టీడీపీకి ముచ్చెమటలే..! | TDP Situation In Prakasam And Nellore Districts Is Very Bad | Sakshi
Sakshi News home page

టీడీపీకి ముచ్చెమటలే..!

Published Tue, Apr 9 2019 9:14 AM | Last Updated on Tue, Apr 9 2019 9:14 AM

TDP Situation In Prakasam And Nellore Districts Is Very  Bad - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌ : ‘ఐదేళ్లలో చేసిందేమీ లేదు. చెప్పుకునేందుకూ ఏమీ లేదు. తెలుగుదేశం నోట మాట రావడం లేదు. అందుకే.. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు నాయకులెవరూ ముందుకు రాలేదు’.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకుల వ్యాఖ్యలు ఇవి. సానుకూల పరిస్థితులు లేకపోవడం.. విజయావకాశాలు అంతంత మాత్రంగానైనా కనిపించకపోవడంతో టీడీపీ నేతలు అధినేతకు ముందుగానే చుక్కలు చూపించారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి.. తగవులను తెచ్చిపెట్టినందుకు ఇప్పుడు శిక్ష అనుభవించం డంటూ పరోక్ష హెచ్చరికలు పంపారు. ఫలానా నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చకపోతే.. రూ.కోట్లు ఖర్చు చేసైనా ఓడిస్తామన్న పలు మండలాల ముఖ్య నాయకులు ఇప్పటికీ అదే మాటపై కొనసాగుతున్నారు. పైకి మాత్రం సర్దుకుపోతున్నామని చెబుతున్నా.. గెలుపునకు కృషి చేయడం లేదని అధిష్టానం గుర్తించిందని స్వపక్షీయులే చెబుతుండటంతో టీడీపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అన్న వైఎస్‌ జగన్‌ భరోసాతో పార్టీ శ్రేణులు ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ అంటూ ఉత్సాహంగా ఉరకలేస్తూ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 

చేతులెత్తేసిన టీడీపీ నేతలు 

నెల్లూరు రైల్వే స్టేషన్‌

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ పరిస్థితి తల్లకిందులైందని.. ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని ఎన్నికలకు ముందే గ్రహించిన నేతలు తమను ఎన్నికల్లో పోటీ చేయమంటారేమోనని ముందుగానే తప్పించుకునే మార్గాల్ని వెతుక్కున్నారు. గెలుపోటముల సంగతెలా ఉన్నా.. తమ వర్గాన్ని నిలబెట్టుకునేందుకు అనివార్యంగా కొందరు ముందుకు వచ్చినా పరిస్థితులు చక్కబడలేదు సరికదా నానాటికీ క్షీణిస్తూ వస్తున్నాయి.

మరోవైపు రెండు జిల్లాల్లోనూ రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన మేకపాటి, ఆనం, నేదురుమల్లి, మాగుంట, నల్లపురెడ్డి, ఆదాల, మానుగుంట కుటుంబాలతోపాటు ఇతర సామాజిక వర్గాల్లోని ముఖ్యులు అన్ని స్థాయిల్లోనూ వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలవటం పార్టీ నాయకులు, శ్రేణుల్లో విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసింది. మరోవైపు సీనియర్‌ నేతలు ఫ్యాన్‌ కిందకు చేరడం, జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయాలకు పూర్తి విలువనిచ్చి.. సిట్టింగ్‌లు సైతం పోటీకి దూరంగా ఉంటూ అభ్యర్థుల విజయానికి సీనియర్లు మార్గదర్శనం చేస్తున్నారు.

ఎన్నికల సీజన్‌ ఆరంభం నుంచీ అభ్యర్థుల వెతుకులాటలో పడిన టీడీపీకి బుజ్జగింపులు, బతిమలాటలతో సమయమంతా సరిపోయింది. పోలింగ్‌ సమయం గంటల్లోకి వచ్చినా టీడీపీ నాయకులకు గెలుపుపై ఏమాత్రం నమ్మకం కుదరడం లేదు. ఒంగోలు, నెల్లూరు లోక్‌సభ స్థానాలు పూర్తిగా.. తిరుపతి, బాపట్ల స్థానాల్లో పాక్షికంగా కలిసి ఉన్న రెండు జిల్లాల్లోని 22 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్‌ సమీపిస్తున్నా సమన్వయం, సహకారం కుదరక టీడీపీ తల్లడిల్లుతోంది. నచ్చీనచ్చని వివాహం కుదిర్చితే.. ప్రతి విషయంలో అలకకు దారితీస్తుందన్నట్లు.. ఒంగోలు, నెల్లూరు లోక్‌సభ స్థానాల నుంచి పోటీకి అభ్యర్థులు లేక శిద్ధా రాఘవరావు, బీద మస్తాన్‌రావు ను చంద్రబాబు బలవంతంగా ఒప్పించారు.

ఫలితంగా ప్రచారపర్వం ఆఖరి క్షణాల్లోనూ వారిలో అసహనం పెరుగుతోందని నేతలు, శ్రేణులు వాపోతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. బాపట్ల ఎంపీ టీడీపీ అభ్యర్థిగా మాల్యాద్రి శ్రీరామ్‌ వద్దని.. ఆయన తాడికొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన అధిష్టానం తిరిగి ఆయనను బాపట్ల నుంచే రంగంలోకి దింపడాన్ని దేనికి సంకేతంగా భావించాలన్న టీడీపీ శ్రేణుల ప్రశ్నలకు నాయకుల నుంచి సమాధానాలు లేవు.

ఒంగోలు ఎంపీ సీటు ససేమిరా నాకొద్దు అన్న శిద్ధా రాఘవరావుకు టీడీపీ అధిష్టానం అనేక హామీలు ఇస్తే గానీ.. పోటీకి అంగీకరించక తప్పలేదని ముఖ్య అనుచరులే గుర్తు చేస్తున్నారు. నెల్లూరు ఎంపీ స్థానం నుంచి బరిలో ఉన్న టీడీపీ నేత బీద మస్తాన్‌రావుది సైతం దాదాపు అదే పరిస్థితి. ఫలితాలపై ముందే ఒక అంచనా ఉన్నప్పటికీ చంద్రబాబు మాటను వారు కాదనలేకపోయారు.

‘మీరు పోటీ చేయండి చాలు. రూ.కోట్లు కుమ్మరించే బాధ్యత నాది’ అని పార్టీ అ«ధ్యక్షుడు హామీ ఇచ్చిన తరువాత కూడా ‘మీ సీట్లు వద్దు.. మీరిచ్చే డబ్బులూ మాకొద్దు మహాప్రభో’ అని కొందరు పారిపోయారంటే ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం పరిస్థితి ఏమిటో అంచనా వేయొచ్చని సీనియర్‌ జర్నలిస్ట్‌ ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు.. ఆ తరువాత కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ఆ తలంపు కూడా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు.  

ఆయనదంతా పచ్చి మోసం 
‘ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు కడపకు ప్రాణపదమైన వెలిగొండ ప్రాజెక్ట్‌ విషయంలో చంద్రబాబు రెండు జిల్లాల పశ్చిమ ప్రాంత ప్రజలను దారుణంగా మోసగించారు. రెండుసార్లు శంకుస్థాపన చేసినా.. పూర్తిగా విస్మరించారు.  అందుకే ఈ ప్రాంత ప్రజలకు టీడీపీపై నమ్మకం లేదు’ అని వి.వెంకటేశ్వరరెడ్డి వాస్తవ పరిస్థితిని వివరించారు.

‘వైఎస్‌ పాలనలో ఎలాంటి మేలు జరిగిందో ప్రజలకు గుర్తుంది. రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులతోపాటు వెలిగొండ పనులు జరిగాయి. భవిష్యత్తులో అయినా వెలిగొండ నీరు  అందాలంటే.. మాట తప్పని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలి’ అని మార్కాపురం వాసిగా కోరుకుంటున్నానని, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పశ్చిమ ప్రాంత వాసుల కోరిక కూడా ఇదేనని వెంకటేశ్వరరెడ్డి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

నడివయసులో ఉన్న బత్తాయి తోటల నుంచి మంచి దిగుబడి, ఆదాయం పొందాల్సిన తాను కరువు వల్ల తోటల్ని నరికేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పెద్దారవీడుకు చెందిన శివారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ‘అందుకే యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కందుకూరు, ఉదయగిరి తదితర పశ్చిమ నియోజకవర్గాల రైతులు, ప్రజలు వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి.. మా ఆశలను నిలబెట్టే  మొనగాడి కోసం ఎదురుచూస్తున్నారు’ అని శివారెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. 

ప్రకాశం బ్యారేజీ

ఐదేళ్లలో ఏం చేశారని..
‘భారీ పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. దుగరాజపట్నం పోర్టును చంద్రబాబు పట్టించుకోలేదు. వైఎస్‌ హయాంలో కృష్ణప ట్నం పోర్టు నిర్మాణం వంటి ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. ఆ తరహాలో ఒక్కటైనా చంద్రబాబు హయాంలో ఉందా’ అని నిరుద్యోగి ఎం.రాజశేఖర్‌ ప్రశ్నించారు. ‘చిత్తూరు, నెల్లూరు జిల్లాల నడుమ శ్రీసిటీ సెజ్‌ వచ్చింది. రెండు జిల్లాల్లోని యువత, మహిళల్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎందరికో జీవన భృతి సా«ధ్యమైంది. ఆ కోవలో ఒక్కటంటే ప్రాజెక్ట్‌ చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు’ అని కేఎన్‌వీ వసుంధర అనే విద్యావేత్త నిలదీశారు. 

పాడి పరిశ్రమ వెన్ను విరిచారు 
‘ప్రకాశం జిల్లా కరువుకు కేరాప్‌ అడ్రస్‌        లాంటిది. పాడి పరిశ్రమ ఇక్కడి వారికి ఆధారం. ఇలాంటి చోట మిల్క్‌ డెయిరీని పడకేయించింది ఈ ప్రభుత్వం. పాడి రైతులకు రూ.45 కోట్ల వరకు ఉన్న బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి.. రూ.5 కోట్లు కూడా ఇవ్వలేదు. వైఎస్‌ హయాంలో సుబాబుల్‌ టన్నుకు రూ.4 వేల ధర వచ్చింది. ఇప్పుడు రూ.2,500 రావడం కూడా గగనమైంది.

ఐదు నెలలుగా అధికారిక కొనుగోళ్లు లేవు. కందుల కొనుగోళ్లలో అవినీతి. ఇంత రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు’ అని మద్దిపాడుకు చెందిన చుండూరి రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్‌ నీళ్లు కూడా ఇవ్వడం చేతకాని నాయకత్వం ఉందని దర్శికి చెందిన కొండయ్య ఎద్దేవా చేశారు.

రైతులకు మద్దతుగా నిలిచే నాయకత్వాన్ని తాము కోరుకుంటున్నామని, వైఎస్‌ జగన్‌ ద్వారా మేలు కలుగుతుందనే భరోసా ఉందని రైతు సంఘం నాయకుడు వెంకట్రావు ముక్తాయించారు. మత్స్యకారులకు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు ఆమోదయోగ్యంగా ఉన్నాయని.. తీరప్రాంత మత్స్యకారులు ఆయన వైపు పూర్తిగా మొగ్గు చూపుతున్నారని ఉలవపాడుకు చెందిన బ్రహ్మయ్య, కృష్ణ పేర్కొన్నారు.  
 
నోట్లు విరజిమ్ముతున్నా...  
‘మా ఊరాయన మంత్రి. మూడేళ్లు మా వైపు చూడలేదు. ఇప్పుడు నోట్లు విరజిమ్మి ఓట్లు కొల్లగొడతారట. నెల్లూరోళ్లను అంత తక్కువగా అంచనావేస్తే ఎలా’ అని న్యాయవాది శీనయ్య అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే నగర వాసుల మనోగతం అర్థమవుతుంది. పోలీస్‌ వాహనాల్లో తీసుకొచ్చి నోట్లు విరజిమ్ముతున్నారు. కానీ.. జనాభిమానం ముందు ఇలాంటివేమీ పనిచేయదు’ అని ఒంగోలుకు చెందిన సీనియర్‌ వైద్యుడు వేణు అన్నారు. 

ఉత్సాహంతో ఉరకలు 
వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచీ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మెజార్టీ ప్రజలు పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఈసారి వర్గాలకు అతీతంగా ప్రజానీకం మొత్తం వైఎస్సార్‌ సీపీకి నీరాజనం పడుతోంది. వైఎస్‌ హయాంలో ఈ రెండు జిల్లాలకు జరిగిన మంచిని మననం చేసుకుంటూ.. మాట తప్పని, మడమ తిప్పని జగన్‌ గుణాన్ని గుర్తు చేసుకుంటూ తమకంతా మంచే జరుగుతుందనే భరోసాతో.. రెట్టింపు ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ఉరకలేస్తున్నారు. ‘నవరత్నాలు’ తమ కుటుంబాల పాలిట ఆణిముత్యాలుగా మారతాయనే ఆశాభావం అన్నివర్గాల్లో వ్యక్తమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement