ప్రతాప్‌రెడ్డికి నామినేటెడ్ పదవిని కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు దక్కాల్సిన దాదాపు పది శాతం రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ గండికొట్టింది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినా కూడా 2014–19 మధ్య చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోగా.. ఆ తర్వాత వైఎస్ జగన్ సీఎం అయ్యాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు మొత్తం 58.95 శాతం రిజర్వేషన్లు కల్పించి అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూనుకున్నారు.
కానీ, టీడీపీ నేత కోర్టుకెళ్లి బీసీల రిజర్వేషన్లకు కోత పెట్టించారు. దీంతో.. జెడ్పీ చైర్మన్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు సహా దాదాపు 15 వేలకు పైగా పదవులను ఆ వర్గాలు కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి.. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అమలుచేసిన రిజర్వేషన్లతో పోలిస్తే బీసీలకు ఏ మాత్రం రిజర్వేషన్లు తగ్గించకుండా.. అదే సమయంలో ఎస్సీ, జనరల్ కేటగిరి రిజర్వేషన్లు పెరిగేలా.. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు సీఎం వైఎస్ జగన్ సర్కారు 2019 డిసెంబరులో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో జీఓ..
► రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏపీలో ఎస్టీల జనాభా తగ్గిపోయి, ఎస్సీల జనాభా పెరిగిపోవడంతో నిబంధనల ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మార్పులు చోటుచేసుకున్నాయి. బీసీల రిజర్వేషన్లు 34 శాతం కొనసాగిస్తూ.. ఎస్టీలకు తగ్గిపోయిన రిజర్వేషన్ల స్థానంలో ఎస్సీలకు 2013లో ఉన్న 18.30 శాతం నుంచి 19.08 శాతానికి.. జనరల్ కేటగిరి అభ్యర్థులకు కూడా 2013లో అమలుచేసిన 39.44 శాతం రిజర్వేషన్లు 40.15 శాతానికి పెరిగాయి.
► ఈ మేరకు జగన్ ప్రభుత్వం 2019 డిసెంబరు 28న జీఓ–176 జారీచేసింది.
► పంచాయతీరాజ్ శాఖాధికారులు కూడా జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు సభ్యుల పదవుల్లో బీసీలకు 34 శాతం చొప్పున రిజర్వేషను ఖరారుచేసి 2020 జనవరిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ
ఆ జీవోపై ‘సుప్రీం’లో టీడీపీ కేసు
అయితే, జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై చంద్రబాబు హయాంలో రెండుసార్లు నామినేటెడ్ పదవిని అనుభవించిన కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈయన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సంఘం (ఇది ప్రైవేట్ సంఘం) ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌తో.. కోర్టు 176 జీవోను కొట్టేసింది.
ఆ తర్వాత కూడా ప్రతాప్‌రెడ్డి మరోసారి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం మొత్తం 59.85 శాతంగా నిర్ణయించిన రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. నిజానికి.. రాజ్యాంగం ప్రకారం ఎస్టీ, ఎస్టీ రిజర్వేషన్లకు మార్పులు చేయకూడదు. ఈ ఆదేశాలతో బీసీలే 9.82 శాతం రిజర్వేషన్లు కోల్పోవాల్సి వచ్చింది. కానీ, చంద్రబాబు ఈ తీర్పుతో కొత్త నాటకానికి తెరతీశారు. రిజర్వేషన్లను తగ్గించడానికి వీల్లేదని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బాబే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తన ద్వంద్వ వైఖరిని చాటుకున్నారు.
టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి వేసిన కేసులో ‘సుప్రీం’ తీర్పు
రిజర్వేషన్లపై ఎప్పుడేం జరిగిందంటే..
2019 డిసెంబరు 28 : పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ ప్రభుత్వం జీఓ 176 జారీ.
2020 జనవరి 8: ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా తక్షణమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు తీర్పు.
2020 జనవరి 10: స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ సుప్రీంకోర్టులో కేసు వేసిన టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి
2020 జనవరి 15: 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు స్టే. రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై హైకోర్టులోనే తిరిగి విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలని ఆదేశం.
2020 మార్చి 2 : సుప్రీంకోర్టు సూచనతో తిరిగి హైకోర్టులో టీడీపీ నేత వేసిన కేసుపై స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు.
Comments
Please login to add a commentAdd a comment