BC list
-
మా ఆవేదన పట్టదా?
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణలో ఉనికిలో లేవంటూ 2014లో జీవో 3 ద్వారా తెలంగాణ యంత్రాంగం 26 బీసీ కులాల ను తొలగించింది. దీంతో అప్పటివరకు బీసీ జాబితాలో ఉన్న కులాలకు నాలుగు సంవత్సరాలుగా బీసీ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. దీంతో 2014 వరకు రిజర్వేషన్ల కింద ఫీజు రీయింబర్స్మెంట్లు, ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత పొందిన ఆ 26 కులాలు ప్రభుత్వ నిర్ణయంతో జనరల్ కేటగిరీలో చేరిపోయాయి. దీంతో ఒకే ఇంట్లో 2014 కంటే ముందు చదువు, ఉద్యోగ రిజర్వేషన్ పొందిన వారు బీసీలు ఐతే, తదనంతరం అదే కుటుంబసభ్యులు ఓసీ కేటగిరీలోకి మారిపోయారు. దీంతో అన్యాయానికి గురైన 26 కులాలు ఒక్కటై ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాయి. ఉనికిలో లేవని..ఆపై ఉన్నాయని.. అనంతరామన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు ఆ 26 కులాలు తెలంగాణలో లేవని చెబుతున్న ప్రభుత్వం, మరో వైపు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారంలో ఆ 26 కులాలు భారీ ఎత్తునే స్థిరపడ్డారని పేర్కొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కళింగలు 12,500 కుటుంబాలు, 50 వేల తూర్పుకాపు కుటుంబాలున్నట్లు పేర్కొంది. ఇప్పటికే తాము అన్ని రాజకీయపక్షాలతోపాటు అన్ని కుల సంఘాలు, 18 మంది ఎంఎల్ఏల సిఫారసు లేఖలు ప్రభుత్వానికి ఇచ్చామని జేఏసీ అధ్యక్షులు కడిపోయిన శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తే ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవాన్ని చాటుతాం మూడేళ్లుగా మా సమస్యలు వినమని ప్రభుత్వానికి చెబుతున్నా పట్టింపులేదు. అందుకే మా ఆత్మగౌరవాన్ని చాటేందుకు ఆదివారం సభ నిర్వహించి మా బలాన్ని చాటుతాం. మాకు మద్దతిచ్చే వారికి మద్దతిస్తాం’ –బొడ్డేపల్లి శ్రీరాంమూర్తి, కళింగ సంక్షేమ సంఘం సుప్రీంలోనూ పోరాడుతున్నాం ‘‘నగరంలో తూర్పు కాపుల కుటుంబాలు లక్షకు పైగానే ఉన్నా యి. మా కులాన్ని బీసీ జాబితా నుంచి తొల గించటం వల్ల మా పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలోనే చదువు ఆపేస్తున్న వారు ఉన్నారు. –జల్లు హేమసుందర్రావు, తూర్పు కాపు సంక్షేమ సంఘం మే స్థానికులం కాదా? ఇక్కడ పుట్టిన వారంతా తెలంగాణ వాసులే. అయినా మా మీద వివక్ష చూపిస్తున్నారు. మా సమస్యను çపరిష్కరించమని నాలుగేళ్లుగా ప్రాధేయపడుతున్నాం. ఇప్పుడు మా సత్తాచాటి తీరుతాం –గొల్లు బాబూరావు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం తొలగించిన కులాలు బీసీ (ఏ): బందర, కోర్చ, కళింగ, కూరాకుల, పొందర, సామంతుల, ఆసాదుల, కివిటి బీసీ(బీ): శెట్టిబలిజ, నాగవడ్డీలు, వక్కలిగ, గుడియ బీసీ(డీ) అగరు, అతగార, గవర, గోదబ, జక్కల, కండ్ర, కొప్పుల వెలమ, నాగవంశం, పోలినాటి వెలమ, తూర్పుకాపు, సాదర, అరవ, బేరిశెట్టి, అతిరాస. -
‘తొలగించిన 26 కులాలను బీసీల్లో చేర్చే వారికే మద్దతు’
హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను వెంటనే బీసీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చే రాజకీయ పార్టీలకే ఈ ఎన్నికల్లో తమ మద్దతు ఇస్తామని ఆయా కుల సంఘాల అధ్యక్షులు తేల్చి చెప్పారు. ఈ మేరకు 26 కుల సంఘాల అధ్యక్షులు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను కలిసి తమ కులాలను బీసీల్లో చేర్చే వరకు అండగా నిలిచి పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. 26 కులాలను బీసీల్లో నుంచి తొలగించడం ద్వారా ప్రభుత్వం ఆ కులాల పిల్లలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా కులాలను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఏ కులాన్ని తొలగించాలన్నా కలపాలన్నా బీసీ కమిషన్‌కు మాత్రమే అధికారం ఉందన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలును క్లియర్ చేయాలని, లేని పక్షంలో ఈ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పి.వి.వి.సత్యనారాయణ (శెట్టి బలిజ), శ్రీరాంచంద్రమూర్తి (కళింగ), యుగేంధర్ (గవర), జె.హేమసుందరరావు (తూర్పుకాపు), గోల్లు బాబురావు (కొప్పుల వెలమ), పి.వెంకట్ (కూరాకుల), మురళి (పలిడోర), అప్పారావు (నాగవంశీ), తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: బీసీ లెక్కలు తేల్చకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. బీసీ గణనతోపాటు చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉన్నాయని, అందుకు విరుద్ధంగా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం విషయంలో జోక్యం చేసుకోలేమంది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పంచాయతీల కాల పరిమితి ముగిసిందని, అయినా ఎన్నికలు నిర్వహించకపోవడం నిబంధనలకు విరుద్ధమని, వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌కు చెందిన జెడ్పీటీసీ బి.సతీశ్, మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. ఆ ఆదేశాలు అమల్లోనే ఉన్నాయి కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ బాధ్యతలను నిర్వర్తించకుండా ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 2017 ఆగస్టులోనే ఎన్నికల సంఘానికి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ..‘‘బీసీ జనాభా లెక్కలు తేలిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నేనే ఈ ఏడాది జూన్‌లో ఆదేశాలిచ్చాను. బీసీ జనాభా గణన ఇంకా పూర్తి కాలేదు. అలాంటప్పుడు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఎలా ఆదేశించగలను? నేను ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉన్నాయి. వాటిపై అప్పీల్ దాఖలు చేయలేదు. వాటిని ఎత్తివేయాలంటూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు కాలేదు. ఆ ఉత్తర్వులు అమల్లో ఉండగా, వాటికి విరుద్ధంగా వెంటనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కానే కాదు. బీసీ గణన ముఖ్యం. అవి తేలితేనే రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఆ తర్వాత ఎన్నికలు జరుగతాయి’’అని స్పష్టంచేశారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పంచాయతీల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని వివరించారు. ‘‘ఎన్నికలు జరిగేంత వరకు స్పెషల్ ఆఫీసర్లను నియమించుకుంటే నియమించుకుంటారు. ఆ విషయంలో జోక్యం చేసుకోలేం’’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పిటిషనర్లు కోరుతున్నట్టుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
బీసీ జాబితాలో మరో 30 కులాలు!
సాక్షి, హైదరాబాద్ : సంచార జాతులకు చెందిన 30 కులాలను బీసీ జాబితాలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ రాసిన ‘బీసీ కులాలు-సంచార జాతులు’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటివరకు గుర్తించని సంచార జాతులను వెనుకబడిన తరగతులుగా గుర్తించలేదని అన్నారు. ఈ 30 కులాలను బీసీ జాబితాలో చేర్చవల్సిన ఆవశ్యకత ఉందని జూలూరు గౌరీశంకర్ సీఎం దృష్టికి తీసుకురాగా.. కేసీఆర్ స్పందించి.. సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చే విషయంపై అధ్యయనం చేయవల్సిందిగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకి బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగేళ్లుగా బీసీలు, సంచార జాతులకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయనాన్ని జూలూరు తన పుస్తకంలో వివరించారు. ఈ కార్యక్రమంలో కేకే, ఎంపీ వినోద్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ జాబితాలో చేర్చండి
సాక్షి, హైదరాబాద్: బీసీ జాబితా నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 26 కులాలను వెంటనే ఆ జాబితాలో చేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మంగళవారం లేఖ రాశారు. ఇటీవల జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ డిమాండ్‌ను ఏకగీవ్రంగా తీర్మానించారని లేఖలో ఆయన గుర్తు చేశారు. జాబితా నుంచి తొలగించిన కులాల వారికి ఫీజులు, ఉపకార వేతనాలు రాకపోవడంతో ఉన్నత విద్యను చదవలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కూడా వారికి అర్హత లేకుండా పోయిందన్నారు. జాబితా నుంచి కులాలను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. బీసీ కమిషన్ ద్వారా మాత్రమే జాబితాలో ఏ కులాన్ని అయినా చేర్చడం, తొలగించడం చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఉందని పేర్కొన్నారు. -
బీసీ జాబితాలో ఇతరులను చేర్చొద్దు
కడప రూరల్: అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీ వర్గాల్లో ఇతరులను చేర్చడానికి సాగుతున్న కుట్రలను అడ్డుకుంటామని ఏపీ బీసీ ఐక్య కార్యరణ కమిటీ తెలి పింది. ఇందుకు నిరసనగా బీసీ కమిషన్‌కు లక్ష వినతిపత్రాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపా రు. ఆ మేరకు శుక్రవారం వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆ కమిటీ నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ కమిటీ రాష్ట్ర కన్వీనర్ యానాదయ్య, జిల్లా చైర్మన్ బంగారు నాగయ్య యాదవ్, బీసీ మహాసభ రాష్ట్ర కన్వీనర్ అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల జాబితాలో దాదాపు 60 కులాలను చేర్చాలనే కుట్ర సాగుతోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా అభ్యం తరాలతో కమిటీ చైర్మన్ అన్నా రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఈనెల 29, 30, 31 తేదీలలో లక్ష వినతిపత్రాల సేకరణ ద్వారా బీసీ కమిషన్‌తోపాటు ప్రభుత్వానికి ఆ పత్రాలను సమర్పిస్తామన్నారు. బీసీ రిజ ర్వేషన్లను జనాభా ప్రకారం పెంచి వాటి ఫలాలను తమకే దక్కేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు బలరామయ్య, శ్రీనివాసులు, ఏకే బాషా, ఖాదర్‌బాషా, రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాపుల్ని బీసీల్లో చేర్చితే ఉద్యమాలే
- రాష్ర్ట బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య హెచ్చరిక తిరుపతి కల్చరల్ సామాజికంగా అభివృద్ధి చెందిన కాపు, బలిజలను బీసీ జాబితాల్లో చేర్చి బీసీల కడుపు కొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఉద్యమ పోరుతోగుణపాఠం తప్పదని రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతిలో బుధవారం రాష్ట్రస్థాయి బీసీ ప్రతినిధుల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల బీసీ సంఘాల ప్రతినిధులు హాజరై బీసీల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై చర్చించారు. బీసీ సంఘాల నేతలంతా ఏకమై రాష్ట్ర బీసీ జేఏసీ ఏర్పాటుచేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా అన్నా రామచంద్రయ్యను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆయనతో పాటు అన్ని జిల్లాలకు చెందిన బీసీ నేతలు పది మందితో బీసీ జేఏసీ అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ సామాజికంగా ఎదగిన కాపులను బీసీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వడం అణగారుతున్న బీసీలను దగా చేయడమేనన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి బీసీల కడుపు కొట్టే కుట్ర పన్నడం దారుణమన్నారు. 1983లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించిన టీడీపీ ఇప్పటివరకు పట్టించుకోకపోగా మొన్న తెరపైకి వచ్చిన కాపు, బలిజలను బీసీల్లో చేర్చే విధానానికి తలొగ్గడం అమానుషమన్నారు. చరిత్ర కలిగిన బీసీ కులాలను చరిత్రహీనులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీసీలను దగా చేసే చంద్రబాబు ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీసీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని బీసీలందరూ ఐక్యవేదికగా ఉద్యమ పోరుకు సిద్ధం కావాలన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జూలై మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీలను చైతన్యపరిచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అనంతరం విజయవాడలో భారీ ఎత్తున బీసీ రణభేరి చేపట్టి బీసీల సత్తా చాటనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు సాంబశివరావు, గంగాధరం, ప్రసాద్‌బాబు, వెంకటేశ్వరరావుర, ఎంవీవీఎస్.మూర్తి, శ్రీనివాసులు, అశోక్‌సామ్రాట్ యాదవ్, యానాదయ్య, రెడ్డి సత్యనారాయణ, అన్ని జిల్లాల బీసీ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏ ప్రాతిపదికన తొలగించారు?
సాక్షి, న్యూఢిల్లీ: కళింగ కులాన్ని బీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలగించారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ‘మధ్యంతర స్టే’ ఇచ్చింది. కళింగ కులాన్ని తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి తొలగించడంతో తాము మెడిసిన్‌లో ప్రవేశాలు కోల్పోయామని, తమకు ప్రవేశం కల్పించాలని కోరుతూ ఇద్దరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పిటిషనర్‌కు రిజర్వేషన్ పొందే హక్కు, అర్హత ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి కళింగ తదితర కులాలను తొలగించడంతో విద్యార్థులు మెడిసిన్‌లో ప్రవేశం పొందలేకపోయారు’ అని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. కులాల తొలగింపు రాజ్యాంగబద్ధంగానే జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ హెచ్ఎల్ దత్తు స్పందిస్తూ రాష్ట్ర విభజనకు ముందు కళింగ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్ వర్తించిందని, అయితే ఇప్పుడు తెలంగాణలో ఆ కులానికి చెందిన వారు లేరని రోహత్గీ తెలిపారు. ‘లేరని ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఏదైనా కమిషన్ వేశారా? విభజనకు ముందున్నప్పుడు.. ఇప్పుడు కూడా ఉండాలి కదా?’ అని న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు. పిటిషనర్ అభ్యర్థన లోని ‘సి’ భాగంపై కౌంటర్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పు(తీర్పు అమలు కాలానికి సంబంధించి)పై ‘మధ్యంతర స్టే’ విధిస్తున్నామని, ఇది పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది. -
నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు కానీ...
హైదరాబాద్: 'నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు, 26 బీసీ కులాలకు న్యాయం జరగాలని' కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ 26 కులాలను బీసీ జాబితాలో చేర్చితే అధికార టీఆర్ఎస్లో చేరడానికి తాను సిద్దమని కృష్ణారావు తెలిపారు. గురువారం ఉదయం తనను కలవాలని మాధవరం కృష్ణారావుకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాబును కలిసేందుకు కృష్ణారావు ఆయన నివాసానికి వచ్చారు. ప్రస్తుతం తాను బిజీగా ఉన్నానని... దాంతో శుక్రవారం ఉదయం కలవాలని కృష్ణారావుకు బాబు సూచించారు. అనంతరం అక్కడే ఉన్న విలేకర్లు .... మీరు సైకిల్ దిగి... కారు ఎక్కుతున్నారటగా అని ప్రశ్నించారు. దాంతో కృష్ణారావుపై విధంగా స్పందించారు. -
ఆరెకటికల సమస్యలపై స్పందిస్తాం: ఎంపీ కేశవరావు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరెకటిక కులస్తుల సమస్యలు పరిష్కరించడానికి టీఆర్ఎస్ తరఫున స్పందిస్తామని ఎంపీ కేశవరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీ భవన్ గురజాడ సమావేశ మందిరంలో టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఆరె కటిక సామాజిక వర్గానికి చెందిన వివిధ రాష్ట్రాల ఎంపీలను తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, వినోద్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఎంపీలు నీలం సోన్కర్, బోలే సింగ్జీ హాజరయ్యారు. ఆర్థికంగా వెనకబడిన ఆరెకటిక లను బీసీ జాబితా నుంచి ఎస్సీల్లో చేర్చాలని ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేశవరావు స్పందిస్తూ.. ఎస్సీల్లో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకోవాలో అవి తీసుకునేలా టీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందని కేశవరావు హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆరెకటి కలను ఎస్సీల్లో చేర్చాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఈ సమస్యపై దృష్టిపెట్టాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు ప్రమోద్బాబు, అడ్వైజర్ శివశంకర్, బాలాజీ, అశోక్, శశి, బాబురావు, మధుసూదన్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.