వైద్యాధికారులు, ప్రజలకు పలు సూచనలు చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో హెచ్‌ఎంపీవీ కేసులు లేవని వెల్లడి
అయినా సిద్ధంగా ఉండాలనిప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశం
ప్రజలు చేయాల్సిన, చేయకూడని పనులపై మార్గదర్శకాలు
‘కరోనా’నాటి జాగ్రత్తలనే పాటించాలని సూచనలు
సాక్షి, హైదరాబాద్: చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజలకు శనివారం పలు సూచనలు చేసింది. హెచ్‌ఎంపీవీ గురించి ఆందోళన చెందకుండా, శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్‌ఎస్) సూచించిన విషయం తెలిసిందే.
ఈ ప్రకటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యాధికారులకు పలు ఆదేశాలు జారీచేసింది. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు బయటపడితే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లోని ఫీవర్, గాంధీ, ఉస్మానియా, రాం కోఠి, పేట్ల బురుజు వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు అన్ని జిల్లాల ఆసుపత్రులను అప్రమత్తం చేసింది.
అదే సమయంలో అనారోగ్యంతో ఉన్నవారు కరోనా సమయంలో వ్యవహరించిన విధంగానే మాసు్కలు, చేతి రుమాలుతో జాగ్రత్తలు పాటించాలని ప్రజారోగ్య సంచాలకుడు బి.రవీందర్ నాయక్ సూచించారు. ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలు, చేయకూడని పనులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
హెచ్‌ఎంపీవీ కూడా ఇతర శ్వాసకోశ వైరస్‌లలాగే శీతాకాలంలో ప్రధానంగా యువకులు, వృద్ధులలో సాధారణ జలుపు, ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో హెచ్‌ఎంపీవీ కేసులేవీ నమోదు కాలేదని చెప్పారు. అయితే శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు సంబంధించిన ప్రస్తుత డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.
హెచ్‌ఎంపీవీ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
చేయాల్సిన పనులు..
» దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్, మాస్‌్కతో కప్పుకోవాలి.
» చేతులను తరచుగా సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో కడగాలి.
» రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి ఒక మూరెడు పొడవు కంటే ఎక్కువ దూరంలో ఉండాలి.
» మీకు జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి.
» పుష్కలంగా నీరు తాగాలి. పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
» అంటువ్యాధులను తగ్గించడానికి తగినంత గాలి వీచే ప్రదేశాలలో ఉండాలి.
» అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఇతరులను కలవకుండా ఉండాలి.
» కంటినిండా నిద్రపోవాలి.
చేయకూడనివి..
» ఇతరులతో కరచాలనం చేయకండి.
» ఒకటే టిష్యూ పేపర్, చేతి రుమాలును పదేపదే వాడకండి.
» అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు సన్నిహితంగా మెలగొద్దు.
» కళ్లు, ముక్కు, నోటిని తరచూ తాకవద్దు.
» బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకండి.
» వైద్యుడిని సంప్రదించకుండా ఔషధాలు వాడకూడదు.
Comments
Please login to add a commentAdd a comment