
పేదలకు ఆర్థిక చేయూతనివ్వడమే సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశం.ఏ పార్టీ వారైనా సరే పేదరికం, సామాజిక స్థితిగతుల ఆధారంగా లబ్ధి చేకూర్చాలి. సమాజంలో మరో మెట్టు ఎక్కేలా చేయూతనందించాలి. టీడీపీ సర్కారు తీరు ఇందుకు పూర్తి భిన్నం. పేదల కడుపు కొట్టి తమ్ముళ్లకు లబ్ధి కలిగించడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పెన్షన్ల నుంచి రేషన్ కార్డుల దాకా, ఎన్టీఆర్ గృహాల నుంచి సిమెంటు రోడ్ల నిర్మాణం వరకు ఏదైనా సరే కోట్లకు పడగలెత్తిన టీడీపీ నేతల చెంతకు చేరాల్సిందే. వారు కనికరించి అనుమతిస్తేనే మంజూరయ్యేది. పేదలు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. ఇది ‘సాక్షి’ పరిశోధనలో తేలిన అక్షర సత్యం. అయ్యా.. అమ్మా అంటూ కాళ్లూ వేళ్లూ పట్టుకుంటున్నా ప్రభుత్వ పెద్దల మనసు కరగడం లేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు మీరే చూడండి – గాండ్లపర్తి భరత్‌రెడ్డి సాక్షి, చిత్తూరు
పేదోడికిగూడు కరువుగుడిసె
ముందు నిలుచున్నఈ దివ్యాంగుడి పేరు శివకుమార్. కుప్పం నియోజకవర్గం గుండ్లమడుగు సొంతూరు. ఐదేళ్ల నుంచి ఇంటి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా అరణ్య రోదనగానే మిగిలింది. గుడిసెకు కనీసం కరెంటు కనెక్షన్ కూడా లేకపోవడంతో చీకట్లోనే బతుకుతున్నాడు. దివ్యాంగుడు కావడంతో పనేమీ చేయలేక పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటుండగా భార్య కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. అతడికి ప్రభుత్వం ఇంటిని మాత్రం మంజూరు చేయలేదు.
బడా వ్యాపారికి ఎన్టీఆర్ ఇల్లు
మామిడితోపులో ఉన్నఈ ఇల్లు గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్సార్‌పురం మండలాధ్యక్షుడు రుద్రప్ప నాయుడుది. ఆయనకు సుమారు రూ.50 కోట్ల వరకు ఆస్తులున్నాయి. బెంగళూరులో వ్యాపారం చేస్తుంటారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి అర్హుడు కాకపోయినా సర్కారు ఆయనకు ఇల్లు ఇచ్చింది.
జన్మభూమి కమిటీలకు కమీషన్ చెల్లిస్తేనే..
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లిలో నివసించే శ్రీనివాసులుకు ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరూ కూలీలే. రేషన్‌కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తీవ్ర నిరాశే ఎదురవుతోంది. జన్మభూమి కమిటీలను సంతృప్తి పరిచేవరకు తమ గతి ఇంతేనని వీరు వాపోతున్నారు.
టీడీపీ నేత ఇంటికి రోడ్డు
రూ.20 లక్షలతో నిర్మించిన ఈ రోడ్డు కేవలం ఒక్క ఇంటి కోసమే అంటే నివ్వెరపోక తప్పదు. కుప్పం మండలం అడవిములకలపల్లిలో టీడీపీ నాయకుడు కుప్పన్న నివాసం కోసమే ఈ రహదారిని నిర్మించారు. రోడ్లు లేని గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నా పట్టించుకోని సర్కారు టీడీపీ నేతల ఇళ్లకు మాత్రం ప్రజాధనంతో రోడ్లేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment