- రాష్ర్ట బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య హెచ్చరిక
తిరుపతి కల్చరల్
సామాజికంగా అభివృద్ధి చెందిన కాపు, బలిజలను బీసీ జాబితాల్లో చేర్చి బీసీల కడుపు కొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఉద్యమ పోరుతోగుణపాఠం తప్పదని రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతిలో బుధవారం రాష్ట్రస్థాయి బీసీ ప్రతినిధుల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల బీసీ సంఘాల ప్రతినిధులు హాజరై బీసీల పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై చర్చించారు.
బీసీ సంఘాల నేతలంతా ఏకమై రాష్ట్ర బీసీ జేఏసీ ఏర్పాటుచేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా అన్నా రామచంద్రయ్యను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆయనతో పాటు అన్ని జిల్లాలకు చెందిన బీసీ నేతలు పది మందితో బీసీ జేఏసీ అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ సామాజికంగా ఎదగిన కాపులను బీసీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వడం అణగారుతున్న బీసీలను దగా చేయడమేనన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి బీసీల కడుపు కొట్టే కుట్ర పన్నడం దారుణమన్నారు.
1983లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించిన టీడీపీ ఇప్పటివరకు పట్టించుకోకపోగా మొన్న తెరపైకి వచ్చిన కాపు, బలిజలను బీసీల్లో చేర్చే విధానానికి తలొగ్గడం అమానుషమన్నారు. చరిత్ర కలిగిన బీసీ కులాలను చరిత్రహీనులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీసీలను దగా చేసే చంద్రబాబు ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీసీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని బీసీలందరూ ఐక్యవేదికగా ఉద్యమ పోరుకు సిద్ధం కావాలన్నారు.
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జూలై మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీలను చైతన్యపరిచే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అనంతరం విజయవాడలో భారీ ఎత్తున బీసీ రణభేరి చేపట్టి బీసీల సత్తా చాటనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు సాంబశివరావు, గంగాధరం, ప్రసాద్‌బాబు, వెంకటేశ్వరరావుర, ఎంవీవీఎస్.మూర్తి, శ్రీనివాసులు, అశోక్‌సామ్రాట్ యాదవ్, యానాదయ్య, రెడ్డి సత్యనారాయణ, అన్ని జిల్లాల బీసీ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.