
రాజ్యసభలో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్
రాజ్యసభలో మంత్రి నిర్మలా సీతారామన్
కాంగ్రెస్ మణిపూర్‌ను గాలికొదిలేసిందన్న మంత్రి
న్యూఢిల్లీ: మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉందని, రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మణిపూర్ బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి రాజ్యసభలో మంగళవారం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారు మణిపూర్‌లో హింసను నిర్మూలించలేకపోయిందన్నారు. రాష్ట్రాన్ని ప్రధాని మోదీ సందర్శించకపోవడంపై ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.
గతంలో హింస జరిగినప్పుడూ ప్రధానులు మణిపూర్‌ను సందర్శించలేదన్నారు. 1993లో మణిపూర్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా నాగాలు, కుకీల మధ్య ఘర్షణల్లో 750 మంది మరణించారని, 350 గ్రామాలను తగులబెట్టారని, అయినా అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుగానీ, హోంమంత్రి శంకర్‌రావు చవాన్‌గానీ రాష్ట్రాన్ని సందర్శించలేదని చెప్పారు. మణిపూర్‌పై దృష్టి సాధించడం లేదని ప్రతిపక్షాల విమర్శలనూ ఆమె తిప్పికొట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బందులు, దిగ్బంధాలతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి జనం అల్లాడినా ఏ మంత్రి రాష్ట్రానికి వెళ్లలేదని గుర్తు చేశారు. కానీ, అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించారని వెల్లడించారు.
ప్రతిపక్షాల కంటే సున్నితంగానే ఆలోచిస్తున్నామని, దేశంలోని ప్రతిరాష్ట్రం గురించి శ్రద్ధ తీసుకుంటున్నామని వెల్లడించారు. మణిపూర్ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పూర్తి మద్దతునిస్తున్నామని తెలిపారు. శాంతి నెలకొల్పి తే ఆర్థికంగా మెరుగుపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెదరుమదురు ఘటనలు మినహా.. మరణాలు, అగ్ని ప్రమాదాలు, కాల్పుల సంఘటనలు, నిరసనల కేసులు తగ్గుముఖం పట్టాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు 286 కంపెనీల సీఏపీఎఫ్, 137 కంపెనీల ఆర్మీ, అస్సాం రైఫిల్స్.. రాష్ట్ర పోలీసులతో కలిసి పని చేస్తున్నాయన్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వా«దీనం చేసుకుంటున్నారని, జాతీయ రహదారిపై స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మణిపూర్ బడ్జెట్ వివరాలను ఆమె సభకు వెల్లడించారు. ఒకరిపై ఒకరు వేలెత్తిచూపుతూ ఉంటే మణిపూర్‌కు ఎవరూ సాయం చేయరన్నారు.
మేకిన్ ఇండియా మంచి ఫలితాలను ఇస్తోంది
మేకిన్ ఇండియా పథకంపై ప్రతిపక్షాల విమర్శలను మంత్రి తోసిపుచ్చారు. మేకిన్ ఇండియా భారత రక్షణ రంగాన్ని నికర ఎగుమతిదారుగా మార్చిందని ఆమె చెప్పారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అవి మంచి ఫలితాలను ఇస్తున్నాయని సీతారామన్ తెలిపారు. తన వాదనను బలపరిచే డేటాను సభకు తెలియజేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు మంచి ఫలితాలను ఇచ్చాయని, ఇప్పటివరకూ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయని, 9.5 లక్షల మందికి ఉపాధినిచ్చాయని చెప్పారు.
తృణమూల్ ఎంపీల వాకౌట్
మణిపూర్ బడ్జెట్‌పై చర్చలో భాగంగా మంత్రి ఇచ్చిన సమాధానంపై తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు. మణిపూర్ బడ్జెట్‌పై మంత్రి ఇచ్చిన సమాధానం కంటితుడుపుగా ఉందని ఎంపీ సుస్మితాదేవ్ అన్నారు. 22 నెలలుగా మణిపూర్ కాలిపోతుంటే అల్లర్లను ఆపడానికి ప్రధాని, హోంమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment