సాక్షి, కావలి: జిల్లాలో ప్రశాంతతకు, దాన గుణానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రాచుర్యం పొందిన కావలి నియోజకవర్గంలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఫ్యాను హోరుకు టీడీపీ చతికిలబడిపోయింది. తొలి నుంచి కూడా వైఎస్సార్‌సీపీ అన్ని అంశాలపైన స్పష్టత ఉండటంతో ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే ప్రచారం ప్రారంభించి పట్టు సాధించింది.ఈ విధంగా ఆ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రచారంలో ప్రజలకు బాగా దగ్గరయ్యారు.అలాగే పార్టీలో నాయకులు, కార్యకర్తలు తమ సొంత ఎన్నికలనే భావనతో కసిగా ప్రచారంలో పాల్గొన్నారు.
దీనికి తోడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు, పాదయాత్రలో వివిధ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని ఇచ్చిన హామీలు ప్రజల్లో విస్తృతంగా వెళ్లింది.చంద్రబాబునాయుడు మోసపూరితమైన పరిపాలనపై విసిగివేసారిన ప్రజలు, జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న వాగ్దానాలు అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఉండటంతో ప్రజల్లో వీటిపై సానుకూలంగా చర్చించుకొంటున్నారు. ఈ క్రమంలో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అంటూ ప్రచారాన్ని ఉధృతంగా చేశారు.దీంతో ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారానికి వస్తే ఆత్మీయంగా పలకరించడం, ఫ్యాను గిర్రుమంటూ తిరుగుతుందంటూ చెప్పడంతో ఆ పార్టీలో జోష్ పెంచింది.
ప్రచారానికి బ్రహ్మరథం
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రచారానికి గ్రామాలకు వెళ్లినా, పట్టణంలో ఏ వీధికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయనకు కరచాలనం చేసేవారు. పలుచోట్ల ఎన్నికలు అయిపోగానే తాము వచ్చి కలుస్తామని, మా సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అడ్వాన్స్‌గానే అడగడం గమనార్హం. ఇతరులపై ఏ విషయంలోనూ ఆధారపడని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వ్యక్తిగతం నిర్ణయాలు తీసుకొంటూ ప్రచారంలో ఫ్యాను జోరును బలంగా ఉండేలా చేసుకోవడంతో విజయవంతం అయ్యారు. ఇక టీడీపీలో విచిత్రమైన అయోమయ పరిస్థితి ఎన్నికల ముందు నుంచి ప్రారంభమై, పోలింగ్ దగ్గరకు వచ్చేసినా కొనసాగుతూనే ఉంది.
చివరి నిమిషం వరకు కూడా నేను కావలి అసెంబ్లీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, ప్రచారాలు నమ్మవద్దని బీద మస్తాన్‌రావు టీడీపీ నాయకులకు చెబుతూ వచ్చారు. నాలుగుసార్లు కావలి అభ్యర్థిగా బీద మస్తాన్‌రావుని ప్రకటించారని నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చారు. నామినేషన్ దాఖలు చేసే గడువు దగ్గరకు వచ్చే వరకు నరాలు తెగే ఉత్కంఠంగా కొనసాగిన అభ్యర్థిత్వం తంతులో, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి అభ్యర్థిత్వం దక్కింది. బీద మస్తాన్‌రావును నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు.అయితే కావలి అభ్యర్థిత్వాన్ని బలంగా ఆశించిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రను కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కావలి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని తెగేసి చెప్పడంతో,మనస్తాపం చెంది బీద రవిచంద్ర కావలి వైపు కన్నెత్తి చూడలేదని టీడీపీ వర్గాలు చెప్పడాన్ని బట్టి తెలుస్తోంది.
కొనసాగుతున్న అంతర్గత విభేదాలు
టీడీపీ నాయకులతో కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఆయన అనుచరులు మధ్య అంతర్గతంగా బిగ్ ఫైట్ ప్రారంభమై, అది నేటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రగడలో టీడీపీ అభ్యర్ధి ప్రచారం మొక్కుబడిగా జరిగింది. ఎన్నికల ఖర్చు వ్యవహారంలో ఒక దశలో టీడీపీ నాయకులు నేరుగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డినే ప్రశ్నిస్తే, ఆయన మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా చూశారని అంటున్నారు. ఈ అంశం చంద్రబాబునాయుడు దృష్టికి బీద మస్తాన్‌రావు తీసుకెళ్తే, నేరుగా చంద్రబాబు నాయుడు కూడా విష్ణువర్ధన్‌రెడ్డిని ఎన్నికల ఖర్చు సంగతి ఏమిటని నిలదీస్తే, చూద్దాం అనే ఒకే ఒక్కమాటతో సరిపెట్టేశారని అంటున్నారు.
ఈ పరిణామాలతో టీడీపీ ప్రచారంలో పూర్తిగా చతికిలపడింది.కాకపోతే మొక్కుబడిగా ప్రచారం చేశారు.ఇక కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యేకు, మత్స్యకారులకు వార్నింగ్‌లు ఇవ్వడం కూడా ప్రజల్లో బలంగా వెళ్లిపోవడంతో ఇప్పుడే ఈ విధంగా ఉంటే గెలిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయనే ఆందోళనను స్వయంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు చర్చనీయాంశం చేశారు. దీంతో ప్రజల్లో చంద్రబాబునాయుడు పాలనపై వ్యతిరేకత కూడా జతకావడంతో టీడీపీ ఎక్కడ ఉందనే పరిస్థితి నెలకొని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment