నెలన్నర దాటిపోయింది. ఇప్పటికి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర బలగాలకు తోడు కేంద్ర బలగాలు రంగంలోకి దిగి చాలాకాలమైంది. సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి వచ్చి పర్యటించారు. అయినా పరిస్థితి మారలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇవాళ్టికీ అగ్నిగుండమై మండుతోంది. శాంతిభద్రతలు క్షీణించి, మూకస్వామ్యం రాజ్యమే లుతోంది.
షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా ఇవ్వాలంటూ మైతై తెగ ప్రజలు చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా మే మొదటివారంలో జరిగిన గిరిజనుల ప్రదర్శన హింసాత్మకంగా మారినప్పుడు మొదలైన ఈ జ్వాల మణిపూర్‌లోని తెగల మధ్య చీలికలను ఎత్తిచూపింది.
మరి, ఈ మంటల్ని చల్లార్చి, శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత తల మీద ఉన్న సర్కారు ఇప్పటి దాకా ఏం చేసినట్టు? సమస్యను చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక వర్గం వైపు నిలబడి, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది.
కుకీలు ఎక్కువుండే కొండ ప్రాంత జిల్లాల నుంచి మైతైలు వలసపోతుంటే, మరోపక్క మైతైలు అధికంగా ఉండే ఇంఫాల్ లోయ నుంచి కుకీలు తరలిపోతున్నారు. కేంద్ర మంత్రి నివాసం సహా రెండు వర్గాలకు చెందిన 4 వేల గృహాలు ఇప్పటికే అల్లర్లలో అగ్నికి ఆహుతి అయ్యాయి. శరణార్థి శిబిరాలు కిక్కిరిశాయి.
అమాత్యుడి ప్రైవేట్ నివాసంపై దాడి గత మూడు వారాల్లో ఇది రెండోసారి. జాతుల మధ్య విద్వేషం ఇంతగా పెచ్చరిల్లుతుంటే, కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా అధికారంలో ఉన్న పాలకపక్షం ఏం చేస్తోందన్నది ప్రశ్న. నిజానికి, కేంద్ర హోమ్ మంత్రి ఇటీవలే సంక్షుభిత మణిపూర్‌ను సందర్శించినప్పుడు, సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్నా ఆ ఆశ నెరవేరలేదు.
భౌగోళికంగా బంగ్లాదేశ్, చైనా, మయన్మార్‌ల మధ్య చిక్కిన ఈశాన్య రాష్ట్రాల్లో తెగల మధ్య తరచూ ఘర్షణలు కొత్త కావు. 1949లో భారత యూనియన్‌లో చేరినప్పటి నుంచి మణిపూర్‌లోనూ అవి ఉన్నవే. కానీ, మధ్యవర్తులుగా ఉండాల్సినవారే తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అనుమా నంతో ఇరువర్గాల మధ్య విశ్వాసం సన్నగిల్లడం విషాదం. అపనమ్మకం నిండినచోట భద్రతా దళాలైనా తగిన చర్యలు చేపట్టడం కష్టం.
మణిపూర్ రైఫిల్స్ సహా రాష్ట్ర పోలీసు బలగాలు మైతైలకే మద్దతుగా నిలుస్తున్నాయని కుకీల భావన. మైతైలేమో కుకీ ప్రాబల్య పర్వత ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా గంజాయి సాగు చేస్తున్నా అస్సామ్ రైఫిల్స్ చూసీ చూడనట్టున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది చాలదన్నట్టు భద్రతాదళాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. పారా మిలటరీ దళాలు తమ పనిలో జోక్యం చేసుకుంటున్నాయని పోలీసుల ఆరోపణ. వెరసి, పాలన మృగ్యమైన మణి పూర్‌లో నేటికీ రహదారులు సాయుధ మూకల నియంత్రణలోనే ఉన్నాయి.
రాష్ట్రంలో ఉద్రిక్తతల్ని చల్లబరచడానికి పాలకుల వైపు నుంచి ఏ మాత్రం ప్రయత్నాలు జరుగుతు న్నాయంటే అనుమానమే. ఎంతసేపటికీ దీన్ని శాంతి భద్రతల సమస్యగానే వారు చూస్తున్నారు. అది పెద్ద చిక్కు. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలో ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పదే పదే విఫలమైనా, కేంద్రం ఉపేక్షించింది.
విద్వేషాగ్నిలో ఈశాన్యం కాలిపోతున్నా, మూడు వారాల పైచిలుకు తర్వాత కానీ హోమ్ మంత్రి అక్కడకు రాకపోవడం ఏ రకంగా సమర్థనీయం? కొన్ని వారాలుగా ఇలా ఉన్నా ప్రధాని తన రాజకీయ సభల్లో కానీ, ఇతరత్రా కానీ ఎక్కడా మణిపూర్ ఊసే ఎత్తలేదు. మాటల ద్వారా మనుషుల మధ్య మత్సరం తగ్గించాల్సిన వేళ పాలకులు మౌనముద్ర దాల్చడం విడ్డూరమే!
గౌహతి హైకోర్ట్ రిటైర్డ్ ఛీఫ్ జస్టిస్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘం వేయడం బాగానే ఉంది. కానీ, రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో శాంతి సంఘం ఏర్పాటుకు మాత్రం ఆదిలోనే హంసపాదు పడింది. పక్షపాత సీఎం సభ్యుడిగా ఉన్న కమిటీలో తాము ఉండబోమనేది కుకీ ప్రతినిధులు తేల్చేశారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో బీరేన్ ఆలోచించుకోవాలి.
2017లో తొలి విడత సీఎంగా ఎన్నికైనప్పుడు గిరిజనవాసులతో సన్నిహితంగా మెలిగిన ఆయన 2022లో రెండో విడత అధికారం చేపట్టాక వైఖరి మార్చారు. ప్రభుత్వస్థలంలో ఆక్రమణల పేరిట ఇంఫాల్‌లో చర్చిలతో సహా అనేకం కూల్చివేతకు ఆదేశించి, కుకీలకు కోపకారణమయ్యారు. సంఖ్యాపరంగా మైతైలున్నందున మెజారిటీ వాదాన్ని స్థానిక గిరిజన తెగలపై రుద్దుతున్నారనే భావన కలగడమూ సమస్యకు కారణమైంది.
మైతైలకు ఎస్టీ హోదానిచ్చే అంశం పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్ట్ చెప్పింది సరే, ఆ వివాదా స్పద నిర్ణయంతో తెగల మధ్య అశాంతి నెలకొంటుందని ఊహించకపోవడం ప్రభుత్వ తప్పిదమే. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పర్యవసానాలు ఊహించి సంబంధిత వర్గాల మధ్య అపోహల్ని ముందే తొలగించడం కీలకం. పాలకులు అక్కడే విఫలమయ్యారు.
అనుమానాలు పెను భూతాలై, పరిస్థితిని ఇంతదాకా తెచ్చారు. ఇంటర్నెట్‌పై నిర్బంధాల నేపథ్యంలో క్షేత్రస్థాయి వార్తలు సరిగ్గా తెలియకపోగా, అసలు కథ వదిలేసి దీన్ని రెండు మతాల మధ్య ఘర్షణగా చిత్రించే ఘోర తప్పి దాలూ సాగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రం కలగజేసుకోవాలి. అన్ని తెగలకూ రాజ్యాంగ రక్షణ ఉందన్న భరోసా కల్పించాలి.
మూలన విసిరేసినట్టుగా ఉన్న ఆ ప్రాంతాలనూ, ప్రజలనూ పరాయి వారుగా చూసే ధోరణి మారాలి. అక్కడి విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను గౌర విస్తూ, దేశంలో తామూ భాగమనే అభిప్రాయం ఆ ప్రజల్లో కల్పించాలి. మరి, ఆ దిశగా శాంతి స్థాపనకు ఇకనైనా పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అన్నది మాటలకే పరిమితం కాదన్న నమ్మకం వివిధ తెగల మధ్య కల్పిస్తారా?
ఈ మంటలు ఆర్పండి!
Published Tue, Jun 20 2023 2:32 AM | Last Updated on Tue, Jun 20 2023 2:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment