇచ్చి ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో 196 వ్యవ సాయ మార్కెటింగ్‌ కమిటీ(ఏఎంసీ) చైర్మన్‌ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చారు..

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపు 1.30 లక్షలు. వీటిలో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలకే. ఈ 29 నెలల్లోనే ఇచ్చిన 2.70 లక్షల వలంటీర్‌ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 6.03 లక్షల మందికి ఉద్యో గాలు కొత్తగా వచ్చాయి. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కనీసం 75 శాతానికి పైగా ఉద్యోగాలు ఇచ్చారు.

‘జగనన్న అమ్మ ఒడి’, ‘వైఎస్సార్‌ రైతు భరోసా’, ‘వైఎస్సార్‌ చేయూత’, ‘వైఎస్సార్‌ ఆసరా’, ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’, ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ వంటి పథకాల ద్వారా చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల జరిగిన మొత్తం లబ్ధి రూ. 1,87,916.46 కోట్లు. ఇందులో బీసీలకు డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి రూ. 90,415.92 కోట్లు అందింది. అంటే దాదాపుగా సగం లబ్ధి బీసీలకే చేకూరింది. ఇలా అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయపరంగా వైసీపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది.

ఆర్‌. కృష్ణయ్య 
వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు ‘ మొబైల్‌: 90000 09164

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement