BC castes list
-
బీసీ కుల గణనకు వైఎస్ జగన్ సర్కార్ జై
సాక్షి, అమరావతి : కుల గణన చేపట్టాలన్న బీసీ సంఘాల న్యాయమైన డిమాండ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైకొట్టింది. వెనుకబడిన వర్గాల ఆశల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. వీరి న్యాయమైన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సీఎం వారికి నైతిక మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ తాజా నిర్ణయంపట్ల బీసీ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్త జనాభా లెక్కల సేకరణలో బీసీ కులం కాలమ్ చేర్చి కుల గణన చేపట్టాలంటూ కేంద్రాన్ని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది. పైగా ఇప్పుడు రాష్ట్ర పరిధిలో కుల గణనకు సన్నద్ధమైంది. దీనిపై అధ్యయనానికి రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం వెల్లడించారు. త్వరలో మంత్రి వేణు నేతృత్వంలో కమిటీని కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే బీసీ కుల గణనకు ముందుకొచ్చిన బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం రాష్ట్రంలో బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుంది. తద్వారా జనాభా లెక్కల సేకరణలో కులం కాలమ్ చేర్పి కుల గణన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కుల జనగణనతో ఎంతో మేలు.. నిజానికి.. దేశ జనాభాలో 52శాతం కంటే అధికంగా ఉన్న ఓబీసీల లెక్కలు తేలాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. ప్రస్తుతం కొన్ని బీజేపీ మిత్రపక్షాలతో సహా అనేక రాజకీయ పార్టీలు ఓబీసీ జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీని సైతం ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానం ప్రకారం కులాల వారీగా జనాభా గణనను చేపట్టలేమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పలుమార్లు ప్రకటించింది. కులాల వారీ లెక్కలు తేలితే జనాభా ప్రాతిపదికన (దామాషా ప్రకారం) వారికి నిధులు, విద్య, ఉద్యోగం, పదవులు రిజర్వేషన్ ప్రకారం దక్కుతాయని, తద్వారా ఆయా కులాలకు ఎంతో మేలు జరుగుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. నామి¯óట్ పదవులు, బడ్జెట్ కేటాయింపులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సైతం జనాభా వారీగా అందించి సామాజిక న్యాయం చేయవచ్చన్నది వాటి వాదన. 20 ఏళ్లుగా ఉద్యమాలు.. సీఎంకు కృతజ్ఞతలు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కలు–2022లో కులం కాలమ్ ఏర్పాటుచేసి బీసీ జనాభా లెక్కలు తేల్చాలని ఇటీవల జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాం. కోవిడ్‌తో ఇప్పటికే ఆలస్యమైన జనాభా లెక్కల సేకరణ ఈ ఏడాది చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ అంటూ అనేక సంఘాలతో కలిసి ఢిల్లీలో ధర్నాలు చేశాం. 20 ఏళ్లుగా చేస్తున్న ఈ డిమాండ్‌ను ఏ జాతీయ పార్టీ పట్టించుకోలేదు. కానీ, ఏపీలో చేపట్టేందుకు నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. – ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇది చరిత్రాత్మకం అవుతుంది కులాల వారీ జనాభా గణన చరిత్రాత్మకం అవుతుంది. అది ఓబీసీల్లోని పేదలకు వరంగా మారుతుంది. ఓబీసీ జనాభాను లెక్కించడంవల్ల ప్రభుత్వ పథకాలను ఇంకా సమర్థంగా అమలుచేయవచ్చు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీసీ బాధలను అర్థం చేసుకుని రాష్ట్రంలో కుల గణనకు సీఎం వైఎస్ జగన్ ముందుకురావడం అభినందనీయం. దీని ద్వారా తాను బీసీల పక్షపాతినని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. – కేశన శంకరరావు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం -
బీసీ కులాల లెక్క తేల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్: దేశంలోని బీసీ కులాల లెక్క తేల్చాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకులు బీసీలకు కాకికి ఎంగిలి మెతుకులు వేసినట్టు వేస్తున్నారని విమర్శించారు. బీసీల జనగనణ చేపట్టేలా అన్ని రాజకీయ పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. సోమవారం ‘బీసీల హక్కుల సాధన సమితి’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయబండి పాండు రంగాచారి అధ్యక్షత వహించ గా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, టీజేఎస్ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామేశ్వర్ రావు, ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, పూలే–అంబేడ్కర్ సమితి నాయకుడు కోలా జనార్దన్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు దుర్గయ్య గౌడ్, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్ హాజరయ్యారు. చాడ మాట్లాడుతూ.. బీసీల్లో చైతన్యం తీసుకువచ్చేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను సీఎం కేసీఆర్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా సగానికిపైగా జనాభా ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్లో రూ. 1,400 కోట్లు కేటాయించడం దుర్మార్గమన్నారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఓబీసీ రిజర్వేషన్లు నాలుగో తరగతి, కింది స్థాయి పోస్టులకే అమలవు తున్నాయని.. తక్కువ జనాభా ఉన్న అగ్రవర్గాలు ఎక్కువ లబ్ధిపొందుతున్నారని అన్నారు. -
వచ్చేనెల 13న ఢిల్లీలో బీసీల జంగ్ సైరన్: జాజుల
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీ కులాల గణన చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. డిసెంబర్ 13న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో బీసీల జంగ్ సైరన్ పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 14న కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 29 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీల జనగణనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. -
బీసీ కులాలవారీగా జనగణన
సాక్షి, హైదరాబాద్: జనగణన ప్రక్రియలో బీసీ కులాల వారీగా జనాభాను లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమసంఘం నేతలు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం సమర్పించారు. కృష్ణయ్య మాట్లాడుతూ..బీసీలకు కేంద్రంలో కనీసం మంత్రిత్వ శాఖ కూడా లేదని, అదేవిధంగా వారికి సంక్షేమపథకాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలవారీగా జనగణన చేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా సరైన స్పందన లేదని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కాగా, దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి కేంద్రంపై ఒత్తిడితెస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. సీఎంను కలసినవారిలో బీసీ సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ తదితరులు ఉన్నారు. -
బీసీ కేటగిరీలోకి మరో 30 కులాలు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల (బీసీ) కేటగిరీలోకి మరో 30 కులాలను చేర్చేందుకు బీసీ కమిషన్ కసరత్తు వేగిరం చేసింది. ప్రస్తుతం బీసీల్లో 112 కులాలున్నాయి. వీటికి అదనంగా 30 కులాలను చేర్చే అంశంపై బీసీ కమిషన్... గతేడాది ఆయా కులాల నుంచి వినతులు స్వీకరించింది. వీటిని పరిశీలించిన బీసీ కమిషన్ తాజాగా నిర్దిష్ట ఆధారాలు, విజ్ఞప్తుల స్వీకరణకు ఉపక్రమించింది. వాస్తవానికి కొత్త కులాల చేర్పు ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాలి. కానీ గతేడాది సెప్టెంబర్ నుంచి వరుసగా ఎన్నికలుండటంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి తొలగిపోవడంతో బీసీ కమిషన్ ఈ ప్రక్రియను వేగం చేసింది. ఈ నెల 17 నుంచి విజ్ఞప్తుల స్వీకరణ బీసీ జాబితాలో చేర్చాలని భావిస్తున్న 30 కులాల నుంచి బీసీ కమిషన్ ఇదివరకే విజ్ఞప్తులు, సూచనలు స్వీకరించింది. అయితే మరోసారి నిర్దిష్ట పద్ధతిలో విజ్ఞప్తులు, సూచనలు సమర్పించే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు ఈనెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బీసీ కమిషన్ కార్యాలయంలో నిర్దిష్ట విజ్ఞప్తులు, వినతులు స్వీకరించనుంది. కులాల మనుగడ, వారి జీవన విధానం, సంస్కృతితో పాటు సంబంధిత అంశాలను ఆధారాలతో జోడించి కమిషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. రెండు నెలల్లో పూర్తి..! బీసీల్లో కొత్త కులాల చేర్పునకు సంబంధించిన గరిష్టంగా రెండు నెలల్లో పూర్తి చేయాలని బీసీ కమిషన్ భావిస్తోంది. ఈనెల 27 వరకు విజ్ఞప్తులు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించనుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి అభిప్రాయాల స్వీకరణ, ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించి పరిశీలిస్తుంది. చివరగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి తుది నివేదికను తయారు చేయనుంది. రెండు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఆగస్టు చివరికల్లా పూర్తవుతుందని బీసీ కమిషన్ సభ్యులు ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. బీసీ కేటగిరీలో చేర్చాలనుకుంటున్న కులాలు.. బీసీల్లో 112 కులాలున్నాయి. కొత్తగా కాకి పగడాల, మందెచ్చుల, సన్నాయోళ్లు/బత్తిన, కుల్ల కడగి, బౌల్ కమ్మర, బాగోతుల, బొప్పల, తోలుబొమ్మలాట, గంజికూటి, శ్రీ క్షత్రియ రామజోగి, ఏనూటి, గుర్రపు, అద్దపు, కడారి సైదరోళ్లు, సరగాని, ఓడ్, మాసయ్యలు/పటం, సాధనాశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవుల, గౌడ జెట్టి, ఆదికొడుకులు, తెర చీరల, సారోళ్లు, అరవకోమటి, అహీర్ యాదవ్, గొవిలి కులాలను బీసీలో చేర్చేందుకు బీసీ కమిషన్ పరిశీలన చేస్తోంది. -
బీసీ కులాలను సాధించుకుంటాం
హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమస్ఫూర్తితోనే తెలంగాణలో బీసీ జాబితానుంచి తొలగించిన 26 కులాలను తిరిగి సాధిస్తామని తెలంగాణ బీసీ కులాల జేఏసీ అధ్యక్షుడు కందిబోయిన శ్రీనివాస్ అన్నారు. కూకట్‌పల్లిలో ఆదివారం జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ 26 బీసీ కులాల లోగోను జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చేందుకు అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నామని శ్రీనివాస్ స్పష్టం చేశారు. 26 కులాలకు చెందిన వారంతా ఐక్యతతో పోరాడి మన హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. తొలగించిన కులాలన్నింటితో త్వరలోనే నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు జేఏసీ సభ్యులు మాట్లాడుతూ..2014 వరకు బీసీలుగా ఉన్న తమకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తీరని అన్యాయం జరిగిందన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో న్యాయం చేస్తానని హామీనిచ్చిన కేసీఆర్ తమకు ఇప్పటివరకూ అపాయింట్మెంటే ఇవ్వలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోని కేసీఆర్‌ను ఇప్పుడు ఎన్నికల ముందు అసలు నమ్మవద్దన్నారు. రానున్న ఎన్నికల్లో తమ సమస్యకు ఎవరు పరిష్కారం చూపితే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఒక కుటుంబంలో పెద్ద కొడుకు బీసీ అయితే చిన్న కుమారుడు ఓసీ ఎలా అవుతాడని ప్రశ్నిం చారు. తమ పిల్లల చదువులను, జీవితాలను నాశనం చేయవద్దని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బాబూరావు, శ్రీరామచంద్రమూర్తి, యుగంధర్, వెంకటి, జల్లు హేమచందర్‌రావు పాల్గొన్నారు. -
మా ఆవేదన పట్టదా?
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణలో ఉనికిలో లేవంటూ 2014లో జీవో 3 ద్వారా తెలంగాణ యంత్రాంగం 26 బీసీ కులాల ను తొలగించింది. దీంతో అప్పటివరకు బీసీ జాబితాలో ఉన్న కులాలకు నాలుగు సంవత్సరాలుగా బీసీ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. దీంతో 2014 వరకు రిజర్వేషన్ల కింద ఫీజు రీయింబర్స్మెంట్లు, ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత పొందిన ఆ 26 కులాలు ప్రభుత్వ నిర్ణయంతో జనరల్ కేటగిరీలో చేరిపోయాయి. దీంతో ఒకే ఇంట్లో 2014 కంటే ముందు చదువు, ఉద్యోగ రిజర్వేషన్ పొందిన వారు బీసీలు ఐతే, తదనంతరం అదే కుటుంబసభ్యులు ఓసీ కేటగిరీలోకి మారిపోయారు. దీంతో అన్యాయానికి గురైన 26 కులాలు ఒక్కటై ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాయి. ఉనికిలో లేవని..ఆపై ఉన్నాయని.. అనంతరామన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు ఆ 26 కులాలు తెలంగాణలో లేవని చెబుతున్న ప్రభుత్వం, మరో వైపు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారంలో ఆ 26 కులాలు భారీ ఎత్తునే స్థిరపడ్డారని పేర్కొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కళింగలు 12,500 కుటుంబాలు, 50 వేల తూర్పుకాపు కుటుంబాలున్నట్లు పేర్కొంది. ఇప్పటికే తాము అన్ని రాజకీయపక్షాలతోపాటు అన్ని కుల సంఘాలు, 18 మంది ఎంఎల్ఏల సిఫారసు లేఖలు ప్రభుత్వానికి ఇచ్చామని జేఏసీ అధ్యక్షులు కడిపోయిన శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తే ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవాన్ని చాటుతాం మూడేళ్లుగా మా సమస్యలు వినమని ప్రభుత్వానికి చెబుతున్నా పట్టింపులేదు. అందుకే మా ఆత్మగౌరవాన్ని చాటేందుకు ఆదివారం సభ నిర్వహించి మా బలాన్ని చాటుతాం. మాకు మద్దతిచ్చే వారికి మద్దతిస్తాం’ –బొడ్డేపల్లి శ్రీరాంమూర్తి, కళింగ సంక్షేమ సంఘం సుప్రీంలోనూ పోరాడుతున్నాం ‘‘నగరంలో తూర్పు కాపుల కుటుంబాలు లక్షకు పైగానే ఉన్నా యి. మా కులాన్ని బీసీ జాబితా నుంచి తొల గించటం వల్ల మా పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలోనే చదువు ఆపేస్తున్న వారు ఉన్నారు. –జల్లు హేమసుందర్రావు, తూర్పు కాపు సంక్షేమ సంఘం మే స్థానికులం కాదా? ఇక్కడ పుట్టిన వారంతా తెలంగాణ వాసులే. అయినా మా మీద వివక్ష చూపిస్తున్నారు. మా సమస్యను çపరిష్కరించమని నాలుగేళ్లుగా ప్రాధేయపడుతున్నాం. ఇప్పుడు మా సత్తాచాటి తీరుతాం –గొల్లు బాబూరావు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం తొలగించిన కులాలు బీసీ (ఏ): బందర, కోర్చ, కళింగ, కూరాకుల, పొందర, సామంతుల, ఆసాదుల, కివిటి బీసీ(బీ): శెట్టిబలిజ, నాగవడ్డీలు, వక్కలిగ, గుడియ బీసీ(డీ) అగరు, అతగార, గవర, గోదబ, జక్కల, కండ్ర, కొప్పుల వెలమ, నాగవంశం, పోలినాటి వెలమ, తూర్పుకాపు, సాదర, అరవ, బేరిశెట్టి, అతిరాస. -
ఆ సీటు రద్దయింది
సుప్రీంలో టీ సర్కార్ అఫిడవిట్ సాక్షి, న్యూఢిల్లీ: కళింగ సామాజిక వర్గాన్ని బీసీ కులాల జాబితా నుంచి తొలగించడంతో మెడిసిన్‌లో ప్రవేశం కోల్పోయిన ఓ విద్యార్థికి సంబంధించిన పిటిషన్ విచారణలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. గత వారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు విద్యార్థి తరపున న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ఆధారంగా మెడిసిన్‌లో సీటు పొందారని, ఆ సందర్భంలో ఫీజు కూడా చెల్లించారని, ఆ తరువాత హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన తీర్పుతో ఆ సీటు రద్దయిందని, మరోసారి సీటు అంశం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సీటు ఉంటే పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తీర్పుతో సీటు రద్దయిందని, ఇప్పుడు సీట్లు కూడా లేవని, ఫీజు త్వరగా వెనక్కి ఇచ్చేస్తామంటూ ప్రభుత్వం గురువారం అఫిడవిట్ సమర్పించింది. దీంతో ధర్మాసనం ఈ ఏడాదికి ఏమీ చేయలేమని పేర్కొంది. అయితే కళింగ, శెట్టి బలిజ కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిన అంశంపై మాత్రం విచారణ కొనసాగనుంది. -
శెట్టిబలిజల తొలగింపుపై సుప్రీం నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ కులాల జాబితా నుంచి శెట్టిబలిజలను తొలగించడంపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సోమవారం నోటీసు జారీ చేసింది. ఇంతకుముందే కళింగ సామాజిక వర్గం దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి కూడా కౌంటర్ దాఖలుకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. బీసీ జాబితా నుంచి కులాలను తొలగించడంపై నాలుగు పిటిషన్లు దాఖలుకాగా... వాటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ అమితవరాయ్ నే తృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. శెట్టి బలిజల తొలగింపుపై న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. ‘‘50 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ పొందుతున్న శెట్టి బలిజలను ఇప్పుడు విభజన జరిగిందంటూ తెలంగాణలో రిజర్వేషన్ దక్కకుండా చేయడం అన్యాయం. ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో విద్యాభ్యాసం ద్వారా వారు తెలంగాణలో స్థానికులుగా మారారు. ఇప్పుడు వారికి ఇక్కడ రిజర్వేషన్ దక్కదు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానికత దక్కదు. ఈ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా తె లంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ మార్గదర్శనం లేకుండా తనంతట తానుగా బీసీ జాబితాను సవరించింది..’’ అని పేర్కొన్నారు. వాదన విన్న ధర్మాసనం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కళింగ సామాజిక వర్గానికి చెందిన పిటిషన్‌తో కలిపి దీన్ని విచారించనుంది. విద్యార్థులకు లభించని ఊరట బీసీ జాబితా నుంచి తొలగించిన కారణంగా మెడిసిన్ ప్రవేశాన్ని కోల్పోయామంటూ గత వారం దాఖలైన పిటిషన్‌తో పాటు సోమవారం దాఖలైన మరో 3 పిటిషన్లకు సంబంధించి విద్యార్థులకు నిరాశే ఎదురైంది. భారత వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 31లోగా మెడిసిన్ ప్రవేశాలు పూర్తికావాలని, ఆ ప్రకారం పూర్తయ్యాయని... ఇప్పుడు సీట్లు కూడా లేవని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది, అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు విన్నవించారు. దీనితో ఏకీభవించిన న్యాయస్థానం... ఈ ఏడాదికి ఏమీ చేయలేమని పేర్కొంది. అయితే కింది కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ప్రవేశం పొంది ఫీజు కట్టిన విద్యార్థికి సీటు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక విద్యార్థి తరఫు న్యాయవాది వాదనను న్యాయస్థానం సమర్థించింది. సీటు లభ్యతను పరిశీలించాలని ఎంసీఐని ఆదేశించింది. అయితే దీనిపై ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ కింది కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా వచ్చిన ఆ సీటు.. తదుపరి ఆ ఉత్తర్వులు రద్దయినప్పుడే రద్దయిందని వివరించారు. ఈ విషయమై అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఆ మేరకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఒకవేళ సీటు ఇచ్చే పరిస్థితి ఉంటే.. ఆ దిశగా ప్రయత్నిస్తామని విన్నవించారు. దీంతో ఆ ఒక్క విద్యార్థికి సంబంధించిన పిటిషన్‌పై గురువారం విచారణ జరపనున్నట్లు కోర్టు ప్రకటించింది. -
బీసీ కులాల తొలగింపు సబబే
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులనుసమర్థించిన హైకోర్టు పలువురు విద్యార్థులు, తల్లిదండ్రుల పిటిషన్లు కొట్టివేత హైదరాబాద్: బీసీ కులాల జాబితా నుంచి కళింగ, గవర, తూర్పు కాపులు.. ఇలా 138 బీసీ కులాల నుంచి 26 కులాలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. తమ కులాలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101, 107లకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుత తీర్పుపై సుప్రీంను ఆశ్రయించేందుకు వీలుగా రెండు వారాలు తీర్పు అమలును నిలుపుదల చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన భీమారావు కోరగా అందుకు న్యాయస్థానం తోసిపుచ్చింది. టీ-ఏజీ వాదనలకు సమర్థన.. బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి రాసిన లేఖ ఆధారంగానే 26 కులాలను బీసీ కులాల జాబితా నుంచి తొలగించామని, అలాగే తెలంగాణలో మనుగడలో లేని కులాలను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందన్న తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. తెలంగాణ ప్రభుత్వం తొలగించిన కులాల్లో కొన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా లేవన్న బీసీ కమిషన్ వాదనలు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.