తేంబల్లి పూర్ణం ఉదంతంతో చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి జిల్లాలో చర్చనీయాంశమైంది. బాబును నమ్మి మునిగిన వారి లిస్టులో తాజాగా పూర్ణం కూడా చేరారు. పూర్ణంను నమ్మించి మోసం చేసి పది రోజులవుతున్నా.. ప్రజలు దీని గురించి పదేపదే చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనతో పాటు గతంలో టీడీపీ కోసం ఖర్చుచేసి నిండా మునిగిన వారిని గుర్తుచేసుకుంటున్నారు. ఆయనలో ఎలాంటి మార్పు లేదంటున్నారు. బాబు పోటు పొడిస్తే గల్లంతే అని.. కనీసం పేరు కూడా వినపడదని.. రాజకీయ సమాధి గ్యారెంటీ అని విశ్లేషిస్తున్నారు ఆయనను బాగా ఎరిగిన వారు. తమ్ముడినే రాజకీయంగా అణగదొక్కినోడికి పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్క లెక్కనా అని చెప్పుకుంటున్నారు.
సాక్షి, చిత్తూరు: ‘‘పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని ముంచడంలో చంద్రబాబు శైలే వేరు. డబ్బున్న వరకు వాడుకుని.. మొత్తం అయిపోయిన తరువాత వారిని పక్కన పడేయడం ఆయన స్టైల్’’ ఇవీ టీడీపీ అధినేత చంద్రబాబు గురించి బాగా తెలిసిన టీడీపీ నాయకుల మాటలు. ఆయనను నమ్మి దివాలా మోసపోయినకొందరి ఉదాహణలు కూడా చెబుతున్నారు.
బాబుకు మంత్రి పదవి ఇప్పిస్తే..
ఉన్నం సుబ్రమణ్యం నాయుడు శ్రీకాళహస్తి నుంచి 1978లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంజయ్య కేబినేట్‌లో మంత్రిగా పనిచేశారు. అదే సంవత్సరంలో చంద్రగిరి నుంచి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా బొటాబొటిగా గట్టెక్కారు. ఒకే సామాజికవర్గం కావడంతో చంద్రబాబును కూడా అంజయ్యకు పరిచయంచేసి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఇప్పించడంలో కీలకపాత్ర పోషిం చారు ఉన్నం సుబ్రమణ్యం నాయుడు. రామారావు కుమార్తెతో చంద్రబాబుకు పెళ్లిని కూడా ముందుండి జరిపించారు. చంద్రబాబు టీడీపీలోకి వెళ్లినప్పుడు ఆయన వెంటే ఉన్నారు. అక్కడ బాబు ఆర్థిక మంత్రి అయినప్పటి నుంచి సుబ్రమణ్యం నాయుడినిపట్టించుకోలేదు. ఆయన ఆర్థికంగా చితికిపోయిన సమయంలో చంద్రబాబు సీఎంగా పనిచేస్తున్నారు. చాలాసార్లు కలిసి పనులు చేసిపెట్టాల్సిందిగా కోరారు. అయినా బాబు పట్టించుకోలేదు.
బాబు స్నేహితుడు..దిగాలుతో కన్నుమూశాడు
పిచ్చాటూరు మండలానికి చెందిన బాలకృష్ణ నాయుడు చంద్రబాబు స్నేహితుడు. టీడీపీ కోసం 64 ఎకరాల పొలం అమ్మేసి పనిచేశారు. 2004 తరువాత పార్టీ కష్టాల్లో ఉన్నపుడు పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోకపోవడంతో దిగులుతో చనిపోయారు. పిచ్చాటూరు మండలంలో రమణయ్య నాయుడు చంద్రబాబు కోసం పనిచేసి చేతులు కాల్చుకున్న వారిలో ఉన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా టీడీపీకి ఫ్లెక్సీలు కట్టిన వేంకటేశ్వర్లు నాయుడు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చంద్రబాబు మూడోసారి సీఎం అయినప్పటి నుంచి ఎన్నిసార్లు కలిసినా ఆయన్ను పట్టించుకోలేదు. చదువుకుంటున్న రోజుల నుంచి చంద్రబాబుకు మురళీకృష్ణ చౌదరి మంచి స్నేహితుడు. ఈ స్నేహంతోనే చంద్రగిరిలో చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఖర్చుపెట్టారు. టీడీపీలోకి వెళ్లినప్పుడు చంద్రబాబు వెంటే ఉన్నారు. టీడీపీ కోసం మురళీకృష్ణ చౌదరి ఆస్తులను మొత్తం అమ్మాడు. ఫలితంగా రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధిగా నియమించి చేతులు దులుపుకున్నాడు. చిన్న చిన్న కాంట్రాక్టు పనులు కూడా ఇవ్వకుండా వేధించాడు. దీంతో మురళి చౌదరి చంద్రగిరి నియోజకవర్గంలో జేసీబీలు పెట్టుకొని చిన్నచిన్న పనులు చేసుకుంటున్నాడు.
ఉద్యోగానికి రాజీనామా చేసి వస్తే..
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పుష్పరాజ్ జిల్లాలో చర్చనీయాంశం అవుతారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఇంతకుముందు వేపంజరి నియోజకవర్గంగా ఉండేది. చంద్రబాబు ఈ నియోజకవర్గం టికెట్‌ను ఆయనకు ఇస్తానని మాట ఇచ్చారు. దీంతో ప్రభుత్వోద్యోగం మానేసి ఎన్నికల బరిలోకి దిగారు. 1999లో టికెట్ ఇచ్చినా ఖర్చులకు డబ్బు పెట్టకపోవడంతో ఆయన ఓడిపోయారు. ఆర్థికంగా చితికిపోయారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయనకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగం ఇప్పించాలని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో పార్టీ నాయకులకే తెలీకపోవడం గమనార్హం.
రావూరి హంగామానే వేరు
రావూరి ఈశ్వరరావు చంద్రబాబు వీరాభిమాని. చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ఎక్కడ సీఎం వచ్చినా ఆయనదే హంగామా. ఆయనకు చిత్తూరు టికెట్ ఇస్తానని చంద్రబాబు ప్రోత్సహించారు. ఆయన ఆస్తులన్నింటినీ అమ్ముకుంటూ పార్టీ కోసం ఖర్చు చేశారు. చంద్రబాబు వస్తున్నారంటే కనీసం వంద వాహనాలు ఉండాల్సిందే. పార్టీ కోసం అంతలా పనిచేసిన ఆయనకు పార్టీ టికెట్ కాదు కదా.. కనీసం కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వలేదు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అప్పులపాలయ్యారు. ఆయన రాజకీయ జీవితం పాతాళానికి పడిపోయింది. ఓ వెలుగు వెలిగిన రావూరి సర్వం కోల్పోయి ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారు.
స్నేహితుడంటే వైఎస్సే
జిల్లా జనం వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు. అవసరాల్లో వాడుకోవడం కాదు.. ఆపదలో ఆదుకోవడం స్నేహమంటే అని రాజశేఖర్ రెడ్డిని గురించి అనుకుంటున్నారు. చంద్రబాబు స్నేహితుడు అయిన ఉన్నం సుబ్రమణ్యంనాయుడును వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదుకున్నారు. ఆయన అడిగిన పనులు చేసి పెట్టి ఆర్థికంగా కుదుటపడేలా చేశారని ఉన్నం బంధువులే చెప్పుకుంటున్నారు. వేపంజేరి నుంచి టీడీపీ గుర్తుపై పోటీచేసి ఓడిపోయిన గాంధీ భార్య చంద్రమ్మకు మళ్లీ ఉద్యోగం ఇప్పించారు. ఆమె గవర్నమెంట్ డాక్టర్. అడిగిన వెంటనే పార్టీలకతీతంగా పనిచేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డే అని చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment