కోల్‌కత్తా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ఈనెల 12న జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కీలకమైన పశ్చిమ బెంగాల్‌లో మరో 17 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మిద్నాపూర్‌లో పర్యటించిన మమత బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బ్రిటీషర్ల కబంధ హస్తాల నుంచి భారతీయులను విముక్తి చేసిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. మోదీపై విమర్శల దాడి చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే భారతీయులంతా మరోసారి క్విట్ ఇండియా తరహా ఉద్యమాన్ని చేపట్టాలని దీదీ పిలుపునిచ్చారు. గాంధీ స్ఫూర్తితో ఉద్యమించి మతతత్వ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని అన్నారు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించినట్లు.. పౌరులపై నిర్బంధం విధిస్తున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. అంతకుముందు నుంచే మమత, మోదీ మధ్య మాటల యుద్ధం ముదురుతోన్న విషయం తెలిసిందే.
రాజకీయ విమర్శలు దాటి.. వ్యక్తిగత ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ నేపథ్యంలో మోదీని ఉద్దేశించి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై.. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. దీదీ అన్ని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘మమతా బెనర్జీ మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కానీ మోదీ ఈ దేశానికి ప్రధాని. మెరుగైన పాలన అందించడం కోసం భవిష్యత్తులో మీరు, మేము కలిసి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదం’టూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment