మా ఓటు మేం వేసుకునేలా అవకాశం కల్పించండి.. | Give Us The Opportunity To Vote This Time | Sakshi
Sakshi News home page

మా ఓటు మేం వేసుకునేలా అవకాశం కల్పించండి..

Published Sun, May 19 2019 11:34 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

Give Us The Opportunity To Vote This Time - Sakshi

వెంట్రామాపురంలో ఎన్నికల అబ్జర్వర్‌ను ప్రాధేయపడుతున్న దళితులు

‘మా పార్టీకి ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. మీరు ఏ పార్టీకి ఓటు వేశారో.. తెలిసిపోతుంది. రేపటి నుంచి మా పొలాల్లోకి పనులకు రావాలి.. ఒక్కడినీ వదలం.. మా పార్టీకే ఓటు వేస్తామని మర్యాదగా వచ్చి దేవుని పటాల ముందు ప్రమాణం చేయండి. అలా చేయనివాడు ఆ పార్టీ మనిషిగా ఉన్నట్టే.. చెబుతున్నాం కదా.. తోక జాడిస్తే భూమిపైన ప్రాణాలే ఉండవు’.. రీ–పోలింగ్‌ జరగనున్న ఎన్‌ఆర్‌ కమ్మపల్లి దళితవాడలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు శనివారం చేసిన హెచ్చరికలు ఇవి. ఆదివారం రీ–పోలింగ్‌ జరిగే గ్రామాల్లో తీవ్రఉత్కంఠ నెలకొంది.
తిరుపతి రూరల్‌: బెదిరింపులు.. హెచ్చరికలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రీపోలింగ్‌ గ్రామాల్లోని దళితులు, గిరిజనులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. టీడీపీకి ఓటు వేయాలని ఆ పార్టీ నాయకులు దేవుని పటాలు ముందు పెట్టి దళితుల చేత బలవంతంగా ప్రమాణాలు చేయించారు. ప్రమాణాలు చేయని వారిపై మరోసారి దాడులకు యత్నించారు. ఇలా ఈ ఒక్క గ్రామంలోనే కాదు రీ–పోలింగ్‌ జరుగుతున్న కమ్మపల్లి, వెంకట్రామాపురం, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ గ్రామాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆ పల్లెల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 
ఈసారైనా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేనా? 
బెదిరింపులు.. హెచ్చరికలు.. ప్రమాణాల మధ్య రీ–పోలింగ్‌ జరగనున్న గ్రామాల్లో దళితులు, గిరిజనులు భయాందోళనల మధ్య నలిగిపోతున్నారు. ఉన్నతాధికారులు, వందలాది మంది పోలీసులున్నా దళితులు, గిరిజనుల్లో ఆత్మస్థైర్యం కల్పించలేకపోతున్నారు. బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దళిత, గిరిజనులు ఈసారైనా స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వారు వినియోగించుకునే అవకాశం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
మాకు ఓటు అవకాశం కల్పించండి
‘‘ఓటు వేయడానికి వెళితే దాడులు చేస్తున్నారు. ఏళ్లతరబడి మా ఓటును బలవంతంగా లాక్కుంటున్నారు. రిగ్గింగ్‌ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎదురు తిరిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. మాపై దాడులు చేసి, ఎన్నికల సమయంలో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు ఇచ్చినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. గతంలో దాడులు చేసిన వారే, గత నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా మా ఓటు మేం వేసుకోకుండా రిగ్గింగ్‌ చేసుకున్నారు.

వారి పాపం పండింది. ఎన్నికల సంఘం కన్నెర్ర చేయడంతో రీ–పోలింగ్‌ వచ్చింది. ఈసారైనా మా ఓటు మేం వేసుకునేలా అవకాశం కల్పించండి’’...అంటూ ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దేవేంద్రకుమార్‌సింగ్‌ను  కమ్మపల్లి దళితవాడ ప్రజలు వేడుకున్నారు. శనివారం ఆయన్ని కలిసి విన్నవించుకున్నారు. న్యాయం చేయాలని కోరారు. 
నిబంధనలు అతిక్రమిస్తే.. క్రిమినల్‌ కేసులు...
ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ దేవేంద్రకుమార్‌సింగ్‌ పిలుపునిచ్చారు. ఓటర్లను అడ్డుకున్నా.. వారిని బెదిరించినా, భయపెట్టినా, వారిపై దాడులు చేసినా నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సంఘం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
సి.కాలేపల్లి, కుప్పం బాదూరులోనూ రీ–పోలింగ్‌..
రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు కాలేపల్లి, కుప్పంబాదూరు గ్రామాల్లోనూ రీ–పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆమేరకు శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు గ్రామాల్లోనూ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. హడావుడిగా చేసిన  రీ–పోలింగ్‌ ప్రకటనపై ఆ గ్రామాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

రీ–పోలింగ్‌ విషయం శనివారం సాయంత్రం వరకు కూడా ఆ గ్రామాల్లో ప్రజలకు సమాచారం లేదు. పోలీసులు, ఎన్నికల అధికారుల హడావుడితో ఆరా తీసిన గ్రామస్తుకు రీ–పోలింగ్‌ విషయం తెలుసుకుని అవక్కాయ్యారు. రీ–పోలింగ్‌ కోరిన పులివర్తి నానిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement