సాక్షి, అమరావతి/పెనుకొండ రూరల్ : ఇంటింటా ఘన స్వాగతాలు.. ఆత్మీయ పలకరింపులు.. మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాల మధ్య ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో 46 నెలల్లో సీఎం వైఎస్ జగన్ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మేలును వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఏడో రోజుకు చేరుకుంది.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, వలంటీర్లు, గృహసారథులతో కూడిన జగనన్న సైన్యానికి ప్రతి ఇంటా కుటుంబ సభ్యులు ఎదురేగి ఆత్మీయ స్వాగతం పలికారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలుచేయకుండా మోసం చేశారని.. కానీ, సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా ఇప్పటికే అమలుచేశారని అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, అన్నదమ్ములు ప్రశంసించారు.
ద్రోహానికి చంద్రబాబు మారు పేరైతే.. సీఎం జగన్ విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ అని అక్కాచెల్లెమ్మలు కొనియాడారు. సంక్షేమ పథకాల ద్వారా చేయూతనిస్తూ ఆర్థిక సాధికారత.. అమ్మఒడి, విద్యాదీవెన తదితర పథకాల ద్వారా విద్యా సాధికారత.. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకూ సింహభాగం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి రాజకీయ సాధికారత.. ఆసరా వంటి పథకాలు, పరిపాలనలో భాగస్వామ్యం చేయడం ద్వారా మహిళా సాధికారత తద్వారా సామాజిక సాధికారతకు సీఎం జగన్ బాటలు వేస్తూ.. దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నారంటూ ప్రజలు ప్రశంసించారు.
ప్రభుత్వానికి మద్దతుగా 40 లక్షల మిస్డ్‌కాల్స్..
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ సర్కార్‌కూ వైఎస్ జగన్ ప్రభుత్వానికి మధ్య తేడాలను వివరిస్తూ కుటుంబ సభ్యులకు కరపత్రాన్ని అందిస్తున్నారు. ఆ తర్వాత ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలోని ఐదు ప్రశ్నలను చదివి.. ఆ కుటుంబ సభ్యుల అభిప్రాయాలను అడుగుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో జగన్ పరిపాలిస్తున్నారని.. మళ్లీ సీఎంగా ఆయన్నే గెలిపిస్తామంటూ తమ అభిప్రాయాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేయిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక.. గృహసారథులు ఇచ్చిన రశీదు తీసుకుని.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960–82960 నెంబర్‌కు మిస్డ్‌కాల్స్ ఇస్తున్నారు.
ఆ తర్వాత వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌ను అడిగి మరీ తీసుకుని.. తమ ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్‌లకు అతికించుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఆరో రోజు ముగిసేసరికి అంటే బుధవారం నాటికి 40 లక్షల కుటుంబాలకు పైగా సీఎం వైఎస్ జగన్ పాలనకు, ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960–82960 నెంబర్‌కు మిస్డ్‌కాల్స్ ఇచ్చారు.
మా ఇంటికి జగనన్న స్టిక్కర్ వేయండి
‘అన్నా... నేను బతుకుదెరువు కోసం కువైట్‌లోని ఖతార్‌లో ఉంటున్నా. అలాగని మా ఇంటికి జగనన్న స్టిక్కర్ వేయకుండా వెళ్లకండి. తప్పకుండా అన్న స్టిక్కర్ మా ఇంటి గోడకు ఉండాలి. రానున్న ఎన్నికల నాటికి నేనూ తప్పకుండా వస్తా. అన్న కోసం మీతో ప్రచారం చేస్తా.. ఆయన పేదల దేవుడు’.. అంటూ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కొండంపల్లి గ్రామానికి చెందిన గొర్ల మంజుల స్థానిక నేతలను వాట్సాప్ ద్వారా కోరారు.
రాష్ట్రంలో ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం జోరుగా సాగుతున్న విషయాన్ని ఈ–పేపర్ ద్వారా తెలుసుకున్న ఆమె గురువారం రాత్రి స్థానిక నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్ తన ఇంటికీ అతికించాలని కోరారు. ఈ ఆడియో ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. – ఖతార్ నుంచి కోరిన మహిళా అభిమాని
Comments
Please login to add a commentAdd a comment