యూజీసీ కొత్త మార్గదర్శకాలు అందులో భాగమే
వర్సిటీలపై ఆధిపత్యం కోసం కేంద్రం ప్రయత్నాలు
విద్యా కమిషన్ సదస్సులో మేధావుల విమర్శలు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన నూతన మార్గదర్శకాలు దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని మేధావులు ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వర్సిటీలపై రుద్దే కుట్రలో భాగంగానే ఈ మార్గదర్శకాలను రూపొందించారని ఆరోపించారు.
రాష్ట్ర విద్యా కమిషన్ నేతృత్వంలో ‘యూనివర్సిటీ రెగ్యులేషన్స్ – రాష్ట్ర యూనివర్సిటీల్లో జోక్యం’ అనే అంశంపై గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, శాంతాసిన్హా, రాం మెల్కొటే, డి.నర్సింహారెడ్డి, తిరుపతిరావు, మురళీ మనోహర్, ఎస్.సత్యనారాయణ, అమీర్ ఉల్లాఖాన్, కె.లక్ష్మీనారాయణ, పద్మాషా, డాక్టర్ చరకొండ వెంకటేశ్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. యూజీసీ మార్గదర్శకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ భావజాల వ్యాప్తికే: మురళి
విశ్వవిద్యాలయాల అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే యూజీసీ కొత్త మార్గదర్శకాలను తెచ్చిందని ఆకునూరి మురళి విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. బోదన, బోధనేతర సిబ్బంది నియామకాలన్నీ కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా నియమించాలంటే పీహెచ్‌డీ చేసి, పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలనే నిబంధనను యూజీసీ ముసాయిదా మార్గదర్శకాల్లో పూర్తిగా మార్చేశారని తెలిపారు. పరిశ్రమలు, అకడమిక్ అడ్మినిస్ట్రేటర్ , పబ్లిక్ సెక్టార్‌లో.. ఇలా నచ్చిన వారిని ఎలాంటి నిబంధనలు లేకుండా నియమించుకునే అధికారం కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా మార్గదర్శకాలు ఉన్నా యని చెప్పారు.
మితిమీరిన జోక్యం: ప్రొఫెసర్ కోదండరాం
విశ్వవిద్యాలయాలపై కేంద్రం మితిమీరిన జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీలు ఉండేలా చూ సేందుకు ఏర్పాటుచేసిన యూజీసీనే ఇప్పుడు రాజకీయం చేయడం దారుణమన్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు అన్నివర్గాలు సమైక్యంగా గళమెత్తాలన్నారు.
వీసీలను నియమించే అధికారం ఇప్పటికే గవర్నర్ చేతుల్లో ఉందని, ఆ గవర్నర్‌ను కేంద్రమే తన ప్రతినిధిగా నియమిస్తుందని గుర్తుచేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై కూడా ఈ తరహా చర్చలు ఎందుకు పెట్టడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ నేత ఆజాద్ సదస్సులో ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment