reservations for BCs
-
బీసీల రిజర్వేషన్లు మింగేసిన టీడీపీ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దక్కాల్సిన దాదాపు పది శాతం రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ గండికొట్టింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసినా కూడా 2014–19 మధ్య చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోగా.. ఆ తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు మొత్తం 58.95 శాతం రిజర్వేషన్లు కల్పించి అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూనుకున్నారు. కానీ, టీడీపీ నేత కోర్టుకెళ్లి బీసీల రిజర్వేషన్లకు కోత పెట్టించారు. దీంతో.. జెడ్పీ చైర్మన్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు సహా దాదాపు 15 వేలకు పైగా పదవులను ఆ వర్గాలు కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి.. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అమలుచేసిన రిజర్వేషన్లతో పోలిస్తే బీసీలకు ఏ మాత్రం రిజర్వేషన్లు తగ్గించకుండా.. అదే సమయంలో ఎస్సీ, జనరల్ కేటగిరి రిజర్వేషన్లు పెరిగేలా.. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు సీఎం వైఎస్ జగన్ సర్కారు 2019 డిసెంబరులో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో జీఓ.. ► రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏపీలో ఎస్టీల జనాభా తగ్గిపోయి, ఎస్సీల జనాభా పెరిగిపోవడంతో నిబంధనల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మార్పులు చోటుచేసుకున్నాయి. బీసీల రిజర్వేషన్లు 34 శాతం కొనసాగిస్తూ.. ఎస్టీలకు తగ్గిపోయిన రిజర్వేషన్ల స్థానంలో ఎస్సీలకు 2013లో ఉన్న 18.30 శాతం నుంచి 19.08 శాతానికి.. జనరల్ కేటగిరి అభ్యర్థులకు కూడా 2013లో అమలుచేసిన 39.44 శాతం రిజర్వేషన్లు 40.15 శాతానికి పెరిగాయి. ► ఈ మేరకు జగన్ ప్రభుత్వం 2019 డిసెంబరు 28న జీఓ–176 జారీచేసింది. ► పంచాయతీరాజ్ శాఖాధికారులు కూడా జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు సభ్యుల పదవుల్లో బీసీలకు 34 శాతం చొప్పున రిజర్వేషను ఖరారుచేసి 2020 జనవరిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆ జీవోపై ‘సుప్రీం’లో టీడీపీ కేసు అయితే, జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై చంద్రబాబు హయాంలో రెండుసార్లు నామినేటెడ్ పదవిని అనుభవించిన కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈయన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సంఘం (ఇది ప్రైవేట్ సంఘం) ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌తో.. కోర్టు 176 జీవోను కొట్టేసింది. ఆ తర్వాత కూడా ప్రతాప్‌రెడ్డి మరోసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం మొత్తం 59.85 శాతంగా నిర్ణయించిన రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. నిజానికి.. రాజ్యాంగం ప్రకారం ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లకు మార్పులు చేయకూడదు. ఈ ఆదేశాలతో బీసీలే 9.82 శాతం రిజర్వేషన్లు కోల్పోవాల్సి వచ్చింది. కానీ, చంద్రబాబు ఈ తీర్పుతో కొత్త నాటకానికి తెరతీశారు. రిజర్వేషన్లను తగ్గించడానికి వీల్లేదని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బాబే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తన ద్వంద్వ వైఖరిని చాటుకున్నారు. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి వేసిన కేసులో ‘సుప్రీం’ తీర్పు రిజర్వేషన్లపై ఎప్పుడేం జరిగిందంటే.. 2019 డిసెంబరు 28 : పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ ప్రభుత్వం జీఓ 176 జారీ. 2020 జనవరి 8: ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా తక్షణమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు తీర్పు. 2020 జనవరి 10: స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ సుప్రీంకోర్టులో కేసు వేసిన టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి 2020 జనవరి 15: 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు స్టే. రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై హైకోర్టులోనే తిరిగి విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని ఆదేశం. 2020 మార్చి 2 : సుప్రీంకోర్టు సూచనతో తిరిగి హైకోర్టులో టీడీపీ నేత వేసిన కేసుపై స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు. -
సమాజంలో సగం–అధికారంలో అధమం
సమాజంలో సగం, అవకాశాల్లో అధమంగా ఉన్న బీసీలకు సామాజక న్యాయం దశాబ్దాలుగా ఎండమావిగానే ఉంది. చట్ట సభల్లో సంఖ్యలేదు. సామాజిక భద్రత లేదు. సేవల్లో సగం, సంపదలో సగం అధికారంలో ఆగమాగం. ప్రభువులు ఎక్కిన పల్లకీని, అలుపూసొలుపూ లేకుండా, ఏడు దశాబ్దాలుగా మోస్తున్నం. ఇంకా ఎంతకాలం ఓట్లు వేసే యంత్రాలుగా ఉండాలి, బీసీలంటే మీ పార్టీలకు సభ్యత్వాల్లోనే లెక్కుంటుందా! మీకు జెండాలు కట్టడానికే మేం లెక్కలోకి వస్తామా, సంక్షేమం అభివృద్ధి పేరుతో పాలకకులాలను గెలిపించే బానిసలుగా మారుస్తారా, ఇది మానవత్వమా? ప్రజాస్వామ్యమా? 55 శాతం ఉన్న బీసీలకు ఏడు దశాబ్దాల పాలనలో దామాషా భాగస్వామ్యం దక్కదా? రెవెన్యూ రికార్టుల ప్రకారం చెట్లకు, పుట్టలకు, గుట్టలకు లెక్కలున్నాయి. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు లెక్కలు లేకపోవటం పాలకుల లెక్క లేని తనానికి నిదర్శనం. మండల్ కమిషన్, కాకా కాలేల్కర్ కమిషన్లు బీసీ కులాలను లెక్కించాలని సిఫారసు చేశాయి. శాస్త్రీయ లెక్కల వల్ల మానవ వనరుల అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి, కార్యక్రమాల సక్రమ అమలుతోపాటు బీసీలకు చట్టసభల్లో రాజ కీయ అవకాశాలు కల్పించవచ్చని ఆ కమిషన్లు పేర్కొన్నాయి. కానీ అవి బుట్టదాఖలయ్యాయి. బీసీల జనగణన ఎప్రిల్ 1 నుండి జరగబో తుంది. అందులో ముప్పయ్ ఒక్క అంశాలు చేర్చి బీసీల కులాలను ఎందుకు లెక్కించటంలేదని దేశవ్యాప్తంగా వోబీసీలు ప్రశ్నిస్తున్నారు. కులగణనను జనాభాలెక్కల్లో చేర్చకపోవటాన్ని బీసీలు ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో మొదటిసారి జనగణన మొదలైంది. 1881 నుండి 1931 వరకు కులాలవారీగా గణన జరిగింది. స్వాతంత్య్రానంతరం, బీసీ కులాలను లెక్కించకుండా కేవలం జనాభానే లెక్కిస్తున్నారు. దీనికి పాలకులు చెప్పే కుంటిసాకులు ఏమిటంటే, కులగణన వల్ల సమాజంలో ఈర్షా్యద్వేషాలు పెరుగుతాయని. వాస్తవానికి భారతదేశం భిన్నకులాలు, మతాలు నిక్షిప్తమైన దేశం. పాలక కులాల ఆధిపత్యం కోసమే, వివక్షతోనే బీసీ లను జనాభా లెక్కల్లో చేర్చటంలేదు. దేశవ్యాప్తంగా ఉన్న 130 కోట్లకు పైగా జనాభాను లెక్కించేందుకు, కేంద్రప్రభుత్వం 1,100 కోట్లు ఖర్చు చేస్తుంది. దీంతో మెజారిటీ ప్రజలు ౖఆఇలతో పాటు, బీసీలను కులాల వారీగా లెక్కించాల్సి అవసరం ఉంది. జనగణలో కులం చేర్చటం వల్ల అదనంగా ఖర్చు ఏమీ కాదు. 32వ కాలంగా కులం చేర్చితే, దేశం మొత్తంలో కులాల సంఖ్య, కుల జనాభా సంఖ్య తేల్చవచ్చు. పాలకులకు కులగణన చేసే ఉద్దేశం కనబడటంలేదు. ఎందుకంటే, మెజారిటీ ఓబీసీ కులాలను, మైనారిటీ పాలక కులాలు పాలిస్తున్నాయనే బండారం బయటపడుతుందో అనే భయమా? పాలక కులాల గుప్పెటనుంచి పాలన చేజారిపోతుందనే స్వార్ధమా? భారతదేశంలో మూడు వేలకు పైగా బీసీ కులాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో కూడా చట్టసభలలో ప్రాతినిధ్యం లేదు. పాలకుల దయాదాక్షిణ్యం మీద ఆధారపడేటట్లు చేయడం కోసమే బీసీలను జనాభా లెక్కల్లో చేర్చటంలేదా! రాజకీయంగా రాణించకుండా పరిమిత సంఖ్యలో ఉంచటమే లక్ష్యంగా బీసీలను జనాభాలెక్కలో చేర్చటం లేదా, మీ ఉద్దేశం ఏమిటి అని ఈ దేశంలో 65 కోట్లమంది బీసీలు ప్రశ్నిస్తున్నారు. బీసీ కులగణనను చేయకపోవటానికి కార ణాలు కేంద్రప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే పాలక కులాలు తమ ఉనికి కోల్పోతామనే భయంతో పాటు, బీసీలకు ఎన్నికలను ఎదుర్కొనేంత డబ్బు లేకపోవటం కూడా కారణమే. పార్లమెంట్లో 272 మంది బీసీ ఎంపీలు ఉండాలి. కానీ ఒకటి నుండి ఐదు ఆరు శాతం ఉన్నవాళ్లే ఈ స్ధానాలను ఆక్రమించుకుంటున్నారు. ఇంకా రాజకీయంగా సీట్లు అడుక్కునే స్థితిలో ఉండటమేం దని బీసీలు ఆవేదన చెందుతున్నారు. ఈ వివక్షలన్నింటికీ బీసీ కులగణనతో కొంత పరిష్కారం లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి కాకపోవటానికి కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యం, కక్షపూరిత వైఖరి ఒకవైపు ఉంటే, ఉద్యమాల వైఫల్యం కూడా కారణమే. చాలామంది బీసీ నాయకులు అష్టకష్టాలు పడుతున్నవాళ్ళే. చేతికిమూతికి చాలని జీవితాలు గడుపుతున్నారు. పాలకులు బీసీలకు అవకాశాలు ఇవ్వకపోవటానికి కారణం బీసీలు బలమైన ఉద్యమశక్తిగా మారకపోవడమే. వ్యాసకర్త: సాదం వెంకట్, సీనియర్ జర్నలిస్టు, రాంనగర్, హైదరాబాద్ ‘ 93953 15326 -
టీచర్లు ఉద్యమానికి నాయకత్వం వహించాలి
హైదరాబాద్: చైతన్యవంతమైన బీసీ టీచర్లు బీసీ ఉద్యమాలకు నాయకత్వం వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.కృççష్ణుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులపై ఉన్న క్రీమీలేయర్ వి«ధానాన్ని ఎత్తివేయాలన్నారు. అనంతరం రాష్ట్ర బీసీ టీచర్స్ అసోసియేషన్ 2019 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎ.లక్ష్మణ్‌గౌడ్, కోశాధికారి వి.రమేశ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యాదగిరి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు గురుప్రసాద్ గౌడ్, కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మా ఆవేదన పట్టదా?
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణలో ఉనికిలో లేవంటూ 2014లో జీవో 3 ద్వారా తెలంగాణ యంత్రాంగం 26 బీసీ కులాల ను తొలగించింది. దీంతో అప్పటివరకు బీసీ జాబితాలో ఉన్న కులాలకు నాలుగు సంవత్సరాలుగా బీసీ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. దీంతో 2014 వరకు రిజర్వేషన్ల కింద ఫీజు రీయింబర్స్మెంట్లు, ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత పొందిన ఆ 26 కులాలు ప్రభుత్వ నిర్ణయంతో జనరల్ కేటగిరీలో చేరిపోయాయి. దీంతో ఒకే ఇంట్లో 2014 కంటే ముందు చదువు, ఉద్యోగ రిజర్వేషన్ పొందిన వారు బీసీలు ఐతే, తదనంతరం అదే కుటుంబసభ్యులు ఓసీ కేటగిరీలోకి మారిపోయారు. దీంతో అన్యాయానికి గురైన 26 కులాలు ఒక్కటై ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాయి. ఉనికిలో లేవని..ఆపై ఉన్నాయని.. అనంతరామన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు ఆ 26 కులాలు తెలంగాణలో లేవని చెబుతున్న ప్రభుత్వం, మరో వైపు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారంలో ఆ 26 కులాలు భారీ ఎత్తునే స్థిరపడ్డారని పేర్కొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కళింగలు 12,500 కుటుంబాలు, 50 వేల తూర్పుకాపు కుటుంబాలున్నట్లు పేర్కొంది. ఇప్పటికే తాము అన్ని రాజకీయపక్షాలతోపాటు అన్ని కుల సంఘాలు, 18 మంది ఎంఎల్ఏల సిఫారసు లేఖలు ప్రభుత్వానికి ఇచ్చామని జేఏసీ అధ్యక్షులు కడిపోయిన శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తే ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవాన్ని చాటుతాం మూడేళ్లుగా మా సమస్యలు వినమని ప్రభుత్వానికి చెబుతున్నా పట్టింపులేదు. అందుకే మా ఆత్మగౌరవాన్ని చాటేందుకు ఆదివారం సభ నిర్వహించి మా బలాన్ని చాటుతాం. మాకు మద్దతిచ్చే వారికి మద్దతిస్తాం’ –బొడ్డేపల్లి శ్రీరాంమూర్తి, కళింగ సంక్షేమ సంఘం సుప్రీంలోనూ పోరాడుతున్నాం ‘‘నగరంలో తూర్పు కాపుల కుటుంబాలు లక్షకు పైగానే ఉన్నా యి. మా కులాన్ని బీసీ జాబితా నుంచి తొల గించటం వల్ల మా పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలోనే చదువు ఆపేస్తున్న వారు ఉన్నారు. –జల్లు హేమసుందర్రావు, తూర్పు కాపు సంక్షేమ సంఘం మే స్థానికులం కాదా? ఇక్కడ పుట్టిన వారంతా తెలంగాణ వాసులే. అయినా మా మీద వివక్ష చూపిస్తున్నారు. మా సమస్యను çపరిష్కరించమని నాలుగేళ్లుగా ప్రాధేయపడుతున్నాం. ఇప్పుడు మా సత్తాచాటి తీరుతాం –గొల్లు బాబూరావు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం తొలగించిన కులాలు బీసీ (ఏ): బందర, కోర్చ, కళింగ, కూరాకుల, పొందర, సామంతుల, ఆసాదుల, కివిటి బీసీ(బీ): శెట్టిబలిజ, నాగవడ్డీలు, వక్కలిగ, గుడియ బీసీ(డీ) అగరు, అతగార, గవర, గోదబ, జక్కల, కండ్ర, కొప్పుల వెలమ, నాగవంశం, పోలినాటి వెలమ, తూర్పుకాపు, సాదర, అరవ, బేరిశెట్టి, అతిరాస. -
చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి
షాద్‌నగర్: చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం దక్షి ణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్‌గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంట్లో ఆమోదం చేయించేందుకు ఢిల్లీకి అఖిలపలక్షాన్ని తీసుకుపోవాలని కోరారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసి బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలన్నారు. పార్లమెంట్లో 36 రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఏ ఒక్క పార్టీ బీసీల పక్షాన మాట్లాడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన పాపాన పోవడంలేదన్నారు. విదేశీయులకు ఉన్న గౌరవం బీసీలకు లేకుండాపోయిందని ఆరోపించారు. దాదాపు 2,600 బీసీ కులాలు ఉంటే, అందులో 2,550 కులాలు పార్లమెంట్, అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో వెనుకబాటు తనమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలలో 27 శాతం, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు మేడిగశ్రీను, నర్సింలుయాదవ్, సాయియాదవ్, శివ, రఘు, రాజేందర్, జగన్, సురేష్, పాషా, మీరాజ్, రఫీ, శ్రీకాంత్‌గౌడ్, రాములు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.