నిజామాబాద్, సాక్షి: రైతుల పండుగ సంక్రాంతి నాడే ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పసుపు బోర్డు ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ ఉన్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటైంది. పసుపు రైతులకు అలాగే తొలి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు ఇతర అనేక ఉత్పత్తులు గతంలో ఎక్కువగా ఎగుమతి అయ్యేవి కాదు. ప్రధాని మోదీ కృషితో ఆ పరిస్థితి మారింది.
.. అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారు. అందుకే నిజామాబాద్ లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉంది. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ ఎగుమతి రవాణా అన్నింటిపై కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుంది’’ అని అన్నారు.
పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని నియమించింది కేంద్రం. ఇక.. ఇటు నిజామాబాద్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ ఆర్మూర్ ఎమ్మెల్యేలు దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా రాకేష్ రెడ్డి, స్పైసెస్ బోర్డు నేషనల్ సెక్రటరీ రమశ్రీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. భారీగా హాజరైన పసుపు రైతులు.. ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
అంతకు ముందు.. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరింది. బోర్డు ఏర్పాటుతో అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో బోర్డుతో ఎంతో ఉపయోగం ఉంటుంది’’ అని అన్నారు.
పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ మాత్రం అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
సాకారమైన రైతుల పోరాటం
పసుపు బోర్డు సమస్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. అదే టైంలో.. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. అయితే..
నిజామాబాద్‌లో తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు ధర్మపురి అర్వింద్. ఎన్నికల్లో గెలుపొందినా.. బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. చివరకు.. ఎట్టకేలకు నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో అటు రైతుల పోరాటం సాకారమైంది.
మన పసుపు మార్కెట్ ఇది
ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారత్‌లో సాగవుతోంది. 202223 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. 11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75%. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2.78 లక్షల టన్నులు, ఆ తర్వాత తెలంగాణలో 2.32 లక్షల టన్నులు పండింది. 202223లో 207.45 మిలియన్ డాలర్ల విలువైన 1.53 లక్షల టన్నుల పసుపు, పసుపు ఆధారిత ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో భారత్ వాటా సుమారు 62 శాతం.
తొలి చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
పల్లె గంగారెడ్డి అంకాపూర్‌లోని రైతు కుటుంబంలో పుట్టారు. డిగ్రీ చదివారు. తొలుత ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారు. 1991 నుంచి 1993 వరకు అంకాపూర్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా, 1993 నుంచి 1997 వరకు బీజేపీ ఆర్మూర్ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత జాతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా, రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2020 నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు తొలి ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ.. కేంద్ర వాణిజ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
Comments
Please login to add a commentAdd a comment