Schedule Tribes
-
పరీక్ష ఫీజు వసూలుపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి వెలువరించిన నోటిఫికేషన్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు పరీక్ష ఫీజు వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. 2023, నవంబర్ 25న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజుగా రూ.450ని నిర్థారించింది. అయితే ఈ నోటిఫికేషన్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ జె.విప్లవ్‌బాబు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. 1985, జూలై 1 నాటి నోటిఫికేషన్ ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్ష/ఎంపిక కోసం పరీక్ష రుసుము చెల్లించకుండా మినహాయించారని పిటిషనర్ వాదించారు. ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించేలా ప్రతివాదులను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుకు తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను జారీ చేసేలా ప్రతివాదులను ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. -
ఈ మంటలు ఆర్పండి!
నెలన్నర దాటిపోయింది. ఇప్పటికి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర బలగాలకు తోడు కేంద్ర బలగాలు రంగంలోకి దిగి చాలాకాలమైంది. సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి వచ్చి పర్యటించారు. అయినా పరిస్థితి మారలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇవాళ్టికీ అగ్నిగుండమై మండుతోంది. శాంతిభద్రతలు క్షీణించి, మూకస్వామ్యం రాజ్యమే లుతోంది. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా ఇవ్వాలంటూ మైతై తెగ ప్రజలు చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా మే మొదటివారంలో జరిగిన గిరిజనుల ప్రదర్శన హింసాత్మకంగా మారినప్పుడు మొదలైన ఈ జ్వాల మణిపూర్‌లోని తెగల మధ్య చీలికలను ఎత్తిచూపింది. మరి, ఈ మంటల్ని చల్లార్చి, శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత తల మీద ఉన్న సర్కారు ఇప్పటి దాకా ఏం చేసినట్టు? సమస్యను చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక వర్గం వైపు నిలబడి, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. కుకీలు ఎక్కువుండే కొండ ప్రాంత జిల్లాల నుంచి మైతైలు వలసపోతుంటే, మరోపక్క మైతైలు అధికంగా ఉండే ఇంఫాల్ లోయ నుంచి కుకీలు తరలిపోతున్నారు. కేంద్ర మంత్రి నివాసం సహా రెండు వర్గాలకు చెందిన 4 వేల గృహాలు ఇప్పటికే అల్లర్లలో అగ్నికి ఆహుతి అయ్యాయి. శరణార్థి శిబిరాలు కిక్కిరిశాయి. అమాత్యుడి ప్రైవేట్ నివాసంపై దాడి గత మూడు వారాల్లో ఇది రెండోసారి. జాతుల మధ్య విద్వేషం ఇంతగా పెచ్చరిల్లుతుంటే, కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా అధికారంలో ఉన్న పాలకపక్షం ఏం చేస్తోందన్నది ప్రశ్న. నిజానికి, కేంద్ర హోమ్ మంత్రి ఇటీవలే సంక్షుభిత మణిపూర్‌ను సందర్శించినప్పుడు, సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్నా ఆ ఆశ నెరవేరలేదు. భౌగోళికంగా బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ల మధ్య చిక్కిన ఈశాన్య రాష్ట్రాల్లో తెగల మధ్య తరచూ ఘర్షణలు కొత్త కావు. 1949లో భారత యూనియన్‌లో చేరినప్పటి నుంచి మణిపూర్‌లోనూ అవి ఉన్నవే. కానీ, మధ్యవర్తులుగా ఉండాల్సినవారే తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అనుమా నంతో ఇరువర్గాల మధ్య విశ్వాసం సన్నగిల్లడం విషాదం. అపనమ్మకం నిండినచోట భద్రతా దళాలైనా తగిన చర్యలు చేపట్టడం కష్టం. మణిపూర్ రైఫిల్స్ సహా రాష్ట్ర పోలీసు బలగాలు మైతైలకే మద్దతుగా నిలుస్తున్నాయని కుకీల భావన. మైతైలేమో కుకీ ప్రాబల్య పర్వత ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా గంజాయి సాగు చేస్తున్నా అస్సామ్ రైఫిల్స్ చూసీ చూడనట్టున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది చాలదన్నట్టు భద్రతాదళాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. పారా మిలటరీ దళాలు తమ పనిలో జోక్యం చేసుకుంటున్నాయని పోలీసుల ఆరోపణ. వెరసి, పాలన మృగ్యమైన మణి పూర్లో నేటికీ రహదారులు సాయుధ మూకల నియంత్రణలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్రిక్తతల్ని చల్లబరచడానికి పాలకుల వైపు నుంచి ఏ మాత్రం ప్రయత్నాలు జరుగుతు న్నాయంటే అనుమానమే. ఎంతసేపటికీ దీన్ని శాంతి భద్రతల సమస్యగానే వారు చూస్తున్నారు. అది పెద్ద చిక్కు. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలో ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పదే పదే విఫలమైనా, కేంద్రం ఉపేక్షించింది. విద్వేషాగ్నిలో ఈశాన్యం కాలిపోతున్నా, మూడు వారాల పైచిలుకు తర్వాత కానీ హోమ్ మంత్రి అక్కడకు రాకపోవడం ఏ రకంగా సమర్థనీయం? కొన్ని వారాలుగా ఇలా ఉన్నా ప్రధాని తన రాజకీయ సభల్లో కానీ, ఇతరత్రా కానీ ఎక్కడా మణిపూర్ ఊసే ఎత్తలేదు. మాటల ద్వారా మనుషుల మధ్య మత్సరం తగ్గించాల్సిన వేళ పాలకులు మౌనముద్ర దాల్చడం విడ్డూరమే! గౌహతి హైకోర్ట్ రిటైర్డ్ ఛీఫ్ జస్టిస్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘం వేయడం బాగానే ఉంది. కానీ, రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో శాంతి సంఘం ఏర్పాటుకు మాత్రం ఆదిలోనే హంసపాదు పడింది. పక్షపాత సీఎం సభ్యుడిగా ఉన్న కమిటీలో తాము ఉండబోమనేది కుకీ ప్రతినిధులు తేల్చేశారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో బీరేన్ ఆలోచించుకోవాలి. 2017లో తొలి విడత సీఎంగా ఎన్నికైనప్పుడు గిరిజనవాసులతో సన్నిహితంగా మెలిగిన ఆయన 2022లో రెండో విడత అధికారం చేపట్టాక వైఖరి మార్చారు. ప్రభుత్వస్థలంలో ఆక్రమణల పేరిట ఇంఫాల్‌లో చర్చిలతో సహా అనేకం కూల్చివేతకు ఆదేశించి, కుకీలకు కోపకారణమయ్యారు. సంఖ్యాపరంగా మైతైలున్నందున మెజారిటీ వాదాన్ని స్థానిక గిరిజన తెగలపై రుద్దుతున్నారనే భావన కలగడమూ సమస్యకు కారణమైంది. మైతైలకు ఎస్టీ హోదానిచ్చే అంశం పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్ట్ చెప్పింది సరే, ఆ వివాదా స్పద నిర్ణయంతో తెగల మధ్య అశాంతి నెలకొంటుందని ఊహించకపోవడం ప్రభుత్వ తప్పిదమే. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పర్యవసానాలు ఊహించి సంబంధిత వర్గాల మధ్య అపోహల్ని ముందే తొలగించడం కీలకం. పాలకులు అక్కడే విఫలమయ్యారు. అనుమానాలు పెను భూతాలై, పరిస్థితిని ఇంతదాకా తెచ్చారు. ఇంటర్నెట్పై నిర్బంధాల నేపథ్యంలో క్షేత్రస్థాయి వార్తలు సరిగ్గా తెలియకపోగా, అసలు కథ వదిలేసి దీన్ని రెండు మతాల మధ్య ఘర్షణగా చిత్రించే ఘోర తప్పి దాలూ సాగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రం కలగజేసుకోవాలి. అన్ని తెగలకూ రాజ్యాంగ రక్షణ ఉందన్న భరోసా కల్పించాలి. మూలన విసిరేసినట్టుగా ఉన్న ఆ ప్రాంతాలనూ, ప్రజలనూ పరాయి వారుగా చూసే ధోరణి మారాలి. అక్కడి విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను గౌర విస్తూ, దేశంలో తామూ భాగమనే అభిప్రాయం ఆ ప్రజల్లో కల్పించాలి. మరి, ఆ దిశగా శాంతి స్థాపనకు ఇకనైనా పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అన్నది మాటలకే పరిమితం కాదన్న నమ్మకం వివిధ తెగల మధ్య కల్పిస్తారా? -
Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్ హోస్టెస్
కేరళలో కేవలం పదిహేను వేల మంది ఉండే గిరిజనులు ‘కరింపలనులు’. పోడు వ్యవసాయం, కట్టెబొగ్గు చేసి అమ్మడం వీరి వృత్తి. అలాంటి సమూహం నుంచి ఒకమ్మాయి ‘ఎయిర్‌హోస్టెస్’ కావాలనే కల కంది. కేరళలో అప్పటి వరకూ గిరిజనులు ఎవరూ ఇలాంటి కలను కనలేదు. 12 ఏళ్ల వయసులో కలకంటే 24 ఏళ్ల వయసులో నిజమైంది. పరిచయం చేసుకోండి కేరళ తొలి గిరిజన ఎయిర్‌హోస్టెస్‌ని. కేరళలోని కన్నూరు, కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ‘కరింపలనులు’. వీళ్లు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాషను మాట్లాడతారు. అటవీ భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. లేదంటే అడవిలోని పుల్లల్ని కాల్చి బొగ్గు చేసి అమ్ముతారు. గోపికా గోవింద్ ఇలాంటి సమూహంలో పుట్టింది. అయితే ఈ గిరిజనులకు ఇప్పుడు వ్యవసాయం కోసం అటవీభూమి దొరకడం లేదు. కట్టెలు కాల్చడాన్ని ఫారెస్టు వాళ్లు అడ్డుకుంటూ ఉండటంతో బొగ్గు అమ్మకం కూడా పోయింది. చిన్నప్పుడు అమ్మా నాన్న చేసే ఈ పని చూస్తూ పెరిగిన గోపికా ఇక్కడతో ఆగడమా... అంబరాన్ని తాకడమా అంటే అంబరాన్ని తాకడమే తన లక్ష్యం అని అనుకుంది. డిగ్రీ తర్వాత బిఎస్సీ చదివిన గోపిక ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ కావాలంటే అవసరమైన కోర్సు గురించి వాకబు చేసింది. ప్రయివేటు కాలేజీలలో దాని విలువ లక్షల్లో ఉంది. కూలి పని చేసే తల్లిదండ్రులు ఆ డబ్బు కట్టలేరు. అందుకని ఎం.ఎస్సీ కెమిస్ట్రీ చేరింది. చదువుతున్నదన్న మాటేకాని ఎయిర్ హోస్టెస్ కావడం ఎలా... అని ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా అప్పుడే ఐ.ఏ.టి.ఏ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) వాళ్ల కస్టమర్ సర్వీస్ కోర్సును గవర్నమెంట్ స్కాలర్షిప్ ద్వారా చదవొచ్చని తెలుసుకుంది. ఎస్.టి విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అప్లై చేసింది. స్కాలర్షిప్ మంజూరు అయ్యింది. గోపిక రెక్కలు ఇక ముడుచుకు ఉండిపోలేదు. లక్ష రూపాయల కోర్సు వాయనాడ్‌లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్సును స్కాలర్షిప్ ద్వారా చేరింది గోపిక. చదువు, బస, భోజనం మొత్తం కలిపి లక్ష రూపాయలను ప్రభుత్వమే కట్టింది. మలయాళ మీడియం లో చదువుకున్న గోపిక ఎయిర్ హోస్టెస్‌కు అవసరమైన హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా తర్ఫీదు అయ్యింది. కోర్సు పూర్తి చేసింది. ఒకసారి ఇంటర్వ్యూకు వెళితే సెలెక్ట్ కాలేదు. రెండోసారి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికయ్యింది. విమానం ఎప్పుడూ ఎక్కని గోపిక విమానంలోనే ఇక పై రోజూ చేసే ఉద్యోగం కోసం తిరువనంతపురం నుంచి ముంబైకి ట్రైనింగ్ కోసం వెళ్లింది. అక్టోబర్‌లో ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని విమానంలో మనకు తారస పడొచ్చు. ఆమె కలను ఆమె నెరవేర్చుకుంది. ఇక మీ వంతు. 8వ క్లాసు కల గిరిజనులు విమానాన్ని గాల్లో ఎగురుతుంటే చూస్తారు తప్ప ఎక్కలేరు. గోపికా గోవింద్ కూడా చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఉత్సాహంగా, వింతగా చూసేది. అందులో ఎక్కడం గురించి ఆలోచించేది. 8వ క్లాసుకు వచ్చినప్పుడు ఒక పేపర్లో ఎర్రటి స్కర్టు, తెల్లటి షర్టు వేసుకున్న ఒక చక్కటి అమ్మాయి గోపికా కంట పడింది. ఎవరా అమ్మాయి అని చూస్తే ‘ఎయిర్ హోస్టస్’ అని తెలిసింది. విమానంలో ఎగురుతూ విధి నిర్వహణ. ఇదేకదా తనకు కావాల్సింది అనుకుంది. కాని ఎవరికైనా చెప్తే నవ్వుతారు. బొగ్గులమ్ముకునే వాళ్ల అమ్మాయికి ఎంత పెద్ద కల అనుకుంటారు. అందుకని సిగ్గుపడింది. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. కాని కల నెరవేర్చుకోవాలన్న కలను మాత్రం రోజురోజుకు ఆశ పోసి పెంచి పెద్ద చేసుకుంది. -
ఈసురోమని మనుషులుంటే...
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి అనేక సమస్యలకు నిలయాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు నేడు అంతకు రెండింతల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో 2022–2023 వార్షిక బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు పక్కా భవ నాల నిర్మాణం, వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నెలకొల్పిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు 90% శాతం ప్రైవేటు అద్దె బిల్డింగు లలో కొనసాగుతున్నాయి. కొన్ని గురుకులాల్లో తరగతి గది, వసతి గది (డార్మెటరీ) రెండూ ఒకటే. ఇక సంక్షేమ హాస్టళ్ల విషయానికి వస్తే... అవి సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గతంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్ల పేరుతో కొన సాగిన హస్టళ్ళు, నేడు పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లుగా మారాయి. సంక్షేమ వసతి గృహాలలో కొన్నింటిని 1990 ప్రాంతంలో రేకుల షెడ్డులుగా నిర్మించగా... ఇవ్వాల అవి శిథిలావస్థకి చేరాయి, మెజారిటీ హాస్టళ్లు ప్రైవేటు అద్దె బిల్డింగులలో కొనసాగుతున్నాయి. అద్దె బిల్డింగుల సముదా యాలు వ్యాపార సంబంధిత అవసరాలకై నిర్మించినవి కావడంతో కనీస వసతి సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తల్ల డిల్లిపోతున్నారు. మా క్షేత్ర స్థాయి పరిశీలనలో... గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో 22 బాలుర హాస్టళ్లు, 16 బాలికల హాస్టళ్లు పూర్తిగా ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. పదవ తరగతిలోపు విద్యార్థు లుండే ప్రీ మెట్రిక్ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు బాల బాలికలవి 12 ఉండగా... ఇందులో మూడు మాత్రమే ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు భవనాలలో ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 24 ఉండగా, ఇందులో 23 హాస్టళ్లు ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. ఈ ప్రైవేట్ బిల్డింగు లలో కనీస సౌకర్యాలు లేక పోగా, ప్రతి నెల అద్దె లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. ఈ డబ్బుతో ప్రభుత్వ హాస్టళ్లు నిర్మించ వచ్చు. కానీ ఆ పని చేయడంలేదు. హాస్టళ్లలో రీడింగ్ రూమ్‌లు, లైబ్రరీలు, స్టడీ టేబుళ్లు, కుర్చీల సమస్యలు వెంటాడుతున్నాయి. గురుకులాల్లో కంప్యూ టర్ బోధన పేరుకు మాత్రమే సాగుతోంది. సంక్షేమ హస్టళ్ళలో చదువుతున్న పదవతరగతిలోపు విద్యార్థులకు రూ. 62 మాత్రమే కాస్మోటిక్స్ చార్జీలు ఇస్తుండగా... పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వటం లేదు. నెల నెలా కాస్మోటిక్స్ కొనుక్కో వడానికి, బస్ పాస్, ఇంటర్నెట్ రీచార్జీ తదితర అవసరాలు నెరవేర్చుకోవడానికైప్రభుత్వం ఎలాంటి స్టైఫండ్ ఇవ్వక పోవడంతో విద్యార్థులు కూలీ పనులకు వెళ్తూ అర్ధ కార్మికు లవుతున్నారు. ఇటీవల పనికి వెళ్లొస్తున్న అంబర్‌పేట హాస్టల్ విద్యార్థి యాక్సిడెంట్లో మరణించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. చాలా హాస్టళ్లకు రెగ్యులర్ వాచ్ మెన్, వాచ్ ఉమెన్, ఇతర సిబ్బంది లేరు, హాస్టళ్లలో వైద్యసదుపాయాలు అందుబాటులో లేవు. సంక్షేమ హాస్టళ్లలో ప్రీ మెట్రిక్ విద్యార్థులకు భోజన ఖర్చులకు రోజుకు రూ. 35 ఇస్తుండగా, కాలేజి విద్యార్థులకు రూ. 50 ఇస్తున్నారు. విద్యార్థులు ఈ ఖర్చుతోనే ప్రతిరోజూ మూడుసార్లు భోజనం చేయాలి. మధ్యాహ్నం, సాయంత్రం భోజనం మెనూలో కూరగాయలతో కూర వండాల్సి ఉండగా... చాలా వసతి గృహాల్లో పప్పుతోనే సరిపెడు తున్నారు. మూడు పూటలా బియ్యంతో తయారైన ఆహారాన్నే తినటంతో... కార్బోహైడ్రేట్లు తప్ప శరీరానికి అందవలసిన మిగతా విటమిన్లు ఏ, సీ, బీ–కాంప్లెక్స్; ప్రొటీన్స్, కొవ్వులు ఇతర పోషకాలు తగినంతగా పిల్లలకు అందటంలేదు. భారత దేశంలోని పిల్లలందరి మనుగడ, పెరుగుదల, అభివృద్ధి, సామర్థ్యాలకు ఉపకరించే పోషకాహార విధానం లేదని యుని సెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్) 2016–18 ప్రకారం పాఠశాలలకు వెళ్లే పిల్లల పోషక స్థితి గమనిస్తే 21.9 శాతం మంది పిల్లలు కుంగిపోతున్నారని తేలింది. చాలామంది అండర్ వెయిట్‌కి చేరి రోగాల బారిన పడుతున్నారు. ‘‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడు నోయ్’ అన్న గురజాడ మాటలు అందరూ ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. సరైన తిండి, బట్ట, వసతి సౌకర్యాల లేమితో బలహీనంగా తయారవుతున్న రేపటి పౌరులను ఆదుకోవలసిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే కదా! కె. ఆనంద్ వ్యాసకర్త పి.డి.ఎస్.యు. (విజృంభణ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొబైల్: 96523 57076 -
BJP: తెలంగాణ టార్గెట్ 31
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా వర్గాల ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి, స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ సీట్లలో పాగా వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లపాటు ఆ నియోజకవర్గాల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి ఒక రోడ్‌మ్యాప్‌ను, ఫార్మూలాను ఖరారు చేయనుంది. ఈ సీట్లలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు, ఆయా స్థానాల్లో బీజేపీ పరిస్థితి ఏమిటన్న దానిపై లోతైన అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గాలతోపాటు మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు దోహదపడే అంశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తోంది. ముందుగానే అభ్యర్థుల ఎంపిక దిశగా.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలవారీగా విస్తృత కసరత్తు ద్వారా బలమైన అభ్యర్థులను గుర్తించి ముందు నుంచే వారిని పోటీకి సిద్ధం చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఆయా స్థానాలకు సంబంధించి పార్టీలో బలమైన అభ్యర్థులు లేని చోట్ల, ఆయా సీట్లలో ఎవరైతే గెలిచే అవకాశాలున్నాయి, ఏ పార్టీ వారిని చేర్చుకొని సీటిస్తే పక్కాగా విజయం సాధించవచ్చు వంటి అంశాలపై కసరత్తు చేపడుతోంది. కనీసం 10 సీట్లు కైవసం చేసుకొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలు, కార్యక్రమాలను సిద్ధం చేసుకోనుంది. ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో అమలు కాని అంశాలపై విశ్లేషణకు కమలదళం సిద్ధమవుతోంది. దళితులకు ఇచ్చిన మూడెకరాల చొప్పున భూకేటాయింపు హామీ, దళితబంధు కింద రూ. 10 లక్షలు ఖాతాల్లో డిపాజిట్ అంశాలను ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాల ద్వారా ఎండగట్టాలని నిర్ణయించింది. ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంపుదల, ఇతర హామీల అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసేలా నిరసనలు చేపట్టాలని భావిస్తోంది. 28న పార్టీ ముఖ్యుల భేటీ.. ఈ నెల 28న రాష్ట్రంలోని ఎస్సీ అసెంబ్లీ సీట్లపై కూలంకష పరిశీలనకు ఎస్సీ నేతలు, పార్టీ ముఖ్యనేతలతో బీజేపీ అంతర్గత భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి స్పష్టమైన కార్యాచరణను ఖరారు చేయనున్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఏళ్లుగా ప్రధాన స్రవంతికి దూరంగా ఉండిపోయినా వారికి... రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రిజర్వేషన్లు రూపంలో సమాన అవకాశాలు కల్పించాలని చూస్తున్నామని, దీనికి తగిన దారి చూపించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పదోన్నతుల సమయంలో ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రానికి కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లపై జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫు అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ... పదోన్నతుల్లో రిజర్వేషన్లపై తగిన మార్గదర్శకాలు రూపొందించకపోతే సమస్యలు తీవ్రం అవుతాయని, ఎప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని తెలిపారు. చదవండి: (గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా) ‘‘పదోన్నతులు మెరిట్ ఆధారంగా తప్ప భర్తీ చేయడం లేదు. కానీ ఏళ్ల తరబడి ఓ వర్గం వెనకబడిపోయింది. దేశప్రయోజనాలు, రాజ్యాంగ ప్రయోజనాల దృష్ట్యా సమానత్వం తీసుకురావాలి. దామాషా ప్రాతినిధ్యంతోనే సమానత్వం వస్తుంది’’ అని వేణుగోపాల్ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఓ సూత్రం కావాలని, ఒక వేళ నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని వేణుగోపాల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. -
AP: బడుగుల భద్రతలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: దళితులు, గిరిజనులకు పూర్తి భద్రత.. సామాజికంగా భరోసా.. రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ.. ఇదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపడుతోంది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడినా పర్వాలేదనే టీడీపీ ప్రభుత్వ హయాంలోని పరిస్థితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమూలంగా సంస్కరించింది. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అప్రతిహతంగా సాగిన దళితులు, గిరిజనుల హక్కుల హననానికి అడ్డుకట్ట వేసింది. ఎస్సీ, ఎస్టీలపై నేరాలను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నది. 2014–19 మేతో పోలిస్తే 2019 జూన్ నుంచి 2021 జూలై వరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలకు భద్రత కల్పించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరుస్తోందని జాతీయ క్రైమ్‌రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థతకు తార్కాణంగా నిలుస్తోంది. 2019 నుంచి తగ్గిన కేసులు రాష్ట్రంలో 2015–19తో పోలిస్తే 2019–21లో దళితులు, గిరిజనులపై దాడులు, ఇతర వేధింపులు గణనీయంగా తగ్గాయి. గత ఆరేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు అత్యల్పంగా 2021లోనే నమోదు కావడం విశేషం. 2015తో పోలిస్తే 2020లో దళితులు, గిరిజనులపై నేరాలు 13శాతం తగ్గాయి. ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను కేటగిరీలవారీగా పరిశీలిస్తే నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లో హత్య కేసులు 40శాతం, అత్యాచారం కేసులు 15శాతం తగ్గాయి, దాడులు 6శాతం, గృహదహనాలు 38శాతం, ఎస్సీ, ఎస్టీ వేధింపులు 18శాతం, ఇతర కేసులు 12శాతం తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. తప్పు చేస్తే పోలీసులైనా కఠిన చర్యలే.. ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడితే పోలీసులయినాసరే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్నిచ్చింది. శ్రీకాకుళంజిల్లాలో కాశీబుగ్గ సీఐను 24 గంటల్లోనే అరెస్టు చేసింది. రాజమహేంద్రవరంలోని సీతానగరం పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐను ఘటన జరిగిన రోజే అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల టూ టౌన్ ఎస్ఐను అరెస్టు చేసి చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. బాధితులకు పరిహారం పెంపు నేరాలకు గురయిన దళితులు, గిరిజనులను ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోంది. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పెంచింది. 2014–2019లో టీడీపీ ప్రభుత్వం బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేవలం రూ.52.32 కోట్లు మాత్రమే పరిహారంగా అందించింది. కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 జూన్ నుంచి 2021 జూలై వరకు బాధిత ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.87.70కోట్లు పరిహారంగా అందించడం విశేషం. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సత్వరం పరిహారం అందేలా చొరవ చూపిస్తోంది. దేశంలోనే భేష్.. ఎస్సీ, ఎస్టీల రక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తోందని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో లక్షమందిజనాభాలో ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసులను ప్రమాణంగా తీసుకుని ఎన్సీఆర్బీ ఈ నివేదిక వెల్లడించింది. ► ఎస్సీలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి లక్ష ఎస్సీలలో రాజస్థాన్‌లో 55.6, మధ్యప్రదేశ్‌లో 46.7, బిహార్‌లో 39.5మందిపై నేరాలకు పాల్పడుతున్నారు. గుజరాత్లో 34.8మందిపై, తెలంగాణలో 31.1మందిపై ఉత్తర ప్రదేశ్‌లో 28.6మందిపై, కేరళలో 28.2మందిపై, ఒడిశాలో 26.2మందిపై నేరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమందికి 24.5 మందిపై మాత్రమే నేరాలు జరుగుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. ► ఎస్టీలపై అత్యధికంగా నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రతి లక్షమంది ఎస్టీలకు ఉత్తరప్రదేశ్‌లో 63.6మందిపై, కేరళలో 28.9మందిపై, రాజస్థాన్‌లో 19.5మందిపై నేరాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో 16.1మంది ఎస్టీలు దాడులకు గురవుతున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమందికి కేవలం 12.5 మందిపైనే నేరాలు జరుగుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. సమర్థంగా కేసుల పరిష్కారం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై నేరాల దర్యాప్తును వేగవంతం చేసి దోషులను సకాలంలో గుర్తించి శిక్షలు పడేలా చేస్తోంది. దాంతో ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు పాల్పడాలంటే భయపడే పరిస్థితిని తీసుకువచ్చింది. గత రెండేళ్లలో ఏకంగా 94శాతం కేసుల్లో దోషులను గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. రికార్డు వేగంతో దర్యాప్తు దళితులు, గిరిజనులపై నేరాల కేసులను పోలీసు శాఖ రికార్డు వేగంతో దర్యాప్తు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలపై కేసుల దర్యాప్తును టీడీపీ ప్రభుత్వంలో కంటే 78శాతం తక్కువ రోజుల్లోనే పూర్తి చేస్తుండడం జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ► కేసుల వారీగా చూస్తే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో దళితులు, గిరిజనుల అత్యాచారాలు, హత్యల కేసుల దర్యాప్తునకు సగటున 240 రోజులు పట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 జూన్ నుంచి 2022 జూలై వరకు సగటున 55 రోజుల్లోనే విజయవంతంగా దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. ► 2014 నుంచి 2019 మే వరకు సామూహిక అత్యాచారం కేసుల దర్యాప్తునకు సగటున 279 రోజులు పట్టి్టంది. కాగా 2019 జూన్ నుంచి 2020 వరకు దర్యాప్తును సగటున 153 రోజుల్లోనే పూర్తి చేశారు. 2021లో అయితే 44 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయడం విశేషం. ► 2014 నుంచి 2019 మే వరకు పోస్కో చట్టం కేసుల దర్యాప్తునకు సగటున 192 రోజులు పట్టాయి. 2019 జూన్ నుంచి 2020 వరకు దర్యాప్తును సగటున 133 రోజుల్లోనే పూర్తి చేశారు. 2021లో కేవలం 53 రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేయడం పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. ► 2014 నుంచి 2019 వరకు అత్యాచారం కేసుల దర్యాప్తునకు సగటున 266 రోజులు పట్టాయి. 2019 జూన్ నుంచి 2020 వరకు సగటున 111 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. ఇక 2021లో కేవలం 46రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ► ఇక టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మే వరకు ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు సంబంధించిన కేసులను పెండింగ్‌లో ఉంచగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కేసులను సమర్థంగా దర్యాప్తు చేసి పూర్తి చేశారు. ఆ విధంగా అత్యాచారం– హత్య కేసులు 3, సామూహిక అత్యాచారం కేసులు 2, పోస్కో చట్టం కేసులు 19, అత్యాచారం కేసులు 64ను దర్యాప్తు పూర్తి చేయడం గమనార్హం. -
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై కీలక తీర్పు
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో రిజర్వేషన్లను కల్పించడానికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే, ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరడానికి సంబంధించి ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని పేర్కొంది. ‘రిజర్వేషన్లు కల్పించాలని కోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేవు’ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం తేల్చిచెప్పింది. 2012 సెప్టెంబర్ 5న ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొనలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయగా, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఆ ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సమర్ధిస్తూ, హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది. ప్రభుత్వ నిర్ణయం చట్టవ్యతిరేకమని కోర్టు నిర్ధారించడం సరికాదని తీర్పులో పేర్కొంది. ‘పబ్లిక్ పోస్ట్‌ల్లో నియామకాలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టులు ఆదేశించలేవని చట్టంలో స్పష్టంగా ఉంది. అలాగే, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు కచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధన కూడా లేదు. అయినా, ఒకవేళ రాష్ట్రాలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వారికి రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, కచ్చితమైన గణాంకాలు సేకరించి, తద్వారా ఆయా వర్గాలను సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే.. రిజర్వేషన్లు కల్పించవచ్చు’ అని ధర్మాసనం వివరించింది. రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలపై కూడా ధర్మాసనం వివరణ ఇచ్చింది. ‘రాజ్యాంగంలోని 16(4), ఆర్టికల్ 16(4ఏ) అధికరణలు ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని ప్రభుత్వాలకు కల్పిస్తున్నాయి. ఆయా వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని విశ్వసిస్తే ప్రభుత్వాలు వారికి రిజర్వేషన్లు కల్పించేలా నిర్ణయం తీసుకోవచ్చు. ఆయా అధికరణాల్లో ఆ విషయం స్పష్టంగా ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది. తీర్పును ఖండిస్తున్నాం: కాంగ్రెస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు ఆమోదనీయం కాదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీల హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించింది. ఈ తీర్పును పార్లమెంట్ లోపల, వెలుపల కాంగ్రెస్ లేవనెత్తుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఆదివారం తెలిపారు. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం వారికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అది ప్రభుత్వాల విచక్షణాధికారంపై ఆధారపడకూడదని కాంగ్రెస్ విశ్వాసం’ అని వాస్నిక్ పేర్కొన్నారు. -
ఎస్సీ/ఎస్టీ క్రీమీలేయర్ అంశాన్ని సమీక్షించండి
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)లోని సంపన్న శ్రేణి(క్రీమీ లేయర్)కి రిజర్వేషన్ కోటాలో భాగం ఇవ్వకూడదంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. సమీక్షించే భాధ్యతను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని ప్రభుత్వం కోరింది. తీర్పు ఎస్సీ/ఎస్టీలకు వర్తించదని, ఈ తీర్పును సమీక్షించాలని, ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేయగా సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ల బెంచ్ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్ కోటా దక్కరాదన్న సూత్రం ఎస్సీ/ఎస్టీ వర్గాలకు వర్తించదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ‘ఇది ఉద్వేగాలతో కూడుకున్న అంశం. విస్తృత ధర్మాసనానికి నివేదించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సమతా ఆందోళన్ సమితి తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని గట్టిగా వ్యతిరేకించారు. -
బడికి వెళ్లాలంటే..అడవికి వెళ్లాలా?
సాక్షి, అశ్వారావుపేటరూరల్: వారంతా రేపటి పౌరులు.. ఈ భావి భారత పౌరులు బడిబాట పట్టాలంటే ముందుగా అడవి బాట పట్టాల్సిందే. అన్ని సౌకర్యాలు ఉన్న గ్రామాల్లోనే ప్రభుత్వ బడులు చాలా వరకు విద్యార్థులలేమితో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దాదాపు ముపైమందికిపైగా విద్యార్థులున్న ఆ గిరిజన గ్రామంలో మాత్రం సర్కారు బడి లేకుండా పోయింది. దాంతో ఆ గిరిజన బిడ్డలు ఉన్నత విద్య కోసం మూడు మైళ్ల దూరం అడవిబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మారుమూల అటవీ ప్రాంతంలో కొండతోగు అనే గిరిజన గ్రామం ఉంది. ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మాత్రమే ఉండగా, ప్రాథమిక పాఠశాల లేదు. దాంతో ప్రతి ఏటా బడులు తెరిస్తే చాలు.. ఈ అడవి బిడ్డలు విద్య కోసం మూడూ కిలోమీటర్ల దూరంలో ఉన్న పండువారిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామంలో ఉన్న బడికి వెళ్లాలంటే కొండతోగు నుంచి అడవి మార్గంలో కాలినడకన వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సిందే. వర్షకాలం సీజన్లో ఐతే అడవి మార్గంలో ఉన్న కొండతోగు వాగు పారుతుంది. వర్షం తగ్గిన తర్వాత మెకాళ్లలోతులో ఉండే నీళ్లు దాటుకొని ఈ చిన్నారులు సాహసంతో బడికి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు గత ఐదేళ్లుగా నెలకొని ఉన్నప్పటికీ అధికారులు, పాలకులకు కనీసం పట్టడం లేదు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘బడిబాట’కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తున్న క్రమంలో ఈ ‘అడవి బాట’పట్టుతున్న గిరిజన బిడ్డల అవస్థలను సైతం దృష్టిలో పెట్టుకొని, ఆ గ్రామంలో సర్కారు పాఠశాలను ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందేమో కాస్తా ఆలోచించాలి. -
మా ఓటు మేం వేసుకునేలా అవకాశం కల్పించండి..
‘మా పార్టీకి ఓటు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. మీరు ఏ పార్టీకి ఓటు వేశారో.. తెలిసిపోతుంది. రేపటి నుంచి మా పొలాల్లోకి పనులకు రావాలి.. ఒక్కడినీ వదలం.. మా పార్టీకే ఓటు వేస్తామని మర్యాదగా వచ్చి దేవుని పటాల ముందు ప్రమాణం చేయండి. అలా చేయనివాడు ఆ పార్టీ మనిషిగా ఉన్నట్టే.. చెబుతున్నాం కదా.. తోక జాడిస్తే భూమిపైన ప్రాణాలే ఉండవు’.. రీ–పోలింగ్ జరగనున్న ఎన్ఆర్ కమ్మపల్లి దళితవాడలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు శనివారం చేసిన హెచ్చరికలు ఇవి. ఆదివారం రీ–పోలింగ్ జరిగే గ్రామాల్లో తీవ్రఉత్కంఠ నెలకొంది. తిరుపతి రూరల్: బెదిరింపులు.. హెచ్చరికలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రీపోలింగ్ గ్రామాల్లోని దళితులు, గిరిజనులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. టీడీపీకి ఓటు వేయాలని ఆ పార్టీ నాయకులు దేవుని పటాలు ముందు పెట్టి దళితుల చేత బలవంతంగా ప్రమాణాలు చేయించారు. ప్రమాణాలు చేయని వారిపై మరోసారి దాడులకు యత్నించారు. ఇలా ఈ ఒక్క గ్రామంలోనే కాదు రీ–పోలింగ్ జరుగుతున్న కమ్మపల్లి, వెంకట్రామాపురం, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ గ్రామాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆ పల్లెల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈసారైనా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేనా? బెదిరింపులు.. హెచ్చరికలు.. ప్రమాణాల మధ్య రీ–పోలింగ్ జరగనున్న గ్రామాల్లో దళితులు, గిరిజనులు భయాందోళనల మధ్య నలిగిపోతున్నారు. ఉన్నతాధికారులు, వందలాది మంది పోలీసులున్నా దళితులు, గిరిజనుల్లో ఆత్మస్థైర్యం కల్పించలేకపోతున్నారు. బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దళిత, గిరిజనులు ఈసారైనా స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వారు వినియోగించుకునే అవకాశం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాకు ఓటు అవకాశం కల్పించండి ‘‘ఓటు వేయడానికి వెళితే దాడులు చేస్తున్నారు. ఏళ్లతరబడి మా ఓటును బలవంతంగా లాక్కుంటున్నారు. రిగ్గింగ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎదురు తిరిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. మాపై దాడులు చేసి, ఎన్నికల సమయంలో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు ఇచ్చినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. గతంలో దాడులు చేసిన వారే, గత నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా మా ఓటు మేం వేసుకోకుండా రిగ్గింగ్ చేసుకున్నారు. వారి పాపం పండింది. ఎన్నికల సంఘం కన్నెర్ర చేయడంతో రీ–పోలింగ్ వచ్చింది. ఈసారైనా మా ఓటు మేం వేసుకునేలా అవకాశం కల్పించండి’’...అంటూ ఎన్నికల జనరల్ అబ్జర్వర్, సీనియర్ ఐఏఎస్ అధికారి దేవేంద్రకుమార్సింగ్ను కమ్మపల్లి దళితవాడ ప్రజలు వేడుకున్నారు. శనివారం ఆయన్ని కలిసి విన్నవించుకున్నారు. న్యాయం చేయాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే.. క్రిమినల్ కేసులు... ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ దేవేంద్రకుమార్సింగ్ పిలుపునిచ్చారు. ఓటర్లను అడ్డుకున్నా.. వారిని బెదిరించినా, భయపెట్టినా, వారిపై దాడులు చేసినా నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సంఘం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సి.కాలేపల్లి, కుప్పం బాదూరులోనూ రీ–పోలింగ్.. రామచంద్రాపురం మండలం చిట్టత్తూరు కాలేపల్లి, కుప్పంబాదూరు గ్రామాల్లోనూ రీ–పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆమేరకు శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు గ్రామాల్లోనూ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. హడావుడిగా చేసిన రీ–పోలింగ్ ప్రకటనపై ఆ గ్రామాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. రీ–పోలింగ్ విషయం శనివారం సాయంత్రం వరకు కూడా ఆ గ్రామాల్లో ప్రజలకు సమాచారం లేదు. పోలీసులు, ఎన్నికల అధికారుల హడావుడితో ఆరా తీసిన గ్రామస్తుకు రీ–పోలింగ్ విషయం తెలుసుకుని అవక్కాయ్యారు. రీ–పోలింగ్ కోరిన పులివర్తి నానిపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. -
గిరి రాజులు
సాక్షి, కొత్తగూడెం: స్థానిక పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్విభజన చేసింది. దీంతో జిల్లాలో ఉన్న 205 గ్రామ పంచాయతీల సంఖ్య ఏకంగా 479కి పెరిగింది. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ పరిధిలో ఉన్న భద్రాద్రి జిల్లాలో అత్యధిక ప్రాంతం ఏజెన్సీ పరిధిలోకే వస్తుంది. నిబంధనల మేరకు ఈ ప్రాంతాల్లో ప్రతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం గిరిజనులకే కేటాయించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం 479లో 454 గ్రామపంచాయతీలు ఎస్టీలకు కేటాయించారు. అశ్వాపురం, అశ్వారావుపేట, బూర్గంపాడు, దమ్మపేట, సుజాతనగర్ మండలాల్లోని 25 గ్రామపంచాయతీలు మాత్రం నాన్–ఏజెన్సీ పరిధిలోకి వస్తున్నాయి. గతంలో జిల్లాలో 205 పంచాయతీలు ఉండగా వాటిలో 190 ఏజెన్సీ, 15 నాన్ ఏజెన్సీ పంచాయతీలుగా ఉండేవి. పంచాయతీరాజ్ చట్ట సవరణ అనంతరం చేపట్టిన పునర్విభజన ప్రకారం గతంలో ఉన్న 205 పంచాయతీలు 479కి పెరిగాయి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో 10 నాన్ షెడ్యూల్డ్ గా ఉన్నాయి. దీంతో గతంలో 15గా ఉన్న ఆ పంచాయతీల సంఖ్య ప్రస్తుతం 25కు చేరుకున్నాయి. అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురం, నెల్లిపాక, ఆనందపురం, మల్లెలమడుగు, మొండికుంట, అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు, అశ్వారావుపేట, కేసప్పగూడెం, పాతఅల్లిగూడెం, ఊట్లపల్లి, పేరాయిగూడెం, బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం, బూర్గంపాడు, టేకులచెరువు, దమ్మపేట మండలంలోని జమేదార్బంజర, దమ్మపేట, కొమ్ముగూడెం, లింగాలపల్లి, సుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం, లక్ష్మీదేవిపల్లి, కోమట్లపల్లి, మంగపేట, నిమ్మలగూడెం, సుజాతనగర్, నర్సింహసాగర్ పంచాయతీలు నాన్ షెడ్యూల్డ్ పరిధిలోకి వస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక గిరిజన పంచాయతీలు భద్రాద్రి జిల్లాలోనే ఉండడంతో ఇక్కడ స్థానిక పాలన ఎస్టీల చేతుల్లో ఉండనుంది. జిల్లాలో 4,232 వార్డులు... పునర్విభజన తర్వాత జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో 12 పంచాయతీలు ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లి మండలంలో 10, అశ్వాపురంలో 24, అశ్వారావుపేటలో 30, బూర్గంపాడులో 17, చంద్రుగొండలో 14, చర్ల మండలంలో 26, చుంచుపల్లి మండలంలో 18, దమ్మపేటలో 31, దుమ్ముగూడెంలో 37, గుండాల మండలంలో 11, జూలూరుపాడులో 24, కరకగూడెం మండలంలో 16, లక్ష్మీదేవిపల్లిలో 31, మణుగూరులో 14, ములకలపల్లిలో 20, పాల్వంచలో 36, పినపాకలో 23, సుజాతనగర్ మండలంలో 20, టేకులపల్లిలో 36, ఇల్లెందు మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 479 గ్రామ పంచాయతీల్లో కలిపి 4,232 వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉండగా, కొత్తగూడెం, భద్రాచలం మినహా మిగిలిన 21 మండలాల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మండలాల్లోని 479 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 7,68,805 మంది జనాభా ఉన్నారు. ఇందులో పురుషులు 3,83,693 మంది, మహిళలు 3,85,112 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 3,57,207 కాగా ఇందులో పురుషులు 1,77,501, మహిళలు 1,79,706 మంది ఉన్నారు. ఎస్సీ జనాభా 92,551 కాగా ఇందులో పురుషులు 46,424 మంది, మహిళలు 46,127 మంది ఉన్నారు. ఎస్టీ, ఎస్సీ యేతరులు 3,19,047 ఉండగా ఇందులో పురుషులు 1,59,768 మంది, మహిళలు 1,59,279 మంది ఉన్నారు. ఇక ఈ 479 పంచాయతీల్లో 25 పంచాయతీలు నాన్–షెడ్యూల్డ్ పరిధిలో ఉన్నాయి. వీటిలో మొత్తం 67,014 మంది ఉండగా, పురుషులు 33,298 మంది, మహిళలు 33,716 మంది ఉన్నారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీల పరిధిలో మొత్తం 8,42,096 మంది జనాభా ఉండగా ఇందులో బూర్గంపాడు మండ లంలోని సారపాక, భద్రాచలంను గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇల్లెందు మున్సిపాలిటీలో సత్యనారాయణపురం, 24 ఏరియాల(సింగరేణి కాలనీ)ను విలీనం చేశారు. దీంతో ఈ రెండు గ్రామాల్లోని 3,035 మంది జనాభా, మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ అయిన భద్రాచలంలోని 50,087 మంది, సారపాకలోని 20,169 మంది జనాభాను మినహాయించారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల పరిధిలో 7,68,805 మంది జనాభా ఉన్నట్లు తేల్చారు. -
గిరిజన పారిశ్రామికవేత్తలకు సాయం
మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.50 లక్షల వరకు సబ్సిడీని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ముఖ్యంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామ న్నారు. శుక్రవారం సచివాలయంలో గిరిజనాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో మంత్రి చందూలాల్ సమీక్షించారు. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోని తండాలు, గూడాలకు సంబంధించిన రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. లాభసాటి పద్ధతిలో గిరిజనులు వ్యవసాయం చేసేందుకు అంతర్జాతీయ సంస్థలతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థలతో ఆయా రంగాల్లో వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని, మొదటి విడతగా రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరవుతున్న గిరిజన విద్యార్థులకు రెసిడెన్సియల్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే గిరిజన బాలికలకు ఏఎన్ఎంలుగా శిక్షణ ఇప్పించి, విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థలలో వాలంటీర్ల నియామకం కోసం అనుమతి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. బోడేఘాట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు వీలుగా రూ.15 కోట్లతో స్థానిక రోడ్లను విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
ఆదివాసీల విచ్ఛిన్నానికి ప్రభుత్వ కుట్ర
మేడారం చేరుకున్న షెడ్యూల్ ఏరియా పరిరక్షణ సమితి బస్సు యాత్ర ఎస్‌ఎస్‌తాడ్వాయి : ఆదివాసీలను విచ్ఛినం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని షెడ్యూల్ ఏరియా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్, ప్రొఫెసర్ ఈసం నారాయరణ, రాష్ట్ర కోకన్వీనర్ అప్ప నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఆదివాసీల జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జుడోఘట్ నుంచి పరిరక్షణ సమితి చేపట్టిన చైతన్య బస్సు యాత్ర ఆదివారం సాయంత్రం మేడారానికి చేరుకుంది. స్థానిక ఆదివాసీల నాయకులు బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయబద్దంగా బస్సు యాత్ర నాయకులను గద్దెలపైకి స్వాగతించారు. అనంతరం సమ్మక్క- సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులకు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేసేలా కేసీఆర్ మనస్సు మార్చాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 5, 6 షెడ్యూల్ భూగాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తే మరో ఉద్యమం తప్పదన్నారు. ప్రత్యేక ఆదివాసీ జిల్లాలు ప్రకటించాలి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉండే ఆదివాసీలను మూడు, నాలుగు జిల్లాల్లో కలపడం సరి కాదన్నారు. ప్రత్యేక ఆదివాసీ జిల్లాలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని, తెలంగాణ తెచ్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనంతరం ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కోప్పుల రవి మాట్లాడుతూ అక్టోబర్ 7న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గిరిజనులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పూజారుల సంఘం ఉపాధ్యక్షుడు చంద గోపాల్, ఆదివాసీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్ల పాపయ్య, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు మైపతి సంతోష్, రేగ కిరణ్‌కుమార్, తుడుందెబ్బ మండల నాయకుడు శేషగిరితోపాటు ఉస్మానియా కాకతీయ విద్యార్థులు పాల్గొన్నారు. 02ఎంయూఎల్407: సమ్మక్క గద్దె వద్ద పూజలు చేస్తున్న ఈసం నారాయణ, నాయకులు -
‘స్మార్ట్’గా సంక్షేమం
♦ పథకాల లబ్ధిదారులకు స్మార్ట్ ఫోన్లు ♦ యూనిట్ల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ♦ ఎస్టీ, బీసీ శాఖ ముఖ్యకార్యదర్శి వినూత్న ఆలోచన సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన లబ్ధిదారులకు త్వరలోనే స్మార్ట్ ఫోన్ల యోగం పట్టనుంది. సంక్షేమ పథకాల కింద రుణాలతో పాటు ఫోన్లు కూడా ఇచ్చే సరికొత్త పథకం త్వరలోనే అమల్లోకి రానుంది. తద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, పథకాలు ఏ విధంగా సాగుతున్నాయనే దానిని ఆయా సంక్షేమ శాఖల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) నుంచి రాష్ట్ర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖల ద్వారా అమలుచేయనున్న స్వయం ఉపాధి పథకాల్లో ఫోన్లను కూడా భాగం చేయనున్నారు. ఇందు కోసం ఆర్థిక స్వావలంబన పథకాల్లో విడిగా కొంత మొత్తాన్ని కేటాయించనున్నారు. లబ్ధిదారుల్లో అంకితభావం పెంపొందించడంతో పాటు, తాము చేపట్టబోయే స్వయం ఉపాధి పథకాలను వారు పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా దీనికి రూపకల్పన చేస్తున్నారు. స్వయం ఉపాధి పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగానే, వారు నిర్వహించనున్న యూనిట్లు, ఉపాధి చర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహనను కల్పించేందుకు శిక్షణ, వాట్సప్, జీపీఎస్, ఇంటర్నెట్ సౌకర్యాలతో లబ్ధిదారులకు స్మార్ట్ ఫోన్లు అందిస్తారు. ఈ క్రమంలో రాష్ర్టస్థాయిలో పర్యవేక్షణకు పరిమితమైన స్టాఫ్‌తో కాల్ సెంటర్, జిల్లా స్థాయిలో ఈ పథకాల పర్యవేక్షణకు విడిగా హ్యాండ్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఇందుకోసం ఈ పథకాల అమల్లో మూడు శాతం నిధులను కేటాయిస్తాయి. నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం ఈ పథకాల లబ్ధిదారులే ఎప్పటికప్పుడు తమ యూనిట్ల పరిస్థితి, పురోగతిపై ఫొటోలు తీసి వాట్సప్‌లో పెట్టేలా చూడాలనే ఆలోచనతో ఆయా శాఖలున్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతను నిర్వహిస్తున్న సోమేశ్‌కుమార్ ప్రత్యేకంగా ఈ అంశాలను పొందుపరుస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా స్వయం ఉపాధి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలను చేర్చడం ద్వారా వారిలో నిబద్ధతతో పాటు, జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా లబ్ధిదారుల చొరవ, అభిరుచులను తెలుసుకొని, పథకాల పర్యవేక్షణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇది మంచి ఫలితం ఇస్తుందని, తద్వారా ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా, నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. -
గిరిజనులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ
అశ్వారావుపేట: పోడు భూముల విషయంలో గిరిజనులు, అటవీ అధికారుల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో లంకాయపల్లిలో ప్లాంటేషేన్ వేసేందుకు అటవీ అధికారులు మంగళవారం వచ్చారు. అయితే ఆ భూమిపై హక్కులు తమకు ఉన్నాయంటూ గిరిజనులు, అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ఇంతలో అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
'గిరిజనేతరులతో ఎలా భర్తీ చేస్తారు'
విజయనగరం(పార్వతీపురం): గిరిజన సంస్థల్లో ఉద్యోగాల భర్తీని గిరిజనేతరులతో చేయడాన్ని గిరిజన సంఘాలు తప్పు బట్టాయి. సోమవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఐటీడీఏ ఆఫీస్ ఎదుట గిరిజన సంఘాలు ధర్నాకు దిగాయి. ఖాళీగా ఉన్న పోస్టులకు నొటిఫికేషన్ విడుదల చేసి గిరిజనలతో నింపాలని వారు డిమాండ్ చేశారు. -
మారి పరిస్థితుల ఆధారంగా ఎస్టీ జాబితా
న్యూఢిల్లీ: మారిన పరిస్థితుల ఆధారంగా షెడ్యూల్ కులా(ఎస్టీ)ల జాబితాలో కొత్త కులాలను చేర్చాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. ఆ కులం ప్రాచీన కాలం నుంచి అనుసరిస్తున్న ఆచారవ్యవహారాలు, వారి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా, కాలక్రమంలో మారిన పరిస్థితుల ఆధారంగా నిర్ణయించాలని కేంద్రం భావిస్తోంది. అందుకు సంబంధించి తగిన విధివిధానాలను సమీక్షించే ప్రయత్నం కూడా చేస్తోంది. ఎస్టీ జాబితాలో కొత్త కులాలను చేర్చాలని రాష్ట్రాల నుంచి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతి రోజూ వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ కొత్త ఆలోచనలో పడింది. కొత్త కులాలను ఎస్టీలుగా గుర్తించడానికి, ఇతర సూచనలు సలహాలు ఇవ్వడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆజీఐ), నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్(ఎన్సీఎస్టీ), సామాజిక న్యాయం, సాధికారత, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ గత సంవత్సరం కేంద్రానికి నివేదిక కూడా సమర్పించింది. మానవజాతి పరిణామ క్రమం, ఒక కులం ఆదిమ లక్షణాలు, దాని విలక్షణ సంస్కృతి, భౌగోళిక ఒంటరితనం, వెనుకబాటుతనం తదితర లక్షణాల ఆధారంగా ఒక కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి రాజ్యాంగంలోని 342 ఆర్టికల్ ప్రకారం దేశం మొత్తంమీద 700 కులాలను గుర్తించారు. ఇప్పడు వివిధ రాష్ట్రాలలో మరికొన్ని కులాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్టీల జాబితాలో చేర్చడానికి పరిశీలిస్తున్న కులాలు ఎక్కువగా అస్సాం, ఒడిశా రాష్ట్రాలలో ఉన్నాయి. -
'గిరిజనుల హక్కులను టీడీపీ సర్కార్ కాలరాస్తోంది'
గిరిజనుల హక్కులను టీడీపీ సర్కారు కాలరాస్తోందని పాలకొండ ఎమ్మెల్యే బి. కళావతి ఆరోపించారు. హుద్‌హుద్ తుపాను కారణంగా పంటలను నష్టపోయిన గిరిజనులకు ఇంతవరకూ నష్టపరిహారం అందించలేదని టీడీపీ సర్కారుపై కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమిటీలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి ప్రజాప్రతినిధులను పక్కన పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. కమిటీలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి.. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులను పట్టించుకోకపోవడం.. ప్రజా తీర్పునకు విరుద్ధంగా నడుచుకోవడమే అన్నారు. జనవరి 31, ఫిబ్రవరి 1న తణుకులో జరగనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దీక్షకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి పిలుపునిచ్చారు. -
స్కూల్లో ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం
-
ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం
గుంటూరు : తోటి ఉద్యోగుల వేధింపులతో గిరిజన ఉపాధ్యాయురాలు శనివారం ఉదయం స్కూల్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. బొల్లాపల్లిలోని కస్తూర్భా స్కూల్లో జ్యోతి సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెపై తోటి ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో ఈ విషయంపై ఆమె పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు కూడా చేసింది. ఆ విషయంపై ప్రధాన ఉపాధ్యాయుడు మిన్నకుండటంతో తోటి ఉద్యోగుల వేధింపులు మరింత అధికమైనాయి. ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సప్తగిరి గ్రామీణ బ్యాంకులో.. జగత్కిలాడీలు.!
మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, రైతుల పేర్లతో రుణాలు తీసుకుని మింగేసిన దాసుకుప్పం బ్రాంచ్ మేనేజర్ బ్యాంకులో నిరుపేదల సొమ్మును కూడా సంతకాలు ఫోర్జరీ చేసి కాజేసిన మనోహరుడు..! కొట్టేసిన సొమ్ములో భారీ వాటా పొందిన ఓ ఉన్నతాధికారి కేసును నీరుగార్చే యత్నం నెలన్నర క్రితమే రూ.రెండు కోట్లకుపైగాకాజేశాడని తెలిసినా చర్యలు తీసుకోని యాజమాన్యం సాక్షి ప్రతినిధి, తిరుపతి: దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పం చుకున్నట్లు ఓ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్, మరో ఉన్నతాధికారి కుమ్మక్కై పేదలకు రు ణాలు ఇచ్చినట్లు చూపి.. రూ.రెండు కోట్లను నొక్కేశారు. ఆ అక్రమాల గుట్టు కాస్త నెల న్నర క్రితం రట్టు కావడంతో ఉన్నతాధికారి రంగంలోకి దిగారు. అక్రమాల్లో తీగ లాగితే తాను ఇరకాటంలో పడతానని భావించిన ఆ ఉన్నతాధికారి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సత్యవేడు మండలం దాసుకుప్పం సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ మనోహరుడికి సంఖ్యాశాస్త్రం(న్యూమరాలజీ)లో ప్రావీ ణ్యం ఉంది. ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరికి సంఖ్యాశాస్త్రంపై ఉన్న మక్కువను మనోహరుడు తనకు అనుకూలంగా మల్చుకున్నారు. ఉన్నతాధికారిని గుప్పిట్లో పెట్టుకుని చెలరేగిపోయారు. స్వయం సహాయక సం ఘాల మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, రైతుల పేర్లను ఫోర్జరీ చేసి.. రుణాలు తీసుకుని మింగేస్తూ వచ్చారు. ఆ క్రమం లో బ్యాంకుకు నిర్దేశించిన లక్ష్యంకన్నా అధికంగా రుణా లు ఇచ్చేసినట్లు చూపి.. నిధులు నొక్కేశారు. ఏడాదిగా ఇదే రీతిలో నిధులను కాజేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.రెండు కోట్లను మనోహరుడు కొట్టేశారు. నెలన్నర క్రితం దాసుకుప్పానికి చెందిన ఓ ఎస్సీ రైతు పంట రుణం మంజూరు చేయాలని బ్యాంకు అధికారులను సంప్ర దించారు. అప్పటికే ఆ రైతు పేరుతో మనోహరుడు రూ.65 వేలు కొట్టేశారు. గతం లో తీసుకున్న రూ.65 వేలు చెల్లిస్తే.. మళ్లీ రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆ రైతు తెల్లబోయారు. తాను ఎలాంటి రుణం తీసుకోలేదని ఆ రైతు చెప్పడంతో మనోహరుడి అక్రమాల బాగోతం వెలుగుచూసింది. ఇదే అంశాన్ని బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించి మనోహరుడిపై చర్యలు తీసుకోవాల్సిన ఓ ఉన్నతాధికారి.. దానికి విరుద్దంగా బ్యాంకు అధికారులపై చిందులు వేసినట్లు తెలిసింది. పైగా మనోహరుడికి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో బ్యాంకు అధికారులు తెల్లబోయారు. నెలన్నర తొక్కిపట్టిన ఉన్నతాధికారి.. మనోహరుడితో కలసి వాటాలు దండుకున్న ఉన్నతాధికారి ఆయనను రక్షించేందుకు రంగంలోకి దిగారు. దాసుకుప్పం బ్రాంచ్‌లోనే మనోహరుడు పనిచేస్తే ఇబ్బంది వస్తుందని పసిగట్టిన ఆ ఉన్నతాధికారి.. నాగలాపురం బ్రాంచ్‌కు ఆయనను బదిలీ చేశారు. మనోహరుడు రూ.రెండు కోట్లు మింగేశారని నెలన్నర క్రితమే బ్యాంకు అధికారులు తేల్చినా.. ఆయనపై సీబీఐకిగానీ సత్యవేడు పోలీసుస్టేషన్లోగానీ ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలోనే సత్యవేడు మండలం పుదుకుప్పంకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు రుణం కోసం బ్యాంకు అధికారులను ఆశ్రయించారు. ఆ గ్రామానికి చెందిన ధనలక్ష్మి, రాజేశ్వరి, మరియమ్మాల్, సరోజిని తదితర మహిళా సంఘాల పేరుతో మనోహరుడు రూ.57 లక్షలకుపైగా రుణం తీసుకున్నట్లు బయటపడింది. తమ పేరుతో బ్యాంకు మేనేజర్ రూ.57 లక్షల రుణం తీసుకుని మింగేయడంపై మహిళా సంఘాలు సోమవారం రాత్రి ఆగ్రహించాయి. సోమవారం, మంగళవారం, బుధవారం దాసుకుప్పం బ్రాంచ్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేశారు. దాంతో చేసేది లేక దాసుకుప్పం బ్రాంచ్ అధికారులు మనోహరుడిపై సత్యవేడు పోలీసుస్టేషన్లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా ఆ బ్యాంకు యాజమాన్యం పట్టించుకోలేదు. దాసుకుప్పం బ్రాంచ్‌లో రూ.రెండు కోట్లకుపైగా మేనేజర్ మనోహరుడు మింగేసిన వైనంపై విచారణకు ఎలాంటి అధికార బృందాన్ని నియమించలేదు. ‘తిన్నదేదో తిన్నావ్. తృణమో పణమో చెల్లించు.. కేసు లేకుండా చూస్తా’ అని ఓ ఉన్నతాధికారి ఇచ్చిన అభయంతో మనోహరుడు సెలవుపై వెళ్లిపోయారు. కేసును నీరుగార్చేయత్నం.. మనోహరుడిపై సత్యవేడు పోలీసుస్టేషన్లో నమోదైన కేసును నీరుగార్చేందుకు బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలోనే లోపభూయిష్టంగా ఫిర్యాదు ఇప్పించారు. నెలన్నర క్రితం మనోహరుడిపై సస్పెన్షన్ వేటు వేయాల్సిన ఆ అధికారి.. పోలీసు కేసు నమోదైన తర్వాత సస్పెండ్ చేస్తున్నట్లు బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. ఇప్పుడు విచారణకు సహకరించకుండా.. పోలీసులకు తప్పుడు సమాచారం అందించి కేసును నీరుగార్చడానికి రంగంలోకి దిగారు. తద్వారా మనోహరుడిని రక్షించడంతోపాటు తానూ సురక్షితంగా బయటపడవచ్చునన్నది ఆ ఉన్నతాధికారి ఎత్తుగడ. దాసుకుప్పం బ్రాంచ్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ కేఎస్ సుధాకర్‌రావును ‘సాక్షి’ వివరణ కోరగా.. నెలన్నర క్రితం ఆ బ్రాంచ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు. రుణాల మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించి.. పోలీసు ఫిర్యాదు ఇచ్చామన్నారు. ఇప్పటిదాకా ఆ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. దాసుకుప్పం బ్రాంచ్ మేనేజర్ మనోహరుడు రుణాల మంజూరు పేరుతో ఇష్టారాజ్యంగా డబ్బు కొట్టేస్తున్నా యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తే.. తామెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పడం గమనార్హం. -
షెడ్యూల్డ్ ప్రాంతానికి మండలి ఏర్పాటు చేయూలి
కొత్తగూడ, న్యూస్‌లైన్ : షెడ్యూల్డ్ ప్రాంతంలో ఆదివాసులకు సర్వాధికారాలు కల్పిస్తూ స్వయం పాలనా మండలి ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకుడు సాధినేని వెంకటేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఆది వారం మండలకేంద్రంలో నిర్వహించిన పోరు కేక బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. బ్రిటీష్ కాలంలో ఏజెన్సీ ప్రాం తానికి ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేస్తే వాటి అమలు చేయకుండా గ్రీన్‌హంట్, టైగర్ జోన్, ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను అడవికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ సంపదను బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేసేందుకు పాలకులు సిద్ధమయ్యూరని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే సుమారు 300 గ్రామాలు జల సమాధి అవుతాయన్నారు. దోపిడీ, అణచివేత ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని, ఎన్కౌంటర్లు, కేసులతో విప్లవాన్ని అడ్డుకోలేరన్నారు. అరుణోదయ కళాకారుల ఆటాపాటా పోరుకేకలో అరుణోదయ కళాకారుల ఆటాపాటా అందర్ని ఆకర్షించాయి. అమరులైన నక్సలైట్లకు జోహార్లు అర్పిస్తూ, ప్రజల కష్టాలపై పాడిన పాటలు అలరించారుు. కాగా, సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో మండల కేంద్రం ఎరుపుమయమైంది. సభలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్, ముక్తార్‌పాషా, తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షడు దబ్బకట్ల నర్సింగరావు, శాతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత, నాయకులు కోడి సోమన్న, మండల వెంకన్న, తోటకూరి రాజు, లావుడ్యరాజు, అరుణోదయ కళాకారులు ఝాన్సీ, అంజయ్య, గుండె శ్రీను, పార్టీ సర్పంచులు పాల్గొన్నారు. -
చీకట్లోనే..
ఉట్నూర్/కాసిపేట, న్యూస్‌లైన్ : జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని సంకల్పించింది. 0 నుంచి 50 యూనిట్ల లోపు కరెం టు వినియోగించుకున్న కుటుంబాలకు ఎస్టీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద బిల్లు మాఫీ చేస్తారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ, ఏజెన్సీ అధికారులకు అప్పగించిం ది. వీరు 20,260 ఎస్సీ, 17,734 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని రచ్చబండ సందర్భంగా తెలిపారు. రూ.18.20 కోట్లు మాఫీ 0-50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్సీ, ఎస్టీలను సెప్టెంబర్ నుంచే అధికారులు గుర్తిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు అంటే ఆరునెలలు 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న కుటుంబాల వారు చెల్లించిన బిల్లులను తిరిగి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏ రూపకంగా చెల్లిస్తుందనేది ప్రభుత్వం ప్రకటించనుంది. దీని ప్రకారం జిల్లాలో దాదాపు రూ.18.20 కోట్ల బిల్లులు ప్రభుత్వం మాఫీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మండలాల్లో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీలు వారి కుల ధ్రువీకరణ పత్రాలు విద్యుత్ కార్యాలయాల్లో సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారులు ప్రచారం కల్పించక పోవడంతో కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం లేదు. పూర్తిస్థాయిలో బిల్లు చెల్లిస్తున్నారు. కొందరు బిల్లులు చెల్లించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు ఎస్సీ, ఎస్టీ గూడాలకు విద్యుత్ సౌకర్యం నిలిపివేస్తున్నారు. వారం రోజులుగా చీకట్లోనే.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ వర్తించే కాసిపేట మండలం ఇప్పలగూడ, రేగులగూడ గ్రామాల ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. రెండు గ్రామాల్లో 33 కుటుంబాలకు చెందిన 180 మంది బిక్కుబిక్కమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రయిందంటే అందరూ ఒకటే చోట చేరుతున్నారు. దీపాల వెలుతురులో వంటలు చేసుకుని భోజనం చేస్తున్నారు. చంటి పిల్లలను వేసుకుని చీకట్లోనే నిద్రిస్తున్నారు. విషపురుగులు, క్రూరమృ గాలు రాకుండా మంటలు వేసుకుంటున్నారు. భయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. అసలే తూర్పు ప్రాంతంలో పులి సంచరిస్తోంది. దాని భారిన పడితే అందరూ మృత్యువాత పడే అవకాశం ఉంది. జైపూర్ పవర్ ప్లాంటు కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే మిగతా ఏజెన్సీలో ఉండే గ్రామాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రూ. వేలల్లో బిల్లులు అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా బిల్లులు చెల్లించలేదని కరెంటు కట్ చేశారు. ఇక మాకు 30 యూనిట్లు కూడా కరెంటు వినియోగం కాదు. మేమందరం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు అర్హులమే. 50 యూనిట్లలోనే అందరం కరెంటు వినియోగించుకుంటాం. బిల్లులు మాత్రం రూ.వేలల్లో వస్తున్నాయి. విద్యుత్ అధికారులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియదు. మేము కూలీకి వెళ్లేచ్చే వరకు బిల్లు మాత్రం తలుపులకు ఉంటుంది. తొమ్మిది నెలల నుంచి బిల్లుకట్టని మాట వాస్తవామే సబ్‌ప్లాన్‌లో మాఫీ చేయడం తరువాత ఒక్కొక్కరికి రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు బిల్లులు వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు యాభై యునిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం పూర్తిస్థాయిలో అమలు కాకముందే ఆయా గూడాలకు విద్యుత్ నిలిపి వెయ్యడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైన అధికారులు వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని.. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని గిరిజనులు పేర్కొంటున్నారు. -
నల్గొండ అత్యాచారాల ఘటనపై విచారణకు ఆదేశం
నల్గొండ జిల్లాలోని 11 మంది గిరిజన బాలికలపై ట్యూటర్ అత్యాచార ఘటనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆ ఘటనపై తక్షణం విచారణ జరపాలని నల్గొండ జిల్లా కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని ఆయన ఆదేశాలలో పేర్కన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాని ఆయన ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని తండాలో ఓ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఉంటున్న అభం శుభం తెలియని పదకొండేళ్లలోపు 11 మంది బాలికలపై ట్యూటర్ హరీష్ మూడు మాసాలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ ఘటనపై ఓ బాలిక ఉపాధ్యాయుడి ఫిర్యాదు చేసింది. దాంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది.