సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణలో ఉనికిలో లేవంటూ 2014లో జీవో 3 ద్వారా తెలంగాణ యంత్రాంగం 26 బీసీ కులాల ను తొలగించింది. దీంతో అప్పటివరకు బీసీ జాబితాలో ఉన్న కులాలకు నాలుగు సంవత్సరాలుగా బీసీ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. దీంతో 2014 వరకు రిజర్వేషన్ల కింద ఫీజు రీయింబర్స్‌మెంట్లు, ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత పొందిన ఆ 26 కులాలు ప్రభుత్వ నిర్ణయంతో జనరల్ కేటగిరీలో చేరిపోయాయి. దీంతో ఒకే ఇంట్లో 2014 కంటే ముందు చదువు, ఉద్యోగ రిజర్వేషన్ పొందిన వారు బీసీలు ఐతే, తదనంతరం అదే కుటుంబసభ్యులు ఓసీ కేటగిరీలోకి మారిపోయారు. దీంతో అన్యాయానికి గురైన 26 కులాలు ఒక్కటై ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్‌లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాయి.
ఉనికిలో లేవని..ఆపై ఉన్నాయని..
అనంతరామన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు ఆ 26 కులాలు తెలంగాణలో లేవని చెబుతున్న ప్రభుత్వం, మరో వైపు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారంలో ఆ 26 కులాలు భారీ ఎత్తునే స్థిరపడ్డారని పేర్కొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కళింగలు 12,500 కుటుంబాలు, 50 వేల తూర్పుకాపు కుటుంబాలున్నట్లు పేర్కొంది. ఇప్పటికే తాము అన్ని రాజకీయపక్షాలతోపాటు అన్ని కుల సంఘాలు, 18 మంది ఎంఎల్‌ఏల సిఫారసు లేఖలు ప్రభుత్వానికి ఇచ్చామని జేఏసీ అధ్యక్షులు కడిపోయిన శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తే ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మగౌరవాన్ని చాటుతాం
మూడేళ్లుగా మా సమస్యలు వినమని ప్రభుత్వానికి చెబుతున్నా పట్టింపులేదు. అందుకే మా ఆత్మగౌరవాన్ని చాటేందుకు ఆదివారం సభ నిర్వహించి మా బలాన్ని చాటుతాం. మాకు మద్దతిచ్చే వారికి మద్దతిస్తాం’
–బొడ్డేపల్లి శ్రీరాంమూర్తి, కళింగ సంక్షేమ సంఘం
సుప్రీంలోనూ పోరాడుతున్నాం
‘‘నగరంలో తూర్పు కాపుల కుటుంబాలు లక్షకు పైగానే ఉన్నా యి. మా కులాన్ని బీసీ జాబితా నుంచి తొల గించటం వల్ల మా పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలోనే చదువు ఆపేస్తున్న వారు ఉన్నారు.
–జల్లు హేమసుందర్‌రావు, తూర్పు కాపు సంక్షేమ సంఘం
మే స్థానికులం కాదా?
ఇక్కడ పుట్టిన వారంతా తెలంగాణ వాసులే. అయినా మా మీద వివక్ష చూపిస్తున్నారు. మా సమస్యను çపరిష్కరించమని నాలుగేళ్లుగా ప్రాధేయపడుతున్నాం. ఇప్పుడు మా సత్తాచాటి తీరుతాం
–గొల్లు బాబూరావు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం
తొలగించిన కులాలు
బీసీ (ఏ): బందర, కోర్చ, కళింగ, కూరాకుల, పొందర, సామంతుల, ఆసాదుల, కివిటి
బీసీ(బీ): శెట్టిబలిజ, నాగవడ్డీలు, వక్కలిగ, గుడియ
బీసీ(డీ) అగరు, అతగార, గవర, గోదబ, జక్కల, కండ్ర, కొప్పుల వెలమ, నాగవంశం, పోలినాటి వెలమ, తూర్పుకాపు, సాదర, అరవ, బేరిశెట్టి, అతిరాస.
Comments
Please login to add a commentAdd a comment