Arvind Dharmapuri
-
బీఆర్ఎస్, బీజేపీ విలీనం ఎప్పటికీ జరగదు: ఎంపీ అర్వింద్
సాక్షి,నిజామాబాద్: బీఆర్ఎస్ బీజేపీలో ఎప్పటికీ విలీనం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. ఇది కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. శుక్రవారం(ఆగస్టు23) అర్వింద్ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, కవితను బీజేపీ ఎప్పటికీ దగ్గరకు రానివ్వదని చెప్పారు.తనకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నాందేడ్ జిల్లా ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ‘బీజేపీ సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడే వారిని, పార్టీని గెలిపించేవారినే రాష్ట్ర బీజేపీ అధ్యకుడిగా ఎంపికచేయాలి. పార్టీ అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించే సత్తా ఉన్నవారికి నాయకత్వ భాధ్యతలను అప్పగించాలి. రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఏమయ్యాడో అందరికీ తెలుసు. కేసీఆర్‌కు రేవంత్ కు తేడా లేదని ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. రుణమాఫీలో పనికిమాలిన కండిషన్లు పెట్టి రైతులను దగా చేశారు. సంపూర్ణ రుణమాఫీ కోసం రేపు రైతు సంఘాలు రైతులు ఆర్మూరులో చేపడుతున్న మహాధర్నాకు బీజేపీ మద్దతు ఇస్తుంది’అని అర్వింద్ తెలిపారు. -
పోరాడు, భయపడకు అని నేర్పింది నాన్నే: ఎంపీ అర్వింద్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయారు.కాగా, తన తండ్రి మరణంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్భంగా అర్వింద్ తన తండ్రిని తలుచుకుంటూ బావోద్వేగానికి లోనయ్యారు.ఈ క్రమంలో అర్వింద్ సోషల్ మీడియా వేదికగా.. ‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాలోనే ఉంటావు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
రేవంత్ లాగు లాగుతారా ?
-
రివేంజ్ తీర్చుకున్న కల్వకుంట్ల కవిత..ఎలా అంటే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ కవితకు మాత్రం సంతోషం కలిగించే విషయం ఒకటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తననున పట్టుబట్టి ఓడించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ చేతిలో ఓటమి పాలయ్యారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి సంజయ్ గెలుపులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ప్రముఖంగా ఉంది. ఎంపీ అర్వింద్ ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోనైతే తనను ఓడించి గెలిచాడో అదే పార్లమెంట్ నియోజకవర్గంలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అర్వింద్‌ను తన సపోర్ట్ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడించి కవిత రివేంజ్ తీర్చుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో అర్వింద్‌ను ఓడిస్తే కవిత పగ పూర్తిగా తీరుతుందని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే విషయమై కవిత ట్విట్టర్లో కూడా స్పందించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. -
బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నోటీసులు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2020 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారని అభియోగం నమోదైంది. కోడ్ ఉల్లంఘించి ఎల్లమ్మగుట్టలో ప్రచారం చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయగా.. నిజామాబాద్ నాలుగో టౌన్లో కేసు నమోదైంది. ఈ విషయమై నోటీసు ఇచ్చేందుకు మంగళవారం నగర పోలీసులు ప్రయత్నించగా.. ఎంపీ అర్వింద్ అందుబాటులో లేరు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగర పర్యటనలో భాగంగా బస్వా గార్డెన్లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన ఉన్నారనే సమాచారం మేరకు నాలుగో టౌన్ పోలీసులు అక్కడికి వెళ్లారు. నోటీసు విషయంపై ఎంపీతో చర్చించారు. నోటీసు తీసుకోవాలని కోరగా.. ఎంపీ అరవింద్ నిరాకరించారు. ఇన్నేళ్ల తర్వాత నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు చేసేది లేక ఉన్నతాధికారుల సూచనతో వెనుదిరిగారు. కొద్దిరోజుల్లోనే ఈ నోటీసును ఆయన ఇంటి అడ్రస్‌కు పోస్టు ద్వారా లేదంటే అధికారిక మెయిల్ ఐడీకి పంపనున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
కేటీఆర్, కవితపై ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం, కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్, కవిత డ్రామాలు ఆపాలి. తెలంగాణలో ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎంపీ అర్వింద్ పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ఢిల్లీలో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం మాటలు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. ప్రధాని మోదీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదు. ప్రధాని మాటలను బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారు. మొదట తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఎందుకు వెనక్కి తీసుకుంది. తెలంగాణలో యువత ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ కాదా?. ఆత్మహత్యలకు సోనియానే కారణం.. అమరవీరుల ప్రాణ త్యాగాలకు కారణం సోనియా గాంధీ. తెలంగాణలో ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎక్కడా ఎటువంటి గొడవలు జరగలేదు. ఆందోళనలు చేయలేదు. అదే విషయం ప్రధాని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నేతలు చరిత్రలో హీనులుగానే మిగిలిపోతారు. కేటీఆర్‌పై ఫైర్.. యువత గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ సర్కార్ నిరుద్యోగులను, యువతను మోసం చేసింది. చదువుకునేందుకు స్కాలర్షిప్స్ కూడా సరిగా ఇవ్వడం లేదు కేసీఆర్ సర్కార్. ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టారు. తెలంగాణలో సారా ఏరులై పారుతోంది. ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్ ట్వీట్లు చేస్తున్నాడు. కల్వకుంట్ల కుటుంబ తెలంగాణను లూటీ చేసింది. యూనివర్సిటీలను నాశనం చేశారు. చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కవితకు కౌంటర్.. ఎమ్మెల్సీ కవిత డ్రామాలు ఆపాలి. కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి బాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల కోసం ఏం చేశారు?. కవిత ముందుగా తెలంగాణలో మహిళలకు మేలు చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేయాలి. కేసీఆర్‌పై ఒత్తిడి తేవాలి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. 30 స్థానాలకు లిస్ట్ ఫైనల్! -
ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రత.. 8 మంది కమాండోలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రత కల్పించింది. దీంతో ఇక నుంచి అర్వింద్ కాన్వాయ్‌లో ముగ్గురు, ఇంటి వద్ద ఐదుగురు సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రతా వలయంగా ఉండనున్నారు. మొత్తం 8 మంది కమాండోలు ఎంపీకి నిరంతరం రక్షణగా ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇటీవల బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ కేటగిరి భద్రత కల్పించింది. తర్వాత కేంద్రం తాజాగా ఎంపీ అర్వింద్‌కు భద్రత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ పర్యటన వివరాలన్నీ కేంద్రానికి, రాష్ట్ర డీజీపీకి.. ఎంపీ అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రత నేపథ్యంలో ఆయన దేశంలో ఎక్కడ పర్యటించి నా అందుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్ర హోంశాఖ కు పంపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రాష్ట్ర డీ జీపీకి పర్యటన వివరాలు అందుతాయి. దీంతో ఎంపీ పర్యటన సందర్భంగా భద్రత కల్పించే వ్యవహారాలను డీజీపీ నేరుగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎంపీ పర్యటన నేపథ్యంలో చిన్న ఘటన చోటుచేసుకున్నా సంబంధిత జిల్లా, క్షేత్రస్థాయి అధికారులపై డీజీపీ చర్య లు తీసుకోవాల్సి ఉంటుంది. వై కేటగిరి భద్రత ఎంపీ అర్వింద్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో పర్యటించిన సందర్భంగా వరుసగా మూడు సార్లు బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరుపార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు, పోలీసు సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యా రు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర అంశాలపై బీజేపీ ఆందోళనలు చేస్తే, ప్రతిగా టీఆర్ఎస్ శ్రేణులు పసు పు బోర్డు విషయంలో ఆందోళనలు చేస్తూ ఎంపీ అర్వింద్‌ను అడ్డుకుంటూ వచ్చాయి. గతేడాది ఎంపీ అర్వింద్ పలుచోట్ల పర్యటనలు, ప్రారంభోత్సవా లు చేసేందుకు, మరికొన్ని చోట్ల ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాలు ఆవిష్కరించేందుకు వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వరుసగా ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి మండల కేంద్రంలో, భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో ఉపాధ్యాయురాలు మరణించిన సందర్భంలో, ఆర్మూర్ మండ లం ఇస్సాపల్లి ప్రాంతంలో ఎంపీ అర్వింద్ పర్యటన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీ లకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఎంపీ కారు అద్దాలు సైతం బీఆర్ఎస్ శ్రేణు లు పగులగొట్టాయి. ఈ విషయంలో పోలీసులు టీఆర్ఎస్కు సహకరించి తన భద్రతను గాలికొదిలేశారని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌పై పార్ల మెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఎంపీ ఫిర్యాదు చేశారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. అధికారికంగా హోంశాఖ నుంచి భద్రత కల్పించే విషయంలో ఆలస్యమయ్యే నేపథ్యంలో అమిత్‌షా కార్యాలయం సూచనల మేరకు ఎంపీ వీఆర్ఎస్ తీసుకున్న బ్లాక్‌క్యాట్ కమెండో, బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు నలుగురు మార్షల్స్‌ను తన భద్రత కోసం నియమించుకున్నారు. అలాగే ఒక కిలోమీటర్ రేడియస్‌లో పనిచేసే విధంగా 5 వాకీటాకీలు, మూడు ప్రత్యేక వాహనాలు, అడ్వాన్స్డ్ వెపన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్నికలు రానున్న నేపథ్యంలో ‘వై’ కేటగిరి భద్రత కల్పించడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్లు దాడులకు దిగితే తూటాలు దిగడం ఖాయమని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. -
ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈటల రాజేందర్‌కు కేంద్రం వై ప్లస్, అర్వింద్‌కు వై కేటగిరి సెక్యూరిటీ కేటాయించింది. ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కూడా భద్రత కల్పించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి సీఆర్పీఎఫ్ అధికారులు చేరుకున్నారు. కేంద్రం భద్రత పెంపుపై అర్వింద్ స్పందిస్తూ.. వై కేటగిరీ సెక్యురిటీ కేటాయింపుపై సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తనకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. తనపైపై పదే పదే దాడులు జరిగిన తర్వాత రిటైర్డ్ ఎన్ఎస్జీతో ప్రైవేట్ సెక్యురిటీ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. భద్రత లోపలపై అధికారులు తన వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కాగా ఇప్పటికే ఈటల రాజేందర్‌కు తెలంగాణ సర్కార్ వై ప్లస్ భద్రత కల్పించిన విషయం తెలిసిందే ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన హత్యకు ప్లాన్ జరుగుతోందంటూ వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. చదవండి: ఆ ఫలితం నమ్మితే మోదీ భ్రమపడ్డట్టే! కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే ‘బండి’ తొలగింపు ఎందుకు? -
లిక్కర్ స్కాం కేసు బలపడుతోంది
పెర్కిట్(ఆర్మూర్): లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడం ఖాయమని జిల్లా ఎంపీ అర్వింద్ అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నందిపేట మండలం డొంకేశ్వర్, నికాల్పూర్ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు ఎంపీ అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లిక్కర్ స్కాం కేసు ఆలస్యమవుతుందని తెలంగాణ ప్రజలు నిరుత్సాహపడనవసరంలేదన్నారు. ఎంత ఆలస్యమయితే కేసు అంత బలోపేతం అవుతుందన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎలాగైనా ఓడిస్తామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను సాగనివ్వమన్నారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ ఏ విషయంలో బాగుపడిందో చెప్పాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అవినీతితో బ్రష్టుపట్టిపోయిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కరువయ్యారన్నారు. ఖరీఫ్ సీజన్లో నార్లు వేసుకుని నిరీక్షిస్తున్న రైతులకు వర్షాలు రాక ఇబ్బందులు పడుతుంటే కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ వరకు రివర్స్ పంపింగ్ ద్వారా సాగు నీరందిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం చుక్క నీటిని వదలడం లేదన్నారు. మహారాష్ట్ర, కర్నాటకలో డీజిల్, పెట్రోల్‌లో మిలిథం చేసే ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే.. వరిని విరివిగా సాగు చేసే తెలంగాణలో మాత్రం ఒక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణలో 17 ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో వరి ధాన్యం సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా తరుగు పేరు తో రూ.12 వందల కోట్ల స్కాం జరిగిందన్నారు. ప్రఽ దాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. త్వరలో రాబోయే కామన్ సివిల్ కోడ్ ప్రయోజనం వల్ల ముస్లిం మహిళలు సైతం నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాలెపు రాజు, సాయి రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎంపీ
ఆర్మూర్: ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన వృద్దుడిని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే రాజకీయంగా బద్ద శత్రువులుగా ఉన్న వీరిద్దరు ప్రమాద స్థలంలో ఎదురుపడటంతో ఒకరినొకరు మాట్లాడించుకోవడం ఆసక్తికరమైన అంశంగా మారింది. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన గాదెపల్లి చిన్నగంగారెడ్డి ద్విచక్ర వాహనంపై ఆర్మూర్ వైపు వెళ్తున్నాడు. సీడ్ కంపెనీ నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో తలకు గాయమైంది. అదే రోడ్డు మార్గంలో పెర్కిట్ నుంచి అంకాపూర్‌కు వస్తున్న ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పల్లె గంగారెడ్డి రోడ్డు ప్రమాదం జరిగింది చూసి తమ వాహనాలను ఆపారు. క్షతగాత్రుడిని స్థానికులు పలకరిస్తున్న క్రమంలో మాక్లూర్ అర్బన్ పార్క్‌కు వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయిని ఆపించారు. గన్మెన్ల సహకారంతో క్షతగాత్రుడిని తన వాహనంలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఎంపీ అర్వింద్, పల్లె గంగారెడ్డిని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పలకరించారు. ఎంపీ సాబ్ నిజామాబాద్ నుంచి వస్తున్నారా అని ఎమ్మెల్యే అడిగారు. పెర్కిట్‌లోని తన ఇంటి నుంచి అంకాపూర్‌లో చేరికల కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఎంపీ సమాధానం ఇచ్చారు. -
నత్తనడకన ఆర్వోబీ పనులు
ఆర్మూర్/మాక్లూర్: మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి శివారులో 63వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన సాగుతుండటంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లో నిర్వహించిన పార్లమెంట్ సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి వెళుతుండగా మా ర్గమధ్యలో ఆర్వోబీ పనులను మంగళవారం ఆయ న పరిశీలించారు. ఎన్‌హెచ్ డిప్యూటీ ఈఈ శంక ర్కు ఫోన్ చేసి వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధుల తో చేపడుతున్న ఆర్వోబీ పనులకు, రూ.14 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేసినా పనులు నెమ్మదిగా సాగడంపై అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచని పక్షంలో కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని హెచ్చరించారు. డిప్యూటీ ఈఈ శంకర్ సమాధానానికి సంతృప్తి చెందని ఎంపీ అర్వింద్ ఈఈ కాంతయ్యకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులను వివరించారు. వారం రోజుల్లో పనులు వేగంగా జరిగేలా చూస్తానని ఈఈ హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్మాణంపై బీఆర్ఎస్ నాయకులు దేశ్ కీ నేతా కేసీఆర్, జీవనన్న అంటూ రాసిన పెయింటింగ్‌లపై అ భ్యంతరం వ్యక్తం చేశారు. పురుషులకు దేశ్ కీ నేతా అని కాకుండా దేశ్ కా నేతా అని రాయాలని సలహా ఇచ్చారు. బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. -
Telangana BJP: బండి సంజయ్ వెనుక ఏం జరుగుతోంది?
తెలంగాణ కాషాయ సేన చీఫ్ బండి సంజయ్‌కు పార్టీలో వ్యతిరేకులు ఎలా తయారయ్యారు? పాత నేతలతో పాటు..కొత్త నాయకులు కూడా బండికి దూరంగా జరుగుతున్నారా? సొంత జిల్లా.. పక్క జిల్లా అనే తేడా లేకుండా అసమ్మతి పెంచుకుంటున్నారా? ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుని పార్టీని పరుగులు తీయించిన బండి సంజయ్ వెనుక ఏం జరుగుతోంది? బీజేపీ తెలంగాణా రాష్ట్ర రథసారథిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక.. పార్టీ పరుగులు తీసిన తీరుతో రాష్ట్ర, జాతీయ నాయకులంతా ఆయన్ను ప్రశంసించారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నా.. తనతో పాటు పదిమంది కలిసి నడిచేలా చేయడంలో బండి సంజయ్ విఫలమవుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇదే అంశాన్ని పార్టీలోని ముఖ్యనేతలు అధిష్ఠానం ముందు మొర పెట్టుకున్నారని.. అందరికీ కలుపుకుని పోలేకపోతున్న బండి సంజయ్ పదవిని కొనసాగించాలా? ఇంతటితో ముగించి మరొకరికి రాష్ట్ర పగ్గాలు అందించాలా అనే ఆలోచనతో హైకమాండ్ ఉందని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలో చేరమని ఆహ్వానించేందుకు ఈటల రాజేందర్ వెళ్ళినపుడు.. ఆ అంశం గురించి మీడియా అడిగితే.. ఆ విషయం తనకు తెలియదంటూ బండి సంజయ్ చేసిన కామెంట్..ఇద్దరి మధ్యా ఉన్న దూరాన్ని చెప్పకనే చెప్పారు. మరోవైపు తన జిల్లాకే చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డితో కూడా బండికి గతం నుంచీ పొసగదు. గుజ్జుల ఈ మధ్య బండిపై బాహాటంగానే విమర్శలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు సుగుణాకర్ రావుతోగానీ.. మరో జాతీయ నాయకుడైన మురళీధర్ రావుతోగానీ బండి సంజయ్‌కు పొసగదనే విషయం బహిరంగ రహస్యం. చదవండి: కేటీఆర్ సార్.. మెట్రో మాక్కూడా! అంతేకాదు.. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు ముఖ్య నేతల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రఘునందన్ రావుతోనూ అంటీముట్టనట్టుండే బండి సంజయ్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీతోనూ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ తోనూ దూరం..దూరంగానే ఉంటారని టాక్. రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేత ఆ స్థాయిలో వ్యవహరించడం లేదని.. ఏదో ఒక జిల్లా నేతగానే ఇప్పటికీ ఆయన వ్యవహార శైలి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడయ్యాక.. ఆయన దూకుడు వల్లే రాష్ట్రంలో కాషాయ పార్టీ పరుగులు తీసిందని కాషాయ సేనలో అందరూ అంగీకరిస్తారు. కాని అంతా తానొక్కడే అన్నట్లుగా ఉండటం. ఎవరినీ కలుపుకునిపోకుండా వ్యవహరించడం ఆయనకు నెగిటివ్‌గా మారినట్లు సమాచారం. సీనియర్లనూ కేర్ చేయకపోవడం వంటి చాలా అంశాలు బండి సంజయ్ నాయకత్వపై నిరసనలకు కారణమవుతున్నట్టు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండినే కొనసాగిస్తారా? మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ కమలం పార్టీలో ఆసక్తికరంగా సాగుతోంది. -
కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ
కర్ణాటకలో కమలం పార్టీ ఎన్నికల ప్రచారానికి, తెలంగాణలో గులాబీ పార్టీకి ఏంటి సంబంధం? ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ ఏంటి? మోదీ కామెంట్స్‌కి తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎందుకిచ్చారు? కేటీఆర్ ట్వీట్లో నిజామాబాద్ ఎంపీని కూడా ఎందుకు లాగారు? టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? పసుపు మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కరోనా క్లిష్ట సమయంలో దీని గురించి ప్రధాని మోదీ చెప్పారట. ఆ సమయంలో ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా పసుపు ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుందని ప్రధాని వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ పార్టీ హేళన చేసిందట. అప్పుడు కాంగ్రెస్ తన వ్యాఖ్యలను హేళన చేసి పసుపు రైతుల్ని అవమానించిందంటూ.. కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. పసుపు ఇమ్యూనిటీ బూస్టర్ అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రధాని మధ్య జరిగిన డైలాగ్ వార్ మధ్యలోకి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ మీద ప్రధాని మోదీ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరపున నిజామాబాద్ నుంచి పోటీ చేసిన అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్‌ను కేటీఆర్ ట్విట్టర్లో పెట్టారు. రాష్ట్రంలోని పసుపు రైతుల కోసం కేంద్రం నుంచి పసుపు బోర్డు తీసుకొస్తామని.. తీసుకురాలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ అభ్యర్థి అరవింద్ రాసిచ్చిన బాండ్ పేపర్‌ను ట్యాగ్ చేయడంతో రాజకీయ రచ్చ మొదలైంది. ఇంతవరకూ పసుపు బోర్డును తీసుకురాకపోవడం పసుపు రైతులకు నిజమైన అవమానం అని ట్విట్టర్లో కేటీఆర్ పేర్కొన్నారు. పసుపు రైతులు మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని కూడా వ్యాఖ్యానించారు. ఒక్క ట్వీట్ ద్వారా కేటీఆర్ అటు ప్రధాని మోదీకి..ఇటు నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కి కౌంటర్లు వేశారా అంటే అవుననే అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. Real insult to Turmeric Farmers is promising them a Turmeric Board on a Bond Paper at the time of Parliament Elections and then hoodwinking them by refusing to deliver despite numerous protests Do you recognise this👇Bond paper promise of your BJP MP from Nizamabad ?? Turmeric… https://t.co/C87FyVyaMM pic.twitter.com/9WjkbrAqzN — KTR (@KTRBRS) May 8, 2023 వాస్తవానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ను గులాబీ పార్టీ చాలా కాలంగా టార్గెట్ చేసింది. పసుపు బోర్డు విషయంలో హామీ ఏమైంది అంటూ ప్రశ్నలు కురిపిస్తూనే ఉంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని.. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలంతా.. సమయం చిక్కినప్పుడల్లా.. బీజేపీ ఎంపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఆర్మూరు కేంద్రంగా పసుపు రైతుల ఉద్యమం దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వాన గల రాష్ట్ర అధికార పార్టీ పసుపు బోర్డు తీసుకురాలేకపోయిందన్న అసంతృప్తితో ఉన్న రైతులకు అరవింద్ హామీ ఇచ్చారు. బీజేపీ నుంచి పసుపు బోర్డ్‌ను తాను తీసుకొస్తానని, తీసుకురాలేని పక్షంలో రాజీనామా చేస్తానని అరవింద్ ప్రకటించారు. ఆ మేరకు బాండ్ పేపర్ కూడా రాసి రైతులకు చూపించారు. ఎంపీగా విజయం సాధించారు. కేసీఆర్ కుమార్తె కవిత పరాజయం పాలయ్యారు. చదవండి: కరీంనగర్లో మారుతున్న పాలిట్రిక్స్.. ఈ సారి గంగుల కమాలకర్‌కు కష్టమే! అరవింద్ ఎంపీగా గెలిచినప్పటినుంచీ పసుపు బోర్డు గురించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం తీసుకొచ్చామని, పసుపునకు మంచి ధర కూడా రైతులకు లభిస్తోందని ఎంపీ అరవింద్ చెబుతున్నారు. అటు రైతులు, ఇటు బీఆర్ఎస్ ఈ విషయంలో సంతృప్తి చెందలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా పసుపు బోర్డ్ మరోసారి రాజకీయ అస్త్రంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సారి కమలనాథులు పసుపుబోర్డ్ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. -
మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు: రైతుల వినూత్న నిరసన
పసుపు బోర్డుకు పంగనామం పెట్టడంపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబద్ రైతులు కన్నెర్రజేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో ప్రకటించిన విషయం విధితమే. ఈ ప్రకటనతో రైతుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. పార్లమెంటు వేదికగా మోసం మరోసారి బట్టబయలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా “పసుపు బోర్డు... ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు” అని పేర్కొని ఉన్న పసుపు రంగు ఫ్లెక్సీలను రైతులు కట్టారు. తమను స్థానిక ఎంపి అర్వింద్ మోసం చేశారని రైతులు భావిస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్ తమను మోసం చేశారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్ పేపరు రాసిచ్చినా ఇప్పటికీ పసుపు బోర్డును సాధించకపోవడమే కాకుండా బోర్డును ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పినా ఏమీ పట్టనట్టు ఉండడం పట్ల రైతులు విస్మయం చెందుతున్నారు. పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని అర్వింద్ ఎన్నికల సమయంలో తెలిపారని, మరి నాలుగున్నరేళ్లు గడిచినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, రామ్ మాధవ్ వంటి వారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని మోసపూరిత హామీ ఇచ్చారని స్పష్టం చేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నాయకులు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదని అంటున్నారు. అన్నదాతలను మోసం చేసిన ఎంపీ అర్వింద్ కు పుట్టగతులు ఉండవని రైతులు హెచ్చరిస్తున్నారు. బోర్డు కోసం గత కొంత కాలంగా నిరసనలు తెలుపుతున్న రైతులు పలుసార్లు అర్వింద్ ను అడ్డుకున్నారు. ఇంకెంత కాలం మోసం చేస్తారని నిలదీశారు. ఇకపై పసుపు బోర్డు కోసం ఆందోళనలను ఉదృతం చేస్తామని, బీజేపీ నేతలు, ముఖ్యంగా అర్వింద్ ను ఎప్పటికప్పుడు దీనిపై నిలదీస్తామని రైతులు తేల్చిచెప్పారు. -
బండి సంజయ్‌పై అలా మాట్లాడడం సరికాదు: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో కీలక నేతల మధ్య మాటల వేడిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్లు చేశాడంటూ వార్త ప్రచారంలో ఉంది. అయితే.. మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిపై మాట్లాడటం పద్దతి కాదని రాజాసింగ్ సూచించారు. ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడొచ్చని, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం సరికాదని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన ఉందని.. ప్రభుత్వం వచ్చే అవకాశమూ ఉందని, ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం సరికాదని చెప్పారు రాజాసింగ్. అలాగే.. అరవింద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే.. ఏవో ఫ్లోలో అన్న మాటలపై విమర్శలు గుప్పించడం సరికాదని, ఆలోచన చేయాలంటూ బండి సంజయ్ వ్యాఖ్యలను రాజా సింగ్ సమర్థిస్తూ అరవింద్‌కు సూచించారాయన. -
సీనియర్ నేత డీ.శ్రీనివాస్‌కు అస్వస్థత..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీ. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు.. శ్రీనివాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో వైద్యులు శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. కాగా, వైద్య పరీక్షల అనంతరం డీఎస్ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి శ్రీనివాస్‌కు అనారోగ్యం నేపథ్యంలో బీజేపీ ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని కార్యకర్తలకు మెసేజ్‌లో తెలిపారు. మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు, రేపు (27,28) రెండు రోజుల పాటు నా కార్యక్రమాలన్ని రద్దు చేసుకుంటున్నాను. pic.twitter.com/Z043QOGu9f — Arvind Dharmapuri (@Arvindharmapuri) February 27, 2023 -
కారులో పెరిగిన కసి.. ఆ గడ్డ ఇక ముందు ఎవరి అడ్డా?
పునాదులు లేని చోట కమలం పార్టీకి హఠాత్తుగా ఓ ఎంపీ ఎన్నికయ్యాడు. అనుకోకుండా లభించిన విజయాన్ని ఆస్వాదించడంతో పాటు దాన్ని కాపాడుకోవడం కూడా అవసరమే. పార్టీకి మరిన్ని విజయాలు అందించడానికి అక్కడున్న నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. కాని ఆ జిల్లాలోని కమలం రేకుల మధ్య ఐక్యత కనిపించడంలేదు. ఇంతకీ కాషాయ సేనలో అంతర్గత పోరు నడుస్తున్నదెక్కడ? ఎంపీ వర్సెస్ కన్వీనర్లు ఇందూరు కమలం పార్టీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గతంలో అంతర్గతంగా ఉండే విభేదాలు ఇప్పుడు వీధిన పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన బీజేపి ఇంటర్నల్ సమావేశం రసాభాసగా ముగిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లుగా.. ఇప్పటివరకు ఉన్నవారికి కాకుండా కొత్తవారికి ఇవ్వడంపై ఒకింత అసహనం..ఆగ్రహం వ్యక్తం అయ్యాయి. ఈ సమావేశం వల్ల మరోసారి బీజేపి నేతల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర నేపథ్యంలో ఇంఛార్జుల నియామకంలో తమను పట్టించుకోలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలపై కూడా పలు మండలాల నాయకులు అగ్గిమీద గుగ్గిలమైనట్టు సమాచారం. ఇప్పటికే ఇందూరు బీజేపీలో ఎంపీ అరవింద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. అరవింద్ తనకిష్టమైనవారికే పదవులిప్పించుకుంటున్నారని.. అలాగే ఇంఛార్జులు, కన్వీనర్ల నియామకాల్లోనూ తమను పట్టించుకోలేదంటూ.. కొందరు నేతలు సుమారు రెండు గంటల పాటు సమావేశంలోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పైగా ఎంపీ అరవింద్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలూ చేసినట్టు సమాచారం. చదవండి: (మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్) నోట నవ్వుతారు.. నొసలు చిట్లిస్తారు..! బీజేపీ పదాధికారుల సమావేశంలో.. ముఖ్యంగా ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల నేతలు అరవింద్‌పై పెద్దఎత్తున ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్య అరవింద్ ఆర్మూర్ లోనే ఉండి పాలిటిక్స్ చేస్తున్నారు. మరోవైపు బోధన్ లోనూ బీజేపీ ఎమ్మెల్యే సీటు ఆశావహుల సంఖ్య పెరగడంతో.. ఆయా గ్రూపుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఇంతకాలం అరవింద్‌కు అనుకూలంగానే ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనర్సయ్య కూడా ఈమధ్య అరవింద్‌తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడినీ మార్చబోతున్నారంటూ.. గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అధ్యక్షుడిగా పనిచేసి.. ప్రస్తుతం అరవింద్‌కు సన్నిహితంగా ఉంటున్న పల్లె గంగారెడ్డితో పాటు.. మరికొందరి పేర్లను జిల్లా అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కారులో పెరిగిన కసి ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్ లో 11 మంది కార్పోరేటర్లు బీజేపి నుంచి ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళారు. అధ్యక్ష పదవి మళ్ళీ తనకే ఇవ్వకపోతే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన బసవ కూడా పార్టీ మారే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ను ఢీ అంటే ఢీ కొడుతూ ఉవ్వెత్తున ఎగిసిపడిన బీజేపీ.. అంతేస్థాయిలో అంతర్గత కలహాల్లో కూరుకుపోతోంది. పైగా రానున్న ఎన్నికల్లో గట్టిగా పోరాడితే కమలం పార్టీకి అవకాశాలున్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ వంటి స్థానాల్లోనే ఈ అంతర్గత విభేదాలు పొడచూపడం పార్టీని కలవరపెడుతోంది. వడివడిగా ఎదిగిన బీజేపీ.. అంతే వడివడిగా సంక్షోభాలు.. అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ మళ్లీ ఇందూరుపై సీరియస్ గా దృష్టి సారిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపి బలహీనతలే ప్రత్యర్థులకు బలమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ.. నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సింహం వర్సెస్ సివంగి: యుద్ధం వెనుక కారణాలేంటి?
మొదట వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత శత్రువులు. రెండు పార్టీల మధ్య రాజకీయాలకే పరిమితం కావల్సిన వైరం.. ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా తిట్టుకునే వరకు ఎందుకు వచ్చింది? గత లోక్ సభ ఎన్నికలప్పుడు మొదలైన రగడ.. రానురాను కత్తులు మింగి.. నిప్పులు కక్కేవరకూ ఎందుకు దారితీసింది? ఎంపీ అరవింద్.. ఎమ్మెల్సీ కవిత మధ్య సింహం వర్సెస్ సివంగిలా సాగుతున్న యుద్ధం వెనుక కారణాలేంటీ? 2019లో మారిన సీను 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కల్వకుంట్ల కవిత.. తానిచ్చిన హామీలు నెరవేర్చలేదనే అభిప్రాయాన్ని తీసుకురావడంలో బీజేపీ నేతలు సక్సెసయ్యారు. ఎంపీ అభ్యర్థిగా బీజేపీ టిక్కెట్ సాధించుకునే క్రమంలో ధర్మపురి అరవింద్ దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పాదయాత్ర చేపట్టారు. చెరకు ఫ్యాక్టరీలు తెరిపించకపోవడంపై టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు అరవింద్. తనను పార్లమెంట్‌కు పంపిస్తే ఫ్యాక్టరీలను తెరిపించడంతో పాటు.. నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ ఏర్పాటు చేయిస్తానంటూ ఏకంగా బాండ్ పేపర్‌తో రైతుల విశ్వాసాన్ని చూరగొన్నారు. తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకునే క్రమంలో కొంత యారగెంట్‌గా మాట్లాడటాన్నే తన శైలిగా మార్చుకున్నారు ధర్మపురి అరవింద్. అరవింద్ విమర్శలు, పాదయాత్ర, పసుపు రైతుల మూకుమ్మడి నామినేషన్లు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే కవితకు సహకరించకపోవడం వంటివెన్నో కారణాలు కవిత ఓటమికి కారణాలయ్యాయి. అవన్నీ ధర్మపురి అరవింద్ విజయానికి దారి తీసాయి. మాటలు.. మంటలు అరవింద్ ఎంపీగా విజయం సాధించడంతో పాటు..ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. నిజామాబాద్ కార్పోరేషన్ లో కూడా 28 డివిజన్లు గెల్చుకుని.. టీఆర్ఎస్ తో ఢీ అంట్ ఢీ అనే పార్టీగా స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో కమలం పార్టీ అవతరించింది. గతంలో ఎమ్మెల్యేగా యెండల లక్ష్మీనారాయణ గెల్చినా... అరవింద్ గెలుపు తర్వాత.. కాషాయజెండా బలం మరింత పెరిగింది. దాంతో అరవింద్‌కు గెలుపిచ్చిన కిక్కుతో... కవితపై, కేసీఆర్‌పై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం ఎక్కువైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా కవిత మళ్లీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నిజామాబాద్ నుంచి గెలిచారు. ఆ గెలుపు పైన కూడా అరవింద్ సెటైర్లు వేయడంతో... కవిత వర్సెస్ అరవింద్ మాటల యుద్ధం ముదిరింది. పార్లమెంటుకా? అసెంబ్లీకా? వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న బీజేపి ఎంపీలందరినీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని బీజేపి అధిష్ఠానం యోచిస్తున్నట్టుగా ప్రచారం ఊపందుకోవడంతో... ఎంపీ అరవింద్ ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని.. బాల్కొండ నుంచి కూడా దిగే అవకాశాలున్నట్టు.. అలాగే నిజామాబాద్ రూరల్, అర్బన్ వంటి నియోజకవర్గాలపైనా దృష్టి సారించారంటూ రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. అరవింద్ వర్సెస్ కవిత కాస్తా... అరవింద్ వర్సెస్ టీఆర్ఎస్గా మారడంతో.. అరవింద్ ఎక్కడికెళ్లితే అక్కడ అడ్డుకోవడాలు సాధారణ విషయాలుగా మారాయి. ఆర్మూరు మండలం ఇసాపల్లిలో పసుపు రైతులు అరవింద్‌ను అడ్డుకుని ఆయన కారు అద్దాలు ధ్వంసం చేయడం గతంలో ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత ఇందల్వాయి మండలంలోనూ శివాజీ విగ్రహావిష్కరణ సమయంలోనూ... దర్పల్లి, మోపాల్ వంటి ప్రాంతాల్లోనూ అరవింద్ ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడమూ ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణాన్ని సృష్టించింది. నోరు జారింది.. అద్దం పగిలింది కొంతకాలం పాటు నిజామాబాద్‌లో వాతావరణం స్తబ్దుగా మారింది. తాను ఎంపీగా గెలవడానికీ...తర్వాత తనను తాను లైమ్ లైట్ లో ఉంచుకోవడానికి... కవితను, కల్వకుంట్ల కుటుంబాన్నే అరవింద్ ఎక్కువ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది కాస్తా ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి నుంచి వ్యక్తిగత శత్రుత్వంగా మారింది. కవిత కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో టచ్ లో ఉన్నారని... ఆమెకు బీఆర్ఎస్లో ఎలాంటి పాత్ర ఇవ్వకపోవడమే అందుకు కారణమన్నట్టుగా అరవింద్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి ప్రత్యర్థుల మధ్య అగ్గి రాజుకుంది. ఇదే సమయంలో హైదరాబాద్ లో అరవింద్ తల్లి ఒక్కరే ఉన్న సమయంలో టీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటిపై దాడికి దిగి ఫర్నీచర్, ఇంటి అద్దాలు ధ్వంసం చేయడంతో మరింత రచ్చకు దారి తీసింది. ఏకంగా గవర్నర్ ఇన్వాల్వ్ కావడం...అరవింద్ కు టాప్ టు బాటమ్ పార్టీ నేతల నుంచి సానుభూతి పెరిగింది. మరోవైపు అరవింద్ ఇంటిపై దాడిని ఓ సామాజికవర్గపు ఎంపీ ఇంటిపై దాడి అంటూ కులరంగు పులమడం మరింత అగ్గి రాజుకునేలా చేసింది. కవితకు మద్దతుగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. చివరకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య వ్యక్తిగత పోరుగా మారిపోయింది. ఏడాది ముందే గరం గరం ఇద్దరు ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య తలెత్తిన కొత్త పోరు ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. పైగా ఎక్కడ పోటీ చేస్తే అక్కడి కొచ్చి ఓడిస్తానని కవిత సవాల్ విసరడం... దమ్ముంటే ఆర్మూర్‌లో నాపై గెలువు అని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరవింద్‌కు ఛాలెంజ్ చేయడం పోరు మరింత రసవత్తరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అరవింద్ ఎక్కడ నిలబడుతాడోనన్న చర్చకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా.. తాను నిజామాబాద్‌లోనే మళ్లీ పోటీ చేస్తానని అరవింద్ ప్రకటించారు. చూడాలి.. ముందు ముందు ఈ ఇద్దరు నేతల మధ్య పోరు ఎక్కడకు దారితీస్తుందో..? పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కవిత, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లు జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ నేతలు జోకర్లు.. అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై స్పందించిన ఆయన.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై ధ్వజమెత్తారు. గురువా రం ఢిల్లీలోని తన నివాసంలో అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో హిందువులను చంపడానికి కుట్రలు పన్నుతున్న పీఎఫ్ఐ సంస్థను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో కవిత, ఫీనిక్స్ సంస్థ, ఇతర బిల్డర్లపై జరిగిన దాడుల వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారన్నారు. డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కేటీఆర్ వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమన్నారు. కేటీఆర్‌కు నార్కోటిక్ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్.. బీజేపీ నేతలను జోకర్లు అనే ముందు తన తండ్రి కేసీఆర్ థర్డ్ క్లాస్ బ్రోకర్ అని తెలుసుకోవాలన్నారు. కా జీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ భూ మి ఇవ్వలేదని తెలిపారు. 4 రోజుల్లో కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారని అన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ.. కేటీఆర్, కవితల కోసం జైలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
కేసీఆర్‌ను ఇకపై పరుష పదజాలంతో విమర్శించను: అర్వింద్
సాక్షి, న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇకపై సీఎంను పరుష పదజాలంతో విమర్శించబోనని స్పష్టంచేశారు. రాజకీయంగా, సాంకేతికంగానే కేసీఆర్‌ను విమర్శిస్తానని, ఇవి ఆవేదనతో చెబుతున్న మాటలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలతో బీజేపీ ఎదుగుదలను, దిగజారుతున్న టీఆర్ఎస్ గ్రాఫ్ కారణంగానో లేక కుటుంబ వారసత్వ రాజకీయాల ఒత్తిడి కారణంగానో కేసీఆర్ మానసిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం అర్వింద్ ఒక వీడియోను విడుదల చేశారు. కేసీఆర్ ఇంట్లో వారసత్వ పోరు మొదలైందని తెలిపారు. శనివారం వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తెలంగాణపై విదేశాలు కుట్ర పన్ని క్లౌడ్ బరస్ట్ చేయడంతో వరదలు సంభవించాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధాకరమని అన్నారు. -
దేశ్‌కీ నేతా! బీఆర్ఎస్ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా హడావుడి చేసి, ఆర్భాటంగా ప్రచారం చేసిన జాతీయపార్టీ ‘బీఆర్ఎస్’ ఏమైందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఇటీవల వివిధ రాష్ట్రాలు తిరిగొచ్చి అనేక మంది నిపుణులు, రాజకీయ ప్రముఖులను కలసిన దేశ్‌కీ నేత కేసీఆర్ దీనిపై స్పష్టతనివ్వాలన్నారు. టీఆర్ఎస్ పోతేనే బీఆర్ఎస్ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం పార్టీనేతలు రవీంద్రనాయక్, జె.సంగప్పలతో కలసి అర్వింద్ విలేకరులతో మాట్లాడుతూ పర్వతారోహణలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన మలావత్ పూర్ణను ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పూర్ణను ప్రోత్సహించడానికి తమ ఫౌండేషన్ తరఫున రూ.3.51 లక్షలు అందజేస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన పూర్ణకు చెక్కు అందజేశారు. -
బ్లాక్‌క్యాట్, బీఎస్ఎఫ్ జవాన్, మార్షల్స్‌తో ఎంపీకి పటిష్ట భద్రత
సాక్షి, నిజామాబాద్: తన జిల్లా పర్యటనలో ప్రతిసారి టీఆర్ఎస్ శ్రేణులు ఆటంకాలు కలిగించడం.. వాగ్వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో బీజేపీ ఎంపీ అర్వింద్ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యాలయం సూచనల మేరకు వీఆర్ఎస్ తీసుకున్న బ్లాక్‌క్యాట్, బీఎస్ఎఫ్ జవాన్‌తో పాటు నలుగురు మార్షల్స్‌తో ఎంపీ సొంత డబ్బులతో భద్రత కల్పించుకున్నారు. కాగా రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ముక్కో ణపు పోటీ నడుస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున ధర్మపురి అర్వింద్, కల్వకుంట్ల కవితపై అనూహ్యంగా విజయం సాధించారు. అప్పటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఘర్షణల దాకా వెళ్లింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇతర అంశాలపై బీజేపీ ఆందోళ నలు చేస్తే, ప్రతిగా టీఆర్ఎస్ శ్రేణులు పసుపు బోర్డు విషయంలో ఆందోళనలు చేస్తూ ఎంపీ అర్వింద్‌ను అ డ్డుకుంటూ వచ్చాయి. ఈ క్రమంలో ఆరు నెలల కా లంలో ఇరుపార్టీల శ్రేణుల మధ్య పలుసార్లు ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. కొన్ని నెలలుగా ఎంపీ పర్యటన చేసిన ప్రతిసారి టీఆర్ఎస్ శ్రేణు లు మోహరిస్తుండడంతో ని యంత్రించడం పోలీసులకు కష్టసాధ్యమైపోతోంది. రెండు సందర్భాల్లో పోలీసులు సైతం తీవ్రంగా గాయపడడం గమనార్హం. చదవండి: (ఎంపీ అర్వింద్ ఇప్పటికీ మభ్యపెడుతూనే ఉన్నాడు: ఎమ్మెల్సీ కవిత) ఇటీవల కాలంలో ఎంపీ అర్వింద్ పలుచోట్ల పర్యటనలు, ప్రారంభో త్సవాలు చేసేందుకు, మరి కొన్నిచోట్ల ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాలు ఆవిష్కరించేందుకు వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వరుసగా ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి మండల కేంద్రంలో, భీంగల్ మండలం బాబాపూర్‌లో ఉపాధ్యాయురాలు మరణించిన సందర్భంలో, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి ప్రాంతంలో ఎంపీ అర్వింద్ పర్యటన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ లు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండడంతో పోటాపోటీ నెలకొంది. ఎంపీ అర్వింద్ ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ విషయంలో పోలీసు లు టీఆర్ఎస్కు సహకరించి తన భద్రతకు సహకరించలేదంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా నిజామాబాద్ పోలీసు కమిషనర్‌పై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎంపీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. అధికారికంగా హోంశాఖ నుంచి భద్రత కల్పించే విషయంలో ఆలస్యం అయ్యే నేపథ్యంలో అమిత్‌షా కార్యాలయం సూచనల మేరకు ఎంపీ అర్వింద్ వీఆర్ఎస్ తీసుకున్న బ్లాక్‌క్యాట్ కమెండో, బీఎస్ఎఫ్ జవాన్‌తో పాటు నలుగురు మార్షల్స్‌ను తన భద్రతా వలయంగా నియమించుకున్నారు. అలాగే కిలోమీటర్ రేడియస్‌లో పనిచేసే విధంగా 5 వాకీటాకీలు, మూడు ప్రత్యేక వాహనాలు, అడ్వాన్స్డ్ వెపన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి తన పర్యటనలో దాడులకు పాల్పడితే టీఆర్ఎస్ వాళ్లకు తూటాలు దిగుతాయని ఎంపీ అర్వింద్ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఐపీఎస్‌లూ జాగ్రత్త!
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ఐపీఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణలో నిజాంను మించిన అరాచక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాది మాత్రమే ఉంటుందని, ఆ తరువాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో మంగళవారం ఎంపీ అర్వింద్, బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు బండి సంజయ్ గురువారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులు గూండాలను పెంచిపోషిస్తే చరిత్ర హీనులవుతారన్నారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న కొందరు ఐపీఎస్ అధికారులు ఇష్టం వచ్చినట్లు దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎంపీ అర్వింద్‌కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తిరిగే వీలు లేనివిధంగా నిజామాబాద్ సీపీ వ్యవహరించి హక్కులకు భంగం కలిగించారన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన సీపీ, ఎంపీని వెనక్కు వెళ్లాలని చెప్పడమేమిటన్నారు. దాడికి పాల్పడిన నేరస్తులు బహిరంగంగా తిరుగుతుంటే ఇప్పటివరకు హత్యాయత్నం కేసు నమోదు చేయలేదన్నారు. దీన్ని బట్టి సీపీ నేతృత్వంలోనే ఎంపీపై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఎంపీపై దాడి జరిగితే ముఖ్యమంత్రి ఎలాగూ మాట్లాడరు.., కనీసం డీజీపీ సైతం స్పందించలేదన్నారు. మరోవైపు రైతులు దాడి చేసినట్లు బుకాయిస్తున్నారన్నారు. పంజాబ్‌లో మాదిరిగా రైతుల పేరుతో ప్రధానిపై దాడికి యత్నించిన ఖలిస్తాన్ తీవ్రవాదులతో టీఆర్ఎస్కు సంబంధాలు ఉన్నాఏమో కేసీఆర్ చెప్పాలన్నారు. ఇప్పటికే కరీంనగర్లో తనపై పోలీసుల నిర్వాకానికి సంబంధించి ఫిబ్రవరి 3న పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఎదుట సీఎస్, డీజీపీ హాజరు కావాల్సి ఉందన్నారు. కాగా, అర్వింద్‌పై జరిగిన దాడి గురించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ తమకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని, అర్వింద్‌ను పరామర్శించారని సంజయ్ చెప్పారు. గవర్నర్‌నూ గౌరవించడంలేదు.. కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్‌ను సైతం గౌరవించని విధంగా సంస్కారహీనంగా తయారైందని బండి సంజయ్ పేర్కొన్నారు. గవర్నర్ అన్నింటికీ తలూపకుండా ప్రశ్నిస్తే చెడ్డవారిగా టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ఓటమి నేపథ్యంలో కేసీఆర్ నిస్పృహలో ఉన్నారన్నారు. ప్రజలు రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో సీఎం తమ పార్టీ నాయకులపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. బీజేపీ ఎదురు దాడులు చేయడం ప్రారంభిస్తే కేసీఆర్ కుటుంబం అన్నీ సర్దుకుని పరార్ కావాల్సిందే అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌పై దాడి
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుని, దాడికి దిగాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో అర్వింద్ కారుతోపాటు ఐదు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు బీజేపీ నేతలు, కార్య కర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం నూత్పల్లి, నికాల్పూర్, దత్తాపూర్ గ్రామాల్లో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల కోసం మంగళవారం ఎంపీ అర్వింద్, పలువురు బీజేపీ నాయకులు బయలుదేరారు. అర్వింద్ పర్యటనను అడ్డుకునేందుకు అప్పటికే వందల సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్మూర్ మండ లం ఆలూర్‌లో, నందిపేట మండలం వెల్మల్ చౌరస్తాలో గుమిగూడారు. ఆలూర్ శివార్లలో రోడ్డుపై ట్రాక్టర్ టైర్లను వేసి, నిప్పు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అర్వింద్ ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎంపీ హోదాలో అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తుంటే టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాస్‌నగర్ మీదుగా వెళ్లా లని పోలీసులు సూచించగా.. ఇస్సాపల్లి, ఆలూర్ మీదుగా నందిపేటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నిజామాబాద్ కమిషనరేట్ వద్ద.. అద్దాలు ధ్వంసమైన అర్వింద్ కారు వెనక్కి వెళ్లేందుకు సిద్ధమయ్యాక.. పోలీసులు శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ.. ఎంపీని ఇస్సాపల్లిలోనే ఆపి వెనుదిరిగి పోవాల్సిందిగా కోరారు. దీనిపై అర్వింద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో మాట్లాడగా.. ‘టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి.. సంయమనం పాటించి వెనక్కి వెళ్లాల’ని సంజయ్ సూచించారు. ఈ మేరకు అర్వింద్, బీజేపీ నాయకులు ఇస్సాపల్లి నుంచి వెనుదిరుగుతుండగా వెల్మల్, ఆలూర్ల నుంచి వందల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఇస్సాపల్లికి చేరుకున్నారు. అర్వింద్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేశా రు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు వాగ్వాదం మొదలై.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందల సంఖ్యలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. కర్రలు, రాళ్లతో బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఎంపీ అర్వింద్ కారులో ఉండగానే.. దాని అద్దాలు పగలగొట్టారు. కాన్వాయ్‌లోని మరో ఐదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు వెంటపడి కొడుతుండటంతో 15 మంది బీజేపీ నేతలు పొలాల మీదుగా పరిగెత్తుతూ పారిపోయారు. మాక్లూర్ మండలం మామిడిపల్లి మాజీ సర్పం చ్ సంతోష్, నిజామాబాద్‌కు చెందిన బీజేవైఎం నేత విజయ్‌తోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు ఎంపీ అర్వింద్‌కు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పక్కా ప్లాన్‌తోనే పోలీసుల సహకారంతో తమపై దాడులు చేయించాడని బీజేపీ నేతలు ఆరోపించారు. -
డీఎస్‌తో ఈటల భేటీ, రెండు గంటలపాటు చర్చలు!
సాక్షి, నిజామాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ రాజకీయం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. భూకబ్జా ఆరోపణలు, మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈటల తన రాజకీయ వ్యూహరచనలో నిమగ్నం అయ్యారు. తాజాగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌తో బుధవారం భేటీ అయ్యారు. డీఎస్ నివాసంలో సుమారు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో తండ్రి డీఎస్‌తో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలతో ఈటల భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డీఎస్‌తో భేటీ కావటం రాజకీయంగా చర్చనీయ అంశంగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా డీఎస్ టీఆర్ఎస్ పార్టీ పరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఈటల మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్‌తో కూడా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డితో కూడా భేటీ కావాలని ఈటల యోచిస్తున్నట్టు సమాచారం. ఇక తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి.. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయటంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటల ఇటీవల పలు సందర్భాల్లో పేర్కొన్నారు. చదవండి: ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం