న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉన్న సమయంలో భారత ప్రభుత్వం తన భవిష్యత్ వృద్ధిపై ఆశాజనకంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తాము ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చిందన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో గురువారం నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
అమెరికా, యూకే, యూరోజోన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎన్నో ఆర్థిక సవాళ్ల మధ్య ఉన్నాయని, అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా కూడా వినియోగదారుల డిమాండ్లు, వేతనాల స్తబ్దత వంటి సమస్యలనెదుర్కొంటోందని తెలిపారు. ‘‘ప్రపంచబ్యాంకు గణాంకాల ప్రకారం 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి 3%గా ఉంది. 2023 నాటికి అది 2.1శాతానికి పడిపోయింది. అదే సమయంలో మోర్గన్ స్టేన్లీ సంస్థ 2013లో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని పేర్కొంది. అదే సంస్థ తాజాగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్‌ను గుర్తించింది. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే దీనికి కారణం’’ అని చెప్పారు.
మిలేగా స్థానంలో మిల్‌గయా
ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ నినాదం గరీబీ హఠావో నినాదాన్ని సీతారామన్ ఎగతాళి చేస్తూ వాస్తవంగా పేదరికం తొలగిపోయిందా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక పరిపాలనలో సమూల మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. ఒకప్పుడు మిలేగా (లభిస్తుంది) అన్న పదం స్థానంలో ఇప్పుడు మిల్ గయా (అన్నీ అందాయి) అని ప్రజలు చెప్పుకునే స్థాయికి పాలన వెళ్లిందన్నారు. అవినీతి, బంధుప్రీతితో దశాబ్దాల పాటు కాంగ్రెస్ సమయాన్ని వృథా చేసిందని, అన్ని సంక్షోభాల్ని అవకాశాలుగా అందిపుచ్చుకొని ముందుకు వెళుతున్నామన్నారు.
నిర్మలా సీతారామన్ ప్రసంగంలో తమిళనాడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా తమిళంలో మాట్లాడారు. సెంగాల్ (రాజదండం) గురించి ఆమె ప్రస్తావిస్తూ దానిని ఎక్కడో మ్యూజియంలో పడేశారని అది తమిళనాడు ఆత్మగౌరవాన్ని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సెంగాల్‌ను లోక్‌సభలో ప్రతిష్టించి సముచిత స్థానాన్ని కల్పించారన్నారు. అదే సమయంలో ఆమె సభను పక్కదారి పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, లెప్ట్ పార్టీల ఎంపీలు వాకౌట్ చేశారు.
నిండుసభలో జయలలిత చీర లాగారు
మణిపూర్‌లో మహిళల అకృత్యాల గురించి సీతారామన్ ప్రస్తావిస్తూ కేవలం మణిపూర్ మాత్రమే కాదు మహిళల్ని అవమానపరిచే, కించపరిచే ఘటనలు రాజస్థాన్, ఢిల్లీ ఇలా ఏ రాష్ట్రంలో జరిగినా ఆందోళన కలిగిస్తాయన్నారు. ఈ ఘటనలు ఎక్కడ జరిగినా తీవ్రంగా పరిగణించాలన్నారు. మణిపూర్ అంశంపై ప్రసంగించిన డీఎంకే ఎంపీ కనిమొళికి ఈ సందర్భంగా ఒక ఘటనను గుర్తు చేయాలనుకుంటున్నాను అంటూ తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు జరిగిన పరాభవం గురించి ప్రస్తావించారు.
‘‘జయలలిత ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు 1989 మార్చి 25న పరమ పవిత్రమైన నిండు సభలో ఆమె చీరను లాగారు. డీఎంకే సభ్యులు అదంతా చూస్తూ జయలలితను గేలి చేశారు. ఆమెను చూసి నవ్వుకున్నారు. రెండేళ్ల తర్వాత జయలలిత ముఖ్యమంత్రిగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తమిళనాడు అసెంబ్లీలో జయలలితను పరాభవించినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వారు ఇప్పుడు విపక్ష నేతలుగా ద్రౌపదికి చీర లాగడం గురించి మాట్లాడుతున్నారు’’ అని డీఎంకేకి చురకలు అంటించారు.
Comments
Please login to add a commentAdd a comment