కందకుర్తిలో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ పూర్వీకుల ఇంటి స్థానంలో నిర్మాణం
ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడి 100వ ఏట అడుగుపెట్టిన నేపథ్యంలో కేశవ స్ఫూర్తి కేంద్రానికి శ్రీకారం
భరతమాత ఆలయం, పాఠశాల, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం ఉండేలా నిర్మాణం
1989 నుంచి శ్రీ కేశవ శిశుమందిర్ ద్వారా విద్యాబోధన, గోదావరి హారతి కార్యక్రమం
168 ఏళ్ల క్రితం కందకుర్తి నుంచి నాగ్‌పూర్ వలస వెళ్లిన హెడ్గేవార్ తాత నరహరిశాస్త్రి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)ను 1925 విజయదశమి రోజున నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవరామ్ బలిరామ్‌పంత్ హెడ్గేవార్ ప్రారంభించారు. హెడ్గేవార్ తాత నరహరిశాస్త్రి సరిగ్గా 168 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుంచి వేదపండితులకు ప్రాధాన్యం ఇచ్చే భోంస్లే సంస్థానమైన నాగ్‌పూర్‌కు వలస వెళ్లారు.
ఈ క్రమంలోనే కందకుర్తిలో స్మృతిమందిరంగా ఉన్న వారి ఇంటి వద్ద ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో 1989 నుంచి శ్రీ కేశవ శిశు విద్యామందిర్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భరతమాత విగ్రహం, హెడ్గేవార్ కులదైవమైన చెన్నకేశవనాథ్ విగ్రహం, హెడ్గేవార్ విగ్రహం ప్రతిష్టించారు. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ 100వ ఏట అడుగు పెట్టిన నేపథ్యంలో హెడ్గేవార్ పూరీ్వకుల ఇంటి స్థానంలో రూ.12 కోట్ల వ్యయంతో భారీ స్మృతి మందిరం నిర్మిస్తున్నారు. వచ్చే ఉగాదికి దీని నిర్మాణం పూర్తి చేస్తారు.
దీని వద్దనే గోదావరి ఒడ్డున మరో 10 ఎకరాల్లో కేశవ స్ఫూర్తి కేంద్రం, పాఠశాల, వసతిగృహం, భరతమాత ఆలయం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. పేద పిల్లలు, రైతులు, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. శ్రీ కేశవ శిశు విద్యామందిర్‌లో ముస్లిం విద్యార్థులు సైతం విద్యనభ్యసిస్తుండడం గమనార్హం. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కందకుర్తి గ్రామాన్ని ఇప్పటికే పలువురు సర్‌సంఘ్ చాలక్ (ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్)లు సందర్శించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ స్మృతిమందిరం ప్రారంభానికి ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భగవత్‌జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరు కానున్నట్టు తెలుస్తోంది.
రెంజల్ మండలంలో అక్షరాస్యత పెంచడంలో కేశవ సేవాసమితి కీలకపాత్ర 1989లో శ్రీ కేశవ శిశు విద్యామందిర్ ప్రారంభం కాగా, 2004లో పాఠశాల నూతన భవనాన్ని శ్రీరాంబావ్ హల్దేకర్ జీ ప్రారంభించారు. 2013 నుంచి కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, ఈ–తరగతులు, ఎల్‌ఈడీ టీవీ సౌకర్యం కలి ్పంచారు. ఉపాధ్యాయులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు కందకుర్తి చుట్టుపక్కల గ్రామాల యువతీయువకులకు ఎండాకాలంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించి సరి్టఫికెట్లు అందిస్తున్నారు.
కందకుర్తి గ్రామం నుంచి మొదటి సైనికుడిగా ఎంపికైన జుబెర్ బాషా, రెంజల్ మండలం నుంచి మొదటిసారిగా నావికాదళానికి ఎంపికైన శశివర్ధన్ ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. ఇక కేశవ సేవాసమితి పాఠశాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. చుట్టుపక్కల 19 గ్రామాల్లో బాలబాలికలలో సంస్కారం, చదువుకు బాల సంస్కార కేంద్రాలు, బాలికలకు కిషోరి వికాస్ కేంద్రాలు, ట్యూషన్ సెంటర్లు, పెద్దవారికి భజన మండళ్లు, గృహిణులకు మాతృమండళ్లు, యువకులకు క్రీడాకేంద్రం, గ్రంథాలయం, నారాయణ సేవ లాంటి కార్యక్రమాలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. వీటి వల్ల రెంజల్ మండలంలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. పేద కుటుంబాల యువతకు చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు.
త్రివేణి సంగమం వద్ద.....
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నడుమ కందకుర్తి వద్ద గోదావరి, మంజీర, హరిద్ర నదుల సంగమం ఉంది. ఈ ప్రాంత ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు మాట్లాడతారు. భిన్న సంస్కృతులకు నిలయంగా ఈ ప్రాంతం మారింది. త్రివేణి సంగమ ప్రాంతానికి కొన్ని అడుగుల దూరంలోనే కందకుర్తి (తెలంగాణ)–బెల్లూర్ (మహారాష్ట్ర)లను అనుసంధానం చేసే వంతెనను 1992లో నిర్మించారు. ఇక్కడికి 15 కిలోమీటర్ల దిగువన బాసర పుణ్యక్షేత్రం ఉంది. కందకుర్తిలో ఉన్న రామాలయానికి సైతం గొప్ప ప్రాశస్త్యం ఉంది.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, ఆయన గురువు సమర్ధ రామదాసు ఈ ఆలయాన్ని సందర్శించారు. గతంలో ఇక్కడ ప్రాచీన స్కంధ (కుమారస్వామి) మందిరం ఉండేది. మూడు నదులు కలిసే కూడలి కావడంతో కూడతి అనేవారు. కాలక్రమంలో కందకుర్తి పేరు వచి్చనట్టు చరిత్రకారులు చెబుతున్నారు. పూర్తిగా కూలిపోయిన స్కంధ మందిరం స్థానంలో కొత్త మందిర నిర్మాణం చేస్తున్నారు. త్రేతాయుగంలో ఇక్కడ శ్రీరాముడు శివాలయాన్ని నిర్మించినట్టు చెబుతున్నారు. దీన్ని తర్వాత రాణి అహల్యాబాయి మందిరాన్ని పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment