ఆరెస్సెస్‌పై సోనియాగాంధీ అటాక్!
- క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆరెస్సెస్ వ్యతిరేకించింది
- లోక్‌సభలో కాంగ్రెస్ అధినేత్రి పరోక్ష విమర్శలు
న్యూఢిల్లీ: క్విట్ ఇండియా ఉద్యమంపై లోక్‌సభలో ప్రత్యేక చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్‌పై మండిపడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని కొన్ని గ్రూపులు వ్యతిరేకించాయంటూ పరోక్షంగా ఆరెస్సెస్‌ను వేలెత్తిచూపారు. 'క్విట్ ఇండియా ఉద్యమ భావనను కొన్ని శక్తులు వ్యతిరేకించిన విషయాన్ని మనం మరువకూడదు. ఈ నిజాలను మనం తప్పక చెప్పాలి' అని ఆమె అన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలకపాత్ర పోషించిన క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లోక్‌సభలో ఈ అంశంపై సోనియాగాంధీ మాట్లాడారు.
'భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఈ గ్రూపులు ఎలాంటి కృషి చేయలేదు' అని పరోక్షంగా ఆరెస్సెస్‌ను దుయ్యబట్టారు. 1925లో ఏర్పాటైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర నిర్వహించలేదని ఎంతోమంది చరిత్రకారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య పోరాటం ఎక్కువశాతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే సాగిందని తెలిపారు. అయితే, ఈ వాదనను ఆరెస్సెస్ ఖండించింది.
సోనియా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. 'దేశంలో చీకటి శక్తులు మళ్లీ పైకిలేస్తున్నాయి. మన లౌకిక, ఉదారవాద, స్వేచ్ఛాయుత ఆలోచనధారకు ప్రస్తుతం ముప్పు వాటిల్లుతోంది. ఈ శక్తులకు విరుద్ధంగా పోరాడాల్సిన అవసరం ఇప్పుడుంది' అని అన్నారు. 'రాజకీయ విద్వేషం, ప్రతీకారం మన దేశాన్ని చుట్టేస్తున్నాయి. బహిరంగ చర్చ, అభిప్రాయ వ్యక్తీకరణకు ఇప్పుడు ఏమాత్రం అవకాశం లేకుండాపోయింది' అని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పార్టీ, జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు.