asannagari jeevan reddy
-
క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎంపీ
ఆర్మూర్: ఆర్మూర్ మండలం అంకాపూర్ శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన వృద్దుడిని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే రాజకీయంగా బద్ద శత్రువులుగా ఉన్న వీరిద్దరు ప్రమాద స్థలంలో ఎదురుపడటంతో ఒకరినొకరు మాట్లాడించుకోవడం ఆసక్తికరమైన అంశంగా మారింది. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన గాదెపల్లి చిన్నగంగారెడ్డి ద్విచక్ర వాహనంపై ఆర్మూర్ వైపు వెళ్తున్నాడు. సీడ్ కంపెనీ నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో తలకు గాయమైంది. అదే రోడ్డు మార్గంలో పెర్కిట్ నుంచి అంకాపూర్‌కు వస్తున్న ఎంపీ అర్వింద్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పల్లె గంగారెడ్డి రోడ్డు ప్రమాదం జరిగింది చూసి తమ వాహనాలను ఆపారు. క్షతగాత్రుడిని స్థానికులు పలకరిస్తున్న క్రమంలో మాక్లూర్ అర్బన్ పార్క్‌కు వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయిని ఆపించారు. గన్మెన్ల సహకారంతో క్షతగాత్రుడిని తన వాహనంలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఎంపీ అర్వింద్, పల్లె గంగారెడ్డిని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పలకరించారు. ఎంపీ సాబ్ నిజామాబాద్ నుంచి వస్తున్నారా అని ఎమ్మెల్యే అడిగారు. పెర్కిట్‌లోని తన ఇంటి నుంచి అంకాపూర్‌లో చేరికల కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఎంపీ సమాధానం ఇచ్చారు. -
బెదిరింపుల రాజకీయం! సొంత పార్టీ వారిపైనే వేధింపుల పర్వం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజక వర్గంలో బెదిరింపుల రాజకీయం నడుస్తోంది!. సొంత పార్టీ వారిపైనే వేధింపుల పర్వం కొనసాగుతోంది. విపక్ష నాయకులను, కార్యకర్తలను బెదిరించడంతో పాటు ఆయా పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బలవంతంగా టీఆర్ఎస్లో చేర్చుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. తాజాగా సొంత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులనే బెదిరింపులకు గురి చేస్తుండడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో వారు సోషల్ మీడియా ద్వారా బహిరంగంగానే ఎమ్మెల్యేపై విరుచుకు పడుతున్నారు. జీవన్‌రెడ్డి ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. నిధులు తెచ్చుకోవడమే కారణమా? మాక్లూర్ జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దాదన్నగారి విఠల్‌రావు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్లో ఉన్న ఆయన సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు. మాక్లూర్ సొంత మండలం కావడంతో సహజంగానే ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు విఠల్‌రావుకు సన్నిహితంగా ఉంటున్నారు. అలాగే, ప్రొటోకాల్ మేరకు ఆయన అధికారిక కార్యక్రమాలకు సర్పంచ్‌లు హాజరవుతున్నారు. ఇది నచ్చని ఎమ్మెల్యే వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ► ముల్లంగి, బొంకన్పల్లి గ్రామాల పరిధిలోని నిజాంసాగర్ చివరి ఆయకట్టు వెయ్యి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో మాదాపూర్ బ్యాలెన్స్ ట్యాంక్ నుంచి ఎత్తిపోతల పథకం కోసం గతంలో ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను అడిగినప్పటికీ నిధులు మంజూరు చేయించలేదు. దీంతో శ్యాంరావు ఆధ్వర్యంలో పలువురు జెడ్పీ చైర్మన్‌ను ఆశ్రయించి రూ.5 లక్షల జెడ్పీ నిధులు, ఎన్ఆర్ఈజీఎస్ కింద మరో రూ.5 లక్షలు మంజూరు చేయించుకున్నారు. ఇందుకు ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకరించారు. దీంతో మండల ప్రజాపరిషత్ సమావేశంలో విఠల్‌రావును సన్మానించారు. మరోవైపు, కల్లెడ గ్రామంలోని పాఠశాలలో వంట గది నిర్మాణం కోసం టీఆర్ఎస్ నేత ప్రసాద్‌గౌడ్ జెడ్పీ చైర్మన్ ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయించుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే తమను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆయా గ్రామాల నాయకులు వాపోతున్నారు. ► ఇటీవల రైతుబంధు సంబురాల్లో జెడ్పీ చైర్మన్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తమపై కేసులు పెట్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కల్లెడ గ్రామపంచాయతీ సర్పంచ్‌కు సమాచారం లేకుండా పంచాయతీకి చెందిన అన్ని ఫైళ్లను ఎంపీవో ద్వారా తీసుకెళ్లారు. ఇంకా మరికొందరు సర్పంచ్‌లను ఇదే విధంగా వేధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీన మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జెడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించాల్సి ఉండగా, సర్పంచ్ వేములపల్లి సుబ్బారావును ఎమ్మెల్యే బెదిరించడంతో వాటిని రద్దు చేయాల్సి వచ్చిందని అక్కడి నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలను ఇప్పటివరకు భరించామని, ఇకపై సహించేది లేదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు చెబుతున్నారు. బయట పడుతున్న వేధింపులు.. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. సొంత పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనపై నేరుగా విమర్శలకు దిగడం కొత్త చర్చకు దారి తీస్తోంది. వందల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఎలా సంపాదించావంటూ ప్రశ్నిస్తుండడం సామాన్యుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మాక్లూర్ మండలంలోని ముల్లంగి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ పావని భర్త శ్యాంరావు ఇటీవల సోషల్ మీడియా వేదికగా జీవన్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. తనపై ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అదే మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్‌గౌడ్ కూడా ఎమ్మెల్యేపై విరుచుకు పడ్డారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని పీల్చిపిప్పి చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులతో కమాండ్ చేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వీరిలాగే మరికొందరు సర్పంచ్‌లు బహిరంగంగానే ఎమ్మెల్యే వేధింపుల గురించి వాపోతున్నారు. మరికొందరు లోలోన రగిలి పోతున్నారు. -
‘కేసీఆర్‌ను టచ్ చేస్తే దేశం అగ్నిగుండం అవుతుంది’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణతో పాటు దేశం అగ్నిగుండం అవుతుందని పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తాము ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని, అవసరమైతే సీఎం కూడా ప్రచారం చేస్తారని వెల్లడించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ బీజేపీ పార్టీని సర్కస్ కంపెనీగా మార్చి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ షో నిర్వహిస్తున్నాడని అన్నారు. చదవండి: జట్టు కట్టి.. బీజేపీ కట్టడి.. వార్డు మెంబర్‌గా కూడా గెలవని ఆ పార్టీ నేత మురళీధర్‌రావు కాళేశ్వరంలో అవినీతి అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ దొడ్డిదారిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని, అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ తప్పుడు ప్రచారాలను గతంలోనే ఫేస్బుక్ బ్యాన్ చేసిందని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ మహబూబ్‌నగర్ సభకు ముఖం చాటేశారన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. -
బీజేపీ నేతలపై జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ నేతలు స్టువర్ట్ పురం దొంగలు.. వారంతా గాడ్సే వారసులంటూ టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.. మా నేతలంతా కలిసి తిడితే నువ్వు ఏ గ్రామంలో తిరగలేవు. మా సీఎం ఆదేశిస్తే.. మేము తిట్టడం స్టార్ట్ చేస్తే నువ్వు తట్టుకోలేవు. బాండ్ పేపర్ మీద పసుపు బోర్డు గురించి రాసిచ్చిన ధర్మపురి అరవింద్.. ఇప్పటికి తీసుకురాలేదు. కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా హైదరాబాద్‌కి తీసుకురాలేదు’ అన్నారు. (చదవండి: 'కూకట్‌పల్లిలో బండి సంజయ్‌కు వ్యాక్సిన్ వేశా') ‘వలస కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ ఫుట్ బాల్ ఆడుకున్నారు. నల్లధనం తీసుకొస్తా అని చెప్పి ఇప్పటికి తేలేదు. గుజరాత్ వాళ్లకు మాత్రమే పదవులు ఇస్తారు. దేశ దొంగలు మొత్తం గుజరాత్ నుంచే ఉన్నారు. మోదీ ఒంటి మీద ఉన్న వస్తువులు, కార్లు అన్ని విదేశాలవే. కానీ ఆయన మాత్రం మేక్ ఇన్ ఇండియా అంటారు. రైతులతో పెట్టుకున్నోడు ఈ దేశంలో ఎవడు బాగు పడలేదు. తరుణ్ చుగ్ నీ రాష్ట్ర రైతుల సంగతి చూసుకో. మేము దంచుడు స్టార్ట్ చేస్తే అరవింద్ బోధన్ నుంచి కోరుట్ల పోలేడు.. బండి సంజయ్ కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కి రాలేడు’ అంటూ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ నేటితరం గాంధీ అని కొనియాడారు. -
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు. కాగా,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ ఇటీవల కోవిడ్‌బారినపడి చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 58,908కి చేరింది. కరోనాతో మంగళవారం ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 492కి చేరింది. (చదవండి: బయటకు వెళ్లి.. ఇంట్లోకి తెస్తుండ్రు) -
మాజీ ఎంపీ కవిత కాన్వాయ్‌లో ప్రమాదం!
తుప్రాన్: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఆమె హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ తుప్రాన్ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు నుజ్జునుజ్జయింది. అయితే, ప్రమాద సమయంలో ఎమ్మెల్యే అందులో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. కాగా, నిజామాబాద్ చేరుకున్న కవిత శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. (చదవండి: డ్రోన్ కేసు: రేవంత్ రెడ్డికి బెయిల్) -
కరోనా: ‘భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ప్రపంచం మొత్తం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కరోనా నియంత్రణకు సీఎం ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేశారని, అవసరమైతే మరో 5 వేలకోట్లు ఇవ్వడానికి సిద్ధం అని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడారు. ఇప్పటికే పాఠశాలలు, సినిమా హాళ్లు, పార్కులు, పబ్‌లు మూసేశారని జీవన్‌రెడ్డి తెలిపారు. కానీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరోనాపై చర్యలే తీసుకోవడం లేదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను ప్రజలంతా హర్షిస్తే కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలతో సంబంధంలో లేకుండా అన్ని రాష్ట్రాలు కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. దేశానికి పట్టిన అసలు కరోన కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. కరోన నియంత్రణలో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ప్రజలు స్వచ్ఛందంగా సినిమా హాల్లు, పబ్‌లు మూసేయాలని ఎమ్మెల్యే కోరారు. -
పరీక్ష రాసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హన్మకొండ: ప్రజాప్రతినిధిగా గెలుపొంది.. శాసనసభలో అడుగుపెట్టినా.. ఆయన చదువును మాత్రం ఆపలేదు. దూరవిద్యలో న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తూ.. క్రమం తప్పకుండా సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. తాజాగా తోటి విద్యార్థులతో కలిసి ఆయన హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లాలో పరీక్షలు రాశారు. ఆయనే ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి. హన్మకొండలోని ఆదర్శ్ లా కాలేజీలో జీవన్‌రెడ్డి ఎల్ఎల్ఎం అభ్యసిస్తున్నారు. ఎల్ఎల్ఎం విద్యలో భాగంగా ఆయన ప్రస్తుతం మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది రెండు సెమిస్టర్ పరీక్షలు రాసి పాసయ్యానని, ఈ రోజు మూడో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యానని తెలిపారు. పరీక్షలకు హాజరుకావడం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందని, పదో తరగతి, ఇంటర్ పరీక్షలు గుర్తుకువచ్చాయని అన్నారు. -
ప్రజలే నా దేవుళ్లు.. ఆశీర్వదించండి: ఆశన్నగారి జీవన్‌రెడ్డి
సాక్షి, నందిపేట్: మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సోమవారం జోరుగా ప్రచారం నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో జీవన్‌రెడ్డి మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు అడుగడుగునా అపూర్వ స్పందన లభించింది. సోమవారం మార్కెట్ దినం కావడంతో జీవన్‌రెడ్డి మార్కెట్ వచ్చిన జనంతో కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన నాలుగున్నర ఏళ్లలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఈ సారి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఏనాడు పేదల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. నియోజవర్గానికి రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చి ఆదర్శంగా నిలిపానని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో జీవన్‌రెడ్డిని గెలిపించాలని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి కోరారు. చర్చిలో ప్రార్థనలు మండల కేంద్రంలోని జూడచర్చిలో జీవన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్, కేఆర్ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు. నక్కల భూమేష్, మీసాల సుదర్శన్, ఉల్లి శ్రీనివాస్‌గౌడ్, సిలిండర్ లింగం, బాలగంగాధర్, హైమద్‌ఖాన్, కొత్తూర్ రాజేశ్వర్, ఎంపీటీసీ గొల్లపల్లి సురేష్‌గౌడ్, బత్తుల శ్రీనివాస్, నాగలింగం, మజీరోద్దీన్, శాకిర్‌హుస్సేన్, బొడ్డు రాజశేఖర్, సయ్యద్ హుస్సేన్, ఉస్నోద్దీన్, మాన్పూర్ భూమేష్ పాల్గొన్నారు. అంకాపూర్‌లో జీవన్‌రెడ్డికి ఘన స్వాగతం పెర్కిట్: ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి సోమవారం గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి చేరుకున్న జీవన్‌రెడ్డికి గ్రామ మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మార గంగారెడ్డి, అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం మాక్లూర్: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి భార్య రజితరెడ్డి అన్నారు. కృష్ణానగర్‌లో సోమవారం ఇంటింటికి వెళ్లి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. నిరంతరం ప్రజల కోసం జీవన్‌రెడ్డి కృషి చేస్తారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. తిరుమల నర్సాగౌడ్, కోక హైమద్, బాబ్జీ పాల్గొన్నారు. పెర్కిట్: ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు సోమవారం ప్రచారం నిర్వహించారు. పెర్కిట్ ఎంపీటీసీ, ఎంఐఎం నాయకుడు జహీర్ అలీ, మండల కోఆప్షన్ సభ్యుడు సాజిద్ అలీ ఆధ్వర్యంలో ఇస్లాంపుర, జెండా గల్లి కాలనీల్లో ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉబేదుల్లా, నిజాముద్దీన్, సల్మాన్, మతిన్, సుమీర్ పాల్గొన్నారు. -
కూటమిని మట్టి కరిపించండి..ఎంపీ కల్వకుంట్ల కవిత
సాక్షి, నందిపేట్: మహాకూటమిని మట్టి కరిపించి తెలంగాణ ప్రజల దీవెనలతో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. మండలంలో ఆంధ్రనగర్తో పాటు నందిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే మరెన్నో పథకాలు అమలు చేస్తారన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ శక్తులన్నీ ఒకచోట చేరి కూటమిగా ఏర్పాడ్డాయని, వారిని ప్రజలు మట్టికరిపించాలని కోరారు. బీడీ కార్మికులందరికి పింఛన్లు వచ్చేలా చేస్తామన్నారు. పది మంది వచ్చి పది మాటలు చెప్తే ఆగం కావద్దని, మోసపోవద్దని ఎటు పక్క నిలబడాలో ఆలోచన చేయాలని సూచించారు. జీవన్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నక్కల భూమేష్, మీసాల సుదర్శన్, ఉల్లి శ్రీనివాస్‌గౌడ్, సిలిండర్ లింగం, శాకిర్‌హుస్సేన్, బాలగంగాధర్, హైమద్ ఖాన్, బొడ్డు రాజశేఖర్, రామకృష్ణ, నాయుడు రామారావు పాల్గొన్నారు. టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ సాక్షి, మాక్లూర్: టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఎంపీ కవిత అన్నారు. మాక్లూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకుందో చెప్పాలన్నారు. ఎన్ని కూటమిలు వచ్చిన టీఆర్ఎస్ను ఓడించలేవన్నారు. జీవన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్‌ను మరింత వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో ముందుగా వారికి బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రభాకర్, అశోక్‌రావు, రాజ్‌మల్లయ్య, దర్గల సాయిలు, నజీబ్, లక్ష్మీనారాయణ, ఆకుల రజనీష్, నర్సాగౌడ్, గుగ్గిలం రాజేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి.. ఆశన్నగారి జీవన్‌రెడ్డి
సాక్షి, ఆర్మూర్: ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రశ్న: నియోజకవర్గంలో మీ హయాంలో అభివృద్ధి ఎంత వరకు సాధించారు? జవాబు: సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత సహకారంతో నాలుగున్నరేళ్ల కాలంలో 2,500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. ప్ర: నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఏమిటి? జ: వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు 52 వేల మంది లబ్ధిదారులకు పింఛన్ల రూపంలో నెలకు ఐదు కోట్ల 91 లక్షల రూపాయల చొప్పున నాలుగున్నరేళ్లలో 250 కోట్లు చెల్లించాం. బీడీ కార్మికులకు జీవన భృతిని అందజేస్తున్నాం. 3,500 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూపంలో రూ.24 కోట్లు, 3,540 మంది యాదవులకు రూ.32 కోట్లతో గొర్రెలు పంపిణీ చేశాం. ప్ర: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి? జ: మిషన్ కాకతీయలో భాగంగా 148 చెరువులకు రూ.51 కోట్లతో మరమ్మతులు చేపట్టి 14,350 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశాం. నిజాంసాగర్ కాలువల మరమ్మతులకు రూ.38 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.15 కోట్లు, అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.105 కోట్లు, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.148 కోట్లు, గుత్ప ఎత్తిపోతల పథకం విస్తరణకు రూ.23 కోట్లు మంజూరు చేశాం. రూ.404 కోట్లతో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ప్ర: ప్రస్తుత ఎన్నికల్లో ఇస్తున్న హామీలు ఏమిటి? జ: ఆర్మూర్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం పని చేస్తున్నా. అందులో భాగంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం. ప్ర: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? జ: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గ్రామాల్లోని ప్రజల వద్దకు ప్రచారానికి వెళ్తే అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికలు తెలంగాణ సెంటిమెంట్‌ను ఆధారం చేసుకొని జరిగితే ప్రస్తుత ఎన్నికలు సంక్షేమ, అభివృద్ధి పథకాలే కేంద్రంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపించనున్నాయి. నందిపేట మండలంలోని లక్కంపల్లి సెజ్ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం నుంచి రూ.109 కోట్లు, నిజామాబాద్ నుంచి ఆర్మూర్ జాతీయ రహదారి అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు, లెదర్ పార్క్ అభివృద్ధికి రూ.పది కోట్లు మంజూరు చేయించాం. 24 గంటల విద్యుత్ సరఫరా కోసం 13 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేయించాం. 12,500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాముల నిర్మాణానికి రూ.ఏడు కోట్లు, 40 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.ఆరు కోట్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలల నిర్మాణానికి రూ.117 కోట్లు, ఉమ్మెడ వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.110 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధికి 144 కోట్లు, రూ.33 కోట్లతో సీసీ రోడ్లు, రూ.8.4 కోట్లతో శ్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపట్టాం. సిద్ధుల గుట్ట అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేశాం. ఆలూర్, నందిపేట బైపాస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయించా. -
టీఆర్ఎస్ ‘తొలి టికెట్’ చరిత్రను మార్చిన జీవన్‌రెడ్డి
సాక్షి,ఆర్మూర్(నిజామాబాద్): టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి టికెట్ కేటాయించిన అభ్యర్థి ఓటమి పాలవుతాడనే అపవాదును ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి చెరిపేశారు. టీఆర్ఎస్లో మొదటి అభ్యర్థి కూడా విజయం సాధిస్తాడని పార్టీ చరిత్రను తిరగ రాశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం 2004లో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొట్టమొదటి టికెట్‌గా ప్రకటించిన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పాపారావ్ ఓటమి పాలయ్యారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డిని ప్రకటించారు. ఆయన కూడా ఓడిపోయారు. దీంతో టీఆర్ఎస్ అధినేత తొలి టికెట్ ప్రకటించిన అభ్యర్థి ఓటమి పాలవుతారనే ప్రచారం సాగింది. ఇలాంటి తరుణంలో 2013 ఏప్రిల్‌లో టీఆర్ఎస్ 13వ ఆవిర్భావ సభను పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్చార్జి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆర్మూర్‌లో విజయవంతంగా నిర్వహించారు. దీంతో సభ అనంతరం జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చి మరీ టీఆర్ఎస్ మొట్ట మొదటి అభ్యర్థిగా ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి జీవన్‌రెడ్డి పేరును ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే తన అభ్యర్థి త్వాన్ని కేసీఆర్ ప్రకటించడమే కాకుండా పలు సభల్లో ‘జీవన్‌రెడ్డి నా కుడి భుజం’ అంటూ కేసీఆర్ ప్రకటించారు. ఇదే ఉత్సాహంతో జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులను కూడగట్టి టీఆర్ఎస్ను బలోపేతం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిపై 13,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. దీంతో టీఆర్ఎస్లో మొదటి టికెట్ కేటాయించిన వ్యక్తి ఓటమి పాలవుతాడనే అపవాదును జీవన్‌రెడ్డి తుడిపేశారు. -
వైఎస్ షర్మిల ఫిర్యాదుపై ఖచ్చితమైన చర్యలు: కేటీఆర్
హైదరాబాద్ : వైఎస్ షర్మిల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో అభూత కల్పనలపై ప్రచారం చేస్తున్నవారిపై కఠినమైన చర్యలు తప్పవని తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపటానికి అవసరం అయితే చట్టంలో మార్పులు కూడా తెస్తామని ఆయన తెలిపారు. వైఎస్ షర్మిల ఫిర్యాదు అందిన మరుక్షణమే కమిషనరేట్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి స్పందించాలని కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుపై చురుగ్గా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అలాగే ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విషయంలోనూ అంతే విధంగా స్పందించామన్నారు. (ఎమ్మెల్యేపై ఓ వ్యక్తి ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు పెట్టిన విషయం తెలిసిందే). ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడే నిందితుల్ని చట్టానికి లోబడి శిక్షించటం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఆటలు కట్టించేందుకు గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా సైబర్ నేరాల వెనక ఉన్నవారిని కూడా ఉపేక్షించకూడదని న్యాయవాదులు, పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడివారికి మూడు నెలల నుంచి 7 సంవత్సరాల వరకూ శిక్షపడే అవకాశం ఉందని సీసీఎస్ డీసీపీ పాలరాజు తెలిపారు. బాధితుల్లో మహిళలే ఎక్కువమంది అని, వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.