ఘటనా స్థలంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్: ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన వృద్దుడిని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే రాజకీయంగా బద్ద శత్రువులుగా ఉన్న వీరిద్దరు ప్రమాద స్థలంలో ఎదురుపడటంతో ఒకరినొకరు మాట్లాడించుకోవడం ఆసక్తికరమైన అంశంగా మారింది.
జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన గాదెపల్లి చిన్నగంగారెడ్డి ద్విచక్ర వాహనంపై ఆర్మూర్ వైపు వెళ్తున్నాడు. సీడ్ కంపెనీ నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో తలకు గాయమైంది. అదే రోడ్డు మార్గంలో పెర్కిట్ నుంచి అంకాపూర్‌కు వస్తున్న ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పల్లె గంగారెడ్డి రోడ్డు ప్రమాదం జరిగింది చూసి తమ వాహనాలను ఆపారు. క్షతగాత్రుడిని స్థానికులు పలకరిస్తున్న క్రమంలో మాక్లూర్ అర్బన్ పార్క్‌కు వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయిని ఆపించారు.
గన్‌మెన్‌ల సహకారంతో క్షతగాత్రుడిని తన వాహనంలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఎంపీ అర్వింద్, పల్లె గంగారెడ్డిని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పలకరించారు. ఎంపీ సాబ్ నిజామాబాద్ నుంచి వస్తున్నారా అని ఎమ్మెల్యే అడిగారు. పెర్కిట్‌లోని తన ఇంటి నుంచి అంకాపూర్‌లో చేరికల కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఎంపీ సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment