అధికారపార్టీ నేతలు పంపిణీ చేసిన కమ్మలు, చెక్ చేయగా రాగికమ్మగా మారిన దృశ్యం
సాక్షి, పలమనేరు : గత ఐదేళ్లుగా ప్రజలను ఈ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అదే రీతిలో ఎన్నికల్లోనూ ఆ పార్టీ నాయకులు ఓటర్లను మోసం చేశారు. మంత్రి నియోజకవర్గమైన పలమనేరులో అధికారపార్టీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదుతోపాటు బంగారు ముక్కుపుడకలు, కమ్మలను బుధవారం పంపిణీ చేశారు. అయితే వాటిని చూసి అనుమానం వచ్చిన ఓటర్లు వారి గ్రామాల్లో చెక్ చేయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. 450 మిల్లీ గ్రాములున్న కమ్మలను కరిగిస్తే అందులో 75శాతం రాగి ఉన్నట్లు తెలిసింది.
దీంతో నాయకులు మోసం చేశారని జనం శాపనార్థాలు పెట్టారు. వీకోట మండలంలో కొందరు ఓటర్లు వాటిని బంగారు దుకాణాల్లోని సేఠ్‌లకు విక్రయించేందుకు ప్రయత్నించగా, వారు రూ.300 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వమని చెప్పడంతో జనం కంగుతిన్నారు. అధికార పార్టీ నేతల మోసంపై ఓటర్లు మండిపడుతున్నారు.
వాటిని వెంటనే ఓపెన్ చేయకూడదట..
ఓటర్లకు కమ్మలు, ముక్కుపుడకలను పంపిణీ చేసేటపుడు నాయకులు ముందుగా ఓ సమాచారమిచ్చినట్లు తెలిసింది. అదేంటంటే.. ఓటేసినాక మాత్రమే వాటిని ధరించాలని.. అంతవరకు జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పినట్లు జనం చెబుతున్నారు. దీంతో ఎందుకిలా చెబుతున్నారనే ఉత్సుకతో వాటిని చెక్ చేయగా అధికార పార్టీ నేతల అసలు రంగు బయటపడింది.
పల్లెల్లో ప్రలోభాలు ఇలా..
మంత్రికి చెందిన వ్యక్తులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కీలక వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ నేతను తమ దారిలో తెచ్చుకునేందుకు నలుగురు వ్యక్తులను పెట్టి ఈ ఆపరేషన్ చేస్తున్నట్లు సమాచారం. వీరి దెబ్బకు ఇప్పటికే కొందరు నాయకులు సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు వినవస్తోంది. కేవలం ఏజెంట్లు, గ్రామస్థాయి నేతలను తమ దారిలో తెచ్చుకునేందుకే 300 మంది ప్రత్యేకంగా నియోజకవర్గంలో దిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment