Quit india movement
-
Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో
సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్‌లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్ వతన్ మేరే వతన్’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా సీక్రెట్ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు? ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... ఈ అనౌన్స్మెంట్ బ్రిటిష్ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్‌ని, దాని నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్‌వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా. గాంధీ పిలుపు విని... ఉషా మెహతా గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఉన్న సారస్ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్‌లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది. డూ ఆర్ డై 1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్ దాస్ ఖాకడ్, చంద్రకాంత్ ఝావేరీ, బాబూభాయ్ ఠక్కర్‌లతో కలిసి ఆ మీటింగ్‌కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది. రహస్య కాంగ్రెస్ రేడియో బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్‌మిషన్‌ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్మిటర్ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్‌గా మలిచింది. ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్‌వేర్ ఇన్ ఇండియా’... అంటూ స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు. మూడు నెలలు రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్ చిరునామా చెప్పేశాడు. నవంబర్ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్ హోమ్ మినస్టర్గా ఉండగా ఆమె విడుదల జరిగింది. కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి 1980లో రిటైర్ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘అయ్ వతన్ మేరే వతన్’ అమేజాన్‌లో మార్చి 21న విడుదలైంది. -
మహాత్ముడి అవసరం పెరిగింది
గాంధీజీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. తన సిద్ధాంత బలంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనది. అహింస అనే ఆయుధంతో, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం ‘డూ ఆర్ డై’ ఎంద రినో ఉత్తేజితులను చేసింది. ‘విజయమో, వీర స్వర్గమో’ అనే నినాదంతో యావత్ దేశ ప్రజలు ముందుకురికి భారత గడ్డ మీద నుంచి బ్రిటిష్ వారిని తరిమేశారు. మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరం తిరగకుండానే 1948 జనవరి 30న ఆయన హత్యకు గురై దేశాన్ని శోకసంద్రంలో ముంచారు. ఆయన ఘనత ప్రపంచ మంతా గుర్తించింది. అయితే భారతదేశంలో ఆయన్ని మెల్లగా మరచిపోతున్న ధోరణి కనిపించడం బాధాకరం. గాంధీజీ జయంతి సందర్బంగా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది. ‘అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్లు ఎప్పుడైతే క్షేమంగా వెళతారో ఆరోజే నా దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని ప్రకటించారు గాంధీ. గాంధీ సహించనివి– మగువలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, హత్యలు, కక్షలు, వైషమ్యాలు. కానీ ఇవే ఎక్కువైన ఈ సమాజంలో ఆయన ఆదర్శం గాలికి కొట్టుకుపోయిందని చెప్పక తప్పదు. మతసామరస్యాన్ని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. కానీ ఇవాళ మత అసహనం పెచ్చరిల్లుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి చంపేసే దృశ్యాలు అనేకం చూస్తున్నాం. నేడు అంతటా, అన్ని రంగాలలో అవినీతి పెచ్చరిల్లింది. గాంధీజీ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా గ్రామాలు స్వయం పోషకత్వం సాధించి ఏ గ్రామానికది ‘స్వరాజ్యం’గా అభివృద్ధి చెందా లనుకున్నారు. మరి ఆయన కలలను మన పాలకులు ఎంతవరకు నెరవేర్చారో సమీక్షించుకోవాలి. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు, తాడిపత్రి ‘ 93915 23027 -
కాషాయీకరణ ‘క్విట్ ఇండియా’
న్యూఢిల్లీ: కాషాయీకరణను, మత శక్తుల ఏకీకరణను, మతతత్వాన్ని దేశం నుంచి తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదర అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. అవినీతి క్విట్ ఇండియా అంటూ బీజేపీ ఇచ్చిన నినాదాన్ని తిప్పికొట్టారు. క్విట్ ఇండియా ఉద్యమం జరగాల్సిందేనని చెప్పారు. కాషాయీకరణ, మతతత్వం క్విట్ ఇండియా అని సభలో అధిర్ రంజన్ నినదించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడొద్దు ‘‘నరేంద్ర మోదీ 100సార్లు ప్రధానమంత్రి అయినా మాకు ఎలాంటి ఆందోళన, అభ్యంతరం లేదు. మా ఆందోళన అంతా దేశ ప్రజల గురించే. మణిపూర్ ప్రజలకు ప్రధానమంత్రి స్వయంగా శాంతి సందేశం ఇవ్వాలని మా పార్టీ కోరుతోంది. మణిపూర్ హింసాకాండ గురించి ‘మన్ కీ బాత్’లో కనీసం ఒక్కసారైనా మోదీ మాట్లాడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మణిపూర్‌లో హింస అనేది సాధారణ అంశం కాదు. ఆ రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణ జరుగుతోంది. పౌర యుద్ధం కొనసాగుతోంది. మణిపూర్ హింస మొత్తం ప్రపంచం దృష్టిలో పడింది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌తోపాటు అమెరికాలోనూ దీనిపై చర్చ జరిగింది. మణిపూర్ వ్యవహారాన్ని కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడొద్దు. అందుకే ప్రదానమంత్రి స్వయంగా కలుగజేసుకోవాలని, మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దాలని, శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రిని లోక్‌సభకు రప్పించడానికి అవిశ్వాస తీర్మానం మినహా మాకు (విపక్ష ‘ఇండియా’ కూటమి) మరో మార్గం లేకుండా పోయింది. బఫర్ జోన్.. ప్రజల మధ్య వద్దు అది హస్తినాపురం అయినా, మణిపూర్ అయినా మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే దేశాన్ని పరిపాలించే రాజు అంధుడిగా వ్యవహరించకూడదు. కఠిన చర్యలు ఉపక్రమించాలి. దోషులను శిక్షించాలి. దేశాన్ని ఏలే పాలకుడు అంధుడైన ధృతరాష్ట్రుడిలా మిన్నకుండిపోతే ఇక మహిళలకు రక్షణ కల్పించేదెవరు? మణిపూర్‌లో రెండు వర్గాల ప్రజల మధ్య ‘బఫర్ జోన్’ను ప్రభుత్వం సృష్టించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం సభలో చెప్పారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బఫర్ జోన్ అనేది రెండు దేశాల మధ్య ఉంటుంది. అంతేతప్ప ప్రజల మధ్య ఉండడం తగదు. అవిశ్వాస తీర్మానంపై సభలో మాట్లాడేందుకు మణిపూర్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు ప్రయత్నిస్తే స్పీకర్ అనుమతించకపోవడం దారుణం’’ అని అధిర్ రంజన్ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిర్ రంజన్ వ్యాఖ్యలు తొలగింపు లోక్‌సభలో అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రధాని మోదీని ధృతరాష్ట్రుడితో పోల్చడం ఏమిటని నిలదీశారు. అధిర్ రంజన్ వ్యాఖ్యల రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ సైతం అధిర్ రంజన్ వ్యాఖ్యలను ఖండించారు. సభకు, దేశానికి అధిర్ రంజన్ క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. -
స్త్రీ పోరాటాన్ని ఆవిష్కరించిన ఉద్యమం!బ్రిటిషర్లకే చుక్కలు చూపించారు!
1942 ఆగస్టు 9న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయి సమావేశంలో లేవనెత్తిన 'డూ ఆర్ డై అనే నినాదమేస క్విట్ ఇండియా ఉద్యమానికి నాంది. ఇదే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వలసవాద వ్యతిరేక ఉద్యమాలలో ఒకటిగా పేరుగాంచింది. దీనినే భారత్ చోరో ఆందోళన అని కూడా పిలుస్తారు. ఈ ఉద్యమే భారత స్త్రీ ఆవేశాన్ని వెలకితీసింది. ఆ ఉద్యమంలో వారేమీ సంప్రదాయ ముసుగులో మగ్గిపోతున్న వంటింటి కుందేళ్లు గాదని అవసరమైతే దేశం కోసం చీరను నడుముకి బిగించి కథన రంగంలోకి దిగే అపర కాళీశక్తులని ఎలుగెత్తి చెప్పారు. బ్రిటిషర్ల గుండెల్లో భయాన్ని పుట్టించారు. భారత స్త్రీ అంటే ఏంటో చూపించారు. వారి ధైర్యసాహసాలు, అపార త్యాగనిరతితో కరడుగట్టిన బ్రిటిషర్ల మనసులనే కదిలించారు. చివరికి నారీమణుల ధీ శక్తికి తెల్లవాళ్లే తలవంచి నమస్కరించి "జయహో భారత్" అనేలా చేసింది. పంద్రాగస్టు వేడుకలు సమీపిస్తున్న తరుణంలో నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ధీరవనితలు గురించి తెలుసుకుందామా! బహుశా ఆమే తొలి రేడియో జాకీ..! క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న 22 ఏళ్ల విద్యార్థిని ఉషా మెహతా. ఆమె తన గాత్రంతో నాటి ఉద్యమ పరిస్థితులను వివరిస్తూ బ్రిటిషర్లను గడగడలాడించింది. ఆమె బహుశా బారతదేశపు తొలి రేడియో జాకీ కావచ్చు. మెహతా ఎంత ధైర్యవంతురాలు అంటే భూగర్భ రేడియో స్టేషన్ ద్వారా ఉద్యమాల్లో జరుగుతున్న తాజా పరిణామాలను గురించి దేశాన్ని ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేసేది. వార్తా సంస్థలను అణివేసే వార్తలన్నింటిని ధైర్యంగా ప్రసారం చేసేది. పోలీసుల కళ్లుగప్పి రహస్యంగా సేవలందించేది. తన ఉనికిని కనిపెట్టకుండా జాగ్రత్త పడుతూ.. వివిధ ప్రదేశాల్లోని స్టేషన్లలో దేశభక్తి గీతాలతోపాటు మనోహర్ లోహియా వంటి విప్లవకారుల ప్రసంగాలను ప్రసారం చేసింది. ఈ రేడియో స్టేషన్ ఆగస్టు 27, 1942న 41.72 మీటర్ల బ్యాండ్‌తో ప్రారంభమయ్యింది. ఇది మార్చి6, 1943 వరకు కొనసాగింది. ఇది చివరిసారిగా జనవరి 26, 1944న ప్రసారమయ్యింది. గాత్రంతో కూడా దేశాన్ని రక్షించుకుంటూ వలసవాదుల గుండెల్లో గుబులు తెప్పించొచ్చు అని రుజువు చేసిన ఘట్టం. గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ అరుణ్ అసఫ్ అలీని గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని కూడా పిలుస్తారు. అరుణా అసఫ్ అలీ 1942లో గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో త్రివర్ణ భారత జెండాను ఎగురవేశారు. బ్రిటిష్ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్న తరుణంలో అరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లి మరీ స్వాతంత్ర పోరాటం కోసం చేస్తున్న ఉద్యమానికి నాయకత్వం వహించింది. అలాగే ఈ ఉద్యమంపై ప్రజల్లో చైతన్యం తెప్పించేలా భూగర్భ రేడియో స్టేషన్, ఇంక్విలాబ్' అనే పత్రికల సాయంతో ప్రచారం చేసింది. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు, 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది. 1932లో, తీహార్ జైలులోని ఖైదీల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఆమె నిరాహారదీక్ష చేసింది. ఆ ఉపవాస ఫలితంగా ఆమె శరీరంలలో ఒక్కసారిగా జీవక్రియ స్థాయిలు పడిపోయి పరిస్థితి విషమించి మరణించింది అరుణ్ అసఫ్ అలీ. ఈ ఘటన కొంతమంది బ్రిటిషర్లను కదిలించడమే గాక భారత స్త్రీలు సహనమే ఆభరణంగా చేసుకుని పోరాడగలరనే విషయాన్ని గుర్తించారు. నెత్తురొడ్డుతున్న లెక్కచేయని తెగువ.. వృద్ధారాలు సైతం దేశం కోసం పరాక్రమంతో పోరాడగలదని చెప్పిన ఘట్టం. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాకు చెందిన మాతంగిని హజ్రా అనే 73 ఏళ్ల మహిళ క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అంతగా తెలియని, గుర్తించని నాయకురాళ్లో ఒకరామె. సెప్టంబర్ 29న 6 వేల మంది స్వాతంత్య్ర సమరయోధులను తమ్లుక్ పోలీస్ స్టేషన్‌ను దోచుకున్నారు. ఆసమయంలో కాల్పులు జరగగా..ఆమె బుల్లెట్ల బారినపడ్డప్పటికీ తలెత్తి వందేమాతరం అంటూ జెండాపట్టుకుని మరీ ఊరేగింపులో కొనసాగింది. నెత్తురొడ్డుతున్న లెక్కచేయలేదు. వందేమాతరం అంటూ కన్నుమూసింది. చివరి శ్వాసవరకు దేశం కోసం పోరాడటం అంటే ఏంటో చాటి చెప్పింది హజ్ర. ప్రజల్ని కదిలించిన గొప్ప ఘట్టం అది. మీ డ్యూటీ మీరు చేయండి! అస్సాంలోని గోహ్పూర్ నివాసి కనకలత బారువా. ఆమె 17 ఏళ్ల వయసులో 5 వేల మంది సైన్యానికి నాయకత్వం వహించి ఏకంగా పోలీస్ స్టేషన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఆ పోలీస్టేషన్‌కి ఇన్చార్జ్గా ఉన్న నాటి ఆఫీసర్ రెబాతి మహన్ సోమ్ దీన్ని ఆపమని బారువాను అభ్యర్థించినా వినలేదు. పైగా మీరు మీ డ్యూటీ చేయండి నేను నా పని చేస్తానని తెగేసి చెప్పింది. ఏ మాత్ర భయం లేకుండా తన పాదయాత్రను కొనసాగించింది. దీంతో పోలీసులు చేసేదేమి లేక ఆమెపై కాల్పలు జరిపారు. ఆ ఫైరింగ్ కారణంగానే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘట్టం ఒక స్త్రీలోని దాగున్న తెగువతో కూడిన ఆవేశాన్ని తెలియజేసింది. ఈ ఘటన ఒకరకంగా బ్రిటిషర్లను మదిలో భయాందోళలనలను రేకెత్తించిందనే చెప్పాలి. రెండు నెలల పాపతో పోరాటంలోకి దిగిన ఓ తల్లి కేరళలోని అత్యంత ప్రసిద్ధ చెందిన స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరు కుట్టిమలు అమ్మ. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులలో ఒకరు. స్థానిక మహిళలతో బ్రిటిష్ సైనికులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే కథనాన్ని ప్రచురించినందుకు ప్రభుత్వం ఆమె మాతృభూమి పత్రికను నిషేధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమ్మ మహిళల ఊరేగింపుకు నాయకత్వం వహించింది. ఆమెతో పాటు రెండు నెలల పాప కూడా ఉంది. వెంటనే నాటి బ్రిటిష్ ఆఫీసర్లు ఆమెను బిడ్డతో సహా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. అంతేగాదు ఆమె భారత స్వాతంత్య్ర పోరాటాలన్నింటిల్లో చురుగ్గా పాల్గొంది. రెండు సార్లు జైలు పాలైంది కూడా. ఆమె విడుదలైన తదనంతరమే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైంది కూడా. 1985లో అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచింది. (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
ఆ రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టాలి
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూ లన, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను భారత్ నుంచి తరిమి కొట్టాలని ప్రజలు నినదిస్తున్నారని ప్రధాని∙మోదీ అన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర పోరాటంలో 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ సంస్మరణ దినాన్ని బుధవారం బీజేపీ నిర్వహించింది. ఈ సందర్భంగా మూడింటిని దేశం నుంచి తరిమి కొట్టాలని ఒకే స్వరం వినిపిస్తోందని ప్రధాని చెప్పారు. ‘అవినీతిని దేశం నుంచి తరిమేయాలి. వారసత్వ రాజకీయాలను, బుజ్జగింపు రాజకీయాలను కూడా తరిమికొట్టాలి’’ అని ప్రధాని బుధవారం ఒక ట్వీట్లో వెల్లడించారు. మరోవైపు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలు పరిరక్షించాలంటే అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలకు చోటు ఉండకూడదని అన్నారు. -
యాత్రతో రాత మారేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో వరుస పరాజయాలు.. కీలక నేతల నిష్క్రమణలు.. అంతర్గత కుమ్ములాటలతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు పార్టీ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’కు బుధవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఈ యాత్రపై కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి, ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న వేళ 3,500 కిలోమీటర్ల పై చిలుకు యాత్ర పార్టీకి పునరుత్తేజం తెస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. రాహుల్ యాత్రతో పార్టీకి ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమమే స్ఫూర్తిగా... ఎనభై ఏళ్ల క్రితం గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సెప్టెంబర్ 7 నుంచే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టనున్నారు. 117 మంది కాంగ్రెస్ నాయకులతో కలిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఐదు నెలలు పాదయాత్ర చేయనున్నారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, అసహన రాజకీయాలను ప్రస్తావించడంతోపాటు జీవనోపాధిని నాశనం చేసే ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయం చూపాలని భావిస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ వంటి అంశాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లనుంది. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపడంతో పాటు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం, రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బలమైన రాజకీయ ఆకాంక్షతో కాంగ్రెస్ ఈ యాత్ర చేపడుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి పరీక్షగా నిలవనున్నాయి. వీటిలో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీతోనే ముఖాముఖి పోరాడాల్సి ఉంది. ముఖ్యంగా గుజరాత్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాల పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవాలి. కర్ణాటకలో అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. గుజరాత్లో కాంగ్రెస్ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్రమిస్తోంది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ మళ్లీ గద్దెనెక్కడం అంత సులభం కాదు. అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్‌కు అగ్నిపరీక్ష 1985 నుంచి ఇప్పటి వరకు 27 ఏళ్లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేనంత భారీ ఓటమిని కాంగ్రెస్ 2014, 2019 ఎన్నికల్లోనూ చవిచూసింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టాక జరిగిన ఈ ఎన్నికల్లో 2014లో 19.3 శాతం, 2019లో 19.5 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. ఇక 2014–2022 మధ్య జరిగిన 49 అసెంబ్లీ ఎన్నికలకు గానూ 39 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. కేవలం 4 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిందని, మరో 6 సందర్భాల్లో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. ఇక రాహుల్ వైఖరిని విమర్శిస్తూ కేంద్ర మాజీ మంత్రులు గులాంనబీ జాద్, కపిల్ సిబల్, అశ్వినీ కుమార్, ఎస్పీ సింగ్, మురళీ దేవ్‌రాతోపాటు పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ ఏమాత్రం యోగ్యుడు కాదంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో భారత్ జోడో యాత్ర ఆయనకు అగ్ని పరీక్షేనని చెప్పక తప్పదు. -
Quit India Movement: ఉద్యమం కాదు.. మహాభారత యుద్ధం!
స్వాతంత్య్రం కోసం ఇండియా ఎన్నో ఉద్యమాలు చేసింది. వాటిల్లో చివరి ఉద్యమం.. క్విట్ ఇండియా! నిజానికది ఉద్యమం కాదు. ఒక యుద్ధం. భరతజాతి అంతా ఏకమై బ్రిటిషర్లపై విరుచుకుపడిన మహాభారత యుద్ధం! ఆ యుద్ధంతోనే మనం స్వాతంత్య్రాన్ని గెలుచుకున్నాం. ఈ డెబ్బ ఐదేళ్లను నడిపిన ఒక స్ఫూర్తిగా క్విట్ ఇండియా ఉద్యమం నేటితో 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇండియాలో బ్రిటిష్ పాలనను తుదముట్టించేందుకు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో పిలుపు నిచ్చిన ఉద్యమమే క్విట్ ఇండియా. ఆ రోజున బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ ‘డూ ఆర్ డై’ అన్నారు. ఆ వెంటనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి ‘క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ‘ కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది. ప్రపంచ యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ, ఈ నిరసనలపై చర్య తీసుకోవడానికి బ్రిటిషు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్నీ విచారణనేది లేకుండా జైల్లో వేసింది. వీళ్లలో చాలామంది యుద్ధం ముగిసే వరకు జైలులోనే, ప్రజలతో సంబంధం లేకుండా గడిపారు. మరోవైపు.. క్విట్ ఇండియాకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్, రాచరిక సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ (ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు)లు బ్రిటిస్ వారికి మద్దతుగా నిలిచాయి! యుద్ధకాలంలో జరుగుతున్న భారీ వ్యయం నుండి లాభం పొందుతున్న భారతీయ వ్యాపారవేత్తలు చాలామంది కూడా క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. విద్యార్థులు అక్ష రాజ్యాలకు (జర్మనీ, ఇటలీ, జపాన్) మద్దతు ఇస్తూ ప్రవాసంలో ఉన్న సుభాస్ చంద్రబోస్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపారు. దాంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం సమర్థవంతంగా అణì వేయగలిగింది. వెంటనే స్వాతంత్య్రం ఇవ్వడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసాక చూద్దాం లెమ్మంది. ఈ ఘర్షణలో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. బ్రిటిషు వారు పదివేల మంది నాయకులను అరెస్టు చేసి, వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కారణంగా భారతదేశాన్ని ఇక నియంత్రణలో పెట్టలేమని బ్రిటిషు ప్రభుత్వం గ్రహించింది. మర్యాద కోల్పోకుండా, శాంతియుతంగా ఎలా నిష్కమ్రించాలనే ప్రశ్న యుద్ధానంతరం వారికి ఎదురుగా నిలిచింది. అనంత పరిణామాలు ఇండియా స్వాతంత్య్రానికి పురికొల్పాయి. అసలు క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపునివ్వడానికి క్రిప్స్ మిషన్ చర్చల వైఫల్యం ప్రధాన కారణం. 1942 మార్చి 22 న బ్రిటన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతును పొందటానికి బ్రిటిషు ప్రభుత్వం సర్ స్టాఫోర్డ్ క్రిప్స్‌ను ఇండియా పంపింది. ఆయన బ్రిటిషు ప్రభుత్వపు ముసాయిదా ప్రకటనను సమావేశానికి సమర్పించారు. అందులో రాజ్యాంగ సభ ఏర్పాటు, రాష్ట్రాల హక్కుల వంటివేవో ఉన్నాయి. అయితే అవి కూడా రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తరువాత మాత్రమే. అంటే ఇప్పుడు కాదు అని. క్రిప్స్ ప్రతిపాదనపై గాంధీజీ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఇది మునిగిపోతున్న బ్యాంకుకు చెందిన పోస్ట్ డేటెడ్ చెక్కు’’ అని అన్నారు. -
మహోజ్వల భారతి: అరుణ చేతికి క్విట్ ఇండియా!
అరుణా అసఫ్ అలీ ప్రసిద్ధ భారత స్వాతంత్య్రో ద్యమ నాయకురాలు. 1942లో గాంధీజీ జైలుకు వెళ్లినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి ఆమే నాయ కత్వం వహించారు. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా ఆమె చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మొట్ట మొదటి మేయర్. అరుణకు ఆమె మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది. అరుణ హర్యానాలోని కాల్కా లో ఒక బెంగాలీ బ్రహ్మసమాజ కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం లాహోరు, నైనిటాల్‌లలో జరిగింది. అరుణకు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయమేర్పడింది. ఈ పరిచయం పెళ్లికి దారితీసింది. మతాలు వేరు. వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే. ఆమె కన్నా ఆయన ఇరవై ఏళ్లు పెద్ద. తల్లిదండ్రులు వ్యతిరేకించి నప్పటికీ వారిని కాదని అరుణ అసఫ్ను వివాహమాడారు. వివాహం తర్వాత అరుణ భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలక సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహంలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమెను దేశదిమ్మరి అనే అభియోగం మోపి అరెస్టు చేశారు. శిక్షాకాలం పూర్తయ్యాక కూడా.. తనతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలను విడుదల చేసేవరకు జైలును వదిలి వెళ్లేది లేదని అరుణ పట్టుబట్టారు. 1932లో తీహార్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉండగా జైల్లో ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా అరుణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైల్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఆమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. నేడు అరుణ జయంతి. 1909 జూలై 16న ఆమె జన్మించారు. ఎన్నారై వీరులు భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎన్నారై పంజాబీలు అమెరికాలో స్థాపించిన పార్టీనే గదర్‌పార్టీ. ఈ పార్టీ హిందూ, సిక్కు, ముస్లింల కూటమిగా 1913 జూలై 15న ఏర్పాటైంది. 1910 దశకంలో వాషింగ్టన్, ఒరేగాన్ రాష్ట్రాలలోని కట్టెల మిల్లులలో, కాలిఫోర్నియాలోని వ్యవసాయ భూములలో పని చేయడానికి పంజాబ్ నుండి చాలామంది కార్మికులు వెళ్లారు. అయితే అక్కడ పని చేస్తున్న తెల్లజాతి కార్మికులకంటే భారతీయులకు తక్కువ జీతం చెల్లించడంతో పాటు, బాగా వివక్ష కనబరిచేవారు.. మిల్లు, భూముల యజమానులు. అందుకు తీవ్ర అసంతృప్తికి లోనైన భారతీయులు.. దేశానికి స్వాతంత్య్రం వస్తే గానీ విదేశాల్లోని భారతీయుల పరిస్థితులు మారవని తలచి అనేక ప్రయత్నాల తర్వాత గదర్ పార్టీని స్థాపించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటాన్ని బ్రిటిష్ వారు ‘గదర్’ (తిరుగుబాటు) అని పిలిచేవారు. గదర్ పేరుతో మొదట పత్రికను పెట్టిన మన హిందూ, ముస్లిం, సిక్కు సోదరులు తర్వాత పత్రిక పేరునే పార్టీకి పెట్టారు. అలా గదర్ పార్టీ ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1948లో రద్దయింది. , -
జైహింద్ స్పెషల్: తెనాలి ఎక్కడ? ఆరా తీసిన చర్చిల్!
ముంబైలో గాంధీజీ ఇచ్చిన ‘క్విట్ ఇండియా’ పిలుపును అందుకుని తెనాలిలో ప్రదర్శన కారులు తెనాలి రైల్వే స్టేషన్లో సృష్టించిన విధ్వంసం కొనసాగుతూ ఉండగానే.. మద్రాసు నుంచి మద్రాసు–పూరీ ప్యాసింజరు రైలు వచ్చి ప్లాట్‌ఫాంపై ఆగింది. ప్రయాణీకులు అందర్నీ దించాక నాలుగు బోగీల్లో కిరోసిన్ పోసి నిప్పంటించారు. అదే రైలులో దూరప్రయాణం చేస్తున్న యవ బ్రిటిష్ దంపతులు ఎంతకీ దిగిరాకపోవటంతో, వేచివుండి, వారు దిగాక, ఆ బోగీని కూడా తగులబెట్టారు. ఈ మంటలు రైల్వేస్టేషనుకూ వ్యాపించాయి. తర్వాత టెలిఫోన్ తీగెల్ని చిన్నాభిన్నం చేశారు. చదవండి: స్వతంత్ర భారతి: కలర్లో దూరదర్శన్ తూటాలకు ఏడుగురు బలి అక్కడ్నుంచి కొత్తపేటలోని సబ్‌ట్రెజరీ కార్యాలయానికి ప్రదర్శకులు బయలుదేరారు. ఈ విధ్వంసంపై సమాచారం అందుకున్న గుంటూరు జిల్లా కలెక్టరు, ఎస్పీలు, రిజర్వు పోలీసులతో సహా తెనాలి చేరుకున్నారు. స్థానిక పాత బస్టాండు వద్ద ప్రదర్శకులను నిలువరించేందుకు ప్రయత్నించారు. పోలీసుల హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేయలేదు. పైగా వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రజలను ఆపటం కష్టసాధ్యమన్న భావనకొచ్చిన అధికారుల ఆదేశాలతో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసు తూటాలకు మాజేటి సుబ్బారావు, శ్రీగిరి లింగం, భాస్కరుని లక్ష్మీనారాయణ, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్యలు కుప్పకూలారు. } విద్యార్థులకు అండగా పోలీసులను ఎదిరించిన హెచ్ఎం జొన్నలగడ్డ శివసుందరం చర్చిల్, నేతాజీల దృష్టికి తెనాలి రైల్వేస్టేషను దగ్ధమైన కొన్ని గంటల్లోనే సమీప దుగ్గిరాల రైల్వేస్టేషన్నూ తగులబెట్టారు. అక్కడ నాయకత్వం వహించిన వెనిగళ్ల సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. తెనాలిలో అరెస్టయిన వారిలో రావి సత్యనారాయణ, రావి అమ్మయ్య కూడా ఉన్నారు. ఈ తెనాలి పోరాటం అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, సింగపూర్‌లో ఉన్న నేతాజీ దృష్టికి వెళ్లింది. భారత్‌లో తెనాలి ఎక్కడాని చర్చిల్ ఆరా తీసినట్టు చెబుతారు. ఈ ఉదంతాన్ని బెర్లిన్, టోక్యో రేడియోలు ప్రసారం చేశాయి. ఆ ఆగస్టు విప్లవవీరుల రక్తతర్పణం ఇతర ప్రాంతాల్లో ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. ప్రజలపై జరిమానా ఈ ఘటన తర్వాత సాయుధులైన పోలీసులు పురవీధుల్లో నెలల తరబడి ప్రదర్శనలు చేస్తూ ప్రజలను హడలగొట్టారు. నాయకులు, దేశభక్తులను అరెస్టుచేసి, కోర్టుల్లో శిక్షలు విధించారు. ఇందులో మొదటి ముద్దాయిగా రావి అమ్మయ్యను కడలూరు జైలుకు పంపారు. తాలూకా హైస్కూలు విద్యార్థులను అరెస్టు చేసేందుకని అక్కడకు వెళ్లిన పోలీసులను ప్రధానోపాధ్యాయుడు జొన్నలగడ్డ శివసుందరం అనుమతించలేదు. తన శవంపైనే లోపలకు వెళ్లాలని ఖరాఖండీగా చెప్పటంతో చేసేదిలేక తిరుగుముఖం పట్టారు. ఉద్యమకారుల కారణంగా జరిగిన ఆస్తి నష్టానికి పరిహారంగా తెనాలి ప్రజలపై రూ.2 లక్షల సామూహిక జరిమానా విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ డబ్బు వసూలుకు పెట్టిన బాధలు వర్ణనాతీతం. రణరంగచౌక్గా నామకరణం తెనాలిలో క్విట్ఇండియా ఉద్యమంలో పోలీసులతో పోరాటం జరిగిన ప్రదేశానికి రణరంగచౌక్గా నామకరణం చేశారు. 1959లో తెనాలి మున్సిపల్ చైర్మన్ ఆలపాటి వెంకట్రామయ్య, ఇక్కడ అమరవీరుల స్మృతి చిహ్నంగా ఏడు స్థూపాలను నిర్మించారు. అదే ఏడాది డిసెంబరు 20న అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు నాడార్చేత ఆవిష్కరింపజేశారు. నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, కాంగ్రెస్ ప్రముఖులు కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య, వెనిగళ్ల సత్యనారాయణ వంటి ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఆగస్టు 12న అమరవీరులకు నివాళిగా తెనాలి మున్సిపాలిటీ అధ్వర్యంలో వీర సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
నాటి సమరంలో మనవారు సైతం...
సాక్షి, విజయనగరం : భారత దేశ స్వాతంత్య్ర సమరంలో విజయనగరానికి చెందిన యోధులు ఉన్నారు. ఆ ఉద్యమంలో జిల్లా పాత్రను ప్రస్ఫుటింపజేసిన గొప్ప వ్యక్తిగా కె.ఎస్.తిలక్ నిలుస్తారు. విజయనగరంలో పుట్టి పెరిగిన తిలక్ దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. యువతలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురై జైలు శిక్ష అనుభవించారు. పార్లమెంట్‌కు ఎన్నికైన తిలక్ బెస్ట్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు రాజకీయాల్లోకి ఆహ్వానించినా పదవుల కోసం పార్టీలు మారకుండా అదే పార్టీలో కొనసాగి, తర్వాత రాజకీయాలకు దూరమైన నైతిక విలువలు కలిగిన నాయకుడాయన. చురుకైన నాయకుడు ఆదిరాజు జగన్నాథశర్మ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మరో నాయకుడు ఆదిరాజు జగన్నాథశర్మ. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చివరికి జైలు శిక్ష అనుభవించారు. విజయనగరం మహారాణిపేటలో నివసించిన శర్మ స్వాతంత్య్రం తర్వాత తెలుగు పండిట్‌గా వృత్తిని కొనసాగించారు. ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా పోరాటంలో పాల్గొన్న నాయకుడు ఆయన. జొన్నవలసలో ఉద్యమ తేజం విజయనగరం మండలంలోని జొన్నవలసకు చెందిన మరో ఉద్యమ తేజం పూసపాటి బుచ్చిసీతారామ చంద్రరాజు. 1888లో జన్మించిన ఈయన సత్యాగ్రహ ఉద్యమ జిల్లా నాయకునిగా నామినేట్ అయి ఉద్యమాన్ని నడిపారు. 1930లో జైలుకు వెళ్లి కఠిన కారాగారశిక్ష అనుభవించారు. గాంధీ, ఇర్విన్ ఒడంబడిక ఫలితంగా 1931 మార్చి11న విడుదలయ్యారు. కాంగ్రెస్ పార్టీ కీలక పదవులు అధిరోహించిన ఆయన 1973లో కన్నుమూశారు. స్వతహాగా ఆస్తిపరులైనా, అన్నింటినీ విడిచిపెట్టి తెల్లదొరలను ఎదిరించిన నాయకునిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్రపోరులో చీపురుపల్లి యోధుడు స్వాతంత్య్ర సమరయోధుడు మొదలవలస అబ్బాయినాయుడు చీపురుపల్లి : దేశంలో ఎంతో మంది సమరయోధుల త్యాగఫలంలో స్వాతంత్య్రాన్ని సాధించుకుంటే అందులో చీపురుపల్లికి చెందిన వ్యక్తుల పాత్ర కూడా కాస్త ఉండడంతో ఎంతో గొప్ప విషయం. అందులో మొదలవలస అబ్బాయినాయుడును స్థానికంగా గుర్తు చేసుకుంటారు. 1914లో శ్రీకాకుళం జిల్లాలో ని షేర్‌మహమ్మద్‌పురంలో జన్మించిన అబ్బాయినాయుడు చీపురుపల్లిలో స్థిరపడ్డారు. ఆయన యవ్వనంలోనే స్వాతంత్య్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. అందులో భాగంగానే అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే బ్రిటిష్ ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి దేశ వ్యాప్తంగా రైళ్లను నిలిపివేయడం, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతుండగా అబ్బాయినా యుడు చౌదరి సత్యనారా యణ, గౌతు లచ్చన్నలను ఆదర్శంగా తీసుకుని చీపురుపల్లి నుంచి జి.సిగడాం, పొందూరు రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు తప్పించి, రైల్వే టెలిఫోన్ తీగెలను తెంచేశారు. దీంతో ఆయన్ను పదిహేను రోజులు చీపురుపల్లి సబ్జైల్లో ఉంచారు. టంగుటూరి ప్రకాశం పం తులు, తెన్నేటి విశ్వనాథం, వి.వి.గిరి వంటి వారితో తనకు ఉన్న ఆత్మీయ సంబంధాన్ని అబ్బాయినాయుడు తన డైరీలో కూడా రాసుకున్నారు. 1981 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధునిగా గుర్తించి గౌర వ వేతనం మంజూరు చేసింది. 1991లో చీపురుపల్లిలో కన్నుమూశారు. -
మహాత్ముని నోట మరణమనే మాట..!
భారతమాత నుదుట స్వేచ్ఛా తిలకం దిద్దిన ఉద్యమం అది. ప్రతీ భారతీయుడి నరనరాన రగిలిన మహోద్యమమది. క్విట్ ఇండియా... ఈ నినాదం మనదేశంలో స్వాతంత్రోద్యమాన్ని మలుపుతిప్పింది. తెల్లదొరలను తరిమికొట్టేందుకు అవసరమైన పోరాట స్పూర్తిని నింపింది. బ్రిటీష్ పాలకులను గడగడలాడించింది. డూ ఆర్ డై అనే నినాదం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యానికి పునాదులు వేసింది. నేటితో క్విట్ ఇండియా ఉద్యమానికి 77 ఏళ్లు నిండిన సందర్భంగా సాక్షి .కామ్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ... -
‘క్విట్ ఇండియాలా మరోసారి ఉద్యమించాలి’
కోల్కత్తా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ఈనెల 12న జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కీలకమైన పశ్చిమ బెంగాల్లో మరో 17 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మిద్నాపూర్‌లో పర్యటించిన మమత బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటీషర్ల కబంధ హస్తాల నుంచి భారతీయులను విముక్తి చేసిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. మోదీపై విమర్శల దాడి చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే భారతీయులంతా మరోసారి క్విట్ ఇండియా తరహా ఉద్యమాన్ని చేపట్టాలని దీదీ పిలుపునిచ్చారు. గాంధీ స్ఫూర్తితో ఉద్యమించి మతతత్వ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని అన్నారు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించినట్లు.. పౌరులపై నిర్బంధం విధిస్తున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అంతకుముందు నుంచే మమత, మోదీ మధ్య మాటల యుద్ధం ముదురుతోన్న విషయం తెలిసిందే. రాజకీయ విమర్శలు దాటి.. వ్యక్తిగత ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ నేపథ్యంలో మోదీని ఉద్దేశించి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై.. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. దీదీ అన్ని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘మమతా బెనర్జీ మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కానీ మోదీ ఈ దేశానికి ప్రధాని. మెరుగైన పాలన అందించడం కోసం భవిష్యత్తులో మీరు, మేము కలిసి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదం’టూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. -
తొలితరం పార్లమెంటేరియన్
లెజెండ్స్ -ఎంఆర్ కృష్ణ :దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న దళిత నేత ఎం.ఆర్ కృష్ణ. క్విట్ ఇండియా అని నినదించిన నాయకుడు. తెలంగాణ విముక్తి పోరాటంలో హైదరాబాద్ స్టేట్‌ను భారతావనిలో కలపాలని పోరాడారు. సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన ఎం.ఆర్. కృష్ణ రక్తం ఉరకలేసిన రోజుల నుంచి స్వతంత్ర జాతి నిర్మాణం వరకు దేశానికి సేవలందించారు. పార్లమెంటేరియన్‌గా మూడు దశాబ్దాల పాటు ఢిల్లీలో వాణి వినిపించిన ఆయన ఇందిరాగాంధీ మంత్రివర్గంలో డిప్యూటీ మినిస్టర్‌గా రక్షణ, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధి శాఖలను నిర్వహించారు. ఆయన గురించి ఈ తరానికి పెద్దగా తెలియదనే చెప్పాలి.-పోలంపల్లి ఆంజనేయులు,సాక్షి ప్రతినిధి, కరీంనగర్ నాలుగు వరుస విజయాలు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తరువాత జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు గెలిచిన దళిత నాయకుడు ఎం.ఆర్.కృష్ణ. వరుసగా ముప్పై ఏళ్లు పార్లమెంట్లో తన వాణి వినిపించారు. భారతావనికి స్వాతంత్రం సిద్ధించాలని, నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ స్వేచ్ఛాగీతం ఆలపించాలని తపించారాయన. 1942లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కీలకంగా వ్యవహరించారు. 1947 ఆగస్టులో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా, హైదరాబాద్ స్టేట్‌కి విముక్తి లభించలేదు. యువతను చైతన్యం చేసి, నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ నేతలతో కలిసి నిజాం గద్దె దిగే వరకు పోరాడారాయన. తెలంగాణ విముక్తి పోరాటాల్లో ఆయన పేరు లిఖించదగినది. తొలి పార్లమెంట్ సభ్యత్వం దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1952లో పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభను ద్విసభ్య నియోజకవర్గంగా ప్రకటించారు. అంటే ఒక జనరల్ సభ్యుడు, ఒక ఎస్సీ సభ్యుడు పోటీ చేయవచ్చు. ఆ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి ఎస్.సీ.ఎఫ్ తరపున పోటీ చేసిన కృష్ణ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తెలంగాణ నాయకురాలు టీ.ఎన్.సదాలక్ష్మిపై 1.38 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1957లో జరిగిన రెండో పార్లమెంట్ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి పీడీఎఫ్‌కు చెందిన పీ.ఎల్.దాస్‌పై 38 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. 1962లో చట్టసభల్లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడంతో ఆయన కరీంనగర్ నుంచి తన ప్రస్థానాన్ని కొత్తగా ఏర్పాటైన పెద్దపల్లికి మార్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1962, 1967లో పోటీ చేసి.. అప్పటి సీపీఐ నాయకుడు పళనివేలు మీద రెండుసార్లు విజయకేతనం ఎగరేశారు. 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి ఉద్యమం అనంతరం మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన తెలంగాణ ప్రజా సమితి తెలంగాణలోని 14 సీట్లలో విజయం సాధించింది. ఆ పార్టీ తరపున 1971లో పెద్దపల్లి నుంచి పోటీ చేసిన వి.తులసీరాం చేతిలో ఎం.ఆర్.కృష్ణ లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1972లో రాజ్యసభకు నామినేట్ చేశారు. అది రాజ్యసభకు మధ్యంతర ఎన్నిక. ఆ తర్వాత 1976లో తిరిగి రాజ్యసభకు నామినేట్ అయ్యి 1982 వరకు కొనసాగారు. జవహర్లాల్ నెహ్రూ, గుల్జారీలాల్ నందా, ఇందిరాగాంధీ, మురార్జీ దేశాయ్, చరణ్‌సింగ్ వంటి మహామహులు ప్రధానులుగా కొనసాగిన కాలంలో ఎంపీగా ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించిన ఘనత కృష్ణకే దక్కుతుంది కేంద్రమంత్రి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో నవంబర్ 1967 నుంచి 1970, జూన్ వరకు కేంద్ర రక్షణ శాఖ డిప్యూటీ మంత్రిగా, ఆ తరువాత 1971, మార్చి వరకు అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి డిప్యూటీ మంత్రిగా సేవలు అందించారు. 1962లో జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా పనిచేసి తన సమర్ధతను చాటుకున్నారు ఎం.ఆర్ కృష్ణ. మరోపక్క సామాజిక రంగంలోనూ తన సేవలను తుది వరకు కొనసాగించారు. దళిత జాతి జనోద్ధరణ కోసం ఆయన జీవితకాలం పోరాడారు. పలు సామాజిక సంఘాలతో కలిసి దళితవాడల్లో అక్షరాస్యత, అభివృద్ధి కోసం కృషి చేశారు. సికింద్రాబాద్ అల్వాల్‌లో జై జవహర్ కాలనీ ఏర్పాటు చేశారు. గాంధీ మెమోరియల్ మల్టీ పర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్ కూడా ఆయన ఏర్పాటు చేసిందే. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్టŠస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. క్రీడలంటే ఆసక్తి కనబరిచే కృష్ణ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ చైర్మన్‌గా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్ సభ్యుడిగా కూడా కొనసాగారు. ఆయన 80 ఏళ్ల వయసులో 2004, మే 12న దివంగతులయ్యారు. -
ఉద్యమాల పుట్టినిల్లు...గుంతకల్లు
ఉద్యమాల పుట్టినిల్లుగా గుంతకల్లుకు ప్రత్యేక ఖ్యాతి ఉంది. 1942లో మహాత్ముడి పిలుపునందుకుని బ్రిటీష్ వారిని భారతదేశం వదలి పొమ్మంటూ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో విజయమో.. వీరస్వర్గమో అంటూ ఈ నియోజకవర్గంలోని గుత్తి, పామిడి, గుంతకల్లు వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ సమయంలో మిత్రులతో కలసి గుంతకల్లు రైల్వేస్టేషన్‌ను ధ్వంసం చేసిన ఘటనలో కసాపురానికి చెందిన మహమ్మద్ రసూల్ ఆరుమాసాల జైలు శిక్షను అనుభవించారు. నాటి స్వాతంత్య్రోద్యమం మొదలు నేటి ప్రత్యేక హోదా సాధన పోరు వరకూ గుంతకల్లు నియోజకవర్గ ప్రజలు చూపిన ఉద్యమ స్ఫూర్తి అనితర సాధ్యం. చైతన్యవంతులైన ఈ నియోజకవర్గ ప్రజలు అధికార మార్పు కోరుతూ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. ఒకసారి గెలిచిన అభ్యర్థిని మళ్లీ ఎన్నికల్లో దూరం పెట్టేస్తూ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ వచ్చారు. అయితే నియోజకవర్గ ప్రజలను దగా చేస్తూ పారిశ్రామిక ప్రగతిని టీడీపీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో పరిశ్రమలకు కేంద్రంగా భాసిల్లుతున్న గుంతకల్లు నియోజకవర్గంలో కార్మికుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. గుంతకల్లు.. 1957 నుంచి 2009 వరకూ గుత్తి నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలు ఈ నియోజకవర్గ ప్రజల చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి. 13 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు నాలుగేసి సార్లు గెలుపొందగా, ఒకసారి సీపీఐ, మరో మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులకు పట్టం కట్టారు. కరుడుకట్టిన కమ్యూనిస్ట్ యోధుడు వీకే ఆదినారాయణరెడ్డి 1962లో గుత్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో గుత్తి నియోజకవర్గంలో తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలోని సగం పల్లెలు ఉండేవి. అలాగే గుంతకల్లులోని పలు గ్రామాలు ఉరవకొండ నియోజకవర్గంలో ఉండేవి. ఈ గందరగోళానికి తెరవేస్తూ మొత్తం పెద్దవడుగూరు మండలాన్ని తాడిపత్రిలోకి, తాడిపత్రి, ఉరవకొండ నియోజవర్గాల పరిధిలోని పామిడి మండలాన్ని సంపూర్ణంగాను, గుంతకల్లు మండలంలోని పూర్తి పల్లెలను కలుపుతూ 2009లో గుంతకల్లు నియోజకవర్గంగా చేశారు. పరిశ్రమలు కనుమరుగు గుంతకల్లులోని ఏసీఎస్ మిల్లు ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్దదిగా ఖ్యాతి గడించి, రాయలసీమకే తలమానికంగా నిలిచింది. ఇక చలనచిత్రాల డిస్ట్రిబ్యూషన్ కంపెనీలూ గుంతకల్లులో పెద్ద సంఖ్యలో ఉండేవి. చిత్ర పరిశ్రమలో రాయలసీమ సీడెడ్ కంపెనీగా గుంతకల్లు అప్పట్లో విరాజిల్లింది. ఇక స్లీపర్ ఫ్యాక్టరీ, లైఫ్‌బాయ్ సబ్బులు ఫ్యాక్టరీ, ఇతర చిన్నతరహా పరిశ్రమలెన్నో గత ప్రభుత్వాల హయాంలో ఉండేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలపై ఇస్తున్న రాయితీలకు మంగళం పాడేసింది. దీంతో నిర్వహణ భారమై పరిశ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మూతపడుతూ వచ్చాయి. సెంటిమెంట్ ఫలించేనా? గుంతకల్లు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక రాజకీయ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఒకసారి గెలిపించిన అభ్యర్థికి మరోసారి ఆ అవకాశమివ్వరు. గత ఎన్నికలు పరిశీలిస్తే ఇవే ఫలితాలు స్పష్టమవుతాయి. గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి మళ్లీ ఎన్నికల్లో బరిలో నిలిస్తే అతనికే నియోజకవర్గ ప్రజలు ఓటేస్తారు. ఈ తరహా రాజకీయ సెంటిమెంట్ బలంగా ఉన్న గుంతకల్లు నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క గాదిలింగప్ప తప్ప రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు ఎవరూ లేరు. ఈ రెండు విడతల మధ్యలో ఒక టెర్మ్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుత్తి/గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలు వీరే.. మండలాలు : గుంతకల్లు, గుత్తి, పామిడి నియోజకవర్గం : గుంతకల్లు మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు 2,38,0 1,18,7 1,19,2 62 గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు. గుంతకల్లులో పాలిటెక్నిక్ కళాశాల, గుంతకల్లు–నాగసముద్రం డబుల్ రోడ్డు, కసాపురం రైల్వే బ్రిడ్జి విస్తరణ, గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు, గుత్తిలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు, గుత్తి కోటకు పర్యాటక కేంద్రం గుర్తింపు తదితర హామీలిచ్చి ఆచరణలో విఫలమయ్యారు. – నియోజకవర్గంలోని చెరువులకు కృష్ణా జలాల మళ్లింపు సాధనలో ఘోరంగా విఫలమయ్యారు. మహిళా ఓటర్లే కీలకం గుంతకల్లు నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే 2019 నాటికి 472 మంది మహిళల ఓటర్ల సంఖ్య పెరిగింది. 2019 జనవరి 11 నాటికి ఎన్నికల అధికారులు ప్రకటించిన మేరకు ఈ నియోజకవర్గంలో 2,38,010 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఐదేళ్లలో 15,745 మంది కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఉన్నారు. కేవలం ఈ మూడు నెలల్లో 18 సంవత్సరాలు పైబడిన యువత 8 వేలకు పైగా ఓటు హక్కు నమోదు చేసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో 242 పోలింగ్ కేంద్రాలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 288కు చేరుకుంది. -
స్వాతంత్య్ర పోరాటంలో కీలకం ఆజాద్ రేడియో
ఐక్యరాజ్యసమితి రేడియో 1846 ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. 2012 నుంచి ఆ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది రేడియో దినోత్సవం సందర్భంగా ‘సంభాషణ, సహిష్ణుత, శాంతి’ అనే అంశాన్ని ఇతివృత్తంగా నిర్దేశించారు. అయితే, సంభాషణ మృగ్యమై, సహిష్ణుత లుప్తమై, శాంతి కరువైన క్విట్ ఇండియా ఉద్యమ వేళ 1942లో ఒక రహస్య వాణి 78 రోజులపాటు ఈ జాతిని ప్రభావితం చేసింది. అప్పటి బ్రిటిష్ పాలకులు దీనిని ‘కాంగ్రెస్ ఇల్లీగల్ రేడియో’అని పిలిచారు. అయితే దాన్ని నిర్వహించిన నాయకులు ‘ఆజాద్ రేడియో’ అన్నారు. ఈ రహస్యవాణికి వ్యూహకర్త రామ్ మనోహర్ లోహియా కాగా, నిర్వహించినది 20 నుంచి 40 ఏళ్ల మధ్యగల ఏడుగురు ధీశాలులు. అతి త్వరలో ఈ విషయం చరిత్ర పుస్తకాల్లో, పాఠశాల విద్యార్థుల పుస్తకాల్లో అంతర్భాగం కానుంది. 1942 ఆగస్టులో గాంధీజీ బ్రిటిష్‌వారి దుష్టపాలనకు మృత్యుగీతం రచిస్తూ ‘కరెంగే యా మారేంగే’అని పిలుపునిచ్చారు. అది మంత్రమై దేశం ఎల్లడెలా పాకింది. బ్రిటిష్ అధికారులు నాయకులను అగ్రస్థాయి నుంచి, బ్లాకు స్థాయి వరకూ చెరసాలల్లో బంధించారు. ఆ సమయంలో చాలామంది సోషలిస్టు నాయకులు తప్పించుకుని, రహస్యంగా ఉద్యమంలోకి సాగారు. 1942 ఆగస్టు 9 నుంచి ఉద్యమం నాయకత్వాన్ని కోల్పోయింది. ఈ సమయంలో దిశానిర్దేశం చేసిన రహస్య మాధ్యమం ‘ఆజాద్ రేడియో’. 1942 ఆగస్టు 27 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం కైవశం చేసుకునే వరకు నవంబర్ 12 వరకు గొప్ప సేవలందించింది. 1988 ఫిబ్రవరి 13 సంచిక మరాఠీ పత్రిక సాధనలో సోషలిస్టు నాయకుడు మధులిమాయే రాస్తూ నాసిక్‌లోని శంకరాచార్య మఠంలో ఆజాద్ రేడియో పరికరాలను విఠలరావ్ పట్వర్థన్ తెచ్చి ఉంచారనీ, అక్కడ నుంచి ప్రసారాలు చేయాలని తలంచినా, పోలీసు దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని గోదావరి నదిలో పడేశారని పేర్కొన్నారు. ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్ కాస్ట్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూవ్మెంట్’అనే పుస్తకం 2018లో కేంద్ర ప్రభుత్వ సంస్థ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించింది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్‌ఫర్ ది ఆర్ట్స్, న్యూఢిల్లీకి చెందిన పరిశోధకులు గౌతమ్ చటర్జీ 1984 నుంచి నేషనల్ ఆర్కైవ్స్‌లో గాలించి పరిశోధన చేస్తున్నారు. వీరికి ‘పోలీస్ మానిటరీ రిపోర్ట్’ అనే పోలీసు ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫైల్ తారసపడింది. అప్పట్లో ఆజాద్ రేడియో ప్రసారాలను గమనిస్తూ, బ్రిటిష్ పోలీసులు తయారు చేసిన రహస్య ఫైలు ఇది. ఇందులో అక్టోబర్ 9 నుంచి పోలీసులు నమోదు చేసిన ప్రసారాల వివరాలున్నాయి. ఇవి పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించిన అంశాలు. వీటిని గమనిస్తే కరాచీ నుంచి బృందావనం దాకా, అలహాబాద్ నుంచి బెంగాల్ దాకా, బిహార్ నుంచి మద్రాసు దాకా, కోయంబత్తూరు నుంచి త్రివేండ్రం దాకా, గుజరాత్ నుంచీ మహారాష్ట్ర దాకా సమాచారాన్ని చేరవేశారని అర్థమవుతుంది. ‘‘..స్కౌట్ సిద్ధం చేసిన నివేదికలు జాగ్రత్తగా పరిశీలించిన కాంగ్రెస్ సోషలిస్టు భావాలతో సాగిన ఈ ప్రసారాలకు కీలకం రామ్ మనోహర్ లోహియా అని తెలి సింది. రైతులు, కార్మికుల కోసమే స్వాతంత్య్ర భారతదేశమని అక్టోబర్ 23వ తేదీ ప్రసారాలలో ప్రకటించడం గమనార్హం. అలాగే అక్టోబర్ 27వ తేదీన స్వాతంత్య్రం కోసం విప్లవం అనేది బీదల కోసం విప్లవం. రైతుల కోసం, కార్మికుల కోసమే ఈ స్వాతంత్య్ర భారతం’’అని బ్రిటిష్ గవర్నమెంట్ అడిషనల్ సెక్రటరీ హెచ్.వి.ఆర్. అయ్యంగార్ ఈ ఆజాద్ రేడియో ప్రసారాల గురించి అప్పటి ప్రభుత్వానికి వివరించారు. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా నిర్వహించిన ‘ఆజాద్ హింద్ రేడియో’కు భిన్నమైనది ఈ ఆజాద్ రేడియో. అంతరాయం లేకుండా వివిధ ప్రాంతాల నుంచి కనీసం మూడు ట్రాన్స్మీటర్లు నడిచేవి. ఈ 78 రోజుల (అధికారుల రికార్డుల ప్రకారం 71 రోజులు) ప్రసారాలు ఐదారు చోట్ల నుంచి, నాలుగైదు ఫ్రీక్వెన్సీల నుంచి సాగాయి. పరుపులు, సూట్‌కేసులతో ట్రాన్స్మీటర్లను వేర్వేరు ప్రాంతాలకు బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి తరలించేవారు. 41.78, 42.34, 41.12, 42.12 మీటర్లపై ప్రసారాలు జరిగాయి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి 9 గంటల సమయంలో అరగంటసేపు ఈ ప్రసా రాలు సాగేవి. హిందుస్తానీ హమారా అనే పాటతో మొదలై, వందేమాతరంతో ముగిసేవి. 10 వాట్ల ప్రసార శక్తిని, 100 వాట్లు చేయడానికి కృషి చేసి సఫలీకృతులయ్యారు. ఈ ప్రసారాలు వినడానికి 225 రూపాయలు వెచ్చించి రేడియో సెట్టు కూడా నిర్వాహకులు కొన్నారు. ఈ ప్రసారాలు నిర్వహించినవారిలో గుజరాత్‌కు చెందిన 20 సంవత్సరాల బాబూ భాయ్ విఠల్దాస్ మాథవి ఖక్కడ్ అనే పేరుగల యువకుడు ముఖ్యుడు. ముంబ యిలో ఫోర్త్ స్టాండర్డ్ మాత్రమే చదివిన ఈ కుర్రాడు కిరోసిన్‌తో కారు నడిపే యంత్రం కేరో గ్యాస్ తయారీ వ్యాపారంలో ఉండేవాడు. లోహియా ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఇతనిదే. ఈ రేడియో ప్రసారాలు నిర్వహించినందుకు 1943 మే తీర్పు ప్రకారం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. సూరత్‌కు చెందిన 22 ఏళ్ల కుమారి ఉషామెహతా ఈ రేడియో ప్రసారాల విషయంలో బాబూ భాయ్‌కి కుడిభుజంగా ఉండేవారు. ట్రాన్స్‌మీటర్ వాడటం, మైక్రోఫోన్ ద్వారా లోహియా రాసిన ప్రసంగాలు రేడియోలో చదవడంవంటి పనులు చేసేవారు. ఎంఏ చదువుతున్న సమయంలో ఈమె ఈ ప్రసార సేవలు అందించారు. చివర్లో నాలుగేళ్లు కారాగార శిక్ష అనుభవించిన మెహతా స్వాతంత్య్రం వచ్చాక ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇక నలభై ఏళ్ల పార్సీ నారీమన్ అబరాబాద్ ప్రింటర్ కూడా వీరితో చేతులు కలిపాడు. దాంతో బాబూభాయ్ కేరోగ్యాస్ వ్యాపారంతో చేతులు కలిపారు. దీన్ని నిషేధించాక, ఆజాద్ రేడియో ట్రాన్స్‌మీటర్ తయారు చేసి ఇచ్చాడు ప్రింటర్. ఈ ముగ్గురుతోపాటు గుజరాత్ భావనగర్ ప్రాంతా నికి చెందిన 28 సంవత్సరాల విఠల్ దాస్ కాంతాభాయ్ జవేరీ, బర్కానా సింథ్ ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల వైర్లెస్ నిపుణులు నానక్ ఘర్ చంద్ మోత్వానీ, బొంబాయికి చెందిన 23 సంవత్సరాల చంద్రకాంత్ బాబుభాయ్ జవేరీ, బొంబాయికే చెందిన 27 ఏళ్ల జగన్నాథ రఘునాథ్ ఠాకూర్ కూడా రేడియో ప్రసారాల్లో కీలకపాత్ర పోషించారు. ఇంకా ఎంతోమంది ఇందులో భాగస్వాములయ్యారు. కొందరి పేర్లు మాత్రమే ఇంటెలిజెన్స్ రికార్డులలో ఉన్నాయి. అందువల్ల వారి పేర్లే ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ఇలా స్వాతంత్య్ర పోరాట సమయంలో రేడియో జర్నలిజానికి గొప్ప చారిత్రక సాక్ష్యంగా నిలిచింది ఆజాద్ రేడియో. (రేపు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా) -డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త డైరెక్టర్, రీజినల్ అకాడమీ, ఆకాశవాణి, హైదరాబాద్ ‘ మొబైల్ : 94407 32392 -
‘అమ్మ’కు విముక్తి కలిగించేందుకు...
సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళామణులదీ విశేషపాత్ర. వారిలో కొందరు తమకే సొంతమైన ధీరత్వంతో చరిత్రకెక్కారు. భూమాత‘అమ్మ’ను పరాయి పాలకుల చెర నుంచి విడిపించేందుకు తమ వంతు కృషి చేసిన కొందరు మహిళా మూర్తులను మరోసారి స్మరిద్దాం.. తరిద్దాం.. జై భరతనారీ.. ఝాన్సీ లక్ష్మీబాయి భారతీయ స్త్రీ అంటే ధైర్యానికి ప్రతీక అని చాటి చెప్పిన ధీర వనిత. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజ్య సంక్రమణ’ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం ప్రకటించిన వీరనారి. కొడుకును వీపున కట్టుకుని పోరాడుతూ అతివ అంటే అబల కాదు సబల అని నిరూపించిన స్త్రీ మూర్తి. బేగం హజ్రత్ మహల్(1820-1879) అవధ్ రాణిగా సుప్రసిద్ధురాలైన హజ్రత్ మహల్ భర్త నవాబ్ వాజిద్ అలీ షా మరణానంతరం పాలనా బాధ్యతలు స్వీకరించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, తన అనుచరులతో కలిసి లక్నోను ఆక్రమించుకున్నారు. కొడుకు బిజ్రిస్ కాద్రాను అవధ్‌కు రాజుగా ప్రకటించారు. కానీ బ్రిటీష్ అధికారుల కుయుక్తుల ముందు ఓడిపోయి, బహిష్కరణకు గురై కలకత్తాకు వెళ్లిపోయారు. రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆలయాలు, మసీదులు కూల్చివేసి ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిచ్చిన రాణిగా అందరి దృష్టి ఆకర్షించారు. 1857- 1859 జాతీయ విముక్తి తిరుగుబాటుకు బేగం నాయకత్వం వహించారని కార్ల్ మార్క్స్, తన పుస్తకంలో పేర్కొన్నారు. మేడమ్ బికాజీ కామా(1861-1936) పార్శీ వర్గానికి చెందినవారు. 1896లో ముంబైలో ప్లేగు వ్యాధి ప్రబలించినపుడు ఆమెకు వ్యాధి సోకినప్పటికీ ఇతరులకు సాయం చేశారు. మెరుగైన చికిత్స కోసం బ్రిటన్ వెళ్లారు. స్వాతంత్ర్యోద్యమానికై జీవితాన్ని ధారపోశారు. దాదాబాయ్ నౌరోజీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో శ్యామ్ కృష్ణ వర్మ స్థాపించిన ‘ఇండియన్ హోమ్‌రూల్ సొసైటీ’కి మద్ధతుగా నిలిచారు. 1907లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సామాజిక సదస్సులో పాల్గొని భారత జెండాను ప్రదర్శించారు. భారత ఉపఖండం కరువును జయించిన తీరును వివరించారు. మానవ హక్కులకై, సమానత్వం సాధించుటకై కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1935లో యూరప్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. సరోజిని నాయుడు భారత కోకిలగా సుప్రసిద్ధురాలైన సరోజిని నాయుడు గవర్నర్ పదవి నిర్వహించిన తొలి భారతీయ మహిళ. స్వతంత్ర పోరాటంలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. గొప్ప కవయిత్రి కూడా. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ‘ఖైజర్-ఎ-హింద్’ పతకంతో సత్కరించింది. కస్తూర్బా గాంధీ భారత జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణిగానే కాకుండా రాజకీయవేత్తగా, పౌర హక్కులకై పోరాడిన మహిళగా, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గుర్తింపు పొందారు. కుటుంబ బాధ్యత తీసుకుని గాంధీజీకి అండగా నిలిచారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ ఆవశ్యకతతో పాటు, విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. విజయ లక్ష్మీ పండిట్(1900-1990) సంపన్న కుటుంబంలో జన్మించిన విజయ లక్ష్మీ పండిట్ భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. పండిట్ జవహర్ లాల్ సోదరి. కేబినెట్ పదవి పొందిన మొదటి భారతీయ మహిళ. స్థానిక స్వయం ప్రభుత్వ, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు. భారత్ తరపున మాస్కో, వాషింగ్ట్‌న్, లండన్ మహిళా రాయబారిగా పనిచేశారు. సుచేతా కృపలానీ(1908-1974) స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారత్‌లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా(ఉత్తర్ ప్రదేశ్) చరిత్ర సృష్టించారు. కమలా నెహ్రూ(1899-1936) జవహర్లాల్ నెహ్రూ భార్య. సహాయ నిరాకరణోద్యమంలో మహిళా బృందాలను సంఘటితపరుస్తూ, విదేశీ దుస్తులు, మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. భర్త హాజరుకాని సమావేశాలకు ఆయన తరపున వెళ్లి ఉపన్యసించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనీబిసెంట్(1857-1933) భారతదేశం స్వతంత్రంగా మారాలని ఆకాక్షించిన విదేశీ మహిళ. ఐర్లాండ్‌కు చెందిన వారు. బాలగంగాధర్ తిలక్‌తో కలిసి ‘హోం రూల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. అరుణా అసఫ్ అలీ(1909-1996) భారత రత్న అవార్డు గ్రహీత. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలు మార్లు అరెస్టయ్యారు. జైలులో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తనా తీరుకు నిరసనగా బంద్‌లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్ జైలులోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (1909-1981) తెలుగు వనిత దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గాంధీజీ అనుచరురాలిగా సుప్రసిద్ధులు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉన్న సమయంలో కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు స్థాపించారు. దీని ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. -సుష్మారెడ్డి యాళ్ళ -
ఇంక్విలాబ్ ఏ హీరో పేరో తెలుసా?
ముంబై: స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపు తెస్తూ బ్రిటీష్ వారిని దేశం వదిలిపోవాలంటూ నినదించిన క్విట్ ఇండియా ఉద్యమానికి ఈ మధ్యే సరిగ్గా 75 ఏళ్లు పూర్తయ్యింది. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం ప్రముఖ రచయిత హరివంశ్ రాయ్ శ్రీవాస్తవను అమితంగా ఆకర్షించిది. అందుకే తనకు పుట్టబోయే కొడుకుకు ఇంకిల్వాబ్ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 11 అంటే క్విట్ ఇండియా మొదలైన రెండు నెలల తర్వాత ఆయన భార్య తేజి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ముందుగా అనుకున్నట్లు ఇంక్విలాబ్ అనే పేరు పెట్టాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. కానీ, ఇంతలో రాయ్ స్నేహితుడు సుమ్రితానందన్ పంత్ బాలుడిని చూసేందుకు ఆస్పత్రికి వచ్చారు. చిన్నారిని చూస్తూ ధన్యావస్త్ అమితాబ్ అన్నారు. అనుకోకుండా ఆయన నోటి నంచి వచ్చిన పదం హరివంశ్ రాయ్‌ని విపరీతంగా ఆకర్షించింది. వెంటనే తన కొడుకుకు అమితాబ్ అని పేరుపెట్టుకున్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బిగ్ బీ అమితాబ్ పేరు వెనుక అసలు కథే ఇది. యాధృచ్ఛికం ఏంటేంటే.. ఇంకిల్వాబ్ పేరుతోనే 1984లో అమితాబ్ శ్రీదేవి జంటగా బాలీవుడ్ లో ఓ సినిమా కూడా వచ్చింది. బచ్చన్ ఎలా అయ్యారు... అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ శ్రీవాస్తవను చిన్నప్పుడు ఇంట్లో అందరూ ముద్దుగా బచ్చన్(చిన్నపిల్లాడు) అని పిలిచేవారు. తర్వాత ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పై చదువుల కోసం వెళ్లినప్పుడు అడ్మిషన్ ఫామ్‌లో బచ్చన్ అనే నమోదు చేయించుకున్నారు. అదే తర్వాత అమితాబ్ పేరు వెనకాల వచ్చి చేరి స్థిరపడిపోయి, బచ్చన్ ఫ్యామిలీకి రిఫరెన్స్‌గా మారింది. -
కేంద్రం చరిత్రను వక్రీకరిస్తోంది
♦ క్విట్ ఇండియా ప్రసంగంలో నెహ్రూను విస్మరిస్తారా? ♦ మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా పోరాడుతాం ♦ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి 14ఏళ్లపాటు జైలులో ఉన్న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరును ప్రధాని తన ప్రసంగంలో కావాలనే విస్మరించారని, ఇది బీజేపీ చిన్న మనస్థత్వానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. 75వ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో నెహ్రూ పేరును విస్మరించడమే మిటన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో, స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ పాత్ర మరువ లేనిదని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో విలేకరుల సమావే శంలో మాట్లాడారు. బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా పనిచేసిన వారిని బీజేపీ, జాతీ య నేతలుగా పొగుడుతూ, నిజంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని విస్మరిస్తోం దని, చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని ఉత్తమ్ అన్నారు. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభు త్వాలు ప్రజలకు కనీస మానవ హక్కులు లేకుండా చేస్తున్నాయని, దళితులు, గిరిజ నులు, మైనారిటీలు, మహిళలకు ఎలాంటి హక్కులు లేకుండా అణచివేస్తున్నారని మండి పడ్డారు. అణగారిన వర్గాలకు అండగా ఉంటా మని, వారికి న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడుతామని తెలిపారు. గాంధీభవన్‌లో ఉత్సవాలు... గాంధీ భవన్లో క్విట్ ఇండియా వేడుకల సందర్భంగా మండలి విపక్ష నేత షబ్బీర్ అలీతో కలసి ఉత్తమ్ పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. దేశంలో మతతత్వం, నిరంకు శత్వం పెరిగిపోయిందని, ప్రజల హక్కులు కాలరాస్తున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్య క్షుడు మల్లురవి, కిసాన్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి, సేవాదళ్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. అహ్మద్ పటేల్ విజయంపై హర్షం గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ విజయం సాధించడంపై ఉత్తమ్, ఇతర నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేశారు. అహ్మద్ పటేల్ ఎన్నిక విషయంలో బీజేపీ అవాంతరాలు సృష్టిం చినా ప్రజాస్వామ్యం విజయం సాధించిం దని, ఇది బీజేపీకి చెంపపెట్టు వంటిదని టీసీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఇకనైనా బీజేపీ రాజ్యం గేతర పనులు చేయకుండా ప్రజోపయోగ పనులపై దృష్టిసారించాలని హితవు పలికారు. -
ఆరెస్సెస్‌పై సోనియాగాంధీ అటాక్!
క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆరెస్సెస్ వ్యతిరేకించింది లోక్‌సభలో కాంగ్రెస్ అధినేత్రి పరోక్ష విమర్శలు న్యూఢిల్లీ: క్విట్ ఇండియా ఉద్యమంపై లోక్‌సభలో ప్రత్యేక చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్‌పై మండిపడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని కొన్ని గ్రూపులు వ్యతిరేకించాయంటూ పరోక్షంగా ఆరెస్సెస్‌ను వేలెత్తిచూపారు. 'క్విట్ ఇండియా ఉద్యమ భావనను కొన్ని శక్తులు వ్యతిరేకించిన విషయాన్ని మనం మరువకూడదు. ఈ నిజాలను మనం తప్పక చెప్పాలి' అని ఆమె అన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లోక్‌సభలో ఈ అంశంపై సోనియాగాంధీ మాట్లాడారు. 'భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఈ గ్రూపులు ఎలాంటి కృషి చేయలేదు' అని పరోక్షంగా ఆరెస్సెస్‌ను దుయ్యబట్టారు. 1925లో ఏర్పాటైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర నిర్వహించలేదని ఎంతోమంది చరిత్రకారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య పోరాటం ఎక్కువశాతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే సాగిందని తెలిపారు. అయితే, ఈ వాదనను ఆరెస్సెస్ ఖండించింది. సోనియా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. 'దేశంలో చీకటి శక్తులు మళ్లీ పైకిలేస్తున్నాయి. మన లౌకిక, ఉదారవాద, స్వేచ్ఛాయుత ఆలోచనధారకు ప్రస్తుతం ముప్పు వాటిల్లుతోంది. ఈ శక్తులకు విరుద్ధంగా పోరాడాల్సిన అవసరం ఇప్పుడుంది' అని అన్నారు. 'రాజకీయ విద్వేషం, ప్రతీకారం మన దేశాన్ని చుట్టేస్తున్నాయి. బహిరంగ చర్చ, అభిప్రాయ వ్యక్తీకరణకు ఇప్పుడు ఏమాత్రం అవకాశం లేకుండాపోయింది' అని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ చేసిన కృషిని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు. -
‘ఆర్ఎస్ఎస్ వారసులు మాట్లాడటం విడ్డూరం'
హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ వారసులు క్విట్ ఇండియా ఉద్యమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ..దేశంలో భయానక వాతావరణం నడుస్తోందని.. దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అందరికి అండగా , మద్దతుగా ఉంటుందన్నారు. తెలంగాణలో కూడా పూర్తిగా మానవ హక్కులు కాలరాస్తున్నారు.. వారికి మేము అండగా ఉంటామని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీభవనలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగురవేశారు. గుజరాత్ నుంచి రాజ్యసభకు అహ్మద్ పటేల్ విజయం సాధించినందుకు గాంధీభవన్‌లో సంబరాలు చేసుకున్నారు. -
సమరయోధులకు రాష్ట్రపతి సెల్ఫోన్ల కానుక
న్యూఢిల్లీ: క్విట్ ఇండియా ఉద్యమం 72వ వార్షికోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు కానుకలుగా మొబైల్ ఫోన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ప్రదానం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో నిర్వహించిన ’ఎట్‌హోమ్’ కార్యక్రమంలో వీటిని అందించారు. డిజిటల్ విజ్ఞాన పథంలో శరవేగంగా సాగుతున్న దేశ ప్రగతికి ప్రతీకలుగా మొబైల్ ఫోన్లు నిలిచినందున వాటినే సమరయోధులకు కానుకలుగా అందించినట్లు ప్రణబ్ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రపతి వ్యక్తిగత సందేశంతో సమరయోధులకు తలా ఒక మొబైల్ పోన్‌ను అందించినట్టు రాష్ట్రపతిభవన్ ప్రతినిధి తెలిపారు. ‘కుటుంబంతో, మిత్రులతో మీ సంభాషణ మీకు మరెంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. ఆయురారోగ్యాలతో మీరు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా ఉన్న వారితో సెల్ఫోన్లు మనల్ని అనుసంధానం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
వేలంలో మహాత్ముని చరఖాకు రూ.1 కోటి
లండన్: క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా ఒకటి మంగళవారం లండన్‌లో నిర్వహించిన వేలంపాటలో రూ.1 కోటి ధర పలికింది. ఎనిమిది దశాబ్దాల క్రితం ఉద్యమకాలంలో పుణెలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో గాంధీ ఈ చరఖాను ఉపయోగించారని ముల్లక్ వేలం సంస్థ అధికారి మైఖేల్ మోరిస్ తెలిపారు. భారత్‌లో విద్య, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేసిన అమెరికాకు చెందిన మెషినరీ రెవడెండ్ ఫ్లోయిడ్ ఏ పఫర్కు 1935లో గాంధీ ఈ చరఖాను బహుమతిగా ఇచ్చారు. అనంతరకాలంలో ఈ చరఖా చాలామంది చేతులు మారింది. గాంధీ చివరి విల్లు సైతం మంగళవారం జరిగిన వేలంపాటలో దాదాపు రూ.20,00,000 మొత్తానికి అమ్ముడుపోయింది. వీటిని వేలంలో సొంతంచేసుకున్న వారి వివరాలను సంస్థ వెల్లడించలేదు.