న్యూఢిల్లీ: కాషాయీకరణను, మత శక్తుల ఏకీకరణను, మతతత్వాన్ని దేశం నుంచి తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదర అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. అవినీతి క్విట్ ఇండియా అంటూ బీజేపీ ఇచ్చిన నినాదాన్ని తిప్పికొట్టారు. క్విట్ ఇండియా ఉద్యమం జరగాల్సిందేనని చెప్పారు. కాషాయీకరణ, మతతత్వం క్విట్ ఇండియా అని సభలో అధిర్ రంజన్ నినదించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..
కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడొద్దు
‘‘నరేంద్ర మోదీ 100సార్లు ప్రధానమంత్రి అయినా మాకు ఎలాంటి ఆందోళన, అభ్యంతరం లేదు. మా ఆందోళన అంతా దేశ ప్రజల గురించే. మణిపూర్ ప్రజలకు ప్రధానమంత్రి స్వయంగా శాంతి సందేశం ఇవ్వాలని మా పార్టీ కోరుతోంది. మణిపూర్ హింసాకాండ గురించి ‘మన్ కీ బాత్’లో కనీసం ఒక్కసారైనా మోదీ మాట్లాడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మణిపూర్‌లో హింస అనేది సాధారణ అంశం కాదు. ఆ రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణ జరుగుతోంది.
పౌర యుద్ధం కొనసాగుతోంది. మణిపూర్ హింస మొత్తం ప్రపంచం దృష్టిలో పడింది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌తోపాటు అమెరికాలోనూ దీనిపై చర్చ జరిగింది. మణిపూర్ వ్యవహారాన్ని కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడొద్దు. అందుకే ప్రదానమంత్రి స్వయంగా కలుగజేసుకోవాలని, మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దాలని, శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రిని లోక్‌సభకు రప్పించడానికి అవిశ్వాస తీర్మానం మినహా మాకు (విపక్ష ‘ఇండియా’ కూటమి) మరో మార్గం లేకుండా పోయింది.
బఫర్ జోన్.. ప్రజల మధ్య వద్దు
అది హస్తినాపురం అయినా, మణిపూర్ అయినా మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే దేశాన్ని పరిపాలించే రాజు అంధుడిగా వ్యవహరించకూడదు. కఠిన చర్యలు ఉపక్రమించాలి. దోషులను శిక్షించాలి. దేశాన్ని ఏలే పాలకుడు అంధుడైన ధృతరాష్ట్రుడిలా మిన్నకుండిపోతే ఇక మహిళలకు రక్షణ కల్పించేదెవరు? మణిపూర్‌లో రెండు వర్గాల ప్రజల మధ్య ‘బఫర్ జోన్’ను ప్రభుత్వం సృష్టించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం సభలో చెప్పారు.
ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బఫర్ జోన్ అనేది రెండు దేశాల మధ్య ఉంటుంది. అంతేతప్ప ప్రజల మధ్య ఉండడం తగదు. అవిశ్వాస తీర్మానంపై సభలో మాట్లాడేందుకు మణిపూర్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు ప్రయత్నిస్తే స్పీకర్ అనుమతించకపోవడం దారుణం’’ అని అధిర్ రంజన్ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధిర్ రంజన్ వ్యాఖ్యలు తొలగింపు
లోక్‌సభలో అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రధాని మోదీని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏమిటని నిలదీశారు. అధిర్ రంజన్ వ్యాఖ్యల రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ సైతం అధిర్ రంజన్ వ్యాఖ్యలను ఖండించారు. సభకు, దేశానికి అధిర్ రంజన్ క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment